అక్కినేని నటవంశానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నది నాగార్జునే. ఆగస్టు 29తో నాగార్జున 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆగస్టు 29న సహనటీనటులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అందరూ నాగార్జునకు అభినందనలు తెలిపారు. కొందరు స్వయంగా కలసి అభినందిస్తే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నాగ్ పై అభినందనల జల్లులు కురిపించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న `గోస్ట్` చిత్రం పోస్టర్ ను ఈ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇంతకు ముందు `వైల్డ్ డాగ్` చిత్రంలో నటించిన నాగార్జున ఇప్పుడు `గోస్ట్` టైటిల్ తో రాబోవడం విశేషం అనే చెప్పాలి. హిట్స్ లేని రాజశేఖర్ నే `గరుడవేగ`తో సక్సెస్ రూటులో నిలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అందువల్ల నాగార్జునకు కూడా `గోస్ట్`తో ఓ మంచి విజయాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే 2016లో నాగార్జునకు చివరి హిట్ గా నిలచిన `సోగ్గాడే చిన్నినాయనా` చిత్రానికి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలయింది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటిస్తూ ఉండడం విశేషం. `సోగ్గాడే చిన్నినాయనా`తో దర్శకునిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోనే `బంగార్రాజు` కూడా తెరకెక్కుతోంది.
ఈ రెండు చిత్రాలు కాకుండా హిందీలో `బ్రహ్మాస్త్ర` అనే సినిమాలోనూ నాగార్జున నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ కూడా నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఓ హిందీ చిత్రం, ఓ తెలుగు చిత్రం పూర్తవుతోంది. మరో తెలుగు చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇలా మూడు చిత్రాలతో సందడి చేసేందుకు నాగార్జున ప్లాన్ చేశారు. తన తరం హీరోల్లో మూడు సినిమాల్లో నటిస్తున్నది నాగార్జున ఒక్కరే. దాంతో నాగ్ స్పీడు పెంచారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. తనయులు నాగచైతన్య, అఖిల్ సైతం ఆయన స్పీడును అందుకోలేక పోతున్నారనీ, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. “గోస్ట్, బంగార్రాజు, బ్రహ్మాస్త్ర“ చిత్రాలతో నాగార్జున ఏ స్థాయిలో మురిపిస్తారో చూద్దాం.
