యాభై ఏళ్ళ పద్మాలయ

krishna

నటశేఖర ఘట్టమనేని కృష్ణ, ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నెలకొల్పిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పద్మాలయ’ ఈ యేడాదితో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది. కృష్ణ చిత్రసీమలో ప్రవేశించే నాటికి యన్టీఆర్, ఏయన్నార్ అగ్రశ్రేణి కథానాయకులుగా రాణిస్తున్నారు. వారి తరువాతి స్థాయిలో కాంతారావు, జగ్గయ్య అలరిస్తున్నారు. కృష్ణ ఈ హీరోల చిత్రాల్లో సైడ్ హీరోగా నటించేవారు. అడపాదడపా పోలో హీరోగా అలరించేవారు. తమ అన్నయ్య కృష్ణను కూడా టాప్ స్టార్ గా చూడాలని హనుమంతరావు, ఆదిశేషగిరిరావు భావించారు. అందుకోసం యన్టీఆర్, ఏయన్నార్ అనుసరించిన బాటలోనే తామూ పయనించాలని తలచారు. యన్టీఆర్ తమ ‘యన్.ఏ.టి.’ పతాకంపై తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, నటించి జనాన్ని అలరించేవారు. ఇక ఏయన్నార్ తన గురుసమానులైన దుక్కిపాటి మధుసూదనరావుతో కలసి ‘అన్నపూర్ణ’ సంస్థను ఏర్పాటు చేసుకొని, అందులో తన పర్సనాలిటీకి తగ్గ చిత్రాలను ఎంచుకొని నటిస్తూ సాగారు. ఈ రెండు నిర్మాణ సంస్థలు తెలుగునాట విశేషాదరణను చూరగొన్నాయి. దాంతో తమ అన్నయ్యను స్టార్ గా నిలపడానికి కృష్ణ సోదరులు తమకూ ఓ నిర్మాణ సంస్థ ఉండాలని భావించారు. తత్ఫలితంగానే 1970లో ‘పద్మాలయా’ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా వెలుగుచూసిన తొలి చిత్రం ‘అగ్నిపరీక్ష’. ఇది నిజంగానే కృష్ణసోదరులకు అగ్నిపరీక్ష పెట్టింది. సినిమా ఆట్టే అలరించలేకపోవడంతో, తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాన్ని చవిచూశారు.

K2

తొలి తెలుగు కౌబోయ్ కృష్ణ!

తమ తొలి ప్రయత్నం ‘అగ్నిపరీక్ష’ బెడిసి కొట్టడంతో ఈ సారి తప్పకుండా వైవిధ్యమైన కథాంశంతో ముందుకు పోవాలని భావించారు కృష్ణ సోదరులు. అప్పటి దాకా మాస్ ను యన్టీఆర్ భలేగా ఆకట్టుకొనేవారు. ఆయన నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు ఆబాలగోపాలాన్నీ అలరించేవి. సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథా చిత్రాలలోనే కాకుండా ‘దొరికితే దొంగలు’ వంటి సైంటిఫిక్ మూవీతోనూ, ‘లక్షాధికారి’ లాంటి థ్రిల్లర్ తోనూ అలరించారు. అందువల్ల యన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు భావించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో విశేషాదరణ పొందే కౌబోయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబోయ్ మూవీస్ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గ కౌబోయ్ కథను రూపొందించారు. అదే ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏ మాత్రం రాజీపడలేదు. కథానుగుణంగా రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరణ జరపడంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చుకొనేవారు. అయితే ఆయన నిర్మించిన ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణ నటించడమే కాదు, నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన సోదరులు సహాయం అందించడంతో ఆదినారాయణరావు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అంగీకరించారు. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ (1971) చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ‘గుడ్ టాక్’ సంపాదించింది. ముఖ్యంగా కౌబోయ్ సినిమాలు తెలుగువారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది ఈ సినిమా పెద్ద హిట్ గా నిలచింది. తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చి వేశాయి. మాస్ మూవీస్ లో వరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న యన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు. ఆ తరువాత కృష్ణతో ఇతర నిర్మాతలు సైతం కౌబోయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు.

మరింత ఉత్సాహంగా…

‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంతో మాస్ హీరోగా కృష్ణకు ఓ ప్రత్యేక స్థానం లభించింది. అయితే అప్పట్లో కుటుంబకథాచిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. యన్టీఆర్ ‘కలసివుంటే కలదుసుఖం, ఉమ్మడి కుటుంబం, కుటుంబగౌరవం’ వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటే, ఏయన్నార్ ‘తోడికోడళ్ళు, ఆదర్శకుటుంబం’ వంటి సినిమాలతో మెప్పించారు. అందువల్ల తమ అన్నయ్యతోనూ అలాంటి కుటుంబకథా చిత్రం నిర్మించాలని తలచారు కృష్ణ సోదరులు. నటుడు ప్రభాకర్ రెడ్డి అందించిన కథతో ‘పండంటి కాపురం’ తెరకెక్కింది. 1972లో విడుదలైన ‘పండంటి కాపురం’ చిత్రంలో ఎస్వీ రంగారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి కృష్ణకు అన్నలుగా నటించారు. ఈ చిత్రంలో జమున, దేవిక, బి.సరోజాదేవి, విజయనిర్మల నాయికలు. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల స్థాయిలో వసూళ్ళు చూసింది. కృష్ణ నటజీవితంలో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా ‘పండంటి కాపురం’ నిలచింది. ఈ సినిమా శతదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో యన్టీఆర్ ముఖ్యఅతిథి. ఆ శతదినోత్సవంలోనే తన అభిమాన నటుడు యన్టీఆర్ తో ఓ సినిమా తీయాలని ఉందని కృష్ణ తన మనసులో మాటను వెలిబుచ్చారు. అందుకు యన్టీఆర్ సైతం అంగీకరించారు. తత్ఫలితంగానే ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) జనం ముందు నిలచింది. ఆ సినిమా అఖండ విజయం సాధించి, అప్పటి వరకు ఏ సినిమా ఏకకాలంలో చూడనటువంటి శతదినోత్సవాలను సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్ళ పాటు బాక్సాఫీస్ హిట్ గా నిలచింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో మదరాసులో విద్యుత్ సరఫరాలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అయితే కృష్ణ సోదరులు తమ చిత్రనిర్మాణాన్ని బెంగళూరుకు మార్చుకొని అక్కడే చిత్రీకరణ పూర్తి చేశారు. కృష్ణ సోదరులు అంటే దేనికీ వెనుకాడరనే పేరు సంపాదించారు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఇద్దరూ అన్నకు కుడి,ఎడమ భుజాలుగా నడచుకొనేవారు. ఆ తరువాత ఈ సోదరులు నిర్మించిన చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’

k3

కృష్ణ సోదరుల సాహసం

కృష్ణ నటజీవితంలో 100వ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ (1974) తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు కథతో 1955లోనే యన్టీఆర్ ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించారు. ఆ సినిమాలో యన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్ కోసం మేకప్ టెస్ట్ కూడా చేసుకున్నారు. ఆ గెటప్ 1955లో యన్.ఏ.టి. సంస్థ నిర్మించిన ‘జయసింహ’ పాటల పుస్తకం వెనుక కూడా ప్రచురించారు. అందువల్ల యన్టీఆర్ బ్రెయిన్ చైల్డ్ అయిన ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రను తాను ధరించడం ఎంతవరకు సబబు అని ఆలోచించారు కృష్ణ. అంతకు ముందు కృష్ణ తన ‘అసాధ్యుడు’ చిత్రంలో ఓ సీన్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించారు. అందువల్ల ఆయన సోదరులు తామే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం నిర్మించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన యన్టీఆర్ కృష్ణను పిలిపించి అడిగారు. అందుకు కృష్ణ “మీరు అల్లూరి సీతారామరాజు తీసే పక్షంలో మేము ఈ చిత్ర నిర్మాణం విరమించుకుంటాం. లేదంటే మేము అన్నీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి ముదుకు పోతాం” అని చెప్పారు. అప్పట్లో యన్టీఆర్ ఎన్నో చిత్రాలకు కమిట్ అవ్వడం వల్ల వెంటనే సినిమా నిర్మించలేకపోయారు. దాంతో కృష్ణ, ఆయన సోదరులు అనుకున్న ప్రకారమే ‘అల్లూరి సీతారామారజు’ను నిర్మించడానికి పూనుకున్నారు. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్ర దర్శకుడు వి.రామచంద్రరావునే దర్శకునిగా ఎంచుకున్నారు. సినిమా మొదలయిన కొద్దిరోజులకే రామచంద్రరావు అనారోగ్యం పాలయ్యారు. షూటింగ్ ఆపేద్దామనుకున్నారు. కృష్ణ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చిత్ర రచయిత త్రిపురనేని మహారథి సలహా ఇచ్చారు. అందుకు కృష్ణ అంగీకరించారు. కృష్ణ నేతృత్వంలోనే సినిమా పూర్తయింది. కృష్ణనే సినిమాను పూర్తిచేసినా, టైటిల్స్ లో వి.రామచంద్రరావు పేరును ప్రకటించారు. 1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ తెలుగులో రూపొందిన తొలి ‘ఈస్ట్ మన్ కలర్-సినిమా స్కోప్’ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రం ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అప్పట్లో కృష్ణ సోదరులు చేసిన ఈ సాహస విజయాన్ని గురించి చిత్రసీమలో విశేషంగా చెప్పుకున్నారు. ‘అల్లూరి సీతారామరాజు’గా కృష్ణను చూసిన జనం ఇకపై ఆయన చిత్రాలను అంతగా ఆదరించరని విజయాధినేత చక్రపాణి జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ‘అల్లూరి సీతారామరాజు’ తరువాత కృష్ణ నటించిన అనేక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఓ హిట్ కొట్టాలంటే తమ పద్మాలయ సంస్థ నిర్మించే చిత్రమే రావాలని కృష్ణ సోదరులు భావించారు. రైతు కుటుంబాల నేపథ్యంలో ‘పాడిపంటలు’ (1976) నిర్మించారు. ఈ సినిమా అప్పటి సంక్రాంతి చిత్రాల్లో మేటిగా నిలచింది. మళ్ళీ కృష్ణ సోదరులకు ఊపు వచ్చింది. ఆ ఊపులోనే ‘కురుక్షేత్రం’ చిత్ర నిర్మాణం చేపట్టారు.

బాక్పాఫీస్ వార్

‘అల్లూరి సీతారామరాజు’ నిర్మాణం తరువాత యన్టీఆర్, కృష్ణ మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే ప్రచారం విశేషంగా జరిగింది. దానిని కొన్ని వర్గాల వారు పనికట్టుకొని ప్రచారం చేశారు. యన్టీఆర్ కు కృష్ణ వర్గం దూరంగా జరిగినంత పనయింది. ఆ సమయంలో కృష్ణ భారీస్థాయిలో ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. అదే సమయంలో అప్పటికి ఎన్నో ఏళ్ళ క్రితమే కొండవీటి వేంకటకవితో యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’ స్క్రిప్ట్ తయారు చేయించుకున్నారు. అలాగే పింగళి నాగేంద్రరావు రచనలో రూపొందిన ‘చాణక్య-చంద్రగుప్త’ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఈ రెండు కథలతో ముందుగా యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఏయన్నార్,శివాజీ గణేశన్ తో కలసి నటిస్తూ ‘చాణక్య-చంద్రగుప్త’ ఆరంభించారు. ఆ సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకే యన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కన్నుమూశారు. దాంతో ‘చాణక్య-చంద్రగుప్త’ను పక్కన పెట్టారు. మళ్ళీ ప్రారంభించాలనుకున్న సమయంలో ముందుగా ‘దానవీరశూరకర్ణ’నే పూర్తి చేయాలని నిర్ణయించారు యన్టీఆర్. అప్పటికే తాను ఓ ఐదు సినిమాల్లో నటిస్తూనే యన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని ఓ యజ్ఞంలా భావించి అతి నిడివిగల ఆ చిత్రాన్ని నెలన్నర రోజుల్లోనే పూర్తి చేశారు. మరోవైపు కృష్ణ, ‘పాండవవనవాసము’ చిత్ర నిర్మాత ఆంజనేయులుతో కలసి భారీగా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించారు. ఆ రోజుల్లోనే కోటి రూపాయల వ్యయంతో ‘కురుక్షేత్రం’ అత్యంత భారీగా రూపొందింది. ఈస్ట్ మన్ కలర్- సినిమాస్కోప్ లో తెరకెక్కిన తొలి తెలుగు పౌరాణిక చిత్రంగా ‘కురుక్షేత్రం’ తెరకెక్కింది. ఈ సినిమా 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయింది. అదే రోజున యన్టీఆర్ తన త్రిపాత్రాభినయ చిత్రం ‘దానవీరశూర కర్ణ’ను విడుదల చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘కురుక్షేత్రం’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ‘పద్మాలయ’ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. అయితే ఈ సంస్థ హిందీలో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఉత్తరాదిన సైతం ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలచింది.

k4

తొలి తెలుగు 70 ఎమ్.ఎమ్. మూవీ

తెలుగు చిత్రసీమకు ఈస్ట్ మన్ కలర్ సినిమా స్కోప్ ను పరిచయం చేసిన కృష్ణ సోదరులు ‘సింహాసనం’తో 70 ఎమ్.ఎమ్.ను అందించారు. ఇది కృష్ణ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం కావడం విశేషం. ఆ పైన కృష్ణ దర్శకత్వంలో మరికొన్ని చిత్రాలు పద్మాలయా సినీస్టూడియోస్ పతాకంపై రూపొందాయి. వీటిలో మహేశ్ బాబు తన తండ్రి కృష్ణతో కలసి నటించిన “ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి జనాదరణ పొందిన చిత్రాలు ఉన్నాయి. పద్మాలయా సినీస్టూడియోస్ పతాకంపై పలు హిందీ చిత్రాలు కూడా రూపొందాయి. శ్రీదేవిని బాలీవుడ్ టాప్ స్టార్ గా నిలిపిన ‘హిమ్మత్ వాలా’ను నిర్మించింది పద్మాలయా సంస్థనే. పద్మాలయా టెలీ ఫిలిమ్స్ పతాకంపై కొన్ని సీరియల్స్ నూ నిర్మించారు. కృష్ణ, మహేశ్ బాబు హీరోలుగా రూపొందిన ‘వంశీ’ కూడా పద్మాలయ పతాకంపైనే నిర్మితమైంది. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత కృష్ణ కోడలు అయిన సంగతి తెలిసిందే.
యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ‘పద్మాలయ’ సంస్థ నుండి ఓ చిత్రాన్ని నిర్మించాలని కృష్ణ చిన్న తమ్ముడు ఆదిశేషగిరిరావు ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.

Share: