డాక్టర్ కృష్ణ ఎల్ల.. ఈ పేరు వింటే చాలు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఆమడ దూరం పారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19పై జరుగుతున్న పోరులో ఆయన పాత్ర అమోఘం. దేశానికి గర్వకారణం. ఆయన సారథ్యంలోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ‘కొవాగ్జిన్’ పేరుతో తీసుకొచ్చిన కరోనా టీకా ప్రపంచ బయోటెక్నాలజీ రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. సమర్థత విషయంలో మేటిగా నిలిచింది. బయోహిబ్, బయోపోలియో, కోమ్‌వ్యాక్ 3/4/5, హెచ్ఎన్‌వ్యాక్, ఇండిర్యాబ్, జెన్‌వ్యాక్, రెవాక్-బి ఎంసీఎఫ్, రెవాక్-బి ప్లస్, రోటావ్యాక్, రోటావ్యాక్ 5డి, టైప్‌బార్, టైప్‌బార్ టీసీవీ వంటి వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించిన భారత్ బయోటెక్ తాజాగా కరోనా టీకాతో మరోసారి సత్తా చాటింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగతా టీకాలతో పోలిస్తే కొవాగ్జిన్ సమర్థత ఎక్కువ మాత్రమే కాదు.. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని టీకాగా కూడా కొవాగ్జిన్ గుర్తింపు పొందింది. తాజాగా, ఈ సంస్థ నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సంస్థ నుంచి వచ్చిన కొవాగ్జిన్ టీకా 18 ఏళ్లు నిండినవారికే కాగా, తాజాగా చిన్నారుకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. 18 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఈ టీకాకు ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి. టీకా పూర్తి భద్రత ఇస్తుందని పరీక్షల్లో స్పష్టమైందని, రోగ నిరోధకశక్తి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే టీకాను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీంతోపాటు కొవిడ్, రేబిస్ రెండింటికీ కలిపి ఒకే టీకా ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని, ఇందుకోసం అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.
అంతేకాదు, ముక్కు ద్వారా ఇచ్చే టీకా (బీబీవీ154- అడెనోవైరస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్) పైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లోనే దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక డోస్ ఇంజెక్షన్, మరో డోస్ నాసల్ వ్యాక్సిన్ ఇచ్చే అంశంపైనా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొవిడ్ టీకాను ఇంజక్షన్ రూపంలో పొందే వ్యక్తికి కరోనా సోకినా పెద్దగా భయం ఉండబోదని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. అయితే, బాధిత వ్యక్తి నుంచి ఇతరులకు మాత్రం కరోనా సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అదే ముక్కు ద్వారా ఇచ్చే టీకా వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఓ జాతీయ చానల్‌తో మాట్లాడిన భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల.. పలు విషయాలను ప్రస్తావించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలో 130 కోట్ల మందికీ టీకా వేయాల్సి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. నిజానికి భారత్‌తో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ టీకాలు ఉన్నప్పటికీ అక్కడ 16 కోట్ల మంది మాత్రమే టీకాలు వేసుకున్నట్టు తెలిపారు. టీకాలు వేసే విషయంలో మన దేశం అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.
కొవిడ్ నివారణకు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. “మొదట కొవాగ్జిన్ వేసి ఆ తర్వాత ముక్కుద్వారా వేసే (నాసల్ టీకా) టీకాలతో కూడిన మిశ్రమ డోసు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నట్టు వివరించారు. దీనివల్ల కరోనాపై పోరాడేలా సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థకు కొవాగ్జిన్ తర్ఫీదు ఇస్తుందన్నారు. ఆ తర్వాత ముక్కు టీకాతో దానికి మరింత ఊతం లభిస్తుందన్నారు. ఫలితంగా ఐజీజీ, ఐజీఏ, మ్యూకోసల్ ఇమ్యూనిటీ స్పందనలు వెలువడతాయని, ఈ మూడు రకాల రోగనిరోధక రక్షణలు చాలా శక్తిమంతమని వివరించారు. ఇన్‌ఫెక్షన్ బారి నుంచి అవి రక్షిస్తాయన్నారు. దీనికితోడు కొవాగ్జిన్ బూస్టర్ డోసుపైనా కృషి చేస్తున్నట్టు డాక్టర్ కృష్ణ తెలిపారు.