జూనియర్ యన్టీఆర్ గా జనం మదిలో నిలచిన బుల్లి రామయ్య అంటే అభిమానులకే కాదు చిత్రసీమలోనూ ఎంతోమందికి ప్రేమ, అభిమానం ఉన్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత, దర్శకుడు అయిన విజయేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. విజయేంద్రప్రసాద్ రచనతో జూనియర్ యన్టీఆర్ కెరీర్ కు విడదీయరాని బంధం ఉంది. జూనియర్ యన్టీఆర్ కెరీర్ లో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు సృష్టించిన ‘సింహాద్రి’ చిత్రానికి ఆయనే రచయిత. ఇక తాతను గుర్తుకు చేసేలా జూనియర్ నటించిన ‘యమదొంగ’కూ విజయేంద్రప్రసాద్ రచన చేశారు. యావద్భారతంలోనే కాదు, విదేశాల్లోని సినిమా అభిమానులను సైతం ఆకర్షిస్తోన్న రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’కు కూడా విజయేంద్రప్రసాదే రచయిత కావడం విశేషం. ‘ట్రిపుల్ ఆర్’ గురించిన అంశాలపై సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలోని యన్టీఆర్ నటనపై విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీన్స్ లో నటించడం జూనియర్ కు కొత్తేమీ కాదు. ఫైట్స్ లో ఆయన ప్రదర్శించే నటన సైతం జనాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. “నిజానికి యన్టీఆర్ ఫైట్ చేస్తూ ఉంటే, ప్రత్యర్థులను కొట్టు, చంపు, నరుకు అన్న రీతిలో ఉంటుంది. కానీ, ‘ట్రిపుల్ ఆర్’లోని యాక్షన్ సీన్స్ లో అందుకు భిన్నంగా కనిపిస్తుంది” అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ ఫైట్స్ చూస్తే ‘సెంటిమెంట్’ ఉంటుందని, చూసేవారి కళ్ళవెంట నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు. దీనిని బట్టి ‘ట్రిపుల్ ఆర్’లో జూనియర్ యన్టీఆర్ నటన ఓ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల ద్వారా పలు చిత్రాల విడుదలలో జాప్యం అనివార్యమయింది. కరోనా గొలుసు తెగితేనే కానీ, మళ్ళీ సినిమా థియేటర్లు కళకళ లాడని పరిస్థితి. అందువల్ల అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ‘ట్రిపుల్ ఆర్’ ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చెప్పలేం. కానీ, ఎప్పుడు వచ్చినా అందులోని యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకోకమానదని తెలుస్తోంది.
ఇక యన్టీఆర్ ఇప్పటి దాకా నటించిన పాత్రల్లో ఆయన కరుణ రసం పలికించలేదని, ఆ తరహా పాత్రల్లో జూనియర్ నటిస్తే చూడాలని ఉందని విజయేంద్రప్రసాద్ అన్నారు. తమ చిత్రాల్లోనే యన్టీఆర్ అన్ని రసాలు భలేగా పలికించారని, అవే ఇతర చిత్రాల్లోనూ కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, జూనియర్ నటించిన ఇతరుల చిత్రాల్లో తనకు ‘అదుర్స్’లోని చారి పాత్ర ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. అంతేకాదు, ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే, చారీ పాత్ర బిట్స్ చూసి ఆనందిస్తుంటాననీ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఇలా చిత్రపరిశ్రమలోని పెద్దలు, పిన్నలు సైతం జూనియర్ ను అభిమానిస్తున్నారు. ఈ మధ్య జూనియర్ కరోనా బారిన పడ్డప్పుడు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ అభిలషించారు. వారందరి అభిమానంతో జూనియర్ మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యారు. అప్పటి నుంచీ ఆయన అభిమానులు, సినిమా ఫ్యాన్స్, దేశవిదేశాల్లోని తెలుగువారు అందరూ ‘ట్రిపుల్ ఆర్’ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూసేద్దామా అన్న మూడ్ లోనే ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడో చూడాలి.
ఆర్.ఆర్.ఆర్.’లో యంగ్ టైగర్ ఫైట్స్!
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021