రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం

MD

భారత రాజకీయాలను పరికించి చూస్తే ఇటీవల ఓ కొత్త విషయం అర్థమవుతోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాత్రంత్యం క్రమంగా మట్టిలో కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకున్న భరతమాత తిరిగి నియంతృత్వం చేతుల్లోకి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి గళం వినిపించినా, విమర్శలు చేసినా ప్రభుత్వాలకు ఎందుకనో రుచించడం లేదు. ఎలాంటి జంకూగొంకు లేకుండా విమర్శలు చేస్తున్న వారిపై దేశద్రోహం (రాజద్రోహం) కేసులు పెట్టి అరెస్టులు చేసి విచారణ పేరుతో కోర్టులు చుట్టూ తిప్పుతూ నానా హింసలు పెడుతున్నారు. అక్కడితోనే ఆగిపోవడం లేదు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడినా ఇదే గతి పట్టిస్తున్నారు. వెంటాడి వేధిస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వాలు మరో కొత్త పోకడకు తెరతీశాయి. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న వారిపై అవినీతి, దేశద్రోహం కేసులు పెడుతున్న ప్రభుత్వాలు తమను విభేదించే సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇటీవల మరింత పెచ్చరిల్లాయి. ఇందుకు బోలెడన్ని దృష్టాంతాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలను పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులను తిరగదోడి సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుల వెనక ఎవరు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీలో చేరితే అవినీతి ఆరోపణలన్నీ చిటికెటలో మాయం కావడానికి ఆ పార్టీ ఏమైనా వాషింగ్ మెషీనా? అని ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారంటే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. తమిళనాడులో జయలలిత అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎంకే నాయకుడు కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో తన అరెస్టుకు స్పందనగానే జయ ఈ అరెస్టు చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అమిత్ షా, చిదంబరం అర్ధరాత్రి అరెస్టుల వెనక కూడా ఇలాంటి నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి.

kii
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి తనపై విమర్శలు చేసిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేసి జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు జగన్ ప్రభుత్వం ఎంచుకున్న కారణం ‘రాజద్రోహం’. రాఘురామను అరెస్ట్ చేయడంతోపాటు తెలుగుదేశం పార్టీ అధినేత, మరికొందరు టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడంతోపాటు తనకు గిట్టని రెండు టీవీ చానళ్లను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేసింది.
ఈటల రాజేందర్ అరెస్ట్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్-19 కట్టడికి అనుసరిస్తున్న విధానాలను విమర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్‌పైనా దేశద్రోహం కేసు నమోదైంది. కారణాలు ఏవైతేనేం పార్టీలు అనుసరిస్తున్న విధానాలు మాత్రం సేమ్ టు సేమ్. కమలం పార్టీ బీజేపీ కరుడుగట్టిన జాతీయవాదం, హిందూత్వ రాజకీయాలతో ముందుకు వెళ్తుంటే, జగన్, కేసీఆర్, మమతలు తమ సొంత మార్కు రాజకీయాలతో ముందుకు వెళ్తున్నారు.
ప్రత్యర్థులను వేధించేందుకు అవినీతి, ఇతర కారణాలను బయటకు చూపిస్తున్నా అసలు కారణాలు మాత్రం వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడమేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. పార్టీలు, ప్రజలు కులాలు, మతాల ఆధారంగా విడిపోవడం. ఈ కారణంగా ప్రజలు కూడా తమ కులం వాడనో, తమ మతం వాడనో ఆయా పార్టీల నాయకులకు మద్దతు పలుకుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అయితే, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తర్వాత తమ వంతేనన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
———————-

Share: