ఏ ముహూర్తాన అయితే కరోనా వైరస్ ఈ భూమ్మీద అడుగుపెట్టిందో కానీ అప్పటి నుంచి బంధాలు, బంధుత్వాలు మాయమయ్యాయి. ఆత్మీయ సంభాషణలు, పలకరింపులు దూరమయ్యాయి. మన ఆత్మీయులో, స్నేహితులో దూరమైతే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేవాళ్లం. తామున్నామంటూ వారిలో భరోసా నింపేవాళ్లం. దీంతో వారు ఆత్మీయులను కోల్పోయిన బాధ నుంచి త్వరగా బయటపడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. పలకరింపులు లేవు, పరామర్శలు లేవు. మన సొంతవారు దూరమైనా సరే దగ్గరకు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనా భయంతో ముఖం చాటేస్తున్నారు. ఓదార్పులన్న మాటే లేదు. కారణం.. కరోనా మహ్మమారి జడలు విప్పి భయపెడుతుండడమే. చనిపోయిన వారిలోనూ కరోనా వైరస్ బతికి ఉంటుందన్న భయంతో కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నారు. పున్నామ నరకం నుంచి తప్పించే కొడుకు కూడా లేకుండానే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి.
కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఎంతసేపు ఉంటుంది? మనిషి మరణించాక కూడా వైరస్ బతికే ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్క ప్రజలు అయోమయంలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా వైద్య నిపుణులు ఈ సందేహాలకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
కరోనాతో చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్ బతకలేదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసన్ అధ్యయనం చేస్తోంది.
కరోనా వైరస్ బారినపడి చనిపోయిన దాదాపు 100కుపైగా మృతదేహాలను నిపుణులు పరీక్షించారు. ఈ సందర్భంగా కొవిడ్-19తో చనిపోయిన వారి మృతదేహంలో 12 నుంచి 24 గంటల తర్వాత వైరస్ ఆ శరీరంలో ఇక బతకదని నిర్ధారణ అయింది. మృతదేహాలకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్టు నిపుణులు తెలిపారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని తమ పరిశోధనలో వెల్లడైందని వివరించారు. అయితే, మృతదేహం ముక్కు రంధ్రాలతోపాటు శరీరం నుంచి ద్రవాలు స్రవించే ఇతర ప్రదేశాలను మూసివేయడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేవారు మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లను ధరించాల్సిందే. అంత్యక్రియలు ముగిసిన తర్వాత చితాభస్మం సేకరించడం కూడా పూర్తిగా సురక్షితమేనని, దానివల్ల కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే తాము ఈ అధ్యయనం చేసినట్టు సుధీర్ గుప్తా వివరించారు.
——————
చనిపోయిన వ్యక్తిలో కరోనా వైరస్ సజీవంగా ఉంటుందా?
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021