శ్రీవాత్సవ చిత్రాలు.. జీవం ఉట్టిపడే అపురూప కళాఖండాలు!

s1

ఓ వైపు చదువులో రాణిస్తూనే మరోవైపు చిత్రలేఖనంలో ప్రతిభ చాటుతున్నాడు రాజమహేంద్రవరానికి చెందిన పోలిన హర్షిత్ శ్రీవాత్సవ. అతడి పెన్సిల్ నుంచి జాలువారుతున్న చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. జీవం ఉట్టిపడేలా ఉండేలా ఈ చిత్రాలు పలువురి ప్రముఖుల మన్ననలు అందుకున్నాయి. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని జయశ్రీ గార్డెన్స్ 2వ వీధికి చెందిన హర్షిత్ శ్రీవాత్సవ (20) తల్లిదండ్రులు స్వరూప, సత్యనారాయణ. వీరి స్వగ్రామం ములకల్లంక. ప్రస్తుతం రాజమండ్రిలో నివసిస్తున్నారు.
స్వరూప, సత్యనారాయణ కుమారుడైన శ్రీవాత్సవ ప్రస్తుతం బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శ్రీవాత్సవకు బాల్యం నుంచే చిత్రలేఖనంపై మనసు మళ్లింది. తన తండ్రి నుంచే తనకు ఈ కళ అబ్బిందని చెబుతాడు శ్రీవాత్సవ. చిన్నప్పుడు తన తండ్రి తనకు ఏం నేర్పించాలన్నా సులభంగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో బొమ్మలు గీసి చూపించేవారని, ఆ తర్వాత అదే తనకూ అలవాటైందని, ఆ తర్వాత అది అభిరుచిగా మారిపోయి జీవితంలో భాగం అయిందని చెప్పుకొచ్చాడు.

30 గంటల వ్యవధిలో 200 చిత్రాలు

ఓ వైపు చదువులో ప్రతిభ చాటుతూనే తనకు ఎంతో ఇష్టమైన చిత్రలేఖనంలోనూ పట్టు సాధించాడు శ్రీవాత్సవ. గత మూడేళ్లుగా వివిధ రంగాల్లోని ప్రముఖుల చిత్రాలను గీస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 300కుపైగా చిత్రాలు గీశాడు. అంతేకాదు, వంద చిత్రాలను గీయడానికి అతడికి మూడేళ్లు పడితే, 30 గంటల వ్యవధిలోనే 200 చిత్రాలను సజీవ కళాఖండాలుగా తీర్చిదిద్దడం అతడి ప్రతిభకు తార్కాణం. అంతేకాదు, కేవలం రెండు నిమిషాల్లోనే ఒక చిత్రాన్ని గీయడంలో నేర్పరి కూడా.

వెంకయ్య నుంచి సమంత వరకు..

తాను గీసే ఏ చిత్రమైన అద్భుత కళాఖండంగా మార్చడంలో దిట్ట అయిన శ్రీవాత్సవ వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల చిత్రాలను కాన్వాస్‌కు ఎక్కించాడు. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, ఆంధ్రుల ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టాటా దిగ్గజం రతన్ టాటా, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు మహేశ్‌బాబు, చిరంజీవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సమంత, నాని, రాజమౌళి, బాలసుబ్రహ్మణ్యం, ఆమిర్‌ఖాన్ మొదలైన వారి ఫొటోలు గీసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు.

s2

అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో నంబర్ వన్

సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు బొమ్మ ఆవిష్కరణ సందర్భంగా అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో మొత్తం 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. ఈ పోటీలో శ్రీవాస్తవ విజేతగా నిలవడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన మహేశ్‌బాబు మైనపుబొమ్మ ఆవిష్కరణ సందర్భంగా మహేశ్‌బాబుకు అతడి ఫొటోను బహూకరించాడు. అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా ఆయన చిత్రాన్ని బహూకరించి అబ్బురపరిచాడు. క్రైస్ట్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో మహేశ్‌బాబు కోరికపై కొన్ని నిమిషాల్లోనే అక్కడికక్కడే ఆయన చిత్రాన్ని గీసి అందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటాడు శ్రీవాస్తవ.

s3 s4

ఆర్కిటెక్చర్ విభాగ ప్రతినిధిగా..

చదువులో రాణిస్తూనే మరోవైపు తనకు అభిరుచి కలిగిన చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టిస్తున్న హర్షిత్ శ్రీవాత్సవ తాను చదువుకుంటున్న క్రైస్ట్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విభాగానికి ప్రతినిధిగా, యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్‌గాను పనిచేశాడు. మూడేళ్లపాటు సేవలు అందించాడు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 30 గంటల వ్యవధిలో 200 పెన్సిల్ చిత్రాలను గీసి ఉపాధ్యాయులకు బహూకరించాడు. తన ఉపాధ్యాయులకు టీచింగ్ అసిస్టెంట్‌గా ఎంపికై పలుమార్లు తోటి విద్యార్థులకు మెలకువలు నేర్పించాడు.

‘పెటా’ ప్రతినిధిగా..

చదువులోను, చిత్రలేఖనంలోనూ అద్భుతాలు సృష్టిస్తున్న హర్షిత్ శ్రీవాత్సవ వన్యప్రాణి సంరక్షణకు నడుంబిగించాడు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ప్రతినిధిగా ఉన్నాడు. ఇటీవల అసోంలో సంభవించిన వరదల కారణంగా ఎన్నో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని తిండి, నిలువ నీడ లేక అల్లాడిపోయాయి. ఇలాంటి వాటికి ప్రభుత్వం పునరావాసం కల్పించగా, వాటికి ఆహారం, వైద్యానికి తనవంతు సాయం అందించాడు. తాను గీసిన చిత్రాలను అమ్మగా వచ్చిన మొత్తాన్ని వాటి సహాయనిధికి అందించాడు.

s5

తల్లిదండ్రుల ప్రోత్సాహం

తనకు ఈ రోజు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి ఎంతో ఉందని శ్రీవాత్సవ చెప్పుకొచ్చాడు. వన్యప్రాణులను వేటాడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న శ్రీవాస్తవ.. యదార్థ సంఘటనల ఆధారంగా ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఓ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఫొటోగ్రఫీ అన్నా, డాక్యుమెంటరీలు తీయడం అన్నా ఎంతో ఇష్టమనే శ్రీవాత్సవ భవిష్యత్తులో మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆశిద్దాం.

s6

Share: