అసలు ఈ పోలికలేంటి … బాబూ!

AA

పిచ్చి ముదిరితే తలకు రోకలి చుట్టమన్నారట. అలాగుంది ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోని పాలక పక్షం వైసీపీ శ్రేణుల తీరు. వారికి ఎంతటి పిచ్చి ఉందో సామాజిక మాధ్యమాలలో వారు పెట్టే పోస్టులే తెలియజేస్తుంటాయి. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు జయంతి అయిన మే 28వ తేదీ, వర్ధంతి అయిన జనవరి 18వ తేదీ తెలుగువారికి మరపురానివి. అలాగే వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అన్నా ఎంతో అభిమానం. అందులో తప్పు పట్ట వలసిన పనేలేదు. వారికి కూడా వైఎస్సార్ జయంతి అయిన జూలై 8వ తేదీ అన్నా, ఆయన వర్ధంతి అయిన సెప్టెంబర్ 2వ తేదీ అన్నా మరపురానివే. అయితే ఈ నాలుగు తేదీలు – అంటే యన్టీఆర్ జయంతి, వర్ధంతి, రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి వచ్చాయంటే చాలు తెలుగుదేశం పార్టీని, ఆ నాయకుల కుటుంబాలను, వారి స్త్రీలనూ విమర్శిస్తూ ఏదో ఒక రీతిన తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో వికృతచేష్టలు చేస్తూ పోస్టులు పెట్టడం వైసీపీ అభిమానులు పరిపాటి అయిపోయింది.

ఏమిటి సంబంధం?

నిజానికి యన్టీఆర్ కు, వైఎస్సార్ కు ఉన్న సంబంధమేంటి? యన్టీఆర్ సినిమా స్టార్ గా ఉన్న రోజుల్లో విద్యార్థిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆయన అభిమాని. యన్టీఆర్ సినిమాలు చూడటానికి గుల్బర్గాలో ఎమ్.బి.బి.ఎస్. చదువుతున్న రాజశేఖర్ రెడ్డి అదే పనిగా మోటార్ బైక్ వేసుకొని హైదరాబాద్ వచ్చేవాడినని ఆయనే చెప్పుకున్నారు. ఈ విషయం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 2004 మే నెలలో పలు పత్రికలలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలోనే ఉంది.ఇక యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఆ సమయంలో పాలక పక్ష నాయకునిగా యన్టీఆర్ పై ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి చేసిన విమర్శలూ, వేసిన ఎత్తులూ అందరికీ తెలిసినవే. అంతేకానీ, రాజశేఖర్ రెడ్డి ఏ నాడూ యన్టీఆర్ ను వ్యక్తిగతంగా పల్లెత్తు మాట అన్నది లేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా యన్టీఆర్ ను అదే పనిగా విమర్శించింది లేదు. 2009 ఎన్నికల సమయంలో హిందూపురంలో ప్రచారం చేస్తూ యన్టీఆర్ మాట తప్పారు అని కామెంట్ చేస్తే జనం ఎలా గేలి చేశారో కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇంతకు మించి యన్టీఆర్, వైఎస్సార్ మధ్య బంధమేమీ లేదు. అలాంటిది ప్రస్తుతం ఏ విషయం వచ్చినా, వైసీపీ శ్రేణులు యన్టీఆర్ తో రాజశేఖర్ రెడ్డిని పోల్చుకోవడం మొదలు పెట్టాయి. అదే వింతగా ఉంది. వారి తీరు చూస్తే పిచ్చి పట్టినట్టే అనిపిస్తోంది.

అదో పోలిక!?

యన్టీఆర్ జయంతి, వర్ధంతి వచ్చినా, రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి వచ్చినా ఈ శ్రేణులు వీరిద్దరినీ పోల్చుతూ తమ నాయకుడే గొప్ప అని డబ్బా కొట్టుకోవడం పెచ్చు మీరి పోయింది. పైగా వీరు పెట్టే క్యాప్షన్ ఏంటయ్యా అంటే – “సినిమాల్లో దేవుని పాత్రలు పోషించి, నాయకుడయ్యారు యన్టీఆర్ – నాయకుడై దేవుడుగా నిలిచాడు వైఎస్సార్”. ఈ వ్యాఖ్యలు అదే పనిగా యన్టీఆర్ జయంతి, వర్ధంతిన, ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతిన దర్శనమిస్తూ ఉంటాయి. అసలు యన్టీఆర్ తో వైఎస్సార్ కు పోలికేంటి?

అదీ ఆయన పద్ధతి!

యన్టీఆర్ తన కోసం, తన కుటుంబం కోసం నటనను వృత్తిగా తీసుకొని కష్టపడ్డారు. బహుకుటింబికుడైనందున పెద్ద కుటుంబానికి తగిన ఆస్తిపాస్తులు చేకూర్చడానికి రేయనక, పగలనక శ్రమించి సంవత్సరానికి ఏడెనిమిది చిత్రాల్లో నటిస్తూ సంపాదించారు. తన అభినయాన్ని ఆరాధించి, అభిమానిస్తున్న తెలుగు జనానికి ఏమైనా చేయాలని భావించారు. ఆ రోజుల్లోనే అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న కథానాయకునిగా వెలిగిపోతున్నా, అభిమానించే వారికి సేవ చేయాలంటే రాజకీయరంగమే తగిన వేదిక అని భావించి, రాజకీయాల్లోకి వచ్చారు. 1982 మార్చి 29న సొంతగా తెలుగు దేశం పార్టీ పెట్టి, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో అధికారం చేపట్టారు. ఆ తరువాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఈ నాటికీ ఏదో ఒక పేరుతో అమలవుతూనే ఉన్నాయి. యన్టీఆర్ కు ఏడుమంది కొడుకులు, నలుగురు బిడ్డలు. వీరు ఏ రోజునా యన్టీఆర్ అధికారంలో ఉండగా సచివాలయం వైపు కన్నెత్తి చూడలేదు. 1995లో మాత్రం యన్టీఆర్ కుటుంబంలో ఏర్పడ్డ వైషమ్యాల పరిష్కారంలో భాగంగా ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ తండ్రితో సంప్రదించడానికి మాత్రమే సెక్రటేరియట్ కు వచ్చారు. అంతే తప్ప అవకాశఃం ఉన్నా ఏ నాడూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలు ఎత్తాలని ఆశించలేదు.

ఇదీ వీరి తీరు

ఇక వై ఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ గా జమ్మలమడుగులో పనిచేసే రోజుల్లో పేదలకు ఉచితంగా వైద్యం చేసిన తీరును ఇప్పటికీ చెప్పుకుంటారు. అది అభినందనీయమే! అయితే ఆయన తండ్రి రాజారెడ్డి చేసిన దందా గురించీ, అందులో భాగంగా రాజారెడ్డి జైలుకు వెళ్లిన విషయాన్నీ అక్కడి జనం ఇప్పటికీ గుర్తుంచుకొనే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబీకులు పులివెందులలో తమ ఆధిక్యం చాటుకోవడానికి చేసిన చేష్టల గురించీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. రాజశేఖర్ రెడ్డికి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి జేజారిపోయింది. ఆ సమయంలో హైదరాబాద్ లో జరిగిన అల్లర్లకు ఎవరు కారకులో కూడా అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, సొంత పార్టీలోనే అసంతృప్త నాయకునిగా ఉన్నారు. చివరకు 2004లో ఆయన కల ఫలించింది. ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఆ పదవినే అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రడ్డి తాను బెంగళూరులోనే ఉంటూ చక్రం తిప్పి, కోట్లకు పడగలెత్తిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆర్థిక నేరారోపణతో 16 నెలలు జైలులో కూడా ఉండి వచ్చారు జగన్. అదే జగన్ పై కొందరికి జాలి కలిగేలా చేసింది. ఇప్పటికీ జగన్ చేసిన నేరమేమీ లేదు, ఆయనను అన్యాయంగా జైలులో పెట్టారు అని వాదించేవారి సంఖ్య తక్కువేమీ లేదు. కేవలం సోనియా గాంధీ చేసిన ఒకే ఒక్క తప్పు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన వైనం ఒక్కటే జగన్ కు కలసి వచ్చిన అంశం. రాష్ట్ర విభజన జరగక పోయి ఉంటే, జగన్ సొంత పార్టీ పెట్టినా, అధికారం చేజిక్కించుకొనేవారు కాదు. ఎందుకంటే, విభజన జరగక పోయిఉంటే ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ బలంగా ఉండేది. అప్పుడు పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ నడుమ ఉండేది. విభజనతో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమై పోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెల్లాచెదురై కొందరు తెలుగుదేశంలోనూ, మరికొందరు వైసీపీలోనూ చేరారు. కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజిక వర్గం వారే అధికంగా ఉండేవారు కాబట్టి వారిలో ఎక్కువమంది వైసీపీ వైపే మొగ్గు చూపారు. అలా జగన్ అధికారం చేపట్టేందుకు సోనియా పరోక్షంగా సాయం చేశారనే చెప్పాలి. అదీగాక కొందరు కాంగ్రెస్ నాయకులు జగన్ సొంత కుంపటి పెట్టుకున్నా, అతను మా వాడే, మా కాంగ్రెస్ డి.ఎన్.ఏ. ఉందనీ చాటింపు వేసిన సంగతి మరచిపోరాదు. ఇలాంటి చరిత్ర కలిగిన వీరిని యన్టీఆర్ తో పోల్చేవారిని ఏమనాలి?

ఎవరి తీరు వారిదే…

ఇక రాజకీయాల్లో ఎవరి తీరు వారిదే. ఓ ఫుల్ టర్మ్ అధికారంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి తన ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక పథకం ప్రవేశ పెట్టక మానరు. అలా యన్టీఆర్ హయాంలోనూ, తరువాత చంద్రబాబు పాలనలోనూ, ఆ పైన రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టినపుడు ప్రజలకు మేలు చేసే పథకాలు కొన్ని వచ్చాయి. అది ఎవరూ కాదనలేని సత్యం! కానీ, ఏపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి మాత్రం యన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎన్నో పథకాలు పెట్టారని, ఇక చంద్రబాబు హయాంలో జనానికి ఏమీ చేసింది లేదని చాటింపు వేస్తున్నారు. అసలు యన్టీఆర్ తో మీకు, మీ నాయకులకు పోలికేంటి? అదలా ఉంచుదాం. చంద్రబాబు నాయుడు ఏ లాంటి జన సంక్షేమ పథకాలు అమలు చేయక పోయివుంటే మూడుసార్లు (అందులో ఒకటి యన్టీఆర్ కు వెన్నుపోటు అనుకున్నా) , లేదు రెండు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయి ఉండేవారు? చంద్రబాబును విమర్శించేటపుడు వైసీపీ శ్రేణులకు ఈ ఆలోచన ఎందుకని కలగదు? అంతటి ఆలోచనే ఉంటే వారు యన్టీఆర్ ను ఎందుకు పదే పదే తమ నాయకులతో పోల్చుకుంటారు.

ఆయన ఆకాశం…

ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రులుగా ఉంటూ ప్రజలకు మేలు చేసిన వారెవరైనా జనం మదిలో నిలచిపోతారు. ఇప్పటికీ కాసును, జలగంను, కోట్లను అభిమానించే ప్రజలు ఉన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డిని, చంద్రబాబు నాయుడును కూడా గుండెల్లో పెట్టుకొనే వారుంటారు. అందుకే రాజకీయాల్లో వీరందరినీ స్టార్స్ గానే మనం భావించాలి. జీవితానంతరం ఆకాశంలో తారల్లా వీరు వెలుగుతుంటారనీ కొందరి విశ్వాసం. అందులో తప్పేమీ లేదు. ఎవరి అభిమానం వారిది. ఇతరుల మనోభావాలను గౌరవించవలసిందే. అయితే పిచ్చిపట్టినట్టు ఏ లాంటి పోలికలు లేని వారిని తీసుకువచ్చి, పోల్చి చూడడం సబబు కాదు. యన్టీఆర్ అనంత ఆకాశం లాంటివారు. సినిమారంగంలోనూ, రాజకీయాల్లోనూ యన్టీఆర్ వేసిన ముద్ర మరపురానిది, మరువలేనిది, తరిగిపోనిది, చెరిగిపోనిది. ఆకాశాన్ని చూసి ఆనందించాలే కానీ, అందుకోవడం ఎవరి సాధ్యమూ కాదు. ఈ సత్యం తెలుసుకున్నవారికి పిచ్చి నయమైనట్టే. లేదూ అంటే జనమే వారి పిచ్చి కుదురుస్తారు. ఏమంటారు?

Share: