ఏది పాషన్? ఏది స్వధర్మం?

dcvr

ప్రాపంచిక లాభనష్టాలతో పని లేకుండా, దేనిపైననైనా మక్కువ పెంచుకుని దాని కోసం ఎంతైనా శ్రమించడానికి ప్రేరేపించేది పాషన్! తెలుగులో తీవ్ర అభినివేశం అనవచ్చు. ఇది పూర్తిగా మానసిక ఆనందం కోసం చేసిది. ఇతరుల దృష్టిలో – ఇది కూడుగుడ్డా పెట్టదు. ఒక రకమైన వెర్రి. సాధ్యమైనంత త్వరలో వదుల్చుకోవలసినది! కానీ సంబంధిత వ్యక్తి మాత్రం దీని కోసం లౌకిక సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. దానిలో తను రాణిస్తాడో లేదో తెలియకపోయినా, అవసరమైన తర్ఫీదు పొందే అవకాశం లేకున్నా, అనుకున్న ఫలితం సిద్ధిస్తుందన్న గ్యారంటీ లేకపోయినా, సర్వం ఒడ్డడానికి, ఏళ్ల తరబడి కష్టాలు పడడానికి సిద్ధమవుతాడు.

ఎంచుకున్న లక్ష్యమే అతన్ని పురికొల్పుతుంది, ఆశ కలిగిస్తుంది. నడిపిస్తుంది. సినిమారంగంలో నటులుగా, దర్శకులుగా, రచయితలుగా ప్రవేశించడానికి నిత్యం నగరానికి వచ్చే కొత్తవారిలో ఇది స్పష్టంగా చూడవచ్చు. దీనిలో ఫలితం దైవాదీనం. టేలంట్ ఉన్నా పైకి రాలేకపోయిన వారెందరో కనబడతారు. కొంతమంది వచ్చిన అవకాశాలు వినియోగించుకోలేక పోవడమూ చూస్తాం. దీనిలో వైఫల్యం వారిని తీవ్రంగా కలచివేస్తుంది. చదువులో, ఉద్యోగాల ఇంటర్వ్యూలలో ఫెయిలయినా ఓర్చుకుంటారు కానీ సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే తట్టుకోలేక పోతారు.

ఇక స్వధర్మం విషయానికి వస్తే – ఒక వ్యక్తి తన మనోధర్మానికి తగిన జీవనమార్గాన్ని ఎంచుకొని తన సర్వశక్తులనూ అందులోనే ఏకీకృతం గావించి మనుగడ సాగించడం స్వధర్మం. ప్రస్తుతం చేస్తున్న వృత్తిని తనకు అభీష్టంగా మలచుకోవడం కూడా స్వధర్మోచితమే. దీనిలో నిరంతరం తనను తాను సానబెట్టుకుంటూ ఇతరుల కంటే మెరుగ్గా నిలవడం కనబడుతుంది. కుటుంబం, సమాజం వీరిని గౌరవిస్తుంది, అండగా నిలుస్తుంది. తమ పాషన్‌కు అనుగుణమైన రంగంలోకి వెళ్లి విజయశిఖరాలకు చేరినవారికి వచ్చినంత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వీరికి రాకపోవచ్చు.

ఎందుకంటే దానిలో రిస్కు వుంది కాబట్టి ప్రాఫిట్ కూడా ఎక్కువే వుంటుంది. ఇక్కడ అంత ప్రతిఫలం కనబడదు. కానీ తమ సర్కిల్‌లో వీరికి మన్నన వుంటుంది. ఈ మార్గంలో ఆత్మసంతృప్తితోపాటుగా సంపాదన, కుటుంబ ప్రగతి, సంఘ శ్రేయస్సు అన్నీ సమకూరుతాయి. ఇతరులకు ఆదర్శంగా కూడా నిలుస్తారు. దీనిలో అదృష్టం పాత్ర తక్కువ. నైపుణ్యం వున్నవారికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయి.

ఇక్కడే పాషన్‌కు, హాబీకి గల తేడా చర్చించాలి. హాబీని తెలుగులో ప్రవృత్తి అంటున్నారు. పాషన్ అనేది వృత్తితో సంఘర్షించినంతగా ప్రవృత్తి, వృత్తితో ఘర్షించదు. వృత్తి అనేది మనుగడ కోసం చేయవలసిన నిరంతర ప్రక్రియ. అనునిత్యం అదే పని చేయడం వలన కొన్నాళ్లకి మొనాటనీ కలుగుతుంది. విసుగు పుడుతుంది. అప్పుడు హాబీ అతన్ని ఆదుకుని, రీచార్జి చేసి మళ్లీ పనికి సిద్ధం చేస్తుంది. పని ఎక్కువైపోయి బోరు కొట్టినప్పుడో, మానసికంగా భారమైపోయి ఒత్తిడికి గురి చేసినప్పుడో, కాస్త విరామం దొరకగానే మనిషి కాస్సేపు పాటలు వింటాడు, ఏదైనా జోక్స్ చదువుతాడు, నచ్చిన వెబ్‌సైట్‌కు వెళ్లి సినిమా కబుర్లు తెలుసుకుంటాడు, లేదా కంప్యూటర్‌లోనే కాస్సేపు పేకాట ఆడతాడు.

ఇవన్నీ ఊరట కలిగించేవే తప్ప వృత్తికి హానీ కలిగించేవి కావు. రొటీన్‌ను బ్రేక్ చేయడమే వీటి ప్రయోజనం. మిఠాయికొట్టు వాడు మధ్యలో లేచి వెళ్లి మిర్చి బజ్జీ తిన్నట్లు, మిర్చీ బజ్జీలు అమ్మేవాడు వెరైటీ కోసం మిఠాయి కొనుక్కున్నట్టు, పత్రికాఫీసు ఉద్యోగి విరామం దొరికినప్పుడు రేడియో పాటలు వింటే, ఆ పాటలు వినిపించే ఆకాశవాణి ఉద్యోగి విరామ సమయంలో పుస్తకాలు చదువుతాడు. ఇవి వృత్తిని మరింత ఉత్సాహంగా, మరింత మెరుగుగా చేసేందుకు దోహదపడేవే.

ప్రవృత్తిని వృత్తిగా మార్చుకునే అవకాశం గనుక వస్తే అంతకంటే భాగ్యం మరొకటి లేదు. అతడు పనిలో అలసట అనేదే ఫీలవడు. హామీగా ప్రారంభమైనది పాషన్‌గా మారి, వృత్తికి భంగం కలిగించిన సందర్భాలూ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగం చేస్తూ నటన మీద ఇష్టంతో సినిమాలలో వేషాల కోసం ప్రయత్నిస్తూ చివరకు ఉద్యోగాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, వాటికే సమయమంతా వెచ్చించి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారెందరో వున్నారు. ఏదైనా అంశంపై అభిరుచి వుందని మీ మనసుకు తట్టగానే, మీరు చేయవలసినది అది నా స్వధర్మమా? వృత్తిగా పనికి వస్తందా? హామీగా మిగులుతుందా? పాషన్‌గా మారుతుందా? అనేది విశ్లేషించుకుని దాని ప్రకారం మీ కెరీర్‌ను మలచుకోవాలి. దానికి గాను, మిమ్మల్ని మీరే ఎక్స్‌రే తీసుకోవాలి, శోధించుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని, నిర్మొగమాటంగా బేరీజు వేసుకోవాలి. ఎలా? నాకు తోచిన పద్ధతి సూచిస్తాను ప్రయత్నించి చూడండి.

– డాక్టర్ సి.వి.రావు రచించిన
‘స్వధర్మ యోగం-అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం!’ పుస్తకం నుంచి

కాపీల కోసం:
నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ, హైదరాబాద్
ఫోన్ నంబరు: 040-24652387, 9000413413
www.telugubooks.in

Share: