మంగళగిరి, జూన్ 16: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఇటు తెలుగు నాట కూడా తన సేవలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. తాజాగా మంగళగిరిలో చిన్నారుల అనాధశ్రమానికి నిత్యావసరాలు అందించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని షరాన్ చిన్నారుల అనాథ ఆశ్రమానికి చేయూత అందించేందుకు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే మానవత్వంతో స్పందించారు. కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు రాకపోవడంతో ఈ ఆశ్రమ నిర్వహణ కష్టంగా మారింది. ఈ విషయం విజయ్ శేఖర్ అన్నేకు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసరాలను అందించేందుకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందించారు.
అయితే, మంగళగిరిలోని షరాన్ ఆశ్రమం ఉన్న ప్రాంతం ప్రస్తుతం రెడ్ జోన్లో ఉంది. దీంతో ఇక్కడ వెళ్లడం కూడా కొంత కష్టమైనప్పటికి.. నాట్స్ ప్రతినిధులు అక్కడకు చేరుకుని షరాన్ ఆశ్రమానికి కావల్సిన నిత్యావసరాలు అందించారు. ప్రస్తుత కష్టకాలంలో మానవత్వంతో స్పందించిన నాట్స్ నాయకులు విజయ్ శేఖర్ అన్నే, కిషోర్ వీరగంథంలకు షరాన్ ఆశ్రమం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే పలు నిరుపేద కాలనీల్లో పేదలకు నిత్యావసరాలు అందిస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తోందని.. రానున్న కాలంలో వీలైనంతగా తాము పేదలను ఆదుకుంటామని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.