ఓ కాంగ్రెస్… ఓ రేవంత్… మ‌ధ్య‌లో చంద్ర‌బాబు…

Revanth

ఆడ‌లేక మ‌ద్దెల వోడు అన్న‌ట్టుగా కొంద‌రు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి త‌యార‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షునిగా ఎన్నిక చేయ‌గానే, ఆ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న కొంద‌రు నేత‌లు అప్పుడే కొత్త‌రాగాలు ఆల‌పిస్తున్నారు. ఆ రాగాల‌లో చంద్ర‌బాబు నాయుడు పేరు తీసుకు రావ‌డ‌మే విచిత్రంగా ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షునిగా ఎన్నిక కావ‌డానికి చంద్ర‌బాబుకు ఏమిటి సంబంధం? అలా అంటే వారు వినే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కావ‌డం వెనుక చంద్ర‌బాబు హ‌స్త‌మే ఉంద‌ని, అందువ‌ల్ల టీపీసీసీ కాస్తా త్వ‌రలోనే టీడీపీ పీసీసీ కాబోతోంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ప‌ట్టుమ‌ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఐదేళ్ళు కూడా కాలేదు. అత‌నికి పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇస్తామ‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోనే వి.హ‌నుమంత‌రావు, జ‌గ్గారెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటివారు వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. అస‌లు రేవంత్ అధ్య‌క్షుడ‌యితే, తాము పార్టీలో ఉండ‌మ‌నీ కొంద‌రు భ‌య‌పెట్టారు. ఇవ‌న్నీ గ‌మ‌నించిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చివ‌ర‌కు రేవంత్ రెడ్డి పేరునే ప్ర‌క‌టించింది. దాంతో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ ని డ‌బ్బుల‌తో కొనేసి రేవంత్ ఆ ప‌ద‌వి ద‌క్కించుకున్నాడ‌ని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డికి, ప‌ద‌విని నోట్ల‌తో కొనుగోలు చేయ‌డం పెద్ద వింతేమీ కాద‌ని, అందుకు చంద్ర‌బాబు నాయుడు స‌హ‌కారం కూడా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రు అయితే, రాహుల్ గాంధీకి చంద్ర‌బాబు చెప్పి మ‌రీ రేవంత్ కు ఆ ప‌ద‌వి ఇప్పించార‌నీ అంటున్నారు. ఏది ఏమైనా త‌మ పార్టీలో పెద్ద‌ల‌కు త‌మ బ‌ల‌మేంటో నిరూపించుకోకుండా, ఈ కాంగ్రెస్ నాయ‌కులు రేవంత్ ను వ్య‌తిరేకించ‌డ‌మే పెద్ద త‌ప్పు. ఇప్పుడు అంతా అయిపోయాక చంద్ర‌బాబును ఆడిపోసుకోవ‌డం మ‌రింత త‌ప్పు. ఇక‌పై తాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మెట్ల‌యినా ఎక్క‌న‌ని
కోమ‌టి రెడ్డి భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. రేవంత్ కంటే ఎన్నో ఏళ్ళ నుంచీ కాంగ్రెస్ ను అంటిపెట్టుకొని ఉన్న కోమ‌టి రెడ్డి ఆ మాట అన‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే, ఆయ‌న‌కు కూడా పీసీసీ ప‌ద‌విపై మోజు ఉంద‌ని తేలిపోయింది. అలాంట‌ప్పుడు ఏ విధంగా ప‌ని అవుతుందో చూసుకోవాలి కానీ, ఇచ్చిన‌ప్పుడు చూద్దాం లే అన్న తీరున ఉండి, ఇప్పుడు అవాకులూ చ‌వాకులూ పేల‌డం విడ్డూర‌మే చెప్పాలి. పీసీసీ ప‌ద‌వి అన్న‌ది కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కంటే మిన్న అయిన‌ద‌ని మొద‌టి నుంచీ ఓ సంప్ర‌దాయం నెల‌కొంది. అందుకు ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో జ‌రిగిన ఉదంత‌మే నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. 1956లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డిన స‌మ‌యంలో ఇద్ద‌రి పేర్లు అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ముందు నిలిచాయి. వారిలో గొట్టిపాటి బ్ర‌హ్మ‌య్య‌, నీలం సంజీవ‌రెడ్డి ఉన్నారు. గొట్టిపాటి బ్ర‌హ్మ‌య్య‌ను నీలం సంజీవ‌రెడ్డి అన్నా అని పిలిచేవారు. బ్ర‌హ్మ‌య్య సైతం సంజీవ‌రెడ్డిని త‌మ్ముడిలాగే భావించేవారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయం ప్ర‌కారం పీసీసీ అధ్య‌క్షుడు వ‌చ్చిన‌ప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విలోని వారైనా స‌రే గౌర‌వించి తీర‌వ‌ల‌సిందే. అందువ‌ల్ల వ‌య‌సులో సంజీవ‌రెడ్డి కంటే పెద్ద‌వార‌యిన గొట్టిపాటి బ్ర‌హ్మ‌య్య‌ను రాష్ట్ర పార్టీ అధ్య‌క్షునిగానూ, నీలం సంజీవ‌రెడ్డిని ముఖ్య‌మంత్రిగానూ ప్ర‌క‌టించారు. అలాంటి సంప్ర‌దాయం ఉన్న పార్టీలో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇప్ప‌టికీ గొప్ప‌దే! అందువ‌ల్లే ఆ ప‌ద‌వికోసం కాంగ్రెస్ నాయ‌కులు ప‌లువురు ఆశ‌ల ప‌ల్ల‌కి ఎక్కి ఊరేగారు. అయితే వీరంతా ఇక్క‌డే ఉండి రేవంత్ రెడ్డిని బ‌ల‌హీన ప‌ర‌చాల‌ని భావించారే త‌ప్ప‌, అంద‌రూ ఏక‌మై ఎవ‌రో ఒక‌రిని త‌మ నాయ‌కునిగా చేసుకొని ఢిల్లీ చేరి, సోనియా గాంధీ స‌మ‌క్షంలోనే త‌మ నిర్ణ‌యం చెప్పి ఉంటే బాగుండేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇది వారి సొంత‌పార్టీలోని విష‌య‌మే అయినా, చంద్ర‌బాబు పేరు తీసుకు రావ‌డంతోనే ఇప్పుడు హైద‌రాబాద్ లో చ‌ర్చ ర‌స‌వత్త‌రంగా సాగుతోంది.

babu

ఇంత‌కూ ఎవ‌రున్నారు?

రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షునిగా చేయ‌డాన్ని ఇప్పుడ‌యితే ప‌లువురు సీనియ‌ర్స్ విమ‌ర్శిస్తున్నారు. కానీ, నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వంటి మెత‌క‌మ‌నిషి ఆ ప‌ద‌వికి ప‌నికి రాడు అనే భావ‌న చాలా రోజుల నుంచీ ఉంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌గిన రీతిలో కౌంట‌ర్ వేయ‌గ‌ల స‌త్తా ఉన్న‌వారే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి అర్హులు అనే భావ‌న కూడా చాలామందిలోఉంది. కానీ, కాంగ్రెస్ లోని సీనియ‌ర్ నేత‌లంద‌రూ ఆ ప‌ద‌వి త‌మ‌కు కావాల‌ని కాంక్షించారే త‌ప్ప అందుకు త‌గ్గ వ్యూహ‌ర‌చ‌న చేయ‌లేక‌పోయారు. కేవ‌లం సినీయారిటీ ఉంటే ఫ‌లం లేదు, కేసీఆర్ కు దీటుగా స‌మాధానం ఇచ్చే వాక్చాతుర్య‌మైనా ఉండాలి. అదీగాక‌, జ‌నాక‌ర్ష‌ణ కూడా క‌లిగి ఉండాలి. ఇవ‌న్నీ ఎవ‌రికి వారు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొని ఉంటే బాగుండేది. నిజానికి ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన నాయ‌కులు ఎవ‌రూ లేరు. దాంతో పాటు వాగ్దాటి కూడా ఉండాలి. అవి రెండూ ఉన్నవారు రేవంత్ రెడ్డిని మిన‌హాయిస్తే ఎవ‌రూ క‌నిపించ‌రు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ కే జై కొట్టింది. ఈ విష‌యాలేవీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా కేవ‌లం చంద్ర‌బాబు అండ‌తోనే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు కాగ‌లిగార‌ని ఎద్దేవా చేయ‌డం వెనుక ఎవ‌రి హ‌స్తాలు ఉన్నాయో అంద‌రికీ తెలిసి పోతోంది.

అదే వైచిత్రి!

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న‌ను విమ‌ర్శించిన‌ప్పుడు, సీనియ‌ర్లు అత‌ణ్ని విమ‌ర్శించ‌డ‌మెందుకు అత‌నిలోనూ కాంగ్రెస్ బ్ల‌డ్ అంది అంటూ మ‌ద్ద‌తు ప‌లికారు. అదే తీరున జ‌గ‌న్మోహ‌న్ రెడ్డినీ అప్ప‌టి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దిగ్విజ‌య్ సింగ్ జ‌గ‌న్ ది కాంగ్రెస్ డిఎన్ఏ అని చెప్పారు. ఇలా త‌మ వారు ఎక్క‌డ ఉన్నా క‌లుపుకోవ‌డం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీకాదు. అలాంటి పార్టీలో ఉంటూ కొత్త‌గా వ‌చ్చిన రేవంత్ రెడ్డిపై అధిష్ఠానం న‌మ్మ‌కం పెంచుకుంటోంద‌నీ తెలిసీ, నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్న వారు ఇప్పుడు కొత్త‌రాగాలు తీయ‌డం స‌బ‌బు కాదు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా 1978లో గెలుపొంది, త‌రువాత సినిమాటోగ్రాఫ‌ర్ మినిస్ట‌ర్ గానూ ప‌నిచేశారు. త‌రువాత 1983లో అదే పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. 1989లో తొలిసారి తెలుగుదేశం అభ్య‌ర్థిగా గెలుపొందింది మొద‌లు ఇప్ప‌టి దాకా చంద్ర‌బాబు గెలుపొందుతూనే ఉన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అత్య‌ధిక కాలం ముఖ్య‌మంత్రిగానూ ప‌నిచేశారు. అందువ‌ల్ల కాంగ్రెస్ నాయ‌కులు చంద్ర‌బాబును త‌మ వాడే అని భావిస్తూ ఉంటారు. కానీ, అదే కాంగ్రెస్ పార్టీపై చంద్ర‌బాబు దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగా పోరాటం చేశారు. ఆ పార్టీని నా నా దుర్భాష్యాలు ఆడారు. అదే తీరున రేవంత్ రెడ్డి చ‌దువుకొనే రోజుల నుంచీ ఏబీవీపీకి చెందిన‌వారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆయ‌న కూడా నానా తిట్లూ తిట్టిన‌వారే. త‌రువాత ఆర్.ఎస్.ఎస్.లోనూ అదే ప‌నిచేశారు. ఆపై టీఆర్ఎస్, ఆ త‌రువాత తెలుగుదేశం ఇలా పార్టీలు మారినా, కాంగ్రెస్ ను మాత్రం ఉతికి ఆరేశారు. ఇప్పుడు అదే పార్టీ నుండి దేశంలో అతిపెద్ద లోక్ స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గం అయిన మ‌ల్కాజ్ గిరి నుండి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు కూడా అయ్యారు. రాజ‌కీయాల‌లో ఇదే వైచిత్రి! ఎవ‌రు ఎప్పుడు ఏ పార్టీలో ఏమ‌వుతుంటారో చెప్ప‌లేం. అలాంటి ప‌రిజ్ఞానం రాజ‌కీయ‌నాయ‌కుల‌కు ఉండాలి. లేన‌ప్పుడు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టే అవుతుంది.

అందుకేనా!?

చంద్ర‌బాబుకు కాంగ్రెస్ తో పొత్తు వ‌ల్లే ఆయ‌న‌కు తెలంగాణ‌లో శృంగ‌భంగ‌మ‌యింది. అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ఇంకా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుంటారా? పైగా, తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌ల‌హీన ప‌డ‌టానికి చంద్ర‌బాబు ప‌స‌లేని ప‌థ‌క ర‌చ‌న‌లే కార‌ణ‌మ‌ని ఇప్ప‌టికీ తెలుగుదేశం శ్రేణులే చెప్పుకుంటున్నాయి. అలాంటి చంద్ర‌బాబు వ‌ల్ల రేవంత్ కు ప‌ద‌వి ద‌క్కింద‌ని చాటింపు వేస్తే ఎవ‌రికి లాభం? ఖ‌చ్చితంగా అది అధికారంలో ఉన్న కేసీఆర్ కే లాభం. సొంత పార్టీలో త‌మ బ‌లం నిరూపించుకోలేక పోయిన కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి, ప‌ద‌వి రాక‌పోగానే, కాంగ్రెస్ కు న‌ష్టం వాటిల్లేలా చేయాలని చంద్ర‌బాబు పేరును వాడుకుంటున్నార‌ని కొంద‌రు చెబుతున్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ క‌నుమ‌రుగై పోయింది. అందుకు కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు కార‌ణ‌మ‌ని కొంద‌రు భావిస్తున్నారు. నిజానికి తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి క్యాడ‌ర్ ఉన్న‌ట్టుగా ఏ పార్టీకీ లేదు. అయితే కేసీఆర్ కూడా ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారే కావ‌డంతో, ఆయ‌న‌కు ఆ పార్టీ శ్రేణుల‌ను ఆక‌ర్షించ‌డం సుల‌భ‌మ‌యింది. ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ప్పుడే వాటిని దీటుగా ఎదుర్కోలేక‌పోయారు చంద్ర‌బాబు. పైగా ఆయ‌న బీసీల జ‌పం చేస్తూనే ఎల్.ర‌మ‌ణ‌నే ఇప్ప‌టికీ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్య‌క్షునిగా కొన‌సాగిస్తున్నారు. ఈ మ‌ధ్య ఎల్.ర‌మ‌ణ త్వ‌ర‌లోనే కేసీఆర్ పంచ‌న చేర‌తార‌ని అన్నారు. ఆ విష‌యాన్ని ర‌మ‌ణ కూడా ఖండించ‌లేదు. అయితే ఇటీవ‌ల చేవెళ్ళ మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి ఓ సంద‌ర్భంలో తెలుగుదేశం పార్టీకి ఇప్ప‌టికీ క్యాడ‌ర్ ఉంద‌ని, అందులో యాభై శాతం మందిని కేసీఆర్ లాక్కుపోయినా, ముప్పై శాతం మందే పార్టీపై అభిమానంతో ఓటువేస్తున్నార‌ని, మ‌రో ఇర‌వై శాతం మంది స్త‌బ్దుగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య‌లు విన్న త‌రువాతే ర‌మ‌ణ వెనుక‌డుగు వేశార‌ని వినిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల్లో నిజానిజాలు ఏ పాటితో తెలియ‌దుకానీ, కొండా చెప్పిన మాట మాత్రం వాస్త‌వం. కొంద‌రు తెలంగాణ‌లోని తెలుగుదేశం అభిమానులు కొంద‌రు అటు టీఆర్ ఎస్ కు , ఇటు సొంత పార్టీకి, ఆపై కాంగ్రెస్ కు, బీజేపీకీ ఓటు వేయ‌డానికి మ‌నస్క‌రించ‌క ఇళ్ళ‌లోనే ఉంటున్నారు. అలాంటి వారంద‌రికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు కావ‌డం ఉత్సాహం క‌లిగిస్తోంది.

ఎందువ‌ల్ల‌?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడ‌యితే, తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు ఎందుక‌ని ఉత్సాహం? ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌ను తెలంగాణ‌లోని అధిక సంఖ్యాకులు వ్య‌తిరేకించారు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారే అధికులు. చంద్ర‌బాబు రెండు క‌ళ్ళ సిద్ధాంతం అంత‌గా ప‌నిచేయ‌లేక‌పోయినా, అనూహ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 2014లో తెలుగుదేశం పార్టీకి గ‌ణ‌నీయ‌మైన స్థానాలు ల‌భించాయి. అవి ఇప్పుడు టీఆర్ఎస్ ప‌ర‌మ‌య్యాయి. అందుకు తెలుగుదేశం ఓటుబ్యాంక్ లో దాదాపు 40 శాతం మంది స్త‌బ్దుగా ఉండ‌డ‌మే కార‌ణం. అలాంటివారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. వారంద‌రికీ రేవంత్ రెడ్డి ఉత్సాహం క‌ల‌గించ‌డానికి కార‌ణం, అత‌ను కేసీఆర్ పై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. త‌న సొంత‌ నియోజ‌క వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మ‌ల్కాజ్ గిరి వంటి అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎం.పి.గా గెలుపొందారు. ఆ గెలుపులో అత‌నికి బాస‌ట‌గా నిల‌చింది, సీమాంధ్ర ప్ర‌జ‌లే అని రేవంత్ కు సైతం బాగా తెలుసు. అందుకే ఆయ‌న ఎంపీ అయిన త‌రువాత జ‌రిగిన ఓ క‌మ్మ‌వారి స‌మావేశంలో రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదీగాక‌, ఓటుకు నోటు కేసులో ఆధారాల‌తో స‌హా ప‌ట్టుప‌డినా, ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా కేసీఆర్ పై పోరు సాగిస్తూనే ఉన్నారు. ఈ స్థాయిలో కేసీఆర్ పై పోరాటం చేస్తున్న వ్య‌క్తి మ‌రొక‌రు ప్ర‌తిప‌క్షాల్లో భూత‌ద్దం వేసి చూసినా క‌నిపించ‌రు. అధికారంలో ఉన్న కేసీఆర్ పాల‌న న‌చ్చ‌నివారు, తెలుగుదేశం శ్రేణుల‌ను కేసీఆర్ న‌యానో భ‌యానో త‌మ పార్టీలో క‌లుపుకోవ‌డం న‌చ్చ‌ని వారంతా, అప్ప‌టి నుంచీ రేవంత్ కు జై కొడుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షునిగా రేవంత్ ఎన్నిక కాగానే, స్త‌బ్దుగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌లిగింది. అదీగాక రేవంత్ ఏ నాడూ చంద్ర‌బాబును కానీ, తెలుగుదేశం పార్టీని కానీ తూల‌నాడ‌లేదు. పైగా మ‌హానాయ‌కుడు య‌న్టీఆర్ అభిమానిగా, బాల‌య్య‌బాబును ప‌లు వేదిక‌ల‌పై పొగడ్త‌ల‌తో ముంచెత్తిన వ్య‌క్తిగానూ రేవంత్ కు తెలుగుదేశం శ్రేణుల్లో ఓ ప్ర‌త్యేక అభిమానం ఉంది. అందువ‌ల్ల ప‌లు క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లోనూ, తెలంగాణ ప్రాంతంలోని తెలుగుదేశం అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నెల‌కొంది. ఇదే ఇప్పుడు అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తెలుగుదేశం కు బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్ లో ఉన్న నాయ‌కుణ్ణి య‌న్టీఆర్, బాల‌కృష్ణ అభిమానులు అభిమానించ‌డ‌మ‌న్న‌ది మొద‌టిసారిగా చూస్తున్నాం. గ‌తంలో చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త కార‌ణంగా కొంద‌రు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని అభిమానించి, అప్ప‌ట్లో ఆయ‌న‌కు అంద‌లం అప్ప‌గించారు. 2004లో రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ అభిమానం ఇలాగే వెల్లువెత్తింది. కానీ, ఇప్పుడు తెలంగాణ‌లో రేవంత్ పై అంత‌కంటే మిన్న‌గా తెలుగుదేశం శ్రేణులు అభిమానం పెంచుకోవ‌డం విశేషం. ఎందుకంటే ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా లేన‌ట్టే అన్న ప‌రిస్థితికి చేరుకుంది. అదే ఇప్పుడు రేవంత్ పాలిటి వ‌ర‌మ‌యింది. స్త‌బ్దుగా ఉన్న తెలుగుదేశం అభిమానులే కాకుండా, బీజేపీకి ఓటేస్తున్న టీడీపీ అభిమానులు కూడా రేవంత్ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఇక కేసీఆర్ పంచ‌న చేరిన తెలుగుదేశం శ్రేణుల్లోనూ రేవంత్ కు ప్ర‌స్తుతం ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి అయోమ‌యం నెల‌కొంది.

అదే మేలు…

రేవంత్ కు ఈ పాటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎందుకంటే అత‌నికి మీడియాలో ప్ర‌ధానంగా ఉన్న ఛాన‌ల్స్ కానీ, దిన ప‌త్రిక‌లు కానీ ఏ మాత్రం మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. అత‌ణ్ణి మీడియా కూడా ఆట‌లో అర‌టి పండులా వాడుకోవాల‌నే చూసింది. కానీ, రేవంత్ ఇక్క‌డే తెలివిప్ర‌ద‌ర్శించారు. త‌న‌ను కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు, ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు దూరం పెడుతున్నా, తాను మాత్రం త‌న‌కంటూ ఓ కంచుకోట‌ను సోష‌ల్ మీడియా ద్వారా నిర్మించుకుంటూ వ‌చ్చారు. అదే ఇప్పుడు రేవంత్ కు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిల‌చింది. అత‌ను ప్ర‌ధాన ఛానల్స్, ప‌త్రిక‌ల‌ను న‌మ్ముకోలేదు. సొంత‌గా త‌న ఉనికిని చాటుకుంటున్నారు. పైగా అత‌ని వాగ్దాటిని చూసి జ‌నం ముగ్ధుల‌వుతున్నారు. అదే అత‌ని ఆక‌ర్ష‌ణ‌గా మారింది. మ‌రి ఇలాంటి వ్య‌క్తిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంత వెదికి ప‌ట్టుకోలేరు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం మ‌రో మాట లేకుండా రేవంత్ రెడ్డినే తెలంగాణ పీసీసీ అధ్య‌క్షునిగా ఎంపిక చేసుకుంది. మ‌ధ్య‌లో చంద్ర‌బాబు పేరు తీసుకు వ‌స్తున్న నిరాశ కాంగ్రెస్ వాదులు ప‌రోక్షంగా రేవంత్ కే మేలు చేస్తున్నారు. ఆ విష‌యం వారికి త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

Share: