గవర్నర్ ఆమోదం అత్యంత దురదృష్టకరం – వడ్డే శోభనాద్రీశ్వరరావు

vs

‘‘సమీకృత అభివృద్ధి వికేంద్రీకరణ – 3 రాజధానుల బిల్లు’’ మరియు ఎ.పి.సి.ఆర్.డి.ఎ రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌గారు ఆమోదించడం అత్యంత దురదృష్టకరం. శాసనసభ మరియు శాసనమండలి బిజిజెన్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ రెండు బిల్లులు గవర్నరు వద్దకు పంపబడ్డాయి. 22 జనవరి, 2020న శాసనమండలిలో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగి, గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు మండలి చైర్మన్ తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలన్న నిర్ణయం ప్రకటించారు. రూల్స్ ప్రకారం కచ్చితంగా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయవలసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడం ఎంతమాత్రం తగదు. ఈ రెండు బిల్లుల ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఈ విషయం సెలక్ట్ కమిటీకి నివేదించబడిందని పేర్కొన్నారు.

ఈ రెండు బిల్లుల విషయం ఎ.పి హైకోర్టులో పెండింగులో ఉండగా, హైకోర్టు నిర్ణయం వెలువడక ముందే శాసనసభలో రెండవసారి జూన్ 16, 2020న పెట్టడం రూల్ 79 (v) నకు విరుద్ధం. లోగడ మండలికి పంపగా ఇది వరకే సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం జరిగి ఉందని, ఇప్పుడు ఎలా ప్రవేశపెడతారని, మెజారిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారే తప్ప తిరస్కరించలేదు. రాజ్యాంగం ఆర్టికల్ 197 (1) (ఎ) (బి) (సి) కింద పరిణామాలు చోటుచేసుకొనకుండానే, ఆర్టికల్ 197 (2) ప్రకారం నెల రోజులు గడచిన తరువాత గవర్నర్ ఆమోదానికి రెండు బిల్లులూ పంపబడడం రాజ్యాంగ విరుద్ధం. లోగడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎ.ఆర్.ఆంటోని విషయంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు ఈ చర్య విరుద్దం.

వివిధ కోణాలలో పరిశీలించినప్పుడు ఈ రెండు బిల్లులూ గవర్నర్ ఆమోదం పొందడానికి అర్హత లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ-మూడు రాజధానుల బిల్లులకు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ జతపర్చి ఉండలేదు. నూతనంగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలంటే భూసేకరణ వ్యయంతోపాటు, భవనాలతోపాటు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు కావలసి ఉంటుందనే విషయం ప్రజలకు తెలియపర్చకూడదనే భావనతోనే ద్రవ్య బిల్లుగా కాక సాధారణ బిల్లుగా శాసనసభ రూల్ 93కి విరుద్ధంగా ప్రవేశపెట్టబడింది. శాసనమండలి వ్యవస్థ ఉన్న రాష్ట్రాలలో రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుకు మినహాగా ఇతర బిల్లులకు మండలి ఆమోదం తప్పనిసరి. గవర్నర్ ఆమోదమునకు బిల్లులను పంపునపుడు రూల్ 124 ప్రకారం విధిగా శాసనసభ స్పీకర్ మరియు శాసనమండలి చైర్మన్ ఇద్దరూ సంతకం చేయవలసి ఉంటుంది. కానీ ఈ రెండు బిల్లుల విషయంలో మండలి చైర్మన్ షరీఫ్ సంతకం చేసి ఉండలేదు.

ఈ అంశాలతోపాటు, ఈ రెండు బిల్లులూ రాజ్యాంగంలో పొందుపర్చబడిన నిబంధనలకు, భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా వున్నందున గవర్నర్ ఆమోదం పొందడానికి వీలులేదు. ఉన్నత న్యాయస్థానాల వద్ద న్యాయసమీక్షలో నిలబడవు. ఎందుకనగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అభివృద్ధి వికేంద్రీకరణ-మూడు రాజధానుల బిల్లులో సెక్షన్ 7 (1) (i) (ii) (iii) ప్రకారం స్పష్టంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ మరియు అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, మూడు రాజధానులు ఉంటాయని స్పష్టంగా పేర్కొనబడింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5(2)లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందని పేర్కొనబడింది. ఒకే అంశానికి సంబంధించి, పార్లమెంటు ఆమోదం పొందిన దాంట్లో  పేర్కొనబడిన దానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన చట్టంలో ఆ అంశానికి సంబంధించి భిన్నంగా ఉన్న యెడల, పార్లమెంటు ఆమోదించిన చట్టంలో వున్నదే నిలబడుతుందని, శాసనసభ చేసిన చట్టంలో వున్నది చెల్లదని పలు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కేంద్రం నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నియమించబడి, రాష్ట్ర  శాసనసభలో వై.ఎస్.ఆర్. పార్టీ సభ్యులతో సహా ఏకగ్రీవంగా ఆమోదం పొందిన పిదప రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23, 2020న అమరావతిలో రాజధానిని నోటిఫై చేయడం, భారత ప్రధానమంత్రి స్వయంగా అక్టోబరు 22, 2015న శంకుస్థాపన చేయడం, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు రాజధాని భవనాల కొరకు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో పరిపాలనకు అవసరమైన సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు వివిధ స్థాయిలలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తుల కొరకు నివాస భవనాలతోపాటు రహదారులు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు దాదాపు ఇప్పటికే సుమారు రూ. 10,000 కోట్లు ఖర్చు చేయగా, ఇంకనూ 19,000 కోట్ల రూపాయల పనులు 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొనసాగుతూ వచ్చాయి.

అమరావతిలో రాజధాని  ఏర్పాటుకు ప్రతిపక్ష నాయకునిగా ఆమోదం తెల్పడమేకాక, 30,000 ఎకరాల భూములు అవసరమవుతాయని మాట్లాడిన వై.ఎస్.జగన్, అధికారం చేపట్టిన దరిమిలా అమరావతిలో నిర్మాణాలను మొత్తంగా నిలిపివేయడమే గాక తాజాగా తీసుకొన్న 3 రాజధానుల నిర్ణయం న్యాయసమీక్షలో నిలవదు. నదీ జలాల విషయంలో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉండి, పంజాబ్ భూభాగంలో కాలువలు తవ్వి, హర్యానాలోకి వెళ్లవలసిన కొన్ని కాలవల తవ్వకానికి పంజాబ్ ప్రభుత్వం అడ్డు చెప్పిన సందర్భంలో అలా చేయడం తగదని, కాలువల నిర్మాణం ఒప్పందం మేరకు పూర్తిచేయవలసిందేనని  AIR 2002 SC 685లో తీర్పు ఇచ్చి ఉంది. అంతేకాక ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రాంతంలో పంచదార ఫ్యాక్టరీ నిర్మిస్తే 3 సంవత్సరాలపాటు పన్నులు విధించబోమని ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని అనుసరించి ‘‘మోతీలాల్ పదంపత్ షుగర్ మిల్స్’’ స్థాపించబడిన దరిమిలా వచ్చిన ప్రభుత్వం పన్నులు కట్టవలసిందేనని ఒత్తిడి చేసినప్పుడు అలా చేయడం తప్పని, 3 సంవత్సరాలపాటు పన్ను మినహాయింపు ఇవ్వవలసిందేనని AIR 1979 SC 651లో ఇచ్చిన తీర్పుతోపాటు, మరెన్నో తీర్పులున్నందున పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు ఉద్దేశించబడిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం ఎంతమాత్రమూ సరికాదు.

చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియ సాఫీగా కొనసాగించేందుకు ఎ.పి సి.ఆర్.డి.ఎ. చట్టాన్ని, సి.ఆర్.డి.ఎ సంస్థను ఏర్పాటు చేయడం రాజధానిని అభివృద్ధి చేయడంతోపాటు రైతులకు నివాస మరియు కమర్షియల్ ప్లాట్లను ఇవ్వడంతోపాటు, కౌలు, రుణమాఫీ, పెన్షన్ మున్నగు ప్రయోజనాలతోపాటు ఎల్.పి.ఎస్ లే-అవుట్లను అభివృద్ధి పరిచి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని విశ్వసించి ‘‘9.14 ఇర్రివర్సబుల్ జనరల్ పవరాఫ్ అటార్నీ కం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్’’ పైన 26 వేలమంది రైతులు సంతకాలు చేసి 34,000 ఎకరాలను అందజేసిన పరిస్థితులలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిలవదు. ‘‘స్టెరిలైట్ ఇండస్ట్రీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’’ వివాదంలో అప్పటికే పరిశ్రమ ఏర్పాటై నడుస్తూ ఉన్నందున దానిని మూసివేయాలనే ఉత్తర్వులు సరికాదని, అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఇచ్చిన తీర్పు వంటివి మరికొన్ని ఉన్నాయి. కావున ఎ.పి.సి.ఆర్.డి.ఎ. రద్దు చట్టం న్యాయ సమీక్షలో నిలబడదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనప్పటికీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం హేతుబద్ధంగా, సమంజసంగా, రాజ్యాంగానికి లోబడి ఉండాలని, అలాకాని పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 13కు విరుద్ధంగా వుంటే కొట్టివేయవలసి ఉంటుందని శ్రీలేఖ విద్యార్థి వర్సెస్ స్టేట్ ఆఫ్ యు.పి. AIR 1991 SC 212లో ఇచ్చిన తీర్పుతోపాటు మరెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ గవర్నర్ పరిశీలించకుండానే ఆమోదించడం ఆయన హోదాకు ఎంతమాత్రమూ తగదు.

తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటైనప్పుడు తమ బిడ్డలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండగలదన్న ఆశతో భూములిచ్చిన అమరావతి రైతులకు పూడ్చలేని నష్టం చేకూరుతుంది. జగన్ ప్రభుత్వ వైఖరిని జీర్ణించుకోలేక ఇప్పటికే 65 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 230 రోజులుగా 29 గ్రామాలలో వేలాదిమంది రైతులు, ఇతర పేదలు శాంతియుతంగా మహిళలతో సహా నిరసనలు వ్యక్తం చేస్తూ వున్నా రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికైనా చీమకుట్టినట్టుగా లేదు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు/కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కొరకు అమరావతిలో భూములు తీసుకోవడంతోపాటు దాదాపు రూ. 270 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించి వున్నా రాజధాని తరలింపు విషయంలో కేంద్రం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధ్యతా రాహిత్యం. వాస్తవంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 256 ప్రకారంగా పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ వుండాలి. అందుకు భిన్నంగా ఉన్న ఎడల ఆర్టికల్ 257 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తన పొరపాటు వైఖరిని మార్చుకోవాలని చెప్పి, అమలు చేయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తీర్పులు ఇచ్చి ఉంది. కానీ కేంద్ర బి.జె.పి. ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులకు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు వై.కా.పా. మద్దతు తీసుకునేందుకు గానూ, సాచివేత ధోరణిని అనుసరిస్తూ ఉంది.

ఒక నూతన రాష్ట్రంలో ఒక పర్యాయం, ఒక ప్రభుత్వం ఒకచోట, వేలాది కోట్లు ఖర్చుచేసి రాజధానిని నిర్మించిన దరమిలా, తరువాత వచ్చిన ప్రభుత్వం అక్కడి నుండి రాజధానిని మార్చేందుకు భారత రాజ్యాంగంలో గాని, ఏ చట్టంలో గాని అవకాశం లేనప్పటికీ, అలా పేర్కొనబడకపోయినా బాధ్యత గల బి.జె.పి అగ్ర నాయకులు కొందరు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, రాజధానిని తరలించాలని శాసనసభ తీర్మానం చేస్తే మార్చవలసి వస్తుందనే భావనను వ్యక్తం చేస్తూ ఉండడం ఆశ్చర్యకరం! అంతేకాక రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1957, సెక్షన్ 51(1) మరియు రాజ్యాంగంలోని హైకోర్టు  ఏర్పాటుకు సంబంధించిన అంశములను పరిశీలించి నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు కార్యస్థానం అమరావతిలో ఉంటుందని భారత రాష్ట్రపతి నోటిఫై చేయగా, రూ. 200 కోట్ల ఖర్చుతో నేలపాడు వద్ద హైకోర్టు భవన నిర్మాణం జరిగి జనవరి 1, 2018 నుంచి హైకోర్టు పనిచేస్తూ ఉండగా బి.జె.పి. రాజ్యసభ సభ్యుడు ఒకరు కర్నూలుకు హైకోర్టు తరలించాలని మాట్లాడడం సిగ్గుచేటు. భారత రాజ్యాంగంలోని అంశాలపట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడడం తగదు.

3 రాజధానుల అంశం ఒక్క అమరావతిలో భూములిచ్చిన రైతులకే పరిమితమైన అంశం కాదు. రాష్ట్ర అభివృద్ధిపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపే అంశం. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే పారిశ్రామిక-వ్యాపారవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వంపైన నమ్మకం సడలుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిలో రాజధానిని సమర్థించి, అధికారం వచ్చిన దరిమిలా మాటమార్చిన చందంగానే పరిశ్రమలు ఏర్పాటైన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వారు భావించేందుకు ఆస్కారం కలుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ సంస్థలు వెనకకు వెళ్లిపోయాయి. భవిష్యత్తులో పెద్దగా నూతన పరిశ్రమలు రానప్పుడు నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. దాదాపు సంవత్సర కాలంగా తాయిలాలు అందించడమే తప్ప ఆశించిన స్థాయిలో నూతన నిర్మాణాలు కానీ, ప్రాజెక్టుల ప్రగతి కాని కంచుకాగడా వేసినా ఎక్కడా కనిపించడం లేదు. ఇట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం-బి.జె.పి. నాయకత్వం చోద్యం చూస్తూ ఉండడం మాని 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేయాలని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా 13 జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చేలా వ్యవహరించమని, రాష్ట్ర ముఖ్యమంత్రికి కుటుంబంలో పెద్దలాగా ప్రధానమంత్రి చెప్పి నడిపించాలని ప్రజానీకం కోరుకుంటూ ఉంటే, ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు బిల్లులకూ ఆమోదముద్ర వేయడం వెనుక కేంద్ర బి.జె.పి. పరోక్ష అంగీకారం ఉందని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లోగడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడం, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించిన దరిమిలానైనా కడు జాగురూకతతో పరిశీలించకుండా శుక్రవారం (31-7-2020) సాయంత్రం ఆమోదముద్ర వేయడం పలు అనుమానాలకు తావిచ్చింది.

రెండు బిల్లులకూ రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేసినంత మాత్రాన అమరావతి రైతులు భయపడవలసిన ఆవశ్యకత లేదు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విషయంలో జరిగినట్టే అమరావతిలోనే రాజధాని కొనసాగటమే సరియైనది, మూడు రాజధానుల చట్టం, సి.ఆర్.డి.ఎ. రద్దు చట్టాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పనిసరిగా తీర్పు ఇస్తుందనే విశ్వాసంతో, మనోధైర్యంతో ఉండాలి. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చిట్టచివరి క్షణంలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టే అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వవలసిన రోజు త్వరలో వచ్చి తీరుతుంది.

Share: