పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తికాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం.
చెరుకువాడ వెంకట నరసింహంగారి మాతామహు స్థానం మా గ్రామం. ఆయన జన్మించినది మా గ్రామంలోనే. ఆయన పెద్ద అక్కగారిని మా వూరిలోనే యిచ్చారు. నా చిన్ననాటినుండి తరుచు వారు మా గ్రామం వస్తూండేవారు. ఆయన ప్రథమోపన్యాసం మా గ్రామంలోనే జరిగింది. నాకు ఆయన మీద ఒక విధమైన ప్రేమ, లక్ష్యం ఏర్పడింది. ఆయనతో నాకు చనువున్ను హెచ్చు.
ఆయన కౌతరంలోని జాతీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడుగా స్థిరపడినట్లు మరియొకచోట చెప్పాను. ఈ ఉపాధ్యాయ ప్రవృత్తే నరసింహం పంతులుగారిని జాతీయ ప్రచారకునిగా చేసింది. ఆంధ్ర ప్రజానీకానికి రాజకీయ పరిజ్ఞానం ప్రసాదించింది పంతులు గారే. ఆయన గొప్ప దేశభక్తుడు. మహావక్త, ఆయనలో బౌద్ధుల ప్రచారకళ – జైనుల సేవదీక్ష; వేదవిధుల ధర్మతత్పరత దీప్తి గాంచినవి. నమ్మినది ఆచరించేంత వరకు ఆయనకు
నిద్రపట్టదు. ప్రతి నూతన భావాన్ని స్వీకరించడం ప్రతి పురోగామి శక్తికి హృదయ పుర్వకంగా స్వాగతమివ్వడం పంతులుగారి విశిష్టత.
1920లో గాంధీ మహాత్ముని అసహాయోద్యమం ప్రారంభమైనప్పుడు నరసింహంగారు ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా వున్నారు. ఒకనాడు కృష్ణాపత్రిక ఆఫీసులో మిత్రులు కౌతా శ్రీరామశాస్త్రిగారు ఈ విధంగా అన్నారు.
“పట్టాభీ? నీవు అసంఖ్యాకములైన అంకెలను క్రోడీకరిస్తూ బ్రహ్మాండంగా ఉపన్యాసం సాగించినా, నేను సమాసాలను గుప్పుతూ కఠిన భాషా ప్రయోగంతో అనర్గళంగా ఉపన్యసించినా, కృష్ణారావు తన కృష్ణాపత్రిక సంపాదకీయం ధోరణిలోనే ప్రసంగించినా, ప్రజలకు అర్థంకావడం కష్టం, మనం చెప్పేదానిలో వారు తెలుసుకునేది చాలా తక్కువ. మనం మనకు తెలిసిన విషయాలు నరసింహంగారికి చెబితే ఆయన తన ధోరణిలో ప్రజల హృదయాలకు హత్తుకునేటట్లు పిట్టకథలో, ఉపమానాలతో, హాస్య రసాన్ని మిళితంచేస్తూ ఉపన్యాసాలిస్తే ఎక్కువ లాభం వుంటుంది. దానివల్ల ప్రజలకు, దేశానికి ప్రయోజనం కలుగుతుంది” అన్నారు.
నరసింహంగారి కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక సహాయం చేయడానికి వల్లూరి సూర్యనారాయణరావుగారు అంగీకరించారు ఈ సలహాను పాటించి జాతీయ కళాశాలలో తన ఉపాధ్యాయ పదవికి నరసింహంగారు సెలవు పెట్టడం, అసహాయోద్యమ ప్రచారానికి గ్రామాలవెంట తిరగడం జరిగింది.
ఆయన మహావక్త. ఆంధ్ర డెమాస్తనీసు అని పేరు పొందారు. ఉపన్యాస కేసరి అని ప్రజలు ఆయనను ప్రశంసించారు. చెరుకువాడవారి ఉపన్యాసం చెరుకురసం అనే సామెత పుట్టింది. ఆంధ్రదేశంలో చెరుకువాడవారు పాదం పెట్టని గ్రామం లేదు. ఆయన వాక్కును వినని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆనాడు ఆంధ్రదేశాన్నంతా ఉర్రూతలూగించిన ఉపన్యాస కేసరి. ఆయన వ్రాసిన గ్రంథాలు: శాసనసభలు, స్వరాజ్య దర్పణము-కాంగ్రెసు ప్రచారకులకు, యువకులకు ప్రమాణ గ్రంథాలు.
ఆయన కెందరో శిష్య ప్రశిష్యు లేర్పడ్డారు. వారి శిష్యులలో ప్రహ్లాదుని వంటి భక్తులు, వికర్ణుని వంటి ధర్మనిర్ణయవేత్తలు, అభిమన్యుని వంటి వీరులు అసంఖ్యాకంగా వుండేవారు. వారందరు దేశసేవలో నిమగ్నులైనారు. ఆయన ప్రభావం అట్టిది. రాజకీయరంగంలోనే కాక సారస్వత రంగమునకూడ ఆయనది అందవేసిన చెయ్యి. వీరు కృష్ణారావుగారిని గురుదేవునిగా భజించి ఆరాధించేవారు. నేను వీరికి ఏకలవ్యుని వంటి శిష్యుడను, ఆయన గురు
దక్షిణను కోరని ద్రోణాచార్యులు.
1920 నుండి వారితో నేను తూర్పుకృష్ణా జిల్లాలో గ్రామాలవెంట కాంగ్రెసు ప్రచారానికి తిరగేవాడిని, ఆయా గ్రామస్తులతో అరమర లేకుండా కలుపుగోలుతనంతో ఆప్యాయంగా మాటాడడం నరసింహంగారి ప్రత్యేకత.
ఈ సందర్బంలో ఆనాటి గ్రామాల సంగతి చెప్పడం ఉచితమని తలుస్తాను. గ్రామాలలో పార్టీలు వుండేవి. రాజకీయ పరిజ్ఞానం కలవారు అరుదు. పత్రికలను తెప్పించుకునే గ్రామాలున్నూ తక్కువే, ధనవంతులమీద, భూస్వాములమీద జస్టిస్ పార్టీ వారి ప్రభావం హెచ్చు. విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగాలు కాంక్షించేవారు ప్రభుత్వమునకు భక్తులే. జన సామాన్యానికి కాంగ్రెసు అన్నా కాంగ్రెసు ప్రచారకులన్నా ప్రేమవున్నా పోలీసు వాళ్ళ భయం వారిని మా దగ్గరకు రానిచ్చేది కాదు. ఇక ఇంగ్లీషు కొద్దో గొప్పో చదివి ఉద్యోగాలలో చేరక గ్రామాలలో వుండేవారు మాకు సన్నిహితులుగా మెలిగేవారు. ఏ గ్రామానికైనా మేము వెళ్ళగానే వారికొరకు వెదకికొని వారి ద్వారా ఆ రోజుని ఫలానా ఇన్ని గంటలకు కాంగ్రెసు మీటింగు జరుగుతుందని టముకు వేయించుకునేవారము. కొన్నిచోట్ల టముకు వేయుటకు నిరాకరిస్తే కిరోసిన్ డబ్బా మెడకు తగిలించుకొని సాహసంగల యువకుడు అందరికి వెల్లడించేవాడు.
అంతటితో మా పని పూర్తి అయ్యేదికాదు. మేము ఇల్లిల్లు తిరిగి ఫలానా చోట మీటింగు పెడుతున్నాము. ఉపన్యాసాలిస్తున్నాము. దయచేయండి అని కోరెవారము. కొందరు ఆప్యాయతతో, మరికొందరు నిరాదరణగాను అలక్ష్యంగాను వేళాకోళంగా మాట్లాడేవారు. ఆ కాలంలో పల్లెటూళ్ళలో ధనాశతో తమ
విద్యలను ప్రదర్శించే ఫైల్మానులు మెుదలగు ఆటగాళ్ళు గ్రామ పెత్తనదార్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం జ్ఞప్తికి తెచ్చుకొని మాస్థితి వారితో సమానంగానే
వున్నదని మాలో మేము నవ్వుకునే వారము.
ఒక్కొక్క గ్రామంలో ఎంత ప్రయత్నించినా ఎవరూ మీటింగుకు వచ్చేవారు కారు. అప్పుడు మేము ”ఈ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వార్తాపత్రికను తెప్పిస్తున్నారా?”అని ప్రశ్నించడం, ‘‘లేదు’’ అని సమాధానం రావడం జరిగిన తర్వాత ఒక ఊళ్ళో ఇక మాకర్తవ్యమేమిటని ప్రశ్నించుకొని అప్పుడు
ఆంధ్రపత్రికకు చందా రూ. 2-8-0, కృష్ణాపత్రికకు చందా రూ.3-0-0, మనియార్డరు రుసుము 0-4-0 మెుత్తం రూ.5-12-0 వసూలు అయ్యేవరకు భోజనం
చేయమని భీష్మించాము. ఆఖరుకు సాయంత్రము రెండు గంటలకు రూ.5-12-0 వసూలైన తర్వాత మనియార్డరుచేసి భోజనం చేశాము. మీటింగు పట్టడం
ఉపన్యాసాలివ్వడం జరిగింది.
ప్రతి గ్రామంలోను యువకులను పోగుచేసి గ్రంథాలయాలను పెట్టడానికి ప్రోత్సహించే వాళ్ళము. గ్రంథాలయాలున్న గ్రామాలు చైతన్యవంతమై ఈ ఉద్యమంలో ముందడుగు వేయుట మనకు అనుభవంలో నున్నదే కదా! ఈ సందర్భాలలో బోర్డు పాఠశాలల ఉపాధ్యాయులున్నూ, మరికొన్ని చోట్ల గ్రామకరణాలున్నూ మాకు ఎంతో తోడ్పడేవారు.
ఆనాడు జస్టిసు పార్టీవారు గొప్పవారుగాను, కాంగ్రెసువారు కుర్రకారుగాను లెక్క. ఇటువంటి పరిస్థితిలో ఎందరో యువకులు త్యాగబుద్ధితో నిరంతర కృషి చేయడంవల్ల 1930 నాటికి కాంగ్రెసు ఉద్యమం బలపడింది. ప్రజాసమూహం కాంగ్రెసుకు అండగా నిలిచినది.
ఐదు రూపాయలు వసూలైతే కానీ భోజనం చేయనని భీష్మించుకున్నాం – గొట్టిపాటి బ్రహ్మయ్య
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021