ఫోర్బ్స్ కవర్‌పేజీపై డాక్టర్ కృష్ణ ఎల్ల – లీడర్స్ ఇన్ హెల్త్ కేర్’ జాబితాలో స్థానం

Forbes

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న కరోనా ముప్పు నుంచి రక్షించే ‘కొవాగ్జిన్’ టీకాను అభివృద్ధి చేసి కరోనా పీఛమణచడంలో తనదైన పాత్ర పోషిస్తున్న డాక్టర్ కృష్ణ ఎల్లపై ‘ఫోర్బ్స్ ఇండియా’ మ్యాగజైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కరోనా ముప్పును ఎదుర్కోవడంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైద్య, ఆరోగ్య రంగాలకు చెందిన నిపుణులతో ‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రత్యేకంగా రూపొందించిన ‘లీడర్స్ ఇన్ హెల్త్‌కేర్’ జాబితాలో డాక్టర్ కృష్ణ ఎల్లకు స్థానం లభించింది. ఆయనపై కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.

అమెరికా నుంచి వెనక్కి వచ్చి టీకాల తయారీ కంపెనీని స్థాపించారని, గత రెండు దశాబ్దాల్లో 400 కోట్ల డోసులకుపైగా వివిధ రకాల టీకాలను ప్రపంచ దేశాలకు అందించారని ఫోర్బ్స్ కొనియాడింది. 145 అంతర్జాతీయ పేటెంట్లు, 16 టీకాలు, 4 బయో-థెరప్యూటిక్స్, 123 దేశాల్లో రిజిస్ట్రేషన్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రీ-క్వాలిఫికేషన్లు.. ఇది భారత్ బయోటెక్ ఘనత అని ప్రశంసించింది.

ఇన్‌ఫ్లూయెంజా హెచ్1ఎన్1, రోటావైరస్, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, రేబిస్, చికున్‌గున్యా, జికా, టైఫాయిడ్ టీకాలను ఈ సంస్థ అందిస్తోందని వివరించింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ భారత్ బయోటెక్ వెంటనే స్పందించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పూణె)తో కలిసి ‘కొవాగ్జిన్’ టీకాను ఆవిష్కరించిందని, తద్వారా టీకాల అభివృద్ధి, తయారీలో సత్తా చాటిందని పేర్కొంది. భారత్ బయోటెక్ నుంచి త్వరలో ముక్కు ద్వారా తీసుకునే (ఇంట్రా-నాజల్) కొవిడ్ టీకా రాబోతోందని ఫోర్బ్స్ వెల్లడించింది.

Share: