కక్షాంధ్రప్రదేశ్

Editor

ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామన్న ధోరణి ఏపీలో క్రమంగా పెరుగుతోంది. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిరంకుశ పోకడలు అవలంబిస్తూ ప్రతిపక్షాలను ఏదో రకంగా హింసిండమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు వ్యవహరిస్తోంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష పూరిత రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పాలనను గాలికొదిలేసి టీడీపీ నేతలను ఎప్పుడు జైలుకు పంపించాలా? అన్న దానిపైనే ప్రభుత్వం వ్యూహరచన చేస్తుండడం గర్హనీయం.

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై కక్ష గట్టి ప్రత్యేక ఆర్డినెన్స్‌తో ఆయనను తప్పించి కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి అంత సీరియస్‌గా తీసుకోని జగన్ మోహన్‌రెడ్డి ‘కరోనా వస్తుంది.. పోతుంది..’ అని తేలిగ్గా తీసుకున్నారు. తీరా నెలలు గడుస్తున్న కొద్దీ తత్త్వం బోధపడింది. రోజురోజుకు వందల్లో పెరుగుతున్న కేసులు చూసి చేతులెత్తేశారు. కరోనా విషయంలో తొలుత హడావిడి చేసిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. రాష్ట్రం ఓ వైపు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన వందిమాగదులు టీడీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టాలి? వారినెలా జైలుకు పంపాలి? అన్న వ్యూహరచనలో మునిగి తేలుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన వేస్తున్న అడుగుల వల్ల రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, తప్పుబట్టినా కేసులు పెడుతూ పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రెండు సందర్భాలలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే ఇదే జగన్ మోహన్‌రెడ్డి అండ్ కో అంతెత్తున లేచింది. ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

తెలతెలవారుతూనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేయగా, ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అరె‌స్ట్‌ చేశారు. మందుల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలతో అచ్చెన్నాయుడుకి నిజంగా సంబంధం ఉంటే ఆయనను అరెస్టు చేయడంలో తప్పు లేదు కానీ, ఆయనను అరెస్ట్ చేసిన తీరును మాత్రం రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు. శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తిని, కనీసం మందులు తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. అంతేకాదు, ఏదో ఉగ్రవాదుల ఇంట్లోకి వెళ్లినట్టు గోడలు దూకి మరీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రభుత్వమే చెప్పాలి. జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు.

జగన్మోహన్‌రెడ్డి పాలన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న భావన రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వంటివి మరింత వివాదాస్పదం అవుతున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించుకోవడానికి అధికార పార్టీ నాయకులు పలు వ్యాఖ్యలు, హెచ్చరికలు జారీ చేశారు. ఇదే చివరిది కాదని, జాబితాలో చాలా మంది ఉన్నారని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబునాయుడుని కూడా అరెస్ట్‌ చేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ మరింత రాజకీయం అయింది. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నింటా అవినీతి జరిగినందున చర్యలు తప్పవని మంత్రులు సైతం హెచ్చరికలు చేశారు. అంతకు ఒకరోజు ముందు ‘చంద్రన్న కానుక’ వంటి పథకంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడాన్ని చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు ఇదే జగన్‌ అండ్‌ కో సీబీఐని ‘పంజరంలోని చిలుక’ అని విమర్శించిన విషయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఇప్పుడు వారు సీబీఐపై అంత ప్రేమ, నమ్మకం ఎందుకు ఒలకబోస్తున్నారో తెలియక ప్రజలు అయోమయం చెందుతున్నారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలు ఎంతమాత్రమూ ప్రజలకు, రాష్ట్రానికి మేలుచేయని రాజకీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. హుందాతనంతో నడవాల్సిన రాజకీయాలు కక్షపూరితం కావడం వల్ల చివరకు మిగిలేది వినాశనమే!

జగన్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చింది ఐదేళ్లే. జీవితాంతం కాదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేవాళ్లు ఇప్పటికి రెండింతలు ప్రతీకారం తీర్చుకోక తప్పరు. అప్పుడు వారెంత గగ్గోలు పెట్టినా ప్రజల నుంచి కూడా కనీస సానుభూతి దొరకదు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడానికి అంగీకరించే వరకు గ్రానైట్‌ క్వారీలో పర్మిట్లు నిలిపివేయించారు. కండువా మార్చుకోగానే పర్మిట్లు జారీ అయ్యాయి. దీనిని బట్టి రాష్ట్రంలో ఎంతటి దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయో ఊహించడానికే జనం భయపడుతున్నారు. అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపిన సీఎం వైఎస్ జగన్ తాను అవినీతిని సహించబోనని, గతంలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు ఉంటాయని చెబుతుండడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

Share: