చంద్రన్నే నయమన్నా…’ అంటున్న జనం

cbn

“మా అన్న జగన్ మాటే తప్పే మనిషి కాడు… ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో, పాలనపగ్గాలు చేపట్టినా అలాగే ఉన్నాడు…” అంటూ స్వపక్షం వారే నవ్వులు రువ్వుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత వరకు అప్పటి పాలకపక్షం తెలుగుదేశాన్నీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును దూషించడంతోనే కాలం గడిపారు జగన్. ఇప్పుడు కూడా తేడా ఏమీలేదు. తన పాలనలో జరుగుతున్న లొసుగులకు కూడా క్రితం చంద్రబాబు చేసిన తప్పిదాలే కారణమంటూ చాటింపు వేస్తున్నారు. చంద్రబాబు ఒకవేళ తప్పు చేసి ఉంటే, వాటిని సరిదిద్ది ప్రజలకు సుపరిపాలన అందజేయవలసిన బాధ్యత అక్షరాలా జగన్ పైనే ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయన చేసినవీ, చేయనివీ అన్నీ కలిపి తప్పులేనంటూ ప్రచారం చేయడంలో జగన్ విజయం సాధించారు. ఆ విధంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేశారు. 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు సొంతం చేసుకున్నారు. మా జగనన్న చరిత్ర సృష్టించాడని సంబరాలు చేసుకున్న తమ్ముళ్ళు సైతం ఇప్పుడు తమ అన్న పాలన చూసి నీరుకారి పోతున్నారు.

ఆందోళనే మరి!

న్యాయస్థానాలను చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని గతంలో చాటింపు వేసినట్టుగానే ఇప్పుడూ వైసీపీ శ్రేణులు టముకు వేస్తూనే ఉన్నాయి. కేవలం 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు, అందులోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా జరిగినా కేవలం ఇరవై మంది శాసనసభ్యులతోనే ప్రతిపక్ష నాయకునిగా మసలుతున్నారు. మరో ముగ్గురిని పక్కకు లాగితే, చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష నాయకుని హోదా కూడా కొల్లేరులో కలసి పోతుంది. అంటే చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగానూ తగిన బలంతో లేరు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించడంలో నిజానిజాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. మరి 151 సీట్లు సాధించి ఘనచరిత సృష్టించిన ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులు బలహీనమైన ప్రతి పక్షాన్ని కూడా ఎదుర్కోలేకపోతే, మునుముందు ఎదురయ్యే ప్రజాసమస్యలను ఎలా పరిష్కరిస్తారు? తమ పాలనలో లొసుగులా కనిపించిన ప్రతీ అంశానికీ చంద్రబాబునే బాధ్యునిగా చేస్తూ ఎంత కాలం పాలన సాగిస్తారు? ఈ ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లోనే నెలకొంటున్నట్టు సమాచారం. తమ నాయకుడు ఇప్పటికే కోర్టుల్లో పలుమార్లు ఓడిపోవడం, న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడం చూసిన నిఖార్సయిన అభిమానులకు ఆందోళనగానే ఉందట!

రేకెత్తుతున్న అనుమానాలు…

గతంలో ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవమున్నవారు కావడం వల్లనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, అంతగా బలం లేకుండానే ప్రతిపక్షంలో ఉన్నా ఒకే తీరున సాగుతున్నారనీ వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోందట! చంద్రబాబు 2004లో అధికారం కోల్పోయిన సమయంలోనూ ఆయన వెంట ఉన్న శాసనసభ్యుల సంఖ్య కేవలం 47 మంది మాత్రమే. అదీ 294 సీట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు బలం. అంటే కేవలం 15 శాతం మాత్రమే. ఇప్పుడు అంతకంటే తక్కువగా 13 శాతం మందితోనే చంద్రబాబు ఉన్నారు. 2004లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబును తొలిసారి ఓడించి, 15 శాతానికే పరిమితం చేశారు. ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్ రెడ్డి చంద్రబాబును 13 శాతానికి కుదించారు. ఈ లెక్కలు వేసుకొని వైసీపీ శ్రేణులు 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎంతగా ఆనందం పొందాయో వేరే చెప్పక్కర్లేదు. వారి ఆనందం కేవలం ఏడాది కాగానే ఆవిరై పోసాగింది. అందుకు వారి అభిమాన జగనన్న పాలనలో చోటు చేసుకుంటున్న లొసుగులే కారణం. కేవలం 20 నెలల పాలనా కాలంలో జగన్ రెడ్డి లాగా కోర్టుల చుట్టూ తిరిగిన ముఖ్యమంత్రి మరొకరు మనకు కానరారు. అంతకు ముందు అక్రమసంపాదన కేసులో జగన్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ, అంతకంటే మిన్నగా తన పాలనలోని లొసుగులకు తానే కోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. పలుమార్లు ఓడిపోయారు. ఏదో ఒకటి అర ఊరటగా జగన్ రెడ్డి సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భాలను చూసీ పొంగిపోయే అభిమానులున్నారు. అయితే ఆయనను ఏమీ ఆశించకుండా అభిమానించేవారిలోనే అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలుస్తోంది.

ఆ బలానికి అసలు కారణం!

రాయలసీమలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కిన సీట్లు మూడంటే మూడే. అందులో ఒకటి చంద్రబాబు, రెండోది బాలకృష్ణ, మూడోది పయ్యావుల కేశవ్. చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, పైగా అప్పటి ముఖ్యమంత్రి. కావున ఆయన గెలుపును శంకించలేం. ఇక బాలకృష్ణ అంటే మాస్ హీరో, హిందూపురంలో అంతకు ముందు శాసనసభ్యునిగా చేసిన సేవలే గెలిపించాయి. పయ్యావుల కేశవ్ గెలుపు చాలామందికి అర్థం కాలేదు. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం! ఇక మిగిలిన 49 సీట్లను జగన్ రెడ్డి సాధించారు. ఇంతటి విజయం ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగలేదు. అందుకు రాయలసీమలో జగన్ రెడ్డి సామాజిక వర్గం అతి బలంగా ఉండడమే కారణమని అందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే, రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనూ ఆ సామాజిక వర్గంలో ఇంతటి ఐక్యత పొడసూపలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసింది మొదలు, జగన్ రెడ్డి సామాజిక వర్గానికి అదో వెలితిగా ఉండేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికే చెందినవారు, పైగా ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారు. అందువల్ల విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి పదవి కూడా తమకే దక్కుతుందని భావించారు. అది నెరవేరక పోయన దగ్గర నుంచీ సమీకరాణాలు మారుతూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఆ సామాజిక వర్గానికే చెందిన వారి అనుయాయులు సైతం ‘ఈ సారి ఓటు మన జగన్ రెడ్డికే’ అంటూ బాహాటంగా చెప్పే పరిస్థితి నెలకొంది. అదీగాక వైసీపీ టిక్కెట్ పై గెలిచిన రెడ్డి సామాజిక వర్గం వారిని చంద్రబాబు నాయుడు చేరదీసి పదవులు ఇవ్వడంతో, తెలుగుదేశం పార్టీలో ఉన్న తమ సామాజిక వర్గం నేతలపైనే ద్వేషం పెంచుకోసాగారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి రాయలసీమలో ఏ రెడ్డి నాయకుడూ గెలవలేకపోయారు. అంటేనే, ఆ సామాజిక వర్గంలో ఐకమత్యం ఎలా బయలుదేరిందో అర్థం చేసుకోవచ్చు. వీరంతా జగన్ రెడ్డి తమకేదో చేస్తాడనీ, రాత్రికి రాత్రే తమ సామాజిక వర్గాన్ని మార్చేస్తాడని ఆశించలేదు. కేవలం సామాజిక వర్గంపై అభిమానంతో ఒక్కటయ్యారు. అలాంటి నిఖార్సయిన అభిమానులకే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి.

ఆశ…దోసె…

ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది జగన్. పైగా ఎవరినీ ఆశించకుండా సాగగల బలముంది. మరి అలాంటప్పుడు సజావుగా పాలన సాగించవచ్చు కదా! ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ సాగడం ఎందుకు? ఇదే ఆయన అభిమానులను తొలచివేస్తున్న ప్రశ్న. దీనితో పాటు కోర్టులో వేసే అఫిడవిట్ ను కూడా సరిగా రూపొందించుకోలేని పరిస్థితి చూసీ వారికి మరింత అనుమానాలు కలుగుతున్నాయట! చంద్రబాబు కోర్టులను ప్రభావితం చేస్తాడని వారి వాదన. అయితే వారి న్యాయవాదులు రాసే అఫిడవిట్ లోని తప్పులకు కూడా ఆయనే బాధ్యుడా? చదువుకున్న వారు సైతం మొన్నటి ఎన్నికల్లో సామాజిక వర్గంపై అభిమానంతో జగన్ రెడ్డికి ఓటు వేశారు. ఇప్పుడు వారిలో ఇలాంటి ఆలోచనలు మెదలుతున్నాయి. ఇక తమకేదో చేస్తాడని ఆశించిన అదే సామాజిక వర్గంలోని కొందరు హతాశులై ఉన్నారు. వారికి వైసీపీ కంటే తెలుగుదేశమే మేలు అన్న భావన కలుగుతోంది. ఇవన్నీ జగన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళాయని సమాచారం. అందువల్లే అతి సులువుగా అయిపోవలసిన స్థానిక ఎన్నికల ప్రక్రియను కూడా ఆయన జటిలం చేస్తూ వస్తున్నారని స్వపక్షం వారే అంటున్నారు. అంటే జగన్ కు కూడా ఈ 20 నెలల పాలనలో జనాన్ని తాను అంతగా ఆకట్టుకోలేక పోయానన్న సత్యం తెలిసిందన్న మాట! ఆ కారణంగానే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీవిరమణ చేశాకే స్థానిక ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు నిర్వహించే వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. నిమ్మగడ్డ తరువాత తమకు నచ్చిన వారినే ఎన్నికల కమీషనర్ గా తీసుకు వచ్చి, కోరుకున్న విధంగా విజయం సొంతం చేసుకోవచ్చునని అభిలాష!

అందుకే కొత్తరాగం…

తనకు కావలసిన వారినే ఎన్నికల కమీషనర్ గా నియమించుకొని, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎన్నికల బరిలోకి దిగితే ఏమి జరిగిందో తెలియదా? ఒకవేళ జగన్ రెడ్డి ఇది మరచిపోయినా, ఆయన అభిమానుల్లో విజ్ఞులైన వారు దీనిని గుర్తు చేసుకుంటున్నారు. అస్మదీయులలోనే వెల్లువెత్తుతున్న ఈ వైఖరిని సమసిపోయేలా చేసేందుకే ‘ఏకగ్రీవం’ అనే మంత్రం జపిస్తున్నారు జగన్ రెడ్డి. అన్ని చోట్లా ఏకగ్రీవం తమ పార్టీ పక్షానే రాదని తెలుసు కాబట్టే, స్థానిక నియోజక వర్గాల జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవం అయిన వారికి ప్రోత్సాహకంగా లక్షల నిధులు ఇస్తామనీ ప్రకటించారు. నిజానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలాంటి ప్రతిపాదన చేయడం సబబు కాదు. ఒకరకంగా ఇది ఓటేస్తే నోట్లిస్తామనడం లాంటిదే. తమ స్వపక్షంలోనే మెల్లగా తలెత్తుతున్న వ్యతిరేకతను రూపుమాపడానికే ఈ ప్రోత్సాహకాల పేరిట ‘ఏకగ్రీవం’ అనే కొత్తరాగం తీస్తున్నారనీ తెలుస్తోంది.

జగన్ రెడ్డికి అధిక సంఖ్యలో బలం ఉండీ, ఈ తరహా రాగాలు ఆలపించడమే అస్మదీయులకు సైతం అనుమానాలు కలిగిస్తోంది. ‘రావాలి జగన్…కావాలి జగన్…’ అంటూ గళం విప్పిన వారే, ‘చంద్రన్నే నయమన్నా…’ అనే పల్లవిని అందుకుంటున్నారు. వారి నోట ఈ పల్లవి సాగకుండా చేసేందుకే వైసీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పార్టీల గుర్తు లేకుండా సాగే స్థానిక ఎన్నికలకే ఇన్ని రాగాలుతీస్తే, రాబోయే పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్ని పాటలు పాడాలో, ఎన్ని పాట్లు పడాలో?

Share: