ఆ త్యాగం చేసిన మొదటి మహిళ అన్నపూర్ణాదేవి పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

G

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తికాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం.
————————-

దేశీయుల కష్టనివారణకై 1885న జాతీయ మహాసభ (కాంగ్రెస్) ఏర్పడింది. ప్రథమంలో అది ఆంగ్ల విద్యాధికుల ప్రయోజనాలను అర్థిస్తూ, రాజభక్తిని వెల్లడిస్తూ ప్రభుత్వం వారి దయాదాక్షిణ్యాలకు లోబడి ఉన్నది.

వంగీయుల దేశభక్తిని, ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని నాయకత్వాన్ని చూచి సహించలేక రాజప్రతినిధి కర్జన్ ప్రభువు మత ప్రాతిపదికన బంగదేశాన్ని రెండుగా 1905లో చీల్చాడు.

ఈ వంగ విభజనకు వ్యతిరేకంగా లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ నాయకత్వాన స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. దీనినే ‘లాల్, బాల్, పాల్’ యుగమన్నారు. ఈ త్రిమూర్తుల నాయకత్వాన వంగ, మహారాష్ట్ర, పంజాబులలో స్వాతంత్ర్యోద్యమం పెచ్చు పెరిగినది. ప్రభుత్వంవారు దమనీతి హెచ్చిన కొద్దీ ప్రజలలో ధైర్యసాహసాలు పెరిగాయి.

శాసనబద్ధమైన ఆందోళనను అరికట్టడం వల్ల, కొందరు యువకులు దౌర్జన్య పద్ధతిని అవలంబించి, బాంబుల ద్వారాను, తదితరంగాను ప్రజాకంటకులైన ఆంగ్ల ఉద్యోగులను హతమార్చజొచ్చారు. కుదిరంబోసు మొదలైనవారు దీనికి నాయకులు. బ్రిటిష్‌వారి రాజనీతి బహుచతురమైనది. విభజించి పరిపాలించడం వారికి వెన్నతో పెట్టిన విద్య.

1909లో మింటో-మార్లే సంస్కరణలను తెచ్చి మితవాదులను కొందరిని చేరదీసి, వారి సహాయ సంపత్తితో పరిపాలించసాగారు. కానీ, దేశాల అశాంతి అధికమై దారుణ కృత్యాలకు కారణమవుతున్నది.

ప్రథమ ప్రపంచ యుద్ధం

1914లో ప్రథమ ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. బ్రిటిషు వారికి సహాయం తిలక్‌గారు చేయనిరాకరించినప్పటికీ, ఆంగ్లేయులకు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, వారి న్యాయప్రీతియందు విశ్వాసముగలవాడై సర్వ విధాల తోడ్పడినారు.

ఇది అధర్మానికి, ధర్మానికి జరిగే సంగ్రామం. ఉద్యమాన్ని బట్టి నాయకులు ఉంటారు. దీనికి ఏకైక నాయకుడు గాంధీ మహాత్ముడు. ఈ కార్యక్రమం వలన లాభాలు త్రివిధాలు. ప్రభుత్వాన్ని లొంగదీసి మనం కార్యసిద్ధి నొందడం, యుద్ధం మొదలైన దౌర్జన్యకాండ వలన జరిగే జననష్టాన్ని ఆపడం, నిస్పృహ చెందుతున్న భారతీయ శక్తిని పునరుద్ధరించడం.

ఈ శాంతి సమరంలో స్త్రీ పురుష, పసిబిడ్డలాది అందరూ చేరవచ్చు. దీనిలో భారతీయులు అధికంగా ఇది వరకు కనీవినీ ఎరుగని పద్ధతిన దేశభక్తులయ్యారు. జాతి రూపురేఖలనే మార్చారు. మహాత్ముడు నూతన జాతిని నిర్మించాడు. కనుకనే జాతిపిత అయ్యాడు.

ఈ ఉద్యమం వృద్ధి అవడానికి మహాత్ముని వ్యక్తిత్వం-ఆత్మశక్తి, సంకల్పసిద్ధి దేశనాయకుల సహాయ సంపత్తులను. ఈ అవసర కాంగ్రెసులో తీర్మానించిన తీర్మానాలు 1920 డిసెంబరులో సేలం విజయ రాఘవాచారిగారి అధ్యక్షతన నాగపూర్‌లో జరిగిన కాంగ్రెసులో ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ వామన మూర్తికి ఇంత శక్తి ఎట్లావచ్చిందో అని అందరూ ఆశ్చర్యపోయారు.

బెంజవాడలో అఖిలభారత కాంగ్రెస్ సమావేశం

అయ్యదేవర కాళేశ్వరరావుగారి కృషి ఫలితంగా అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశం 1921 మార్చి 31, ఏప్రిల్ ఒకటవ తేదీలలో బెజవాడలో జరిగింది. ఇంతవరకు కాంగ్రెసు కానీ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశం కానీ అంధ్రదేశంలో జరుగనందున గాంధీ మహాత్ముడు, దేశనాయకులు వస్తారని తలచి ఆంధ్రదేశం నుంచి మూడు లక్షల జనం విజయవాడంతా ఇసుకవేసిన రాలకుండేట్టు జనం నిండారు. వీధుల నిండా, సత్రాల నిండా, నదీ తీరాల నిండా, ఎక్కడ చూచినా జనమే.

ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి దేశభక్తి ప్రపూరితులైన ప్రజలు వచ్చి స్వాతంత్ర్య సమర సర్వసేనాధిపతి గాంధీ మహాత్ముని సందర్శించి తక్కుంగల అతిరథ మహారథులను కళ్లారా గాంచి పునీతులమైతిమని ఆనందించారు.

బెజవాడలో ఎక్కడ చూచినా అలంకారాలే. ఎక్కడ చూచినా కాంగ్రెసు పత్రాలే. ఎందుబోయినా మంగళవాద్యాలే. ఎటువెళ్లినా దేశభక్తి పూరిత జాతీయ గీతాలే. ఎక్కడ విన్నా జాతి పునరుద్ధరణను గురించి మహాత్ముని గూర్చి దేశనాయకుల ప్రశంసలే. ఎవరిని చూచినా ఖద్దరుదారులే. బెజవాడంతా కన్నుల పండువగా ఉత్సాహంతో పండుగ చేసుకున్నది.

ఆనాడు రాముడు అరణ్యం నుంచి అయోధ్య కరుదెంచినపుడు ప్రజలెంత ఉత్సాహభరితులుగా వున్నారో, ఈనాడు ఆంధ్రప్రజ బెజవాడలో అలా ఉన్నది. ఆనాటికి బస్సులు లేవు. లక్షలాది జనం రైళ్లమీద నేల ఈనినట్లు వచ్చారు బెజవాడకు. బెజవాడ స్టేషనులో టిక్కెట్టు కలెక్టర్లుగా పోలీసులు ఉండి కూడా, టిక్కెట్టు కొనని వారిని ఏమీ చేయలేకపోయారు. ఆ లక్షలాది జనాన్ని ఈ సమయంలో ఏమి చేయగలరు?

ఆ జనసందోహంలో గాంధీజీకి అంగరక్షకులు షౌకతలీ, కోడేటి రాజుగారలు. మహాత్ముడెంత అల్పకాయుడో షౌకతాలీ అంత వున్నతకారుడు. తాను 144 ధిక్కరించడం కంటే తన పుట్టుకే దానిని ధిక్కరించిందని చమత్కరించాడు.

దేశానికి గాంధీజీ నాయకత్వం ప్రారంభం

మహాత్ముని పిమ్మట షౌకతాలీ, ఆయన తల్లి, సోదరుడు మహమ్మదాలి ప్రజలను ఆకర్షించారు. వారు ఖిలాఫత్తు నిధికై రూపాయనోట్లను అమ్మారు. షౌకతాలి ‘ఆంధ్రరత్న’ గోపాలకృష్ణయ్యగారిని ప్రశంసిస్తూ ‘‘ఈ దేశంలో ముగ్గురు పిచ్చివాళ్లు ఉన్నారు. గాంధీ మహాత్ముడు, నేను, నీవు’’ అని పలికారు.

మహాత్ముడు వున్నచోటున మధ్యాహ్నం ప్రజలు గుమిగూడారు. ఆయన దర్శనానికై ఆ జనం ఆరాటపడుతున్నది. ఎంత చెప్పినా వెళ్లలేదు. అంతట మహాత్ముడు ఆ అలజడి గ్రహించి చేసేది లేక ఎర్రటెండలో ఒక బల్లమీద నిలబడ్డారు. స్వరాజ్య కార్యక్రమాల నిర్వహణకు, పంజాబు హత్యలకు తోడు ఖిలాపత్ అన్యాయాన్ని కూడా జోడించారు. మహాత్మాగాంధీ, మౌలానా మహ్మదాలీ షౌకతాలీ సోదరులు దేశమంతా పర్యటించారు.

ఉద్యమ ప్రచారానికై మూడు నెలల్లో కోటి రూపాయలు తిలక్‌నిధి వసూలు చేయడానికి, కోటిమంది కాంగ్రెస్ సభ్యులను చేర్పించడానికి, ఖద్దరు ఉత్పత్తికి 20 లక్షల రాట్నాలను ఏర్పాటు చేయడానికి 1921 మార్చి 31 ఏప్రిల్ ఒకటవ తేదీలలో విజయవాడలో జరిగిన అభిలభారత కాంగ్రెస్ సంఘం నిర్ణయించింది.

ఈ తీర్మానపు అర్థం ‘దేశబంధు’ చిత్తరంజన్‌దాస్ ‘Men, Money And Amunition’ సైన్యం, ధనం, ఆయుధ సామగ్రి అని భావగర్భితంగా తెలిపారు. గ్రామస్థాయి నుంచి దేశం వరకు పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతిష్ఠంభన కలిగించడానికి ఉద్యమాన్ని సాగించారు. దేశమెల్లడలా కల్లుదుకాణాల పికెటింగు, విదేశవస్త్ర బహిష్కరణ, ఉద్ధృతంగా సాగింది. ప్రభుత్వ దమననీతి పెచ్చు పెరుగుతున్న కొలదీ, ప్రజలలో సంఘటనాశక్తి, ఐకమత్యం పెంపొందుతూ వచ్చింది.

మహాత్ముడు స్వరాజ్య సంపాదనకు అహింస, సత్యాలనే ఆయుధాలుగా నిర్ణయించి, ఎట్టి హింసాకాండనైనా అహింసాయుతంగానే ఎదుర్కొనవలెనని శాసించారు. శ్రీకృష్ణ జన్మస్థానాలను యాత్రాస్థలాలుగా మార్చనుద్దేశించారు.

ఈ సమావేశానికి మహాత్మాగాంధీజీ, కస్తూరిమాత, అలీ సోదరులు, వారి మాతృదేవిని, లాలాలజపతిరాయ్, చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, మదనమోహన మాలవ్యా, కేల్కార్, పటేల్ సోదరులు, జమునాలాల్ బజాజ్, జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సరోజినీదేవి, సరళాదేవి, చౌదరాణి, అబ్బాస్ తయాబ్జీ సౌకం అజ్మల్‌ఖాన్, డాక్టర్ అన్సారీ, అబ్దుల్ కలామ్ అజాద్, డాక్టరు సత్యపాల్, డాక్టర్ కిచ్లూ, కాకాసాహెబ్, కలేల్కర్, శ్రీమన్నారయణ అగర్వలా, పురుషోత్తమదాస్ టాండన్, శ్యామసుందర చక్రవర్తి, ప్రొఫెసర్ గిద్వానిసేన్ గుప్తా, మహాదేవ్ దేశాయి, దేవదాసు గాంధీ, శంకర్‌లాల్ బ్యాంకర్, రాజగోపాలాచారి, కొండా వెంకటప్పయ్య, ప్రకాశం, సాంబమూర్తి, దుగ్గిరాల గోపాలకష్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామశాస్త్రి, డాక్టరు సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, పట్టాభి, ముట్నూరి యింకా చాలామంది పెద్దలు వచ్చారు.

ఆంధ్రదేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది ప్రజలను మొదటి రోజున సరిగా కూర్చోబెట్టడం చాలా కష్టమైంది. అప్పుడు మైకులు కూడా లేవు. ప్రజలకు నాయకుల దర్మనమే దుర్లభమైనది. సభ భగ్నమైనది. ఈ తొక్కుడులో ముగ్గురు మరణించారు. ఇదంతా చూచి గాంధీగారు స్థానిక నాయకులను మందలించారు.

అంతట కాళేశ్వరరావుగారు ఆంధ్ర రత్నాన్ని అభ్యర్థించారు. ఆయన చీరాల నుంచి తన ఆధ్వర్యం కింద వచ్చిన ఐదువందల ‘రామదండు’ను నియోగించి అన్ని ఏర్పాట్లు తెల్లవారేసరికి చేయించారు. ఆయన వాసాలు బాదులు తెప్పించి వాటిని పాతించి, ఐదు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసి ఈ వీధుల గుండా నాయకుల కార్లు చుట్టూ తిప్పించి వారెవరో ఆంధ్రప్రజలకు ఎలుగెత్తి చాటుతూ అందరికీ దర్శనభాగ్యం కలుగజేశారు. సభ జయప్రదంగా జరిగిన కారణాన ఇందుకు ముఖ్య కారకులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారిని, వారి రామదండును, వారి కార్యకౌశల్యాన్ని అఖిల భారత పెద్దలు మిక్కిలిగా ప్రశంసించారు.

ఈ ఐదు ప్లాటుఫారాల దగ్గర నాయక ప్రముఖులు ఉపన్యసిస్తూ వుంటే తెనుగులో ఆంధ్రులు తర్జుమా చేశారు. షౌకతాలీ ఉపన్యాసాన్ని ‘ఆంధ్ర రత్న’, కేల్కార్ ఉపన్యాసాన్ని నాగేశ్వరరావు పంతులుగారు, ‘దేశబంధు’ చిత్తరంజన్‌దాసు ఉపన్యాసాన్ని శ్రీ కాళేశ్వరరావు పంతులుగారు అనువదించడం నేను చూచాను.

శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు, శ్రీ చెరుకువాడ నరసింహం, శ్రీ వీఎల్ శాస్త్రి ప్రభృతులు అనువాదకులలో ఉన్నారు.

త్రివర్ణ పతాక

ఈ సమావేశంలోనే మనకు కావలసిన జాతీయ జెండాను గురించి అదివరకే శ్రమచేసి రూపురేఖలు దిద్దిన పింగళి వెంకయ్యగారిని గాంధీగారు సంప్రదించడం, శ్రీ వెంకయ్యగారు ఆంధ్ర జాతీయ కళాశాలలో చిత్రలేఖనా అధ్యపకులైన ఈరంకి వెంకటశాస్త్రిగారితో సంప్రదించి, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో చిత్రించి గాంధీగారికి ఇవ్వడం జరిగింది.

ఎరుపు హిందూమతానికి, ఆకుపచ్చ మహమ్మదీయ మతానికి, తెలుపు మిగతా అన్ని మతస్థులకు అని ఊహించారు. కొంతకాలానికి సిక్కులు తమకు ప్రత్యేకంగా ఒక రంగు కావాలనడం అందుపై అభిల భారత కాంగ్రెసు వారు మతాలతో నిమిత్తం లేకుండా ఎరుపు బదులు కుంకుమవూపు రంగు త్యాగానికి, తెలుపు- శాంతి, సత్యధర్మాలకు, ఆకుపచ్చ- పాడిపంటలకు సౌభాగ్యానికి చిహ్నాలుగా రూపొందించారు. పరిశ్రమకు చిహ్నంగా రాట్నం మొదటి నుంచి మధ్య చిత్రించబడింది.

మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాట్నానికి బదులుగా అశోక ధర్మచక్రాన్ని చిత్రించి, కాంగ్రెసు జాతీయ పతాకనే అఖిల భారత ప్రభుత్వ పతాకంగా పండిత జవహర్‌లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి అంగీకరించడం జరిగినది.

హరిజనోద్ధరణ

ఈ సమావేశంలోనే కృష్ణా జిల్లాలో గుడివాడ కేంద్రంగా పెట్టుకుని హరిజనోద్ధరణ కొరకు తన సర్వస్వం అర్పిస్తున్న బ్రహ్మచారి గూడూరు రామచంద్రుడు గారితో హరిజన సమస్యను గురించి మహాత్ముడు దీర్ఘంగా సంప్రతించి, ఆయన కృషిని ప్రశంసించి, అభిల భారత కాంగ్రెస్ సంఘంచే భూరి విరాళాన్ని ఇప్పించడం జరిగింది.

రామచంద్రుడు గారు మహాత్ముని కారులోనే సభస్థలికి వచ్చారు. ఈ సభ కార్యనిర్వహణకు తోడ్పడడానికి ఆంధ్రదేశం నలుమూలల నుంచి కాంగ్రెసులో భక్తితతప్పరితగల మహిళా మణుములు అసంఖ్యాకంగా వచ్చారు. ఉత్సాహవంతులైన వారు స్వచ్ఛంద సేవాదళంగా చేరి ప్రశంసనీయంగా పెద్దల ఆశీర్వచనలను పొందే తీరున తమ విధులను సక్రమంగా నిర్వర్తించి, ప్రశంసలనందుకున్నారు.

శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి

వీరిది పశ్చిమ గోదావరి జిల్లా, పోతునూరు. మాగంటివారు ఆంధ్రదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వర్ధిష్టులు. వీరి భర్త మాగంటి బాపినీడుగారు కాలిఫోర్నియాలో ఎం.ఎస్.సి. చదువుతున్నారు. ఈవిడ మహాత్ముని సన్నిధిని తనకున్న విలువైన విదేశీ చీరెలను దహనం చేసి తన వంటిమీద వున్న బంగారు నగలన్నిటిని మహాత్ముని కర్పించుకోవడం జరిగింది. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే ప్రథమంగా ఇట్టి త్యాగం చేసినది ఈ అన్నపూర్ణదేవిగారే.

శ్రీమతి అన్నపూర్ణాదేవిగారు 1927లో క్షయవ్యాధితో అస్తమించినపుడు మహాత్ముడు ఆవిడను గురించి రాసిన ప్రశంసావాక్యాలు ఇవి.

‘‘1921లో బెజవాడలో జరిగిన మహిళా సమావేశంలో ఖద్దరు వస్త్రధారిణియై సభా వ్యవహారం ఉత్సాహంతో, దీక్షతో, శాంతంగా నడవడానికి తోడ్పడుతున్న సమయాన అన్నపూర్ణను ప్రథమంగా దర్శించాను. ఆనాటి సమావేశాన ఖద్దరు ధరించినది ఆమె ఒక్కతే. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు తన ఆభరణాలను, చేతి గాజులను, హారాలను మొట్టమొదట అర్పించినది ఆమే. ఆ మహాసభలో ఆమె నలుమూలలకేగి, ఆభరణాలను, కానుకలను ప్రోగుచేసి తెచ్చారు. నాటి నుంచి అసహాయోద్యమంలో పాల్గొంటూ తుట్టతుదకు తదర్థమై ఆత్మ సమర్పణం గావించారు.

ఆమె మరణం వలన భక్తురాలినే కాదు కేవలం పుత్రికనే కోల్పోయినట్టు భావిస్తున్నాను. భారతపురంధ్రులలో అనేకులను నా పుత్రికలనుగా భావించుకొనగల భాగ్యం నాకు కలదు. వారందరిలో ఆమె అత్యుత్తమురాలు. ఆమె నిశ్చల భక్తితో ఫలాపేక్ష వదలి, దేశసేవ కావించారు. ఆమె వలే యువతీ యువకులనేకులు దేశారాధనలో ప్రాణసమర్పణం కావించిన గాని భారతదేశం మరల పూర్వంవలె పవిత్రవంతమైన స్వతంత్ర్యం కానేరదనడం నిస్సంశయం. అంత ధైర్యం, అంత చిత్తశుద్ధి, అంత దేశభక్తి కనబరిచిన అన్నపూర్ణాదేవికి స్థానికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పరచడం విధాయకం’’.

బెజవాడ కార్యసంఘ సమావేశానికి వచ్చిన అతిథులకు సకల సౌకర్యాలు చాలా సంతృప్తిగా జరిపి, ఆంధ్రుల ఆతిథ్యాన్ని మిగతా రాష్ట్రాలవారు ప్రశంసించే తీరున వ్యవహరించిన బెజవాడ, కృష్ణాజిల్లా పౌరులకు, ప్రధాన నాయకత్వం వహించిన పూజ్యులు అయ్యదేవర కాళేశ్వరరావు, అద్దేపల్లి వెంకట గురునాథ రామశేషయ్య శ్రేష్టి గారలు చిరస్మరణీయులు.

మన పిండివంటలు ఆవకాయ వగైరా పచ్చళ్లు ఉత్తరాది సోదరులను ముగ్ధులను గావించాయి. వాటి రుచిని వారు ఈనాటికి మర్చిపోకుండా ప్రశంసిస్తున్నారు.

ఆవకాయ రుచిని శ్రీ లజపతిరాయ్ వగైరా పంజాబువారు ప్రశంసించి అనుభవించగా, ఆ కారపు మంటకు శ్రీ చిత్తరంజన్‌దాసు ప్రభృత బెంగాలీ బాబులు హడలిపోయారు.

Share: