చంద్రబాబే కారణమంటున్న జగన్ అండ్ కో

c

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులనే ధిక్కరిస్తూ సాగుతున్న తీరు అందరికీ వినోదం పంచుతోందే తప్ప, ఆయనపై ఎలాంటి సానుభూతి కలిగించడం లేదు. జగన్ అభిమానులు మాత్రం న్యాయస్థానాలే తమ నేతను అన్యాయంగా ఆటాడేసుకుంటున్నాయని వాపోతున్నారు. సాక్షాత్తు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా అదే అభిప్రాయంతో ఉండడం విడ్డూరంగా ఉంది. కోర్టులు పదే పదే ప్రభుత్వ తీరును తప్పు పట్టడం న్యాయస్థానాలు పాలనలో వేలుపెట్టడమేనని ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయంలో ఎలాంటి మార్పూ లేదని సీతారామ్ ఇటీవల మరోమారు చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. తమ నాయకుణ్ణి సంతృప్తి పరచడానికి ఓ సభాపతి ఇలా ప్రవర్తించడం దేశంలో ఏమో కానీ, తెలుగునేలపై మాత్రం ఇదే మొదటి సారి అని అంటున్నారు పరిశీలకులు.

దానినేమంటారో…

జగన్ అభిమానుల తీరు అలా ఉంటే, అతను చేస్తున్న ప్రతి పనినీ కోర్టులు సమర్థించాలని కోరుకొనేవారూ ఉన్నారు. విశాఖపట్టణం సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం పరిశీలన నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయనను అనుమతించకుండా పోలీసులు చేసిన హంగామా కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ అంశంపై తెలుగుదేశం పార్టీ కోర్టులో వ్యాజ్యం వేసింది. ఈ కేసు ఇటీవల ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఏపీ ఏజీ.. ప్రభుత్వం తరపున వాదిస్తూ, తెలుగుదేశం పార్టీ వారు వేసిన వ్యాజ్యంలో చంద్రబాబును అడ్డగించడం మతిలేని చర్య అని పేర్కొన్నారు. అది సరైన పదం కాదని అటార్నీ జనరల్ వారు వాదించారు. అయితే అమరావతిలోని రాజధానిని వైజాగ్ తరలించడం ఏ తరహా చర్య అంటూ న్యాయస్థానం ప్రశ్నించినప్పుడు సదరు ఏజీ వద్ద సమాధానం లేదు.

అయినా తీరు మారలేదు…

అమరావతిలోని రాజధానిని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులుగా మలచే ప్రయత్నం చేపట్టినప్పటి నుంచీ జగన్ మోహన్‌రెడ్డి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం రాష్ట్ర పరిపాలనా రాజధాని వైజాగ్ తరలిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చాటింపు వేశారు. ఇక రాష్ట్ర హైకోర్టు కర్నూలుకు తరలిస్తే తరతరాలుగా అన్యాయమై పోయిన రాయలసీమకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇక అమరావతి కేవలం శాసనసభకు కేంద్రంగా ఉంటుందనీ సెలవిచ్చారు. శాసనసభ ఎక్కడ ఉంటే అదే కదా అసలైన రాజధాని, అందువల్ల అమరావతిని తామూ రాజధాని కాదని అనడం లేదనీ వాదించారు. సచివాలయం, హైకోర్టు లేకపోవడంతో అమరావతిలో రాజధానికి సేకరించిన 33 వేల ఎకరాల భూముల అవసరం ఉండదని, కేవలం కొన్ని వందల ఎకరాలను శాసనసభ కోసం తీసుకొని, మిగిలిన ప్రాంతాన్ని పేదలకు భూదానం చేస్తామనీ వైసీపీ ప్లాన్ వేసింది. ఈ పథకం సబబైనది కాదని, రైతులు అన్ని వేల ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించింది. కేవలం రాజధాని కోసమేనని, ఇప్పుడు రాజధానిని మారుస్తాం, మిగిలిన భూమిని పేదలకు దానం చేస్తాము అనడం సబబు కాదని న్యాయస్థానం కూడా ఆక్షేపించింది. అయినా దానిని సాకుగా చూపుతూ, చంద్రబాబు కారణంగానే పేదలకు భూపంపిణీ చేయలేకపోతున్నామని జగన్ అభిమానులు చాటింపు వేశారు. అమరావతి భూములపై కోర్టులో వ్యాజ్యం ఉన్నందున అక్కడి భూపంపిణీ ఆపు చేయాలి. అంతేకానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని పేదలకు భూపంపిణీ చేయడానికి చంద్రబాబు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన అభిమానులు కానీ కారణం కాదు కదా! అయినా సరే రాష్టంలో జరిగే ప్రతి అవరోధానికీ చంద్రబాబునే కారణంగా చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ వైసీపీకి అలవాటయి పోయింది. చివరకు అధికారం చేజిక్కించుకున్నా, ఆ తీరు మారలేదు. ఇప్పటికీ ప్రతీ అవరోధానికీ చంద్రబాబే కారణమంటూ చెప్పుకు తిరుగుతున్నారే తప్ప, తాము అనుకున్న పథకాలను పంపిణీ చేయడంలో వైసీపీ జాప్యం చేయడానికి కారణం ఏమిటి?

అవునంటే కాదు… కాదంటే అవును…

చంద్రబాబును బూచిగా చూపిస్తూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలన్నదే జగన్ బాబు అండ్ కో వ్యూహం. కరోనా ఆరంభ సమయంలో యావత్ ప్రపంచమూ లాక్ డౌన్ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నప్పుడు జగన్ అండ్ కో స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుపట్టింది. ఆ తరువాత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నూ పదవీచ్యుతిడిని చేసి, ఆ పై నానా యాగీ చేసి, చివరకు కోర్టులో అపజయం చవిచూసి మొట్టికాయల మీద మొట్టికాయలు తిని ఆఖరకు తెల్ల జెండా ఊపారు. మళ్ళీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవిలో అడుగుపెట్టారు. కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి జనంలో ఓ అవగాహన ఏర్పడింది. దాంతో ఓటింగులో పాల్గొనడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓటుహక్కును ఉపయోగించుకుంటున్నారు. బీహార్ లోనూ, కొన్ని ఉప ఎన్నికల స్థానాల్లోనూ ఈ మధ్యే ఎన్నికలు జరిగాయి. జనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఓటింగ్ లో పాల్గొని కరోనాను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ కూడా ఇది స్థానిక ఎన్నికలకు సరైన సమయం అని నిర్ణయించారు. జగన్ బాబు అండ్ కో మాత్రం అడ్డం తిరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఈ సమయంలో స్థానిక ఎన్నికలు జరపడం సమంజసం కాదని వాదన లేవదీశారు. ఈ సమయంలోనే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో దుబ్బాక ఎన్నిక పూర్తయింది. హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికలకు కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, జనం ఉత్సాహంగా పచ్చ జెండా ఊపారు. దీనిని కూడా ఉదహారణగా చూపించినా, జగన్ అండ్ కో స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకిగానే ఉందని వాదిస్తూనే ఉన్నారు. అయితే చిత్రంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు మాత్రం సై అనడం విచిత్రమే. ఒకరు అవునంటే తాము కాదనడం, ఇతరులు కాదంటే తాము అవుననే వారిని ఏమంటారో లోకానికి తెలుసు. అ తీరునే జగన్ అండ్ కో సాగుతూ ఉండడం గమనార్హం.

అన్నిటికీ ఆయనే…

తమకు తోచిన రీతిన ఏలికేస్తే కాలికేయడం, కాలికేస్తే ఏలికేయడం చేసేవారు ప్రతపక్షంలోనే అధికంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమేమో కానీ, 151 సీట్లతో గెలిపించిన పార్టీ ఆ తీరున సాగుతూ ఉండడం విడ్డూరం కాక మరేమిటి!? ఈ వింత పోకడలతో పాలన సాగిస్తున్న వైసీపీకి అమరావతి తరలింపు, మూడు రాజధానుల విషయంపై సాగుతున్న రోజువారీ విచారణలో మరో చుక్కెదురయింది. అమరావతి నుండి రాజధానిని తొలగించడం తప్పకుండా రాజ్యాంగధిక్కారమేనని, ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకమానదని హైకోర్టు స్పష్టం చేసింది. వేలకోట్లు ఖర్చుపెట్టి ఇప్పుడు రాజధానిని వైజాగ్ తరలించడం సమంజసం కాదని, ఇలాంటి విషయాల్లో న్యాయస్థానం తప్పకుండా కల్పించుకుంటుందనీ దర్మాసనం తేల్చిచెప్పింది. ఇలా ఇప్పటికీ కోర్టుల్లో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. అయినా, ప్రతీ అంశానికీ చంద్రబాబునే కారణంగా చూపే అలవాటున్న వైసీపీ ఎప్పటిలాగే, తమకు కోర్టుల్లో వ్యతిరేక తీర్పు రావడంపై న్యాయస్థానాలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడనీ అంటోంది.
తగిన బుద్ధి చెప్పాలి
పాలన చేతకకాపోయినా, తాము తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజావ్యతిరేకం ఎదురైనా, న్యాయస్థానాల్లో తమకు అనుకూలంగా తీర్పు వెలువడక పోయినా, అన్నిటికీ చంద్రబాబే కారణం అంటూ సాగుతున్న వైసీపీ పాలకులు మరెందుకు జనాన్ని మభ్యపెట్టి ఎన్నికల్లో విజయం సాధించినట్టు? ఈ ప్రశ్ననే ప్రస్తుతం ఎందరో తెలుగువారిలో తలెత్తింది. తెలంగాణలో ఎన్నికలు సజావుగా సాగుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వమే వాయిదా వేస్తూ వస్తూండడం విడ్డూరంగానే అనిపిస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, పక్కనున్న తెలంగాణలోని తెలుగువారు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఏపీ ప్రభుత్వం చర్యలను చూసి విస్తుపోతున్నారు. విడ్డూరాలు చూసి ఆశ్చర్యపోవడం కాదు, ఓటు అనే ఆయుధంతో ఆ వింత పోకడలకు స్వస్తి పలకాలి. అవి స్థానిక ఎన్నికలే కావచ్చు, లేదా సార్వత్రిక శాసనసభ ఎన్నికలే కావచ్చు. లేదా ప్రదాని మోదీ కలలు కుంటున్న జమిలి ఎన్నికలూ అవ్వవచ్చు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు విచక్షణతో పనిచేసే పాలకులను ఎన్నుకోవాలే తప్ప, ప్రతీ దానికి ప్రతిపక్షం కారణం అంటూ చాటింపు వేస్తూ కాలయాపన చేసే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి.

Share: