అక్కడైనా ఇక్కడైనా కొత్త నీరు రావాలి

tdp

దేశాన్ని ప్రప్రమథంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్ ఆ తరువాత అదే అసలు పార్టీగా చెలామణీ అవుతూ వస్తోంది. ఆ లెక్కన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వలోపం ప్రస్పుటంగా కనిపిస్తోంది.
ఇటలీమాతగా పేరొందిన సోనియాగాంధీ నేతృత్వంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి సోనియా ఉన్నా, పార్టీకి ఈ పరిస్థితి రావడానికి కారణం? సువిశాలమైన తెలుగునేల పలువురు పాలకుల పాలనలో ప్రాంతాలుగా మారింది. దేశ స్వాతంత్ర్య అనంతరం ఆ నాటి ప్రధాని పండిత నెహ్రూ సైతం తెలుగువారందరూ ఒక గొడుగు కిందనే ఉండాలని భావించి, అప్పటి రెండు తెలుగు ప్రాంతాలను ఏకం చేస్తూ 1956లో ‘ఆంధ్రప్రదేశ్’ను ఏర్పాటు చేశారు. అలాంటి సంయుక్త రాష్ట్రాన్ని స్వార్థం కోసం ఇటలీమాత సోనియా గాంధీ రెండుగా చీల్చింది. రాష్ట్ర విభజనకు ముందు ఆమె నిర్దేశకత్వంలోనే శ్రీకృష్ణ కమీషన్ చేసిన సర్వేలోనూ అప్పటి 23 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాలు మినహాయిస్తే , ఎక్కడా వేర్పాటు వాదం కనిపించలేదు. అయినా ఇటలీమాత తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పి తెలుగునేలను రెండుగా చీల్చారు. ఆ రోజున ఇరు ప్రాంతాల్లోని ఎందరో సమైక్యవాదుల హృదయాలు భగ్గుమన్నాయి. కన్నీరు మున్నీరయ్యారు. ఆ కన్నీటి శాఫం ఫలితమే అంత పెద్ద చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది అవుననే అంగీకరిస్తారు. ఆ శాప ఫలితమేమో కానీ, చివరకు ఆ జాతీయ పార్టీకి నాయకత్వలోపం తారసల్లింది. తనయుని పట్టాభిషిక్తునిగా చూడాలని కలలు కన్న ఇటలీమాత స్వప్నం సాకారం కాకపోగా, అబ్బాయి రాహుల్ గాంధీ జనాల్లో ‘పప్పు’గా మిగిలిపోయారు. అయినా సోనియా కన్నతల్లి మమకారం అతణ్ణి పార్టీ అధ్యక్షునిగా చేసింది. అయితే, ఫలితం లేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి పెట్టని కోటగా నిలచిన అమేథీలో కూడా పరాజయం పాలయి, చివరకు కేరళలోని వయనాడు నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు రాహుల్. చావుతప్పి కన్నులొట్టపోయినట్టు అయిన తన పరిస్థితికి తానే సిగ్గు పడ్డారు రాహుల్. దాంతో ఆ ఎన్నికల పరాజయానికి తన నాయకత్వమే కారణమనీ నిజాయితీగా అంగీకరించారు. తాను పార్టీకి నాయకునిగా ఉండటానికి అర్హుడను కానని నిర్ణయించుకున్నారు. దాంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నేతృత్వం అనివార్యమయింది. మొన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మరోమారు సోనియాగాంధీనే నాయకురాలుగా ఉండాలని తీర్మానించారు. అయితే త్వరలోనే మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని, అప్పటి దాకా పార్టీ పగ్గాలు చేపడతానని సోనియా అన్నారు. పార్టీకి కొత్తనీరు అవసరం ఎంతయినా ఉందని పలువురు భావిస్తున్నారు.

అధికుల అభిప్రాయం!

కాంగ్రెస్ పార్టీ ముసలివారితో నిండిపోయిందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! లోలోపల కొత్తతరం రావాలని అందరూ భావించినా, ఎవరూ ఆ మాటను బహిర్గతం చేయలేని పరిస్థితి. అయితే రెండు సార్లు పార్టీ ఓటమి పాలు కావడంతో ఇప్పుడు అందరిలోనూ ధైర్యం పొడసూపింది. తత్ఫలితంగానే మొన్నటి కాంగ్రెస్ పార్టీ సమావేశం. అందులో సోనియానే మళ్ళీ నాయకురాలు కావాలని అభిప్రాయం కలగడం జరిగాయి. అయినా పాత నాయకుల్లో సైతం పార్టీకి యువరక్తం అవసరం అన్న భావన ఉంది. ఆ దిశగా రాహుల్ గాంధీని నాయకుణ్ణి చేసినా, అతను అంతగా రాణించలేకపోయారు. అందువల్ల సోనియా కూతురు ప్రియాంక గాంధీ పార్టీ పగ్గాలు చేపడితేనే, కాంగ్రెస్ కు కొంత ఊపు వస్తుందనీ పలువురి అభిప్రాయం. అదీగాక, మొన్న రాజస్థాన్ లో ఏర్పడిన అధికార సంక్షోభ సమయంలోనూ మళ్ళీ సచిన్ పైలట్ పార్టీలోకి రావడానికి అన్న రాహుల్ తో కలసి ప్రియాంక సైతం కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ అభిమానులు ప్రియాంక పార్టీకి నాయకత్వం వహించాలని భావిస్తున్నారు. పైగా ఇది అసలు సిసలు జాతీయ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇందిరా గాంధీ నెలకొల్పిన పార్టీ. అందువల్ల ఈ పార్టీకి మహిళా నాయకత్వమే మేలని అదీ గాంధీ-నెహ్రూ కుటుంబం నుండి వచ్చిన వారయితేనే రాణించగలరనీ ఆ పార్టీలో అధిక సంఖ్యాకుల అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరు చేపడతారో అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

అదే దృశ్యం!

పార్టీలో కొత్త నీరు రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. ఆ పార్టీలాగే మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. అయితే ఆయన నేతృత్వంలోనే పార్టీలో కొత్తనీరు ప్రవహిస్తే శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం వస్తుందని పలువురు భావిస్తున్నారు. పార్టీలో కొత్త నీరు తీసుకురావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేశ్ ను రాజకీయాల్లోకి దించారు. లోకేశ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ నియమించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీని చేసి, తద్వారా ఐటీ మినిస్టర్ నూ చేశారు. ఇన్ని చేసినా, మొన్నటి ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎలా చేసి గెలిచినా, గెలిచినోడే మొనగాడు అనేది సామెత. ఆ దిశగా ఆలోచిస్తే తెలుగునేలపై ‘పప్పు’గా ముద్ర పడ్డ లోకేశ్, రాహుల్ గాంధీకి ఏమీ తీసిపోలేదు. కాకపోతే, రాహుల్ తెలివిగా రెండు చోట్ల నిల్చుని, ఓ చోట విజయం సాధించారు. లోకేశ్ ఆ మాత్రం తెలివి ప్రదర్శించలేకపోయారు. అందువల్ల లోకేశ్ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు తక్కువనే చెప్పాలి. కరోనా కారణంగా ఏడు పదుల చంద్రబాబు నాయుడు జనంలోకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదు. అయితే నారా లోకేశ్ యువకుడు. ఆ అవకాశం ఉంది. అయినా ఆయన కూడా ఇతరుల్లాగే సోషల్ మీడియా యుద్ధం చేస్తున్నారే తప్ప, ప్రత్యక్ష పోరాటంలో కనిపించడం లేదు. ఈ కోణంలో ఆలోచిస్తే, లోకేశ్ కంటే రాహుల్ ఎంతో మేలని అంటున్నారు జనం. అలాంటి రాహులే తాను నాయకునిగా తగనని నిజాయితీగా తప్పుకున్నారు. లోకేశ్ కు ఆ సీన్ లేదు. ఎందుకంటే అతను పార్టీకి తానే ఉత్తరాధికారినని భావిస్తున్నారు. కేవలం ఆశిస్తే సరిపోదు, అందుకు తగ్గట్గుగా వ్యవహరించాలి. ఇక్కడే లోకేశ్ పై పార్టీ శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లింది. మరి లోకేశ్ కాకపోతే ఎవరు? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

అదే తీరు…

కాంగ్రెస్ పార్టీకి ఎలా గాంధీ-నెహ్రూ కుటుంబమే రక్షగా ఆ పార్టీలోని అధిక సంఖ్యాకులు భావిస్తున్నారో, అదే తీరున ‘తెలుగుదేశం’ పార్టీకి వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు కుటుంబంలోని వారు నాయకులయితేనే పార్టీలో మునుపటి ఉత్సాహం కలుగుతుందని చాలామంది భావిస్తున్నారు, అప్పుడే పార్టీ కూడా రాబోయే ఏ ఎన్నికల్లోనైనా బతికి బట్టకట్ట కలుగుతుందని పలువురి అభిప్రాయం. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు తమలో తాము చర్చించుకుంటున్నాయే తప్ప, ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు చెవిలో వేయలేకపోతున్నారనీ వినిపిస్తోంది. అందుకు లోకేశ్ ప్రధాన కారణమనీ అంటున్నారు. ఎలాగంటే, చంద్రబాబు దాకా ఎవరైనా వెళ్ళాలంటే ముందు లోకేశ్ ఏర్పాటు చేసిన కోటరీని దాటుకొని వెళ్ళాలి. అదీగాక, ఓ వ్యక్తి చంద్రబాబుతో కలవాలంటే, ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. అప్పుడు సదరు వ్యక్తి ఏదో ఒకటి చెప్పి, నాయకుణ్ణి కలిసినా, తరువాత విషయం ఇదని తెలిస్తే, మరోమారు సదరు వ్యక్తికి నాయకుణ్ణి కలిసే అవకాశం ఉండదు. ఈ కారణంగా ఎవరూ సాహసించి, తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేకపోతున్నారని సమాచారం.

చంద్రబాబే కారణం!

ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితం కావడానికి చంద్రబాబే కారణమని పార్టీ శ్రేణుల్లోనే పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా చీల్చిన సోనియాగాంధీ పార్టీతో ఆయన 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చేయి కలిపారు. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ లో నాయుడు నాయకత్వంపై పార్టీలోనే అనుమానాలు తలెత్తాయి. కానీ, అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కావడంతో ఆయనతో ఈ విషయాన్ని ధైర్యంగా ఎవరూ చర్చించలేక పోయారు. చంద్రబాబు ఇలాంటి తప్పు చేయడం ఇదేమి మొదటి సారి కాదనీ, కొందరు అంటున్నారు. 2009 ఎన్నికల్లో అప్పటి రాజశేఖర్ రెడ్డి పాలనపై జనాల్లో వ్యతిరేకత పొడసూపింది. దానిని సరైన విధంగా తనకు అనుకూలంగా మలచుకోవడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారు. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి వేర్పాటు వాద పార్టీ టీఆర్ఎస్ పొత్తుతో బరిలోకి దూకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టేలా చేశారు. 2009 ఎన్నికలు వచ్చేసరికి, అదే పార్టీని కూల్చే ప్రయత్నాలు చేశారు రాజశేఖర్ రెడ్డి. ఆ సమయంలో తనకు తెలంగాణలో టీఆర్ఎస్ మద్దతు లభిస్తే తిరుగే ఉండదని భావించిన చంద్రబాబు, ఆ పార్టీతో చేతులు కలిపారు. అదే అదనుగా తీసుకొని రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ వస్తే వీసాలు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చాటింపు వేశారు. ఆ చాటింపు చంద్రబాబుపై అభిమానం ఉన్నవారు సైతం కాంగ్రెస్ కు ఓటు వేసేలా చేసింది. ఆ రోజున సీమాంధ్ర జనం ఒక్కసారి ‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని’ వాగ్దానం చేసింది కదా, ఆ పార్టీ వచ్చినా విభజన జరుగుతుంది కదా అని ఆలోచించలేక పోయారు. దాంతో చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అలా 2009 ఎన్నికల్లో చేసిన తప్పునే, మరోమారు పదేళ్ల తరువాత చంద్రబాబు చేశారనీ అదే పార్టీకి శాపమయిందనీ అధికసంఖ్యాకులు అంటున్నారు. అదీగాక చంద్రబాబు దాదాపు నలభై ఏళ్ళ నుంచీ రాజకీయరంగంలో ఉన్నారు. ఆయనను చూసి చూసీ జనానికి కూడా మొహం మొత్తిపోయింది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్తనీరును ఆహ్వానించి ఉంటే బాగుండేది. అది నందమూరి కుటుంబం నుండి వచ్చేవారయితేనే మేలనీ జనం భావిస్తున్నారు.

tdpp

మరి ఎవరున్నారు?

సరే, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏమి చేయాలి. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడుగా ఉంటూనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన అధ్యక్ష/లను నియమించాలి. అది కుల సమీకరణాలను బట్టి, తమ ఓటు బ్యాంకు పలానావారేనని భావించి ఎవరికో పట్టం కడితే లాభం లేదు. ఖచ్చితంగా నందమూరి కుటుంబంలోని వారికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పగ్గాలు అప్పచెప్పాలి. అందుకు సమర్థులు జనాల్లో ఎంతో పాపులారిటీ ఉన్న జూనియర్ యన్టీఆర్ ఒకరు, మరొకరు చంద్రబాబు నాయుడు కోడలు బ్రహ్మణి. వీరిద్దరినీ క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానిస్తేనే పార్టీ మనుగడ సాగుతుందని శ్రేణుల్లోనే పలువురి అభిప్రాయం. నటుడిగా విజయయాత్ర సాగిస్తున్న జూనియర్ యన్టీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడానికి అంత సుముఖంగా లేరనీ కొందరి వాదన. అయితే అతని మద్దతు కూడా అంతో ఇంతో పార్టీకి మేలు చేస్తుందని అందువల్ల 2009 ఎన్నికల సమయంలో నందమూరి కుటుంబాన్ని మొత్తం ఒకతాటిపైకి తీసుకు వచ్చిన విధంగా మరోమారు వారందరినీ కలిపే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలనీ పార్టీ అభిమానులు అంటున్నారు. చంద్రబాబు పాతపడిన నాయకుడు కావడం వల్లే జగన్ మోహన్ రెడ్డికి ఏలాంటి పూర్వపాలనా అనుభవం లేకపోయినా, కొత్తముఖం అయినందువల్ల జనం పట్టం కట్టారనీ కొందరు గుర్తు చేస్తున్నారు. అదీగాక రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే జగన్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా, అతణ్ణి కడప ఎంపీగా విజయం సాధించేలా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండీ, తనయుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు అనీ కొందరు అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సైతం పునరాలోచించాలి.

లోకేశ్ కూడా ఆలోచించాలి

చంద్రబాబు తరువాత తానే పార్టీకి అన్నీ కావాలని లోకేశ్ కూడా ఆశించరాదు. పార్టీలో పదవి కంటే, పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యం. ఈ దిశగా లోకేశ్ కూడా ఆలోచించాలి. పార్టీ అధికారంలోకి వస్తే, జూ.యన్టీఆర్ కన్నా, బ్రహ్మణి కన్నా రాజకీయ అనుభవం లోకేశ్ కే అధికంగా ఉన్న కారణంగా ఆయన పరపతికి ఏలాంటి నష్టమూ వాటిల్లదు. మహానాయకుడుగా పేరొందిన యన్టీఆర్ సైతం అప్పట్లో పరాజితుడై, పోటీకూడా చేయకుండా ఉన్న చంద్రబాబు నాయుడుకు తగిన గౌరవం ఇచ్చిన సంగతిని ఇక్కడ లోకేశ్ గుర్తు చేసుకోవాలి. అలా లోకేశ్ కూడా నందమూరి కుటుంబసభ్యుల నుండి వచ్చే నాయకులకు మద్దతు పలికితే, తప్పకుండా అతనికే జనాల్లో గౌరవం లభిస్తుందని, తద్వారా ఉత్తరోత్తర రాజకీయంగా లోకేశ్ బలపడటానికి మేలు చేకూరుతుందనీ మరికొందరి భావన.
ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మళ్ళీ విజయం సాధించాలంటే, గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన కొత్తవారు పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్నారు. అదే దిశగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ నందమూరి కుటుంబసభ్యులు రావాలనే అభిలాష నెలకొంది. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేశ్ లోతుగా ఆలోచిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీకి పూర్వవైభవం సిద్ధించక మానదని అధికుల అభిప్రాయం. మరి మన తెలుగునేలపై చెరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు కొత్త నీరు ప్రవహిస్తుందో చూడాలి.

Share: