అంతరిక్ష యానం

sirisha bandla

బండ్ల శిరీష జులై 11న రాత్రి 8 గంటలకు న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా రోదసీలోకి వెళ్లారు. ఆ నౌకలో ఆమెతోపాటు వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌, మరో నలుగురు ఉన్నారు. ఈ వ్యోమనౌక నేల నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీరంతా నాలుగైదు నిమిషాలపాటు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను వీక్షించారు.

అదృష్టంగా భావిస్తున్నా..

రోదసీలోకి వెళ్లడానికి ముందు శిరీష ట్వీట్ చేస్తూ.. అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగస్వామి కావడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో వెళ్లబోయే అంతరిక్ష పర్యాటకులకు ఆ యాత్ర జీవితకాల అనుభూతిగా మిగిలిపోయేలా చేసేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.

యాత్ర సాగిందిలా..

రోదసీ యాత్రలో భాగంగా యూనిటీ అని పిలిచే వాహక నౌకను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15 కిలో మీటర్ల(50 వేల అడుగుల) ఎత్తుకు తీసుకెళ్లి విడిచిట్టింది. ఆ సమయంలో యూనిటీకి అమర్చిన రాకెట్ మోటార్‌ను ప్రజ్వలింపజేయడం ద్వారా దాని మోటార్‌ను 60 సెకండ్లపాటు మండించారు. ఆ సమయంలో రిచర్డ్ బ్రాన్సన్, ముగ్గురు క్రూ సహచరులు, ఇద్దరు పైలట్లు అక్కడి నుంచి భూమిని చూడగలిగారు. అనంతరం అంతరిక్షంలోకి యూనిటీ ప్రయాణం సాగింది. యూనిటీ నౌక గరిష్ఠంగా భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 80 కిలోమీటర్లు దాటి వెళ్లిన వారిని వ్యోమగాములుగా పరిగణిస్తారు. రోదసీ సరిహద్దుగా భావించే కర్మన్ రేఖకు చేరుకున్న తర్వాత నౌకలోని వారంతా కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాబిన్‌లో తేలుతూ కిటికీలోంచి భూమిని చూశారు. ఆ తర్వాత వాహక నౌక తిరిగి న్యూమెక్సికోలోని స్పేస్‌పోర్ట్‌కు తిరిగి పయనమైంది.

లక్ష్యానికి అడ్డు వచ్చిన కంటి చూపు

రోదసీ యాత్రను అద్భుమైన ప్రయాణంగా అభివర్ణించిన శిరీష.. ఈ ప్రయాణం మొత్తం నమ్మశక్యం కాకుండా ఉందన్నారు. ఈ అనుభవాన్ని వర్ణించేందుకు ‘ఇన్‌క్రెడిబుల్’ పదానికి మించిన దాని కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రోదసీలోకి వెళ్లడం, అక్కడి నుంచి భూమిని చూడడం, తిరిగి వెనక్కి రావడం ఈ మొత్తం ప్రయాణం జీవితంలో అద్భుతమైన ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన చిన్నప్పటి స్వప్నం నెరవేరినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని శిరీష చెప్పుకొచ్చారు.

నిజానికి శిరీష వ్యోమగామి కావాలని అనుకునేవారు. కానీ అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు ఎంపిక కాలేకపోయారు. దీనికి కారణం ఆమె కంటిచూపు. నాసా పైలట్, వ్యోమగామి అయ్యేందుకు ఉండాల్సినంత కంటి చూపు ప్రమాణాలు లేకపోవడంతో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అయితేనేం.. ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ చదివి మరో మార్గంలో అంతరిక్షయానం చేసి తన కలను నెరవేర్చుకున్న శిరీష.. అవకాశాలు మూసుకుపోయాయని బాధపడే యువతకు స్ఫూర్తి ప్రదాత. శిరీష మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.

Share: