విజయం వినయాన్ని ఇవ్వాలి. కానీ, విజయ గర్వం తలకెక్కితే మాత్రం అది దారుణాలకు దారితీస్తుంది. పతనం వైపు మళ్లేలా చేస్తుంది. భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమనే అనుకోవాలి. తాను సర్వాధిపతిని అనుకోవడం ఎంతటి పెను విపత్తుకు దారితీస్తుందో ప్రస్తుతం దేశంలోని పరిస్థితితులను చూస్తే అర్థం అవుతుంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించిన తొలినాళ్లలో దానికి అడ్డుకట్ట వేసి దేశంలో మరణాలు, కేసులను గణనీయంగా తగ్గించిన గొప్ప నేతగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న మోదీపై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. ఆయనను ఆకాశానికెత్తేసింది.
గిర్రున ఏడాది తిరిగేసరికి మోదీ ఆ ప్రాభవాన్ని కోల్పోయారు. అప్పుడు మోదీని కొనియాడిన గ్లోబల్ మీడియా ఇప్పుడు అదే మోదీపై విరుచుకుపడుతోంది. 130 కోట్ల మంది దేశ ప్రజలను ప్రమాదంలోకి నెట్టేయడమే కాకుండా యావత్ ప్రపంచానికే ముప్పును కొనితెచ్చి పెట్టారని దునుమాడింది. రాజకీయ లబ్ధి, అధికార కాంక్షతో దానిని తేలిగ్గా తీసుకున్నారని ఆక్షేపించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చూపించిన శ్రద్ధ ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో చూపించలేకపోయారని ఆరోపించింది. ఎన్నికల ర్యాలీలు, కుంభమేళాలు నిర్వహించడం, బడులు, షాపింగ్ మాల్స్ తెరిచి భౌతిక దూరాన్ని గాలికి వదిలేసి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు ఆంక్షలకు సిద్ధమవుతున్నారని నిందించింది. మోదీని అంతర్జాతీయ మీడియా ఇంతలా తూర్పారబట్టడం ఇదే తొలిసారి.
ప్రతి రోజూ లక్షలాది కేసులు వెలుగు చూస్తుండడం, వేలాది మరణాలు సంభవిస్తుండడానికి మోదీ పరోక్షంగా కారకులయ్యారని గ్లోబల్ మీడియా విమర్శలు కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం భారత్ నుంచే వస్తున్నాయని పేర్కొంది. ఆక్సిజన్ దొరక్క మరణాలు సంభవిస్తుండడం, ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్కపోవడాన్ని ప్రస్తావించిన మీడియా.. ప్రభుత్వ చేతకాని తనం, అసమర్థతను తూర్పారబట్టింది. భారత్‌లో పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్ల వల్ల ప్రపంచానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
రెండో దశ గురించి ఏడాది ముందే తెలిసినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎందుకు సన్నద్ధం కాలేదని ప్రశ్నించిన ‘ఎకనమిస్ట్’.. కరోనా విషయంలో మోదీ వైఫల్యాన్ని సాక్షాత్తూ ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. భారత మీడియాను మోదీ ‘మ్యానేజ్’ చేశారని, ఫలితంగా ఎన్నికలు, కుంభమేళా వంటి జాతరల విషయంలో భారత మీడియా చూసీచూడనట్టు వదిలేసిందని రాసుకొచ్చింది. ‘స్కై టీవీ’ అయితే, భారత్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు పెద్దఎత్తున మరణిస్తున్నారని పేర్కొంది.
కరోనా వేళ మోదీ లెక్కలేనంత మందితో ర్యాలీలు నిర్వహించారని ‘న్యూయార్క్’ టైమ్స్ ప్రస్తావించింది. కరోనా సెకండ్ వేవ్‌లో మోదీ కొట్టుకుపోయారని లండన్ నుంచి వెలువడే ‘టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్‌లో ఒక భారీ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ ఇంత భారీ జనసమూహాన్ని తన జీవితకాలంలో చూడలేదని వ్యాఖ్యానించడాన్ని కూడా అంతర్జాతీయ మీడియా తమ కథనాల్లో ప్రస్తావించడం గమనార్హం.
కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకుంటే మోదీ, అమిత్ షా మాత్రం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణ, ప్రత్యర్థులను దెబ్బకొట్టడంపై వ్యూహాలు రచించేందుకు ఆ సమయాన్ని వాడుకున్నారని అంతర్జాతీయ మీడియ ధ్వజమెత్తింది. ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మోదీ 20, అమిత్ 30 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారని గుర్తు చేసింది. మోదీ ప్రతిష్ఠకు ఇప్పటి వరకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదేనని వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ దెబ్బకు భారత్‌లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని ‘గార్డియన్’ పత్రిక వ్యాఖ్యానించింది.
మరోవైపు, మోదీపై దేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా రిజైన్ మోదీ (#Resign PM Modi) హ్యాష్‌టాగ్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ట్విట్టర్‌లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్. కరోనా సెకండ్ వేవ్‌కు ఆయన అసమర్థతే కారణమని, వెంటనే ఆయన తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా కింగ్‌గా పేరు సంపాదించుకున్న మోదీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా నుంచి సెగ మొదలైంది.