మహానటుడు, మహానాయకుడు యన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పక ముందే కొంగర జగ్గయ్య వంటివారు రాజకీయాల్లో రాణించారు. ఆయన కంటే ముందే కోన ప్రభాకరరావు రాజకీయాల్లో ఉన్నట్టు చెబుతారు.కానీ, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించిన తొలి నటునిగా జగ్గయ్య చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే అప్పట్లోనూ చిత్రసీమలో రాజకీయాలు ఉండేవి. యన్టీఆర్ వర్గం, ఏయన్నార్ వర్గం అంటూ ఉన్నా, పరిశ్రమ మేలు కోరి యన్టీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందుకు ఏయన్నార్ వర్గం సైతం మద్దతు నిచ్చేది. అయితే రామారావు రాజకీయ ప్రవేశం చేసిన తరువాత కాంగ్రెస్ వాదులు కొందరు అప్పటి మాస్ హీరో కృష్ణను చేరదీసి, సినిమా రంగంలో యన్టీఆర్ కు వ్యతిరేక వర్గాన్ని తయారు చేశారు. కాంగ్రెస్ అండ చూసుకొని కృష్ణ కూడా రామారావు వర్గంతో ఢీ కొట్టారు. అయితే కొన్ని సార్లు కృష్ణ దెబ్బ తిన్న దాఖలాలూ లేకపోలేదు. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాలు అంటూ ఏర్పడ్డాయి. అధిక సంఖ్యాకులు తెలుగుదేశంకు జై కొట్టినప్పటికీ కాంగ్రెస్ అభిమానులు సైతం తమ సత్తా చాటే ప్రయత్నం చేసేవారు. అలా పార్టీల వారిగా వర్గాలు ఉన్న తెలుగు చిత్రసీమ ఇప్పుడు కులాల రీతిన విడిపోయింది. తెలుగు నటులకు ఓ గుర్తింపును తీసుకు వస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 1993లో ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని కలుసుకొని, తమకు తగిన గౌరవం ఇవ్వాలంటూ ఆ కొత్తగా ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కోరింది. అందుకు కోట్లవారు కూడా ఏవో చిన్నపాటి వరాలు కురిపించినట్టు సమాచారం. మా అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులుగా అక్కినేని నాగేశ్వరరావు , అద్యక్షునిగా చిరంజీవి ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతగా ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించలేదు. అయితే తొలి నుంచీ తాను తెలుగుదేశం అభిమానినని చెప్పుకొనే మురళీ మోహన్ మాత్రం ఆ తరుణంలో క్రియాశీలక పాత్రనే పోషించారు. తొలుత అధ్యక్షునిగా ఉన్న చిరంజీవి మా కోసం అప్పట్లో పెద్దగా చేసిందేమీ లేదు. తరువాత మురళీమోహన్ అధ్యక్షుడయ్యారు. ఆ పైన నాగార్జున, మోహన్ బాబు కూడా ఆ పదవిని అలంకరించారు. అయితే మూడుసార్లు మా అధ్యక్షునిగా సేవలు అందించిన ఘనత మురళీమోహన్ కే దక్కింది. ఆయన హయామ్ లో పలు సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదంతా గమనించిన చిరంజీవి, ఎటూ తాను రాజకీయాల్లో ఓడిపోవడం, పార్టీని తీసుకు వెళ్ళి కాంగ్రెస్ లో కలిపివేయడం జరిగింది. ఇక ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే తమ్ముడు నాగబాబును అధ్యక్షుడు కావడానికి దోహదపడ్డారు. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తమదైన మార్కు ఉండాలని చిరంజీవి, ఆయన సోదరులు ప్రయత్నిస్తున్నారు. అందుకు టీవీ వ్యాపారంలో చిరంజీవికి భాగస్వామి అయిన నాగార్జున సైతం ఇతోధికంగా సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇలా కమ్మవారి అండతోనే చిరంజీవి తాను మద్దతు పలికిన వారిని గెలిపించుకుంటూ వచ్చారు. ఎప్పుడూ కమ్మవారే రాజ్యం ఏలాలా అన్న నినాదంతో ఇప్పటి దాకా తన తమ్ముడు, శివాజీరాజాను
గెలిపించుకున్నారు. తప్పని పరిస్థితులలో కమ్మవాడయిన రాజేంద్రప్రసాద్ కు కూడా మద్దతు పలకాల్సి వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ తనకు ఎప్పటి నుంచో మిత్రుడు కాబట్టి, ఆయనను గెలిపించామని కూడా చెప్పుకున్నారు.
ముందులా కాదు…
అయితే సీనియర్ నటుడు నరేశ్ మా అధ్యక్షుడు అయిన తరువాత నుంచీ సమీకరణాలు కొన్ని మారిపోయాయి. నరేశ్ చేష్టలు నచ్చని రాజశేఖర్ తన పదవికి రాజీనామా కూడా చేశారు.చిరంజీవి, మోహన్ బాబు వేదికపై ఉండగానే రాజశేఖర్ తన మనసులోని మాటలు బయటపెట్టి ఆ సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళారు. అప్పటి నుంచీ చిరంజీవి ఈ సారి నుంచీ తన మాటను తు.చ. తప్పక పాటించేవారికే మద్దతు పలకాలని నిర్ణయించారు. ఈ సంగతి ఇలా ఉంటే మా పాలనా కాలం పూర్తయింది. ఇప్పటికే ఎన్నికలు జరగవలసి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా ఎన్నికలకు అనుమతి ఇవ్వలేదు. చివరకు సెప్టెంబర్ చివరి ఆదివారం అంటే ఆ నెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కన్నడనాట పుట్టినా తెలుగు చిత్రాల ద్వారా ఎంతో పేరు సంపాదించిన ప్రకాశ్ రాజ్ తాను ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నానని, తనకు మద్దతు ప్రకటించమని చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ అందరికీ ఫోన్ చేశానని చెబుతున్నారు. అయినప్పటికీ ఉన్నట్టుండి ఆ మధ్య మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాను మా ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నానని తండ్రితో చెప్పారు. దాంతో మోహన్ బాబు, మంచు విష్ణు కలసి సీనియర్ నటుడు కృస్ణను కలుసుకున్నారు. అలాగే మరో సీనియర్ నటుడు కృష్ణంరాజుతోనూ ఈ తండ్రీకొడుకులు భేటీ అయ్యారు.
ఒక్కని చేసి…
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవికి ఎవరైనా అర్హులు పోటీ చేయవచ్చు. అందులో తప్పేమీలేదు. అయితే ఇక్కడే కులాల కుంపట్లు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ నలుగురూ తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి జై కొడుతున్నవారే! పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పినతండ్రి కూతురు భర్త మంచు విష్ణు. జగన్ బంధువు అంటే తెలంగాణలో కేసీఆర్ కు కూడా దగ్గరివాడే అని వేరే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు పోటీదారులు టీఆర్ఎస్ కు కావలసిన వారే అని తేలిపోయింది. మరి ఏ విధంగా ఈ పోటీదారులను వేరు చేసి మాట్లాడాలి. ప్రకాశ్ రాజ్ ను అప్పుడే మోహన్ బాబు వర్గం నాన్ లోకల్ అనే ముద్ర వేసింది. కళాకారులకు ఎల్లలు లేవని, కళను ఆరాధించేవారు ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నట్టే, పోటీ చేసే హక్కు కూడా ఉంటుందని చిరంజీవి వర్గీయులు చాటింపు వేస్తున్నారు. ఎందుకంటే కమ్మవారి ఆధిపత్యం సాగకుండా తమ ఆధిక్యం ప్రదర్శించు కోవాలని తపిస్తోన్న చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రకాశ్ రాజ్ కాపు వర్గంకాకపోయినా, ఆ సామాజిక వర్గంకు చెందిన చిరంజీవి బలపరుస్తున్న అభ్యర్థి. అలాగే జీవితారాజశేఖర్, హేమ కూడా ఆ సామాజిక వర్గంతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. దాంతో మంచు విష్ణు ఒక్కడే కమ్మ కులస్థుడు. అందువల్ల పోటీ అన్నది పైకి కనిపించక పోయినా, కమ్మ,కాపు వర్గాల నడుమ సాగుతున్నట్లే లెక్క అంటున్నారు కొందరు.
భలే రాజకీయం…
అసలు తెలుగుచిత్రసీమలో అసలైన బలం అన్నది అన్న నందమూరి తారకరామారావు కుటుంబానికే అని అందరూ చెబుతారు. అయితే ఆ కుటుంబానికి చెందినవారు మొదటి నుంచీ మా ఎన్నికలను ప్రిస్టేజ్ గా తీసుకున్నదాఖలాలు లేవు. అయితే బాలకృష్ణ మద్దతు ఉంటే గెలవవచ్చుననీ కొందరు చెబుతున్నారు. ఆయన మాత్రం తాను మద్దతు తెలిపిన వారికి ఓటు వేసి సైలెంట్ అయిపోతారు తప్పితే, పూసుకొని ఫలానా వాణ్ణి గెలిపించాలని చూడరు. మాలో మొత్తం 900 ఓట్లలో 200 మంది టీవీ ఆర్టిస్టులే ఉన్నారట. వారిలోనే అధిక సంఖ్యాకులు వచ్చి ఓటేస్తారని తెలుస్తోంది. నిజానికి ఇది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అయినా, ఇందులో గెలుపు సాధఙంచాలంటే టీవీ ఆర్టిస్టుల మద్దతు కావాలి. ఇప్పటి దాకా చిరంజీవి వారిని తన సేవాభావం ద్వారా మచ్చిక చేసుకుంటూ వచ్చారు. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్, లోకల్ లీడర్ శ్రీశైలం యాదవ్ ఇద్దరూ టీవీ ఆర్టిస్టులకు పలు విధాలా ఆదుకొనేవారే! వారి మాట కూడా మాఎన్నికల్లో పరోక్షంగానైనా పనిచేస్తూ వచ్చింది. కరోనా కష్టకాలంలో టీవీ ఆర్టిస్టులను ఆదుకోవడంలో ఈ ఇద్దరు నాయకులు ముందున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట కూడా చెల్లుతుందని తెలుస్తోంది. ఈ నాయకులు కూడా గతంలో చిరంజీవి మద్దతు పలికిన వారికే జై కొడుతూ వచ్చారు. కానీ, ఈ సారి వీరి మద్దతు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే, కేసీఆర్ కానీ, ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఏపీ సీఎమ్ జగన్ తో సఖ్యంగా ఉంటారు. జగన్ కు సమీపబంధువు అయిన మంచు విష్ణుకే వీరు మద్దతు పలుకుతారని తెలుస్తోంది.అదీగాక, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మోహన్ బాబుకు, తలసానికి ఎంతో అనుబంధం ఉంది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తలసాని, చిన్న శ్రీశైలం మద్దతు మంచు విష్ణుకు లభిస్తే లెక్క వేరేగా ఉంటుందని అంటున్నారు.
ఎన్నడూ లేనివిధంగా…
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలను కమ్మ,కాపు వర్గాల పోరుగా చిత్రీకరించడం ఏ మాత్రం సబబు కాదని, తటస్థులు అంటున్నారు. కళాకారులకు కులాలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. యన్టీఆర్, ఏయన్నార్ టాప్ స్టార్స్ గా ఉన్న రోజుల్లో ఈ కులాల పంచాయతీ అన్నదే లేదని వారు గుర్తు చేస్తున్నారు. దాసరి నారాయణరావు చిత్రపరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న సమయంలోనూ ఈ కులాల పోరు లేనే లేదని చెబుతున్నారు. దాసరి స్థానాన్ని ఆక్రమించడానికి తపిస్తున్న చిరంజీవి కారణంగానే ఈ కులాల గొడవ తలెత్తిందని, మొదటి నుంచీ కమ్మవారి ప్రాపుతోనే స్టార్ డమ్ సంపాదించిన చిరంజీవి, ఇప్పుడు అదే సామాజిక వర్గంపై తన ఆధిపత్యం చాటుకోవాలని చూడటం కొందరికి ఏ మాత్రం నచ్చడం లేదు. పైగా సినిమా రంగానికి పెద్ద దిక్కుగా ఉండాలంటే అందరినీ కలుపుకు పోవాలి. అంతేకానీ, ఇలా కులరాజకీయాలు చేస్తే, రాజకీయాల్లో మర్యాద పోగొట్టుకున్నట్టే ఇక్కడా పోగొట్టుకుంటారనీ కొందరి అభిప్రాయం.
ఏమిటో ఈ పిచ్చి?
అదలా ఉంచితే, చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, ఏదో ఒక రీతిన ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. చిరంజీవి కరోనా కట్టడి నేపథ్యంలో తన అభిమానులను వాలంటీర్లుగా నియమించి, జనానికి వ్యాక్సిన్ వేయించడం, అవసరమైన వారికి ఆక్సిజన్ సరఫరా చేయడం వంటి అభినందించదగ్గ కార్యక్రమాలు చేపట్టారు. అయితే , ఈ మధ్య చిరంజీవి తన అభిమానులను అభినందిస్తూనే, ఏపీ సీఎమ్ జగన్ ను కూడా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అది ఆయన అభిమానులతో పాటు, పవన్ కళ్యాణ, జనసేన ఫ్యాన్స్ ను కూడా హర్ట్ చేసింది. దాంతో చిరంజీవిపైనే వారు తిట్ల దండకం అందుకున్నారు. అధికారంలో ఎవరుంటే వారిని మంచిచేసుకోవాలని చిరంజీవి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే జగన్ ను ఆయన అభినందించినట్టు తెలుస్తోంది. అందుకు జగన్ కూడా తిరిగి కృతజ్ఞతలు చెప్పారు. మరి జగన్ కు దగ్గర కావాలని చూస్తున్న చిరంజీవి, జగన్ మనిషి అయిన మంచు విష్ణుపైనే పోటీకి దిగితే ఎలా? అంటున్నారు కొందరు. ఒకవేళ చిరంజీవి మద్దతు పలికిని ప్రకాశ్ రాజ్ గెలిచి, విష్ణు ఓడిపోతే, ఆ తరువాత నుంచీ ప్రకాశ్ రాజ్, అతని కార్యవర్గం చేసే పనులకు మంచు విష్ణు మద్దతుదారులు అడ్డుపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాసభ్యులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అలా కాకుండా విష్ణు గెలిచాడనుకోండి, అతని పనులకు అడ్డు పడే దమ్ము మా సభ్యుల్లో ఎవరికీ అంతగా లేదు. సాక్షాత్తు చిరంజీవి మద్దతు పలికినా, మంచువారి అబ్బాయికి వ్యతిరేకంగా ఎవరూ నిలవలేరు. ఇలాంటి సమీకరణాలు పొడసూపుతున్న నేపథ్యంలో మా ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 26కు ఎంతో సమయం ఉన్నా, ఇప్పటి నుంచే హడావుడి మొదలయింది. ఎవరి మనసుల్లో ఏమున్నా, ప్రస్తుతానికి ఈ పోరును కమ్మ, కాపు పోరుగానే చిత్రీకరిస్తున్నారు. కళాకారుల నడుమ ఈ కులాల కురుక్షేత్రం ఏమిటో అంటూ తటస్థులు ఈసడించుకుంటున్నారు. అంతా చేసి, ప్రతీసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేవారి సంఖ్య 500లకు మించదనీ చెబుతున్నారు. అందులోనూ 150 మంది టీవీ ఆర్టిస్టుల ఓట్లే ఉంటాయట! అంటే 350 మంది కూడా సినీ యాక్టర్స్ ఓటింగ్ లో పాల్గొనరని తెలుస్తోంది. మరి మా కుమ్ములాటకు కులాల పోరు అని చాటింపు వేయడం ఎందుకో అర్థం కాకుండా ఉంది.