యన్టీఆర్ మరో పేరు ‘ట్రెండ్ సెట్టర్’!

ntr krishna

ఈ మధ్య పలువురు దర్శకనిర్మాతలు తమ చిత్రాల గొప్పలు చెప్పుకుంటూ సరికొత్త పంథాకు నాంది పలికాం అంటూ చాటింపు వేసుకుంటున్నారు. ఇక తమ సినిమా ‘ట్రెండ్ సెట్టర్’గా నిలచిందనీ ప్రకటించు కుంటున్నారు. చివరకు చూస్తే, సదరు చిత్రాలు ఎక్కడో కొట్టుకు వచ్చిన కథలతో తెరకెక్కినవని తేలిపోతోంది. అలా డబ్బా కొట్టుకున్నవారు నవ్వుల పాలవుతున్నారు. ట్రెండ్ అన్నది ఒకరు నెలకొల్పిన దానిని మరికొంతమంది అనుకరిస్తే మొదలవుతుంది. అంతే తప్ప, అదే పనిగా ట్రెండ్ సెట్టర్స్ మేమే అంటూ డంభాలు పలకడం సముచితం కాదు. అసలు తెలుగునాట ‘ట్రెండ్ సెట్టర్’ అన్న పదానికి అసలు సిసలు నిర్వచనం చెప్పిన ఘనత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు సొంతం. ఆయన నటజీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నవతరం నటీనటులు, దర్శకనిర్మాతలు సైతం యన్టీఆర్ ను ఫాలో కావలసిందేనని ఇప్పటికీ ఎందరో సినీజనం చెబుతూనే ఉంటారు. “రామారావు ఏ నాడూ ట్రెండ్ అనుసరించి సాగరు. ఆయనే ట్రెండ్ సృష్టిస్తారు” అనే నానుడి తెలుగు చిత్రసీమలో నెలకొంది. అందుకు ఎన్నెన్నో ఉదాహరణలు మన కళ్ళముందే కదలాడుతున్నాయి.

జానపదాలకు మళ్ళీ ఊపు…

తెలుగు చిత్రసీమ ఆరంభంలోనే అనేక పౌరాణిక, జానపద చిత్రాలను చూసింది. యన్టీఆర్ సినిమా రంగంలో ప్రవేశించే నాటికి, సాంఘికాలవైపు తెలుగు సినిమా పయనిస్తోంది. అప్పటికే “సుమంగళి, రైతుబిడ్డ, స్వర్గసీమ, దేవత, ద్రోహి, మనదేశం” వంటి చిత్రాలు రూపొందాయి. యన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’ కూడా సాంఘికమే. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా ‘షావుకారు’ కూడా సాంఘిక చిత్రమే. అందువల్ల యన్టీఆర్ సాంఘికాలకు భలేగా సరిపోతారని భావించారు. అయితే కేవీ రెడ్డి ‘పాతాళభైరవి’లో యన్టీఆర్ ను తోటరామునిగా నటింపచేశాక, జానపద కథానాయకుడంటే ఇలా ఉండాలన్న భావన తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. అప్పటి వరకూ జానపద నాయకునిగా సాగిన ఏయన్నార్ సదరు చిత్రాలకు దూరంగా జరగడం, ఆ తరువాత జానపదాల్లో తిరుగులేని వీరునిగా యన్టీఆర్ సాగడం జరిగిపోయాయి. ప్రపంచంలో అత్యధిక జానపదాల్లో హీరోగా నటించిన ఘనత యన్టీఆర్ సొంతం. ఆయన తరువాత ఆ ఖ్యాతి కాంతారావు దక్కించుకున్నారు.

పౌరాణికాలతో రికార్డు…

ఇక పౌరాణికాలకూ కాలం చెల్లిందనుకుంటున్న సమయంలో యన్టీఆర్ “ఇద్దరు పెళ్ళాలు”లో శ్రీకృష్ణునిగా, “చరణదాసి”లో శ్రీరామునిగా కనిపించారు. ఈ రెండు చిత్రాలు సాంఘికాలే అయినా, వాటిలో ఆయనను పౌరాణిక పాత్రల్లో నటింప చేసి అలరించారు ఆ చిత్రాల దర్శకులు ఎఫ్. నాగూర్, తాతినేని ప్రకాశరావు. ఆపై కేవీ రెడ్డి ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపారు. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ పౌరాణికాలకు, తెలుగునాట విశేషఖ్యాతి లభించింది. ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాలు తమిళ, బెంగాల్, హిందీ, ఒరియా భాషల్లోనూ అనువాదమై అక్కడి వారినీ అలరించాయి. అందువల్లే శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు అనగానే ఉత్తరాదివారు సైతం యన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. పౌరాణికాల్లోనూ యన్టీఆర్ ఓ రికార్డు నెలకొల్పారు. అత్యధిక పౌరాణిక చిత్రాలలో నటించిన నటునిగా ఆయన ఆ చరిత్ర సృష్టించారు.

శ్రీకృష్ణపాత్రలో…

ఓ పురాణ పాత్రను ఒకే నటుడు పదిసార్లకు పైగా నటించిన సందర్భాలు భూలోకమంతటా భూతద్దం వేసి చూసినా కనిపించవు. అలాంటిది యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను దాదాపు పాతికసార్లు తెరపై ప్రదర్శించడం విశేషం. దాదాపు 17 సార్లు పౌరాణికాల్లో శ్రీకృష్ణ పాత్ర ధరించిన యన్టీఆర్, ఆ తరువాత జానపద, సాంఘికాల్లోనూ శ్రీకృష్ణునిగా కనిపించి మురిపించారు. అంతకు ముందు, ఆ తరువాత కూడా ఏ నటుడూ ఓ పౌరాణిక పాత్రను ఇన్నిసార్లు తెరపై ఆవిష్కరించింది లేదు. అందుకే శ్రీకృష్ణుడు అనగానే మన దక్షిణాదివారికే కాదు, ఉత్తరాది వారికి సైతం యన్టీఆరే గుర్తుకు వస్తారు.

ద్విపాత్రాభినయంలో…

ఇక సాంఘికాల్లోనూ యన్టీఆర్ పలుమార్లు ట్రెండ్ క్రియేట్ చేశారు. యన్టీఆర్ కంటే ముందు భానుమతి, రమణారెడ్డి, ఏయన్నార్ వంటివారు తెరపై ద్విపాత్రాభినయం చేశారు. అయితే వారు నటించిన తరువాత డ్యుయల్ రోల్స్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ, యన్టీఆర్ 1964లో ‘రాముడు-భీముడు’లో ద్విపాత్రాభినయం చేయగానే, తెలుగునాట పలువురు హీరోలకు రెండు పాత్రలు ధరించాలన్న మోజు పెరిగింది. ఇక తెలుగు చిత్రసీమలో ఎక్కువ సార్లు డ్యుయల్ రోల్ చేసి అలరించిన ఘనత కూడా రామారావు సొంతమే. ఆయన తరువాత ఆ రికార్డ్ శోభన్ బాబుకు దక్కింది.

ntr-trnd

మరికొన్ని…

తెలుగునాట తొలి సోషియో ఫాంటసీగా ‘దేవాంతకుడు’ (1960) చిత్రం తెరకెక్కింది. తెలుగులో ఘనవిజయం సాధించిన తొలి అపరాధ పరిశోధన చిత్రంగా ‘లక్షాదికారి’ (1963) నిలచింది. తెలుగువారి మొదటి సైంటిఫిక్ ఫిక్షన్ గా ‘దొరికితే దొంగలు’ (1965) రూపొందింది. ఇక సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన ‘సూపర్ మేన్’ (1980)లోనూ యన్టీఆర్ నటించారు. ఇలా సాంఘికాలలోనూ పలు జానర్స్ ను టచ్ చేసి, తనకు తానే సాటి అనిపించుకున్నారు రామారావు. ఇప్పుడు సైంటిఫిక్ ఫిక్షన్ వైపు తెలుగు సినిమా పరుగులు తీస్తోంది. అలాగే సూపర్ హీరో కథలపైనా మనసు పారేసుకుంటోంది. అలాంటి వాటికి తెలుగు తెరపై తొలి సంతకం చేసిన ఘనత నిస్సందేహంగా యన్టీఆర్ దే!

నిర్మాతల మేలు కోరి…

తొలి తెలుగు రంగుల చిత్రం ‘లవకుశ’ (1963)లో యన్టీఆర్ శ్రీరాముని పాత్రలో జీవించారు. ఆ సినిమా సాధించిన ఘనవిజయం తరువాత ఎందరో యన్టీఆర్ తో రంగులచిత్రాలు తీయాలని పరుగులు తీశారు. అయితే అప్పట్లో కలర్ ముడి ఫిలిమ్ సంపాదించడం కష్టంగా ఉండేది. పైగా వ్యయం పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రామారావు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలోనే నటించసాగారు. ఇతర హీరోలు కలర్ మూవీస్ వైపు పరుగులు తీసి, రంగుల సినిమాల కోసం పారితోషికాలు తగ్గించుకొని మరీ నటించారు. అయినా, రామారావు తన నిర్మాతల మేలు కోరి పదేళ్ళ పాటు నలుపు-తెలుపు చిత్రాలలోనే నటిస్తూ సాగారు. రంగుల చిత్రం తీయాలన్న కోరికతో ‘శ్రీకృష్ణ సత్య’ తీశారు. అది ఆయన సొంత చిత్రం. అంతే తప్ప ఇతరుల సొమ్ముతో తాను ప్రయోగాలు చేయదలచుకోలేదు. ఆ తరువాత యన్టీఆర్ తొలి రంగుల సాంఘిక చిత్రంగా ‘దేశోద్ధారకులు’ (1973) వచ్చింది. ఆ సినిమా ఘనవిజయం సాధించాకే, రామారావు తన నిర్మాతలకు రంగుల చిత్రాలు తీసేందుకు పచ్చ జెండా ఊపారు. ఇక నటునిగా ఆయన ఎప్పుడు ప్రయోగాలు చేయాలనుకున్నా తన సొంత చిత్రాలలోనే చేసేవారు. అంతేకానీ, ఇతరులు ఎంతగా కోరినా, ఆ ప్రయోగం వికటిస్తే తన నిర్మాత నష్టపోతాడని భావించేవారు. అందుకే ఆయన త్రిపాత్రాభినయ చిత్రాలు “కులగౌరవం, దానవీరశూరకర్ణ”, పంచ పాత్రాభినయ చిత్రం ‘శ్రీమద్విరాట పర్వము” సొంతగా నిర్మించారు. అంతకు ముందు ఎందరో ‘బ్రహ్మంగారి చరిత్ర’ తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో ఏలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవని అన్నారు. అయితే రామారావు నిష్టతో ‘బ్రహ్మంగారి చరిత్ర’ను తన సొంతగా నిర్మించి, నటించారు. ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ చారిత్రక చిత్రాలలో ‘బ్రహ్మంగారి చరిత్ర’ దరిదాపుల్లో నిలచే సినిమా మరొకటి కానరాదు. ఆయన సొంత చిత్రాలలో ప్రయోగాలు చేసినా, అవే ట్రెండ్ సెట్టర్స్ గా నిలచి ఘనవిజయాలను సొంతం చేసుకోవడం మరింత విశేషం!

Share: