రాజకీయాలలో వ్యూహప్రతివ్యూహాలు సహజం. కొన్నిసార్లు పెత్తనం చెలాయించేవారి వ్యూహం ఫలిస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షం పైచేయి అనిపించుకుంటుంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రజానిర్ణయానిదే అంతిమ తీర్పు. ఇది మొన్నటి దాకా రాజకీయనాయకులు, విశ్లేషకులు అంటున్న మాట. కానీ, నేడు ప్రజలు కూడా తెలివి మీరి పోయారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ తెలివి ప్రదర్శిస్తున్నారు. కొన్నిసార్లు అది అతితెలివిగానూ ఉండవచ్చు. ఫలితంగా ఐదేళ్ళు జనం అన్యాయం కావడానికీ ఆస్కారం ఉంది. ఇక మధ్యలో వచ్చే ఉప ఎన్నికల సమయంలో కానీ, స్థానిక ఎన్నికలలో కానీ జనం భలే తెలివిమీరి పోయారు. అందుకు నిదర్శనం మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికలే! అధికారంలో ఉన్నవారు కూడా ఒకప్పటిలా నిజాయితీగా ఎన్నికలు జరపడం లేదు. నూటికి నూరుశాతం తమకే గెలుపు దక్కాలని పలు ప్రయత్నాలు చేశారు. అది కూడా జనానికి తెలియనిది కాదు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొడితే పోలా- అనే భావనకు జనాల్లో చాలామంది వచ్చేశారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అది ప్రస్ఫుటంగా కనిపించింది.
ముందు అలా… తరువాత ఇలా…
ఈ స్థానిక ఎన్నికల్లో ముందుగా పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎవరికి వారు, గెలుపు మాది అంటే కాదు మాది అంటూ చాటుకున్నారు. చివరకు అధికార వైసీపీ నేతలు తమకు 80 శాతం పంచాయతీలు లభించాయని చాటింపు వేసుకున్నారు. తెలుగుదేశానికి కేవలం 15 శాతమే వచ్చాయని, మిగిలిన 5 శాతంలో ఇతరులు గెలిచారని టముకు బజాయించారు. అయితే ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే 59 శాతం అధికార పార్టీకి రాగా, 32 శాతం ప్రతిపక్ష పార్టీకి దక్కాయని, మిగిలిన వాటిలో ఇతరులు ఉన్నారని తెలుస్తోంది. ఈ అసలు లెక్కలు తెలియగానే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. అందులో మొట్టమొదటి వ్యూహం, వైరివర్గాలను ఆనందంలో మునకలు వేయించడం. ప్రత్యర్థులు సంతోషంగా ఉన్న సమయంలో వారికి వ్యూహరచన చేసే శక్తి సన్నగిల్లుతుందని, దరిమిలా వారిపై సులువుగా దాడి చేయవచ్చునన్నది ఓ యుద్ధనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దీనిని తు.చ. తప్పక పాటిస్తారు. అలాగే ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలుత తెలుగుదేశం పార్టీకి ఘననీయమైన సీట్లు వస్తాయని, వైసీపీకి మునుపటి కంటే తక్కువ సీట్లు వచ్చేలా ఉన్నాయని ముందుగా ఓ వ్యూహం ప్రకారం ప్రచారం సాగింది. పైగా ఈ ప్రచారంలో వైసీపీలో అగ్రనాయకులుగా చెలామణీ అవుతున్నవారే ఆందోళన చెందడం చూసి, తెలుగుదేశం శ్రేణులు ఇక విజయం మాదే అన్న ధీమా వ్యక్తం చేశాయి. తమ గెలుపు నల్లేరు మీద బండినడకలా సాగుతుందని ఆశించారు. దాంతో ప్రత్యర్థుల వ్యూహాలను పసికట్టలేని స్థితికి చేరుకున్నారు. అప్పటికే ఆలస్యం అయంది. ఆలోగా వైసీపీ జనాల్లో అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంపై విద్వేషం కలగడానికి చేయవలసిందంతా చేసేసింది. ఇక తెలుగుదేశం, వైసీపీ ఎత్తుగడలను తిప్పి కొట్టే స్థితికి చేరుకోవడానికి సమయం పట్టింది. అప్పటి నుంచీ తమ వైసీపీ ఖచ్చితంగా 150 సీట్లు సంపాదిస్తుందన్న ప్రచారం మొదలు పెట్టారు. తొలుత తెలుగుదేశంకే ఘననీయంగా సీట్లు వస్తాయని ప్రచారం చేయడం వల్ల తెలుగుదేశం శ్రేణులు ఆనందసాగరంలో మునకలు వేస్తూ అసలు వ్యూహాలకే తావీయలేదు. దాంతో వైసీపీ అభిమానులు ఢీలాపడ్డారు. వారిలో ఉత్సాహం కలిగించేలా ఇక ఎన్నికల తేదీ సమీపించే సరికి, తమదే విజయం అంటూ చాటింపు వేశారు. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగింది. అదీగాక, తొలుత విన్నవి నిజం కాకూడదని, తమ నాయకుడే గెలవాలని వారు అహర్నిశలూ పనిచేశారు. ఇదే సమయంలో తమకు గెలుపు ఖాయం అన్న ధీమాతో ఉన్న తెలుగుతమ్ముళ్ళు అసలు ఫలితాల వేళ కంగుతిన్నారు.
పార్టీ ఎందుకు? తాయిలం ఉందిగా…
ఇక జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఆయనకు ఆశ్చర్యం కలిగించిన అంశం, తమ పార్టీకి 151 సీట్లు వచ్చినా, తెలుగుదేశం పార్టీకి 1 కోటి 25 లక్షల పైచిలుకు ఓట్లు ఎలా వచ్చాయన్నదే! జగన్ రెడ్డి దానిని తేలికగా తీసుకోలేదు. ఇంకా తెలుగుదేశంపై జనానికి మక్కువ ఉందని అర్థం చేసుకున్నారు. దాంతో స్థానిక ఎన్నికల సమయంలోనూ మరో నాటకానికి తెరతీసి, తెలుగుదేశం శ్రేణులను మళ్ళీ ఆనందంలో ముంచెత్తే పనిచేశారు. అదే ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కమార్ డ్రామా! ఆయనను పదవి నుంచి తొలగించడం, మరో రిటైర్డ్ జడ్జిని హుటాహుటిన తీసుకువచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టడం, తరువాత కోర్టుల్లో వాదప్రతివాదాలు సాగడం జరిగాయి. చాలాసార్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యాయస్థానంలో పైచేయి సాధించారు. ఆయన పోరాటంలో న్యాయం ఉందని న్యాయస్థానం సైతం విశ్వసించింది. రమేశ్ కుమార్ గెలిచి, తన పదవిని మళ్ళీ చేపట్టారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు జగన్ రెడ్డి స్థానిక ఎన్నికలకు భయపడుతున్నాడని, అందుకే నిమ్మగడ్డను పదవిని నుండి తొలగించాడని భావించారు. కోర్టుల్లో నిమ్మగడ్డ విజయం సాధించిన ప్రతీసారి అది తమ విజయంగా భావిస్తూ, ఇక వైసీపీ పని అయిపోయింది అనే మూడ్ లోకి వెళ్ళారు. అయినా స్థానిక ఎన్నికల్లో పంచాయతీలలో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థులను గెలిపించడానికి జనం బారులు తీరారు. మొదటి రెండు విడతల్లోనూ తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థులు ఘననీయంగానే గెలిచారు. దానిని గమనించిన అధికార పార్టీ తమ వ్యూహాన్ని అమలు చేయడం మొదలెట్టింది. అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసింది. జనానికి డబ్బు ఎర వేసింది. అప్పటిదాకా అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ బలపరచిన వారికే ఓటు వేయాలనీ ఆంక్ష విధించింది. ఈ మొత్తం ప్రణాళికకు జగన్ రెడ్డి ఇంట్లో నుండి బయటకు రాకుండానే, తాను నియమించిన వాలంటీర్లను చక్కగా ఉపయోగించుకున్నారు. వారే వైసీపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించి తీసుకువచ్చేలా చేశారు. అయినా నాలుగు దఫాలుగా సాగిన పంచాయతీలలో తెలుగుదేశం అభ్యర్థులు బాగానే గెలిచారు. అక్కడే అసలు నాటకానికి తెరతీశారు. మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికలు కరోనా కారణంగా ఆగిపోయాయి. అప్పటికే కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకొనేలా చేసుకుంది అధికార పార్టీ. ఆ ఏకగ్రీవాలను కొనసాగించాలా వద్దా అనే మీమాంస కలిగించారు. చివరకు ఎన్నికల కమీషన్ ముందుగా ఏకగ్రీవం అయినవారి ఎన్నిక చెల్లుతుందని ప్రకటించింది. దాంతో జగన్ రెడ్డి కే అధిక సంఖ్యలో మునిసిపల్, కార్పోరేషన్ లు దక్కుతాయని అందరూ భావించారు. వైసీపీ వారి వ్యూహాలకు పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు కూడా చిత్తయిపోయి, తెల్లజెండా ఊపేసి, వారిచ్చింది పుచ్చుకుని, వారికి ఎలా కావాలంటే అలా చేసుకోమని పక్కకు తప్పుకున్నారు. గుంటూరు కార్పోరేషన్ లో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక నెగ్గితీరుతుందనుకున్న విజయవాడ సీటును తెలుగుతమ్ముళ్ళ అనైక్యత వల్లే పోగొట్టుకోవలసి వచ్చింది. విశాఖ ఉక్కు కారణంగా ఆ కార్పోరేషన్ సీటు తమకే దక్కు అనే ధీమాతో ఉన్న తెలుగుదేశం నాయకులు అక్కడ కూడా తెల్లజెండా చూపించేశారు. కేవలం అక్కడి స్థానికుల వ్యతిరేకత కారణంగానే తెలుగుదేశం పార్టీ 30 కార్పోరేటర్స్ ను సంపాదించగలిగింది. ఇక కడప జిల్లా మైదుకూరులోనూ, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ స్థానిక నాయకులు సవాల్ గా తీసుకోవడం వల్ల వైసీపీ కంటే రెండు ఎక్కువ సీట్లు రాబట్టగలిగారు. అన్ని చోట్లా ఇదే స్ఫూర్తి ఉండి ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కనీసం 20 మునిసిపాలిటీలు, ఒక కార్పోరేషన్ దక్కేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. అంటే, తెలుగుతమ్ముళ్ళు అధికార పార్టీ ఇచ్చిన తాయిలాలకు ఎలా ఆకర్షితులయ్యారో తెలిసిపోతోంది.
కారణం ఏమిటి?
పార్టీ గుర్తు రహిత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు లభించగానే కాలర్ ఎగరేసిన తెలుగుతమ్ముళ్ళు, మునిసిపల్, కార్పోరేషన్ ఎలక్షన్లలో పార్టీ చిత్తుగా ఓడిపోగానే తమ అధినాయకుని అసమర్థత అంటూ పాట అందుకున్నారు. సరిగా డబ్బు లు ఖర్చు చేయలేదన్నదే చాలా చోట్ల తెలుగుదేశం నాయకుల మాట! అయితే ఇక్కడే చంద్రబాబును వారు తక్కువగా అంచనా వేశారు. అనుభవం ఉన్న నాయకునిగా చంద్రబాబు, ఎన్నికల కమీషన్ ఎప్పుడయితే పాత ఏకగ్రీవాలు చెల్లుతాయని ప్రకటించిందో, అప్పుడే ఆశలు వదలుకున్నారు. అయినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అన్నట్టు చంద్రబాబు కొన్ని చోట్ల ప్రచారం చేశారు. కానీ, ఆయన ఎప్పుడూ వైఫల్యం చెందే తీరునే ఈ సారి కూడా విజయవాడలో తలెత్తిన నాయకుల మధ్య అనైక్యతను సద్దుమణిగేలా చేయలేకపోయారు. కొందరు అసలు మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికలను తెలుగుదేశం బహిష్కరించి ఉంటే బాగుండేదని అంటున్నారు. మరికొందరు ఇక తెలుగుదేశం పార్టీ పనయిపోయిందనీ చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పోటీ పడకుంటే మేలనీ సూచిస్తున్నారు. పైగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా ఉండి, రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రాంతం వారినే నీచంగా మాట్లాడిన పనబాక లక్ష్మికి తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం సీటు ఇవ్వడాన్నీ కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎటూ అధికార పార్టీకే జనం జై కొడతారని, అందువల్ల తిరుపతి సీటు కూడా సునాయాసంగా వారికే దక్కుతుందని కొందరు తెలుగు తమ్ముళ్ళు బాహాటంగానే చెబుతున్నారు.
నాయకులు ఎప్పుడూ జనం మనసును ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విషయం సీనియర్ లీడర్ అయిన చంద్రబాబుకు తెలియనిది కాదు. తెలుగుదేశం పార్టీ తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటేనే జనం ఇంకా తమ పార్టీ ఉందని భావిస్తారు. లేదంటే, ప్రధాన నాయకుడే ఎన్నికలను బహిష్కరించినప్పుడు మనకెందుకు అంటూ శ్రేణులు పక్కపార్టీ జెండా మోసుకొనే పరిస్థితీ లేకపోలేదు. అందువల్లే చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో పోటికి దిగుతున్నారు. ఇక జనానికే వైసీపీ ఎప్పుడూ అన్యాయం చేసి గెలుస్తూ ఉంటుందన్న భావన కలిగిన రోజున చంద్రబాబు కూడా తప్పకుండా మధ్యలో జరిగే ఎన్నికలను బహిష్కరించగలరు. అంతేకానీ, ఎవరో ఒకరు ఇద్దరు చెప్పినట్టుగా ఎన్నికలను బహిష్కరిస్తే, పార్టీ శ్రేణులకే అనుమానాలు కలిగే అవకాశం ఉంది. పైగా అలాంటి పరిస్థితి టీడీపీలో రావాలనే ఎదురుచూస్తున్న జగన్, ఆ పరిస్థితి వస్తే, వెంటనే మరో వ్యూహం అమలు చేయగలరు. ఆ సంగతి తెలిసే తమ్ముళ్ళలో ఉత్సాహం నింపడానికి చంద్రబాబు వయసును సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. అధికారం ఉంది కదా, ఊళ్ళన్నీ మనవే తోసేయ్ అన్నట్టుగా జగన్ ఇంటనే ఉండి పావులు కదిపారు. అన్ని ఆటలూ ఒకేలా ఎప్పుడూ సాగవు. ఈ విషయాన్ని మరువరాదు. అసలు ఎన్నికల సమయంలో వైరి వర్గాలు తెరతీసే నాటకాలను చూసి మురిసిపోరాదు. స్వయంగా నాటకం వేసి రక్తి కట్టించే స్థాయికి తెలుగుతమ్ముళ్ళు కూడా చేరతారని ఆశిద్దాం.