చిత్రసీమలో ప్రాణాలు తీస్తున్న ‘సామాజిక దూరం’

C1

సామాజిక దూరం.. ప్రస్తుత కరోనా కాలంలో ఈ పదానికి విపరీత ప్రాధాన్యం ఏర్పడింది. సామాజిక దూరాన్ని ఎంతగా పాటిస్తే మరణానికి అంత దూరం ఉండొచ్చు. కానీ ఇప్పుడదే సామాజిక దూరం చిత్రసీమను విషాదంలోకి నెట్టేస్తోంది. నటీనటుల ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలకు సామాజిక దూరమే కారణమన్న చేదు నిజం చిత్రసీమను ఇప్పుడు కలవరపరుస్తోంది. బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఇప్పుడిది మరోమారు చర్చనీయాంశమైంది.

సుశాంత్ సింగ్ మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమల్లోనూ ఆత్మహత్య చేసుకున్న నటులున్నారు. అందరూ తమ నటనతో మెప్పించిన వారే. ఎంతో భవిష్యత్ ఉన్న వీరంతా అర్ధంతరంగా తనువు చాలిస్తుండడం షాక్‌కు గురిచేస్తోంది. ఆర్థిక, సామాజిక, ప్రేమ, కుటుంబ వ్యవహారాలు.. కారణాలేమైనా వీరి మృతి వెనక అంతర్లీనంగా సామాజిక దూరం ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. పేరు ప్రఖ్యాతులు, అమాంతంగా వచ్చిపడుతున్న డబ్బు లాంటి వాటిని చూసి క్రమంగా ప్రజల నుంచి దూరంగా జరుగుతూ తమకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని, గిరి గీసుకుని బతకడమే వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సామాజిక దూరాన్ని విడిచిపెట్టి ప్రజల్లో కలిసిపోయిన ఎన్టీఆర్, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత వంటి చిత్రపరిశ్రమకు చెందిన దిగ్గజాలు మాత్రం చివరి వరకు ప్రజలతోనే ఉండి, వారితోనే మమేకమై వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉండగా ప్రజలతో మమేకమైన వారు రాజకీయాల్లోకి అదే ప్రజల మధ్య ఉంటూ ముఖ్యమంత్రులై చెరగని ముద్ర వేశారు.

సినిమాల ద్వారా వచ్చిన స్టేటస్‌ను, స్టార్‌డమ్‌ను వారు ప్రజల కోసమే ఉపయోగించడం వల్లే ఇది సాధ్యమైంది. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా స్టార్లకు విపరీతమై క్రేజ్ ఏర్పడుతోంది. ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్లుగా వెలిగిపోయిన వారు కూడా తమకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు వచ్చేసినట్టు ఆకాశంలో తేలియాడుతున్నారు. ఆ తర్వాత రెండుమూడు సినిమాలు ఫ్లాప్ అయితే అవకాశాలు కరవై ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడితే తట్టుకోలేక, అలాగని కిందికి దిగి ‘ఎడ్జెస్ట్’ కాలేక చివరికి ఉరితాళ్లను ఆశ్రయిస్తున్నారు. చిత్ర పరిశ్రమల్లో జరుగుతున్న ఆత్మహత్యలన్నింటిలోనూ వీటిలో ఏదో ఒక కారణం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. నాటి దివ్యభారతి నుంచి నేటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకు జరిగింది ఇదే. తమ చుట్టూ ఉన్న గిరిని చెరిపేసి బయటకు రాకపోతే మున్ముందు కూడా ఆత్మహత్యలు కొనసాగుతాయని, ఇకపై సంగీత ప్రపంచంలోనూ ఆత్మహత్యల గురించి వింటారని బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ చెప్పడం చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

19 ఏళ్లకే ప్రాణాలు తీసుకున్న దివ్యభారతి

దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి చిన్న వయసులో స్టార్ డమ్ అనుభవించిన దివ్యభారతి 19 ఏళ్లకే తనువు చాలించింది. బొబ్బిలిరాజా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన దివ్యభారతి తర్వాత బాలివుడ్‌కి వెళ్లింది. భర్త సాజిద్ నడియావాలా‌తో గొడవల కారణంగానే దివ్యభారతి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అంటారు. కానీ అసలు నిజం ఏంటనేది ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది. తొలిముద్దు సినిమా చేస్తూ పూర్తికాకుండానే ఆత్మహత్య చేసుకుంది.

C2

విషాదాన్ని మిగిల్చిన సిల్క్‌స్మిత

తెలుగు తెరపై వెలిగిన మరో తార సిల్క్ స్మిత. ఆమె ఆత్మహత్య సినీ రంగాన్ని కుదిపేసింది. ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. హీరోయిన్ కావాలని కలలు కని ఇండస్ట్రీకి వచ్చిన స్మిత అనుకున్నది సాధించింది. అప్పట్లో ఆమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు ఐటమ్ సాంగ్స్‌లో కనిపిస్తూనే నటన పరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి బానిసైన సిల్క్‌స్మిత కుంగుబాటుకు గురై 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది.

C3

30 ఏళ్లకే కానరాని లోకాలకు కునాల్

కునాల్ సింగ్.. ప్రేమికుల రోజు లాంటి సూపర్ డూపర్ హిట్ డబ్బింగ్ సినిమాతో సుపరిచితుడైన నటుడు కునాల్ సింగ్.. ఆ సినిమా తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి కునాల్ ఆ తర్వాత పదేళ్లు తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు. 2008లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా కునాల్ ప్రాణాలు తీసుకున్నాడని చెబుతున్నా అతడి ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతడి వయసు 30 ఏళ్లు.

C4

అనేక ప్రశ్నలు రేకెత్తించిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

అతి చిన్న వయసులో వరుస హిట్లతో తెలుగులో అశేష అభిమానులను సంపాదించుకున్న నటులలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ విజయాలతో ఉవ్వెత్తుకి దూసుకెళ్లాడు. సినీ నేపథ్యం లేకున్నా కష్టపడి పైకొచ్చాడు. అతి చిన్నవయసులోనే స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అయితే, కారణాలు ఏవైనా అవకాశాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో తట్టుకోలేకపోయాడు. దీనికితో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తను గీసుకున్న గిరి నుంచి బయటకు రాలేక, చిన్న చిన్న క్యారెక్టర్లు చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా ఒత్తిడికి లోనై 33 ఏళ్ల వయసులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగు చిత్ర సీమలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది.

C5

25 ఏళ్లకే ప్రాణాలు తీసుకున్న జియాఖాన్

బాలీవుడ్ నటి జియాఖాన్ 25 ఏళ్ల వయసులోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. వర్మ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో అమితాబ్‌తో కలిసి నటించింది. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్న వార్తలు వినిపించాయి. అయితే, ఆమెది హత్యేనని, ప్రేమికుడు సూరజ్ పాంచోలీనే కారణమని జియాఖాన్ తల్లి అప్పట్లో ఆరోపించారు.

C6

22 ఏళ్లకే ప్రాణాలు తీసుకున్న భార్గవి

అష్టాచమ్మా సినిమాతో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటి భార్గవి. ఆ చిత్రంలో భార్గవి నటన చూసి మంచి నటి అవుతుందని అందరూ భావించారు. కానీ, కొన్ని నెలలకే భార్గవి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. 22 ఏళ్లకే తీవ్ర నిర్ణయం తీసుకున్న ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమన్న ఆరోపణలు వినిపించాయి. కానీ, ఇది కూడా మిస్టరీగానే మిగిలిపోయింది.

C7

ఆత్మహత్యలు వద్దంటూనే..

చిచోరే సినిమా ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని చెప్పిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం మొత్తం సినీ రంగాన్ని కలచివేసింది. చిత్రపరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ 34 ఏళ్లకే ఆత్మహత్య ద్వారా ప్రాణాలు తీసుకోవడం గమనార్హం.

తరచి చూస్తే వీళ్లందరి మరణం వెనక అంతర్లీనంగా ఉన్నది ఒక్కటే. తమ చుట్టూ గిరి గీసుకుని అందులోనే ఉండిపోవడమే కారణం. ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణకు కారణమైన ప్రజలకే దూరంగా జరగడం. అకస్మాత్తుగా అందనంత ఎత్తుకు ఎదిగి ఆ వెంటనే అగాధంలోకి జారిపోతుంటే తట్టుకోలేక క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంటూ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. కలల ప్రపంచం చుట్టూ అల్లుకున్న వీరి జీవితం చివరికి కలగానే ముగుస్తుండడం విషాదం.

C8

 

Share: