*రావాలి జగన్… కావాలి జగన్…* అంటూ జగన్ అభిమానులు భలేగా కోరుకున్నారు. ఇక *జగనన్న వస్తేనే జాబు వస్తుంది* అనే మాటలూ భలేగా ప్రచారం చేశారు. అన్నిటినీ మంచి *ఒక్క ఛాన్స్ ప్లీజ్* అంటూ జగన్ అమాయకమైన ముఖం పెట్టి అర్థించిన తీరునూ మరచిపోరాదు. ఇక జగన్ అధికారానికి వస్తే *అవినీతి*కి నిలువ నీడ ఉండదని గొప్పగా చెప్పుకున్నారు జగన్. తన పాలనలో సంపూర్ణ మద్యనిషేధం తథ్యమనీ చెప్పారు. మహిళలకు అనూహ్యమైన రీతిలో గౌరవమర్యాదలు దక్కుతాయనీ సెలవిచ్చారు. ఇవన్నీ నమ్మేసి జనం ఓట్లేశారు. కనీవినీ ఎరుగని రీతిలో జగన్ బాబు పార్టీకి 151 సీట్లు కట్టబెట్టారు. పాలన మొదలయిన తరువాత నుంచీ తాను చెప్పిన తాయిలాల పంపకం మొదలు పెట్టారు జగనన్న. అంతకు మించి రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కానీ పట్టించుకోలేదని ఇట్టే తెలిసిపోతోంది. తాను ప్రవేశ పెట్టిన పథకాల అమలుకే కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని సైతం వినియోగిస్తున్నారు. దాంతో అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఇదే సాగుతూ పోతే, 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచినా, చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. మరి జగనన్న నిజాయితీ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎందుకని మెరుగు పడడం లేదు. ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే గౌరవనీయులైన ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేందర్ గారు అన్నిటికీ చంద్రబాబే కారణం అన్న ఏకైక సమాధానం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చెబుతున్నారు. జగన్ బాబు, బుగ్గన బాబు ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని కాసింత ఆర్థిక విజ్ఞానం ఉన్నవారందరికీ తెలుసు. కానీ, వారిద్దరూ తామే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా టముకు వేసుకుంటున్నారు.
అతి పెద్ద మోసం
జగన్ బాబు చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలవుతూ ఉంటే తమకు కేవలం మద్యపాన పన్ను ద్వారానే ఇరవై వేల కోట్ల రూపాయలు రాబడి ఉందని బుగ్గన బాబు ఎలా చెబుతారు? మద్యపాన నిషేధం అంటూ మహిళలను నమ్మించి, ఓట్లు దండుకున్నారు. ఇప్పుడేమో ఇరవై వేల కోట్ల రూపాయల రాబడి, కేవలం మద్యం ద్వారానే వస్తోందని, అదిచూస్తైనా తమ రాష్ట్రానికి రూ.25,000 కోట్లు అప్పు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేందర్ వేడుకోవడం చూస్తే ఏమనిపిస్తోంది? పచ్చి దగా, మోసం అనిపించక మానదు కదా. అదే చంద్రబాబు పాలనలో మద్యం సీసాలను పగల గొట్టి నానా యాగీచేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమంటారు? తాము మద్యంపై నిషేదం పెట్టినా, జనం తాగడం మానలేదని వితండవాదం చేస్తారా? మద్యపానం నిషేధం పేరుతో వేసిన లక్ష్మణ్ రెడ్డి కమిటీ ఎక్కడుందో ఏం చేస్తుందో కనిపించడం లేదని ప్రతిపక్షం కోడైకూస్తున్నా, అధికార పక్షం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఓ వైపు మద్యపాన నిసేధం అంటూనే చీప్ లిక్కర్ పేరుతో తమ సొంత కంపెనీలకు చెందిన మద్యాన్నిఅమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. మాట తప్పడు, మడమ తిప్పడు అని జగన్మోహన రెడ్డి గురించి ఎన్నికలకు ముందు డబ్బా కొట్టిన నేతలంతా ఇప్పుడు ఏమయ్యారు? వారందరూ అమాయక జనానికి పూచిగా నిలుస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. కానీ, ఏం లాభం అమాయక మహిళలు మద్యపాన నిషేధం చేస్తే తమ మగాళ్లు తాగుడు మానేస్తారని ఆశించి వైసీపీకి ఓట్లేశారు. ఇప్పుడు చీప్ లిక్కర్ బారిన పడి వారి ఇంట్లో మగాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద మోసం ఉంటుందా?
పేదల ఇళ్ళపైనే గురి…
ఇదిలా ఉంటే తెలుగుదేశం హయాంలో పేదలకు అన్యాయం జరుగుతోందని, తాను అధికారంలోకి రాగానే లేనివారికి న్యాయం చేస్తానని చాటింపు వేసిన జగనన్న ఇప్పుడేమి చేస్తున్నారు. తన ఇంటిసమీపంలోనే పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు. కనీసం ఇరవైనాలుగు గంటల ముందైనా నోటీసు ఇవ్వకుండా సాయంకాలం నోటీసులు చూపి, ఉదయాన్నే కూల్చివేసిన ఘటన ఇటీవలే పేదల కన్నీటికి కారణమయింది. మరి పేదల ఓట్లతో గద్దెనెక్కిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఆ పేదలకే నిలువ నీడలేకుండా చేయడం ఎంతవరకు సబబు? ఎక్కడో మారుమూల పల్లెల్లోనో, లేదా వేరే జిల్లాలోనో, లేక వేరే ప్రాంతంలోనో ఉన్న పేదలకు అన్యాయం జరగడం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇలా జరగడంతో జనం నివ్వెర పోతున్నారు. ఒకవేళ పేదల ఇల్లు చట్టవిరుద్ధంగా నిర్మితమైనవే అనుకుందాం. వారిని ఖాళీ చేయించడానికి తగిన సమయం ఇవ్వాల్సింది. లేదా, తన చుట్టూ పేదల నీడ పొడసూపకూడదు అని గౌరవనీయ ముఖ్యమంత్రిగారే అనుకొని ఉంటే, ఆ పేదలకు ఎక్కడో ఓ చోట నివాసస్థలాలు చూపించి ఆ తరువాత కూల్చివేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతెందుకు, వైసీపీ శ్రేణుల్లోనే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అధికులు పేదలవైపే నించుంటున్నారు. మరి ముఖ్యమంత్రిగారూ, ఈ విషయంలోనూ తూనా బొడ్డు అంటూ దాటవేస్తారేమో! ఇది జగనన్న పేదలకు చేసిన మోసం కాదా?
రాయలసీమకు అన్యాయం…
కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారం చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి, ప్రాంతాల మధ్య కూడా అదే పని చేశారు. తెలంగాణ వారయితే, ఆంధ్రోళ్ళు అంటూ ఉన్నారు. కానీ, ఒకే ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ రాయలసీమ, ఆంధ్ర అంటూ విభజించి, ఓట్లు దండుకున్నారు. తెలుగుదేశం పార్టీ యన్టీఆర్ స్థాపించింది కాబట్టి, అది ఆంధ్రాపార్టీ అంటూ, వైసీపీ తాను నెలకొల్పింది కావున రాయలసీమ పార్టీ అని రాయలసీమ వాసులను రెచ్చగొట్టి మరీ అనూహ్య విజయాన్ని సాధించారు. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు నాలుగు రాయలసీమ జిల్లాలోని 52 అసెంబ్లీ స్థానాలలో మూడు సీట్లు తక్క, అన్ని సీట్లను గెలుచుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాయలసీమనే పట్టించుకోవడం లేదని అక్కడి నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టులపై కేంద్రం గజిట్ విడుదల చేసి, ఇకపై తనదే పెత్తనం అంటూ ఆర్డర్ జారీ చేయడాన్ని విజ్ఞులైన రాయలసీమ వాసులు తప్పు పడుతున్నారు. రాయలసీమ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏమిటని, అదే జరిగితే, ఇక్కడి నాలుగు జిల్లాల రైతుల పరిస్థితి అగమ్యగోచరమేనని వైసీపీ మాజీ నేత మైసూరా రెడ్డి సైతం ఆక్షేపిస్తున్నారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే. ఒకరికొకరు సాయం చేసుకొనేవారే! అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే పైకి మాత్రం ఎవరి ప్రాంతాల కోసం వారు పాటు పడుతున్నట్టు డ్రామా ఆడుతున్నారని రాయలసీమ జనం అంటున్నారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిలో మూడు టీఎమ్.సీలకు మించి ఉపయోగించుకుంటున్నా జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాజకీయ లబ్ధికోసం నాటకాలకు తెరతీసి, చివరకు నీటి తగాదాను కేంద్రం చేతిలో పెట్టేశారని రాయలసీమలో అధికసంఖ్యాకులు విలపిస్తున్నారు. ఆ రోజున చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో *పట్టిసీమ*ను నెలకొల్పి, ఆంధ్రప్రాంతం వారికి ఓ వరంగా దానిని మలిచారు. అప్పుడు శ్రీశైలం నీటిని రాయలసీమ వాసులే ఉపయోగించుకొనే వీలు కల్పించారు. అప్పట్లో ప్రతిపక్షనాయకునిగా ఉన్న జగన్, పట్టిసీమను వట్టి సీమ అని గేలిచేశారు. తరువాత అదే ఆంధ్రజనానికి వరంగా మారింది. కనీసం పట్టిసీమకు చట్టబద్ధత కల్పించడంలోనూ జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాయలసీమ జనమే అంటున్నారు.
అమాయకులైన రాయలసీమ వారిని మరింతగ మభ్యపెట్టడానికి అన్నట్టు చంద్రబాబు హయాములో ప్రారంభమైన కర్నూలు సమీపంలోని ఎయిర్ పోర్ట్ ను ఇటీవల జగన్ ఆరంభించారు. అక్కడి ప్రజలను సంతృప్తి పరచే విధంగా ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరవీరుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. అది బాగానే ఉంది. అందులో తప్పేమీ లేదు. కానీ, ఆ ఎయిర్ పోర్ట్ ఏదో తానే ఏర్పాటు చేసినట్టు డబ్బా కొట్టుకుంటూ అక్కడి జనాన్ని వంచన చేస్తున్నారు. అదీగాక త్వరలోనే రాయలసీమకు హైకోర్టు వస్తుందనీ నమ్మబలుకుతున్నారు. తరచూ కీచులాటలకు దారితీసే అంశాలు రాయలసీమలోనే అధికంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాయలసీమలో హైకోర్టు వస్తే అక్కడి జనానికి ఎంతో మేలు జరుగుతుందని వైసీపీ శ్రేణులు ఇప్పటికీ టముకు వేస్తూనే ఉన్నారు. ఈ శబ్దాల మధ్య తెలంగాణతో కలసి డ్రామా ఆడుతూ రాయలసీమ కరవు ప్రాంతంలోని జనాలకు నీటిసమస్యలు తెస్తున్నారు. దీనిని విజ్ఞులైన రాయలసీమ వాసులు పసికట్టారు. మరి దీనిని ఏమనాలో జగనన్నకు జైకొడుతున్న రాయలసీమలోని ఆయన అభిమానులే ఆలోచించాలి.
ఉద్యోగుల సంగతి…
చంద్రబాబు బెత్తం పట్టుకొని పెత్తనం చేస్తారని ప్రతీతి. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఆయనంటే మంట! ఇది అందరికీ తెలిసిన విషయమే. బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి, ఏ ఉద్యోగి ఎప్పుడు విధులు నిర్వర్తించారు అన్న అంశం ఇట్టే గుర్తించేవారు. తమను స్కూలు పిల్లల మాదరి చంద్రబాబు ట్రీట్ చేస్తున్నారని అప్పట్లో వాపోయిన ఉద్యోగ సంఘాల నాయకులు, ఆ రోజున ఏమీ బాహాటంగా అనలేకపోయారు. తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్ కు ఎంతగానో మద్దతు నిచ్చారు. కోరుకున్నట్టుగానే జగన్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడేమో జగన్ సర్కార్ కోర్టులనే ధిక్కరిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వం కోర్టులను ధిక్కరిస్తే, మధ్యలో కోర్టులకు హాజరై, ప్రతివాయిదాకూ సంజాయిషీ ఇచ్చుకోవలసింది ఆ యా శాఖలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులే తప్ప, జగన్ వచ్చి బోనులో నిల్చోడు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. తమ ముఖ్యమంత్రి ఏ విషయాన్నయినా, సాగదీస్తూ, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినయోగం చేస్తున్నారని, పైగా ప్రభుత్వం వేసిన కేసులు కోర్టులో నిలవకపోగా, కోర్టు చీవాట్లు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఇప్పటికే దేశంలో ఏ ముఖ్యమంత్రీ అనుసరించని రీతిలో జగన్ వ్యవహరించి, కోర్టు ధిక్కరణలో రికార్డు సృష్టించారు. అది గొప్ప అని ఆయన అభిమానులు జబ్బలు చరచుకోవచ్చు. అయితే మధ్యలో నలిగేది ఉద్యోగులు. ఈ విషయంలో నలుగుతున్న ఉద్యోగులంతా జగన్ ను ఎన్నుకొని తాము మోసపోయామని వాపోతున్నారు.
చంద్రబాబు హైదరాబాద్ నుండి హుటాహుటిన అమరావతికి రాజధాని మార్చారని,అప్పట్లో ఎంతోమంది ఉద్యోగస్థులు నిరసించేవారు. రాజధానికి వచ్చిపనిచేసే వారి కోసం చంద్రబాబు రైల్వే శాఖతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు కూడా వేయించారు. అంతేకాదు, సాఫ్ట్ వేర్ వారిలాగా వారానికి రెండు రోజులు సెలవు కూడా మంజూరు చేశారు. అయినా చంద్రబాబు దిగిపోవాలని నూటికి తొంభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. కక్షకట్టి, ఎన్నికల సమయంలో తాము విధులు నిర్వహించిన చోట పరోక్షంగా, కొందరు ప్రత్యక్షంగానే వైసీపీకి కొమ్ముకాశారు. ఇప్పుడు జగన్ అమరావతి నుండి రాజధానిని వైజాగ్ తరలిస్తూ ఉంటే, లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే జగనన్న బుర్రలో ప్రభుత్వ ఉద్యోగులపై మరో ఆలోచన కూడా వెలిగిందట. అదేమిటంటే, చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలాన్ని 60 ఏళ్ళ వరకూ పెంచారు.కాబట్టి దానిని తుంచాలనే యోచన జగన్ కు కలిగిందట. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని మళ్ళీ 58 ఏళ్ళకు కుదించాలనే యోచనలోనూ ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికయితే దానిని అమలు చేయడం లేదు కానీ, ఆలోచన మాత్రం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలిసిన ఉద్యోగులు తాము నిండా మునిగామని బావురుమంటున్నారు.
ఇవే కాదు జగనన్న తన మామ మోహన్ బాబు అదేదో సినిమాలో చెప్పినట్టు – *అరిస్తే కరుస్తా, చరిస్తే అరుస్తా, కరిస్తే చీరేస్తా…* అన్నట్టుగా ప్రత్యర్థులు ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి లోపలే్స్తున్నారు. జనం పక్షాన నిలచి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుల మీదకు జగన్ మాట విని పోలీసులు ఒంటికాలి మీద లేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమను అలాగే అరెస్ట్ చేశారు. పైగా అతనే గత ప్రభుత్వంలో లంచం తీసుకున్నారని, కమ్మ సామాజిక వర్గం నాయకుడు వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ తో టముకు వేయిస్తున్నారు. ఉమ చేసిన అన్యాయం ఉంటే , మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? తెలిసిన వెంటనే రుజువులు చూపించి, ఆయనను అరెస్ట్ చేయవచ్చు కదా! ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తుంటే, అరెస్ట్ చేయడం ఏమిటని జనం అంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ అమరావతి రాజధాని విషయంలో అడ్డగోలుగా మాట్లాడిన వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని డబ్బా కొట్టారు. ఇప్పటికీ కొడుతూనే ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం అసలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ అన్నదే జరగలేదని కొట్టేసింది. దీనినీ కొందరు వైసీపీ అభిమానులు అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్.వి.రమణ కమ్మవారు కాబట్టే, ఆ తీర్పు వచ్చిందనీ ఇంకా జనం నమ్మేలా చెప్పడమే విడ్డూరంగా ఉంది.
జనం గగ్గోలు పెడుతున్నా, కోర్టులు చీవాట్లు వేస్తున్నా జగనన్న మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన సాగుతున్నారు. మరి ఆ నాడు పరుగులు తీసి ఆయనకు ఓట్లు వేసిన జనాల్లో ఎంతమంది ఈ విషయాలపై దృష్టిని సారిస్తారో చూడాలి.