‘వంకలేమన్న డొంక పట్టుకు ఏడ్చిందట’.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రసంగాలు ఈ సామెతను నిజం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలను అటు అధికార టీఆర్ఎస్, ఇటు దుబ్బాక ఫలితంతో జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికలకు ఎన్నడూ లేనంత క్రేజ్ వచ్చేసింది. నిజానికి ఆరున్నరేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాభివృద్ధికి తామేం చేశామో చెప్పుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడడమే లక్ష్యంగా పెట్టుకుంటే, తామొస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెప్పలేకపోతున్న బీజేపీ, టీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడంతోనే సరిపెడుతోంది.
గ్రేటర్ ఎన్నికలు క్రమంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా మారడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. మరోవైపు, ప్రజలు కూడా ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. బీజేపీ యువతను నమ్ముకుని ముందుకు వెళ్తుండగా, టీఆర్ఎస్ మాత్రం సంక్షేమ పథకాల పేర్లు చెప్పుకుని ఓట్లడుగుతోంది. బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉండడంతో మేయర్ పీఠం తమదేనన్న ధీమా టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. ఇక, ప్రజల తీర్పు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం డిసెంబరు 4 వరకు ఆగాల్సిందే.
అభివృద్ధి మాటను పక్కనపెడితే ఉచితంగా ఇస్తామంటే చాలు పొలోమంటూ ఓట్లన్నీ తమకే పడతాయని భావిస్తున్న ప్రధాన పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్ద పీట వేశాయి. టీఆర్ఎస్ నెలకు 20 వేల లీటర్ల నీటిని, సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఊదరగొడుతోంది. మిగతావి చాలానే ఉన్నా ఓటర్లను అత్యంతగా ఆకర్షించేవి ఇవే. ఇక, బీజేపీ తానేమీ తక్కువ కాదన్నట్టు అది కూడా ఉచితంవైపే మొగ్గుచూపింది. మెట్రో రైళ్లు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, గృహ అవసరాలకు ఉచితంగా నీటి సరఫరా, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ అంటూ వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ మాత్రం ఉచితాల నుంచి పక్కకు జరిగి గతంలో అభివృద్ధి చేశామని, మళ్లీ అవకాశం ఇస్తే చేసి చూపిస్తామని హామీ ఇచ్చింది. అలాగే, వివాదాస్పదమైన ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెప్పుకొచ్చింది. ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను మేనిఫెస్టోలో ఎత్తి చూపింది. అయితే, ఎవరెన్ని హామీలు ఇచ్చినా విజ్ఞులైన ఓటర్లు మాత్రం ఈసారి మార్పునే కోరుకుంటున్నట్టు పలు సర్వేలు వెల్లడించాయి.
తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని పారదోలామని నాయకులు జబ్బలు చరుచుకుంటున్నా ప్రజల గుండెల్లోంచి మాత్రం దానిని వెళ్లగొట్టలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతూ ఉంది. అయితే, ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ నేతలు టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటుపై కన్నేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ, ఎంఐఎం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందన్న భ్రమను ప్రజలకు కల్పిస్తూ టీడీపీ ఓట్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
హుస్సేన్‌సాగర్‌ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను తొలగించే ధైర్యం ఉందా? అన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నకు.. వాటిపై చెయ్యేస్తే రెండు గంటల్లో దారుస్సలాం కూలిపోతుందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యల వెనక ఉన్న మర్మాన్ని సగటు ఓటర్లు అర్థం చేసుకోలేనేంత తెలివి తక్కువ వాళ్లేం కాదు. ఇరు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల నేతల నోటి నుంచి ఈ సవాళ్లు వచ్చాయన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ అభిమానులను తమవైపు తిప్పుకోవడంలో భాగంగానే సడన్‌గా బీజీపీకి ఎన్టీఆర్ గుర్తొచ్చారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, బీజేపీకి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇటీవల బీహార్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసిందని ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు గతంలో ఎన్నడూ ఇంతటి ఊపు రాలేదు. వచ్చి పోయేవి అంతే. కానీ ఈసారి మాత్రం వీటిని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన పరాభవంతో కసి మీద ఉన్న అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ కూడా జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చూస్తుంటే ఇవి జీహెచ్ఎంసీ ఎన్నికలా? లేక, సార్వత్రిక ఎన్నికలా అన్న సంశయం కలుగుతోంది. దుబ్బాక విజయం అయాచితంగా వచ్చిందని కాదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది వాపు కాదు, బలుపేనని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడం మినహా మరో మార్గం లేదు. అందుకనే ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సగటు ఓటరు దృష్టిని ఆకర్షించాయి.