ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. మన దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని పీఛమణచేందుకు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధనల్లో వెలుగు చూసిన ఓ విషయం ఇప్పుడు మరింత ఆశ్చర్యపరుస్తోంది. కంటినిండా హాయిగా కునుకు తీసే వారికి వైరస్ సోకే ముప్పు చాలా తక్కువని పరిశోధకులు తేల్చారు. ఎంత ఎక్కువగా నిద్రపోతే కరోనా అంత దూరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు.
ప్రాణాంతక కరోనాతోపాటు ఇతర సమస్యలు వేధించడానికి నిద్రలేమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమికి తోడు మానసిక పరమైన ఒత్తిళ్ల వల్ల వైరస్ సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ‘బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక పేర్కొంది. కరోనా సోకే విషయంలో నిద్ర ప్రభావంపై ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, అమెరికాలలో కరోనా బాధితులకు చికిత్స అందుస్తూ ఆ మహమ్మారి బారినపడిన ఆరోగ్య కార్యకర్తలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వీరిలో 40 శాతం మంది నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల ప్రభావం కారణంగానే కరోనా బారినపడినట్టు అధ్యయనకారులు గుర్తించారు.
రోజూ నిద్రపోయే సమయం కంటే ఒక గంట అదనంగా నిద్రించినా కరోనా సోకే అవకాశాలు 12 శాతం చొప్పున తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి నిద్రకు ఉన్న ప్రాముఖ్యాన్ని ఇప్పటికైనా గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలతోపాటు కరోనా భూతాన్ని కూడా దూరం పెట్టవచ్చని చెబుతున్నారు. నిజానికి టెక్నాలజీ పెరిగిన తర్వాత నిద్రలేమితో అల్లాడిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ చార్జీలు గణనీయంగా తగ్గడం వంటివి ఇందుకు ఓ కారణమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లలో పడి చిన్న, పెద్దలు రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉంటూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం నిద్రపోతే కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. కాబట్టి హాయిగా నిద్రపోండి.. కరోనాను దూరంగా ఉంచండి!