నవీన కాలమ్

nv

ఇది నేను ఇంతకుముందు చెప్పానో లేదో గుర్తులేదు. వరుస విడాకుల కథలు విని ఆలోచిస్తుంటే మూడొంతులకు పైగా ఉమ్మడి కుటుంబాలలోని పిల్లల విషయంలోనే విడాకులు నడుస్తున్నాయి. ఒకప్పుడు పెద్దపెద్ద ఇళ్లు కట్టింది మా ఒక్కరి కోసం కాదంటూ కొత్తగా పెళ్లైన పిల్లల్ని తమతోనే ఉంచుకుంటున్నారు. మన ఇంటిలో పుట్టినప్పటి నుంచి పెరిగే మన అబ్బాయి అలవాట్లు, పద్ధతులు, ఎమోషన్స్‌ అన్నీ మనకు తెలుసు. కానీ వచ్చే ఆడపిల్ల తన అలవాట్లు, పద్ధతులు, ఎమోషన్స్‌తో తమ తల్లిదండ్రుల వద్ద పెరిగి ఒక అడల్ట్‌గా మన ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడి వాటిలో అమె కలవడానికి చాలా సమయమే పడుతుంది. ఆ పద్ధతిలో కొన్ని విషయాలలో మన అబ్బాయి, కొన్ని విషయాలలో వచ్చిన అమ్మాయి, మరికొన్ని విషయాలలో ఇరువైపుల తల్లిదండ్రులు మారాలి. మార్చుకుని తీరాలి. అందులోని ముఖ్యవిషయం పిల్ల మనవారిని వదిలేసి వారిని గమనించుకుంటూనే మూతికి జిప్‌ వేసుకుని ఉండాలి. మా అబ్బాయికి ఈ వంట అంటే ఇష్టం అని చెప్పడంలో తప్పులేదు. అమ్మాయి దగ్గర అడిగి వండిచుకునే స్వతంత్రం మనకన్నా అబ్బాయికే ఎక్కువ. దానికి మన సిఫార్సు దేనికి. అందుకు బదులు ఆ అమ్మాయికి నచ్చినవి తీసుకుని అవి కూడా మన వంటలిస్టులో చేర్చడం పద్ధతి కదా.
ఎంతసేపూ వచ్చిన పిల్ల మనలాగా, మనకు తగినట్టు ఉండాలి అనుకోవటం సరికాదు. కొత్తచోటు తనదైన పద్ధతిలో పెరిగివచ్చిన అమ్మాయిని కన్‌ఫ్యూజ్‌ అయ్యేలా చేయకుండా తనకి తన స్పేస్‌ ఇచ్చి మన వాతావరణాన్ని, మనుషుల్ని, పద్ధతుల్ని అవగాహన చేసుకుని అవర్చుకోవటానికి తగిన సమయం ఇవ్వాలి. అప్పుడు పిల్లలిద్దరూ వారిరువురికి మరియు, వారి కుటుంబాలకు తగినట్టు మార్చుకుని వారి పిల్లలను ఆ పద్ధతుల్లో పెంచుకుంటారు. ఈ ప్రక్రియ సర్వసహజం. మార్పు అనేది ఆ ఇద్దరిలోనూ అనివార్యం. అంతేకానీ తగునమ్మా అంటూ పెద్దలు అనవసరంగా కలుగచేసుకోవటం ముమ్మాటికీ తప్పు. పిల్లలు వాళ్లే సర్దుకుపోతారు. కానీ ఈ పద్ధతి కేవలం పెళ్లి అయిన పిల్లల విషయంలో అంతేకానీ, ఆ అతిచనువు అనవసరపు లాలూచీ పెళ్లికి ముందు ఒప్పుకోకండి. పెళ్లి మాటలు జరుగుతున్నప్పటి నుంచి పెద్దలకన్నా ఎక్కువగా పిల్లలు మాట్లాడుకోవటం. వీటివల్ల నిశ్చితార్థాలు నిలిచిపోవడం కూడా తప్పే. ముందుజరగవలసినవి వెనక, వెనక జరగవలసినవి ముందు. ఎందుకలా! మన పెద్దలు మన పెళ్లిళ్లు అలానే చేశారా. మనం అలానే ఉన్నామా? ఆలోచించండి. పద్ధతులు మార్చకండి. దాని వల్ల జరిగే అనర్థాలకి కారణం ఆ మార్పే.

Share: