రాజకీయాలంటనే బురద అన్నారు పెద్దలు. ఆ బురదలో కాలు మోపనేల కడుక్కోవడానికి నీళ్ళ కోసం పాకులాడనేల? అన్నది అలాంటి పెద్దల మాట. ఈ మాట ఇప్పటిది కాదు మనకు స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుంచీ వాడుకలో ఉన్నదే. అయితే అప్పటి రాజకీయ నాయకులు హుందాగా, విలువలకు ప్రాధాన్యమిస్తూ నడచుకొనేవారు. ఒకవేళ ప్రతిపక్షాలపై విమర్శలు చేసినా అందులోనూ విలువలు పాటించేవారు. అంతే తప్ప అసభ్య, అశ్లీల పదాలను ఏ నాడూ ఉపయోగించేవారు కారు. ఇప్పటి రాజకీయనాయకులను ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లోని అధికార పార్టీ నాయకుల భాష చూస్తోంటే చదువు సంధ్యలేని పామర జనం కూడా అసహ్యించుకొనే భాషను ఎంచుకుంటున్నారు. అలాంటి నాయకులను ఎన్నుకోవడం మన దురదృష్టం.
యథా రాజా… తథా గణం…
ఇక అసలు విషయానికి వస్తే మన ఆడపడచు దగ్గుబాటి పురందరేశ్వరిని బీజేపీ అధిష్ఠానం తమ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్నారు. ఆ తరువాత పురందరేశ్వరి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న పాలనపై వాస్తవాన్నే వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తరువాత అంతటి స్థాయి ఉన్న నాయకుడైన విజయసాయిరెడ్డి చాలా చౌకబారు మాటలు వల్లించారు. అదీ సామాజిక మాధ్యమంలో పురందరేశ్వరిని ఉద్దేశించి, ఆమె జాతీయ కార్యదర్శియో, ‘జాతి’ కార్యదర్శియో అంటూ విషం చిమ్మారు. ఓ ఆడపడచును ఉద్దేశించి ఆలాంటి మాటలు అనడానికి ఎలా మనసు ఒప్పింది అని మనవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన రెడ్డే, తన హోదాను కూడా గుర్తించకుండా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ ను , చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. అంటే కులపిచ్చిని జనంలో నింపడానికి వైసీపీ ప్రధాన నాయకుడే ప్రయత్నిస్తోంటే ఇక విజయసాయి రెడ్డి వంటి వారు ఎంత అని కొందరి మాట.
ఈ విజయసాయిరెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఇదేమీ మొదటి సారి కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా “చంద్రబాబు ఒక అమ్మకు పుట్టివుంటే…” అంటూ దేశరాజధాని ఢిల్లీలోనే మాట్లాడారు. మరి అలాంటి వ్యక్తి నుండి సభ్యసమాజం గర్వించే మాటలు రావాలని కోరుకోవడం తప్పే అవుతుంది కదా! ఇక వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఓ సారి 30 మంది పోలీసు అధికారులకు డీఎస్పీలుగా పదన్నోతి లభిస్తే, అందులో అందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని గోబెల్స్ ప్రచారం చేశారు. గుర్తుండే ఉంటుంది. ఆయన అలా మాట్లాడిన రోజునే పలు పత్రికలు ఏయే సామాజిక వర్గానికి చెందిన వారు డీఎస్పీలుగా పదోన్నతి పొందారో జాబితాను కూడా ప్రకటించాయి. అందులో కమ్మవారు కేవలం ఇద్దరే ఉన్నారు. జగన్ సామాజిక వర్గానికి చెందినవారు కూడా ఉన్నారందులో. అయినప్పటికీ జగన్ తాను చెప్పినదే సరైనది అంటూ ఢిల్లీలోనూ అదే మాటను నొక్కి వక్కాణించారు. జగన్ అభిమానులు తమ నాయకుడు చెప్పిందే నిజం అంటూ కీర్తించారు. జేజేలు పలికారు. ఇంకా విచిత్రమేమంటే, అలా జగన్ మాటను వాస్తవమని చాటింపు వేసిన వారిలో విద్యాధికులు కూడా ఉండడం విచారకరం.
ఆ మాటలు గుర్తుకు తెచ్చుకోండి…
అలాంటి పార్టీ నాయకుల నుండి విలువలను ఆశించరాదు. ఇక సభ్యసమాజం మెచ్చే పదాలను ఆశించినా పాపమే అవుతుంది. మీ నాయకులు ఏమైనా తక్కువా అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి ఢిల్లీలో మీడియా సమావేశం జరుగుతూ ఉండగా, పొరపాటున జగన్ ను ‘వాడా’ అన్నారు. వెంటనే సరిదిద్దుకుని “సారీ” “ఆయనా” అంటూ వ్యాఖ్యానించారు. అదీ చంద్రబాబు రాజకీయాల్లో విలువలకు ఇచ్చే గౌరవం. అంతెందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేంద్రంలో పాలనలోనూ భాగస్వామ్యం పంచుకున్న సమయంలో ఇదే వైసీపీ నాయకుల్లో కొందరు చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా అనరాని మాటలు అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏమన్నారో కాసింత గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఆ పార్టీ నాయకురాలు రోజా నోటికి హద్దే లేదు. చంద్రబాబుపై విరచుకు పడడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. తాను అధికారంలో ఉన్నా , తనను అన్నేసి మాటలు అంటున్నా చంద్రబాబు ఏ నాడూ దిగజారి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం ఎలాంటిదో ఆయనకు తెలుసు. అంతేనా, ప్రజలను సైతం అంతే గౌరవంగా పాలించగల సత్తా కూడా ఆయనకు ఉంది.
ఆలోచించండి బాస్…
ఎంతటి నాయకులైనా ఏదో ఒక సమయంలో సంయమనం కోల్పోవడం జరుగుతూ ఉంటుందని, అందువల్ల తమ నాయకులు అన్న మాటలను పెద్దగా పట్టించుకోరాదని వైసీపీ ఇతర నేతలు వల్లె వేస్తూ ఉంటారు. అంటే ఒకరు గిల్లితే మరొకరు వచ్చి రుద్దుతారన్న మాట. ఇలాంటి నాయకులను ఎంచుకోవడంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువత కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆ సమయంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతీయువకులే కొందరు “జగన్ యువకుడు. అతని భావాలు యువతకు తగ్గ రీతిలో ఉంటాయి. ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటి” అన్నారు. పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది ఒకసారి చూడండి. ఉన్నతమైన భావాలు కలవారి నోట అదే స్థాయి పలుకులు వెలువడుతాయి. ఈ సత్యాన్ని ఈ తరం తెలుసుకోలేక పోయింది. జగన్ తమ సామాజిక వర్గాన్నే తూలనాడుతున్నా, అదంతా రాజకీయం, జగన్ వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించినవారు ఉన్నారు. కొంతమందికి జగన్ రాగానే సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగం కూడా వచ్చింది. వారంతా చూశారా, ఏ సామాజిక వర్గమయితే ఏంటి, జగన్ వచ్చాడు, ఉద్యోగం వచ్చింది అంటూ చాటింపు వేశారు. అలాంటి వారు కూడా ప్రస్తుతం వైసీపీ నాయకుల నేలబారు వ్యాఖ్యలు చూసి విస్తూ పోతున్నారు. ఒక్క చాన్స్ అనగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఓట్లేశారు. మీ ఒక్క ఓటుతో భావితరాల భవిష్యత్ లో ఐదేళ్ళు నాశనం చేస్తున్నామని ఆలోచించలేక పోయారు.
ఏది ఏమైనా విద్యావంతులు – వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారయినా సరే, ఉన్నతమైన భావాలతో ఏ నాయకులు మీ ముందుకు వస్తారో, వారి మాట తీరు ఏలాంటిదో గమనించి మరీ ఓటు వేయండి. ఒకవేళ ఒక్క అవకాశం అడిగాడు కదా అని ఇస్తే, ఇలాగే ఉంటుంది. ఆడ, మగ అన్న తేడాలేకుండా తామున్న పదవుల గౌరవం కూడా లెక్క చేయకుండా సభ్యసమాజం తలదించుకొనేలా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి మాటలు వారిని కులం కారణంగా అభిమానించే వారికి ఆనందం కలిగించవచ్చు. అదే సమయంలో వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారన్న సత్యాన్ని గ్రహించాలి. అంత ఇంగితం ఉంటే వైసీపీ అదికారంలోకి వచ్చేదా అని పెద్దలు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ నాయకుల అసభ్య పదజాలాన్ని కూడా అభిమానించేవారికి దూరంగా ఉండండి. అలాంటి వైసీపీ అభిమానుల్లో విద్యాధికులు కూడా ఉంటే వారికి మరింత దూరంగా ఉండండి. మామూలు మూర్ఖులకన్నా చదువుకున్న మూర్ఖులు బహు ప్రమాదం.