ఘంటసాల గ్రామ పెత్తందార్లు చంచయ్యగారి కుమారుడు వెంకయ్యగారు, గ్రామ మునసబు, మంచి ఔదార్యం బంధుప్రేమ, న్యాయదృష్టిగల గొప్పవ్యక్తి, ఆయనే తమ మేనళ్లులగు కొండపల్లి వారిని మంత్రిపాలెం నుంచి, తిరువూరు తాలూకా బిల్లనపల్లి నుంచి కాకుమానువారిని ఈ వూరికి తీసుకువచ్చిన బంధుప్రియుడు. ఈయన భార్యపేరు నాగమమ్మ గారు అఖండమైన తెలివితేటలు గల వ్యక్తి. వీరి పెద్ద కుమారుడే బాలకృష్ణమ్మగారు. ఈయన ఆర్జించిన పేరు ప్రతిష్ఠలే అవలంబించిన ధర్మప్రవృత్తియే. సత్య నిర్ణయంలో ఈయన చూపిన జంకుగొంకులేని సాహసమార్గమే నేటికీ ఘంటసాల పేరు ప్రతిష్ఠలు గల గ్రామంగా వన్నెకెక్కడానికి కారణములైనవి.
తండ్రి వెంకటయ్యగారి తర్వాత ఈయన గ్రామ మునసబు అయ్యాడు. ఆనాటి ఉద్యోగులు బాలకృష్ణమ్మ గారి మాట సత్యంగా భావించి గౌరవించేవారు. జమీందారి విధానం రైతులను పీల్చి పిప్పిచేసే విధానమని వేరే చెప్పనక్కరలేదు. జమీందారు చేసే అక్రమాలను ఎదుర్కొనడం అంటే ప్రతి చిన్న తగాదాకు హైకోర్టు వరకు సివిల్ క్రిమినల్ కేసులలో చిక్కుకుని రుణాలపాలై భూమి పుట్ర అమ్ముకోవలసిన దుర్గతి కోరి తెచ్చుకొనడమే. ఇలాంటి సాహసవంతులు నూటికి, కోటికి ఒకరుంటారు. అట్టి వారిలో ఒకరు బాలకష్ణమ్మగారు. రెండవవారు నూజివీడు జమీందార్లను ఎదిరించిన ముస్తాబాద్ కాపురస్థుడు శ్రీ కడియాల చంద్రయ్య.
1. రైత్వారీ పద్ధతి అమలులోకి రాకపూర్వం రైతు, జమీందారు మధ్య ‘ఆస్రా’ లేక అమానీ పద్ధతులు అమలులో ఉండేవి. ఈ పద్ధతిలో రైతు పండించే పంటలో సగం జమీందారుది. ఈ పంటను సిఖారకంతో కొల్వక పిచ్చబోలె (తక్కు మరకంతో) కొల్చి బజారు ధాన్యపుధరను జమీందారు రైతువద్ద జబర్దస్తీగా పుచ్చుకునేవారు. దీనికి ఆందోళన చేసి విచారణలు సాగించి సిఖామరకంతో కొలిచేటట్లు ఉద్యోగులచే నిర్ణయం చేయించేవారు బాలకృష్ణమ్మగారు.
2. ఆరోజులో కత్తికి (య. 17 భూమి)
అమ్మవారి రుసుం 2-0-0
బాజా ఖర్చు 2-8-0
ఆటగాళ్లకు జమీందారి ఉద్యోగుల ఖర్చుకు 0-7-0
నాయకునికి 0-2-7
——
5-1-7
———
వసూలు చేసేవారు జమీందారుగారు.
అది అక్రమమని హైకోర్టు వరకు 1873లో వేమూరి వెంకయ్య (పరగణా పెత్తందారు), బాలకృష్ణమ్మగారు వెళ్లి జయంపొంది ఖర్చుల కింద రూ.300లు జమీందారు నుంచి వసూలు చేశారు. దీనికే పరిగణా వ్యాజ్యమని ప్రసిద్ధి కలిగింది.
3. తాళ్ల శిస్తులు-తాడి ఈత చెట్లకు గీసే కల్లు (అనగా) గీస్తూ వున్న అని రైతుల వాదన. ‘గీతకు తగిన’ అని జమీందారు వాదన. హైకోర్టు తీర్పు ‘గీస్తూ వున్న’ అనే రైతు వాదనకు అనుకూలమైంది.
4. కరణాలకు జీతాలేర్పడక పూర్వం రైతుల నుంచి కత్తికి (య.17కు) 1-00 జమీందారు వసూలు చేసి కరణాలకు ఇచ్చి తనకు అనుకూలంగా వర్తించునట్లు చేసుకునేవాడు. దీనికి ‘కరణంశలగ’ అని పేరు. దీనిని జమీందారు రైతుల నుంచి వసూలు చేయరాదని హైకోర్టు తీర్పునిచ్చింది.
5. పగ్గం కేసు: రైతు తన భూమిలో తుమ్మచెట్టు కొట్టుకొనగా పోరంబోకులో కొట్టినాడని జమీందారు క్రిమినల్ కేసు పెట్టాడు. సివిల్ స్వభావమని కోర్టు నిర్ణయమైన తర్వాత తిరిగి సివిల్ కోర్టులో వ్యాజ్యం.
అక్కడ పగ్గమనగా 44 గజాలని జమీందారు వాదన.
48 గజాలని రైతు వాదన.
కత్తి అనగా 14 ఎకరాలని జమీందారు వాదన.
17 ఎకరాలని రైతు వాదన.
రైతు వాదన నెగ్గింది హైకోర్టులో. రైతుకు రూ. 350 ఖర్చులు ఇచ్చుకోవలసి వచ్చింది జమీందారు. ప్రతి చిన్న తగాదాకు రైతును కోర్టుకు లాగడం, ఖర్చులు పెట్టలేక కోర్టులు చుట్టూ తిరిగే యమయాతన పడలేక జమీందారుకు లోబడి ఆయన అన్యాయాలకు తలొగ్గవలసిన వాడయ్యేవాడు. శ్రీ బాలకృష్ణమ్మ ఈ ఎస్టేటులో రైతులకు నాయకత్వం వహించి ఆ సమస్యలను పరగణా సమస్యలుగా చేసి అష్టకష్టాలు పడి సమష్టి ధనంతో జమీందారుని ఢీకొనేవారు.
ఆర్థిక స్థోమతకు ఈయన అవలంబించిన విధానాలు- నమూనాకు గ్రామంలో ఒక శుభముహూర్తాన పది పెళ్లిళ్లు జరిగేవి. దొడ్డి సంభావన పెత్తనం గ్రామ పెత్తందార్లది. పాలకీ ఒకటికి పది రూపాయల చొప్పున నూరు రూపాయలు మగ పెండ్లివారి వద్ద వసూలు చేశారు. బ్రాహ్మణ సంతర్పణకు బియ్యం, పప్పు, కూరగాయలు వగైరా ఆడ పెండ్లివారి వద్ద వసూలు చేశారు.
ఇక తక్కువైన కూరగాయలు గ్రామంలోని తోటలలో కోసుకు వచ్చారు. క్షీరాన్నానికి తగిన పాలు రైతుల దొడ్లలో పాలుపిండే సమయంలో పోగుచేశారు. ఆ కిందిటి రోజుననే తియ్యని పెరుగు, మామిడి పండ్లు, విసనకర్రలు వగైరా జాగ్రత్త చేశారు. ఆనాడు బ్రాహ్మణులందరికీ షడ్రసోపేతంగా సంతర్పణ చేసి వారికి తన స్వహస్తంతో గంధం పూసి అది వరకే సిద్ధపరిచిన మల్లెపూల దండలు (గ్రామంలో పూచినవే) వారి మెడలో వేసి, విసనకర్రలతో వారికి విసిరి అణాబేడో వారి చేతిలో భక్తశ్రద్ధలతో ఉంచి సన్మానం చేసేవారు. వారితో కొంత శాస్త్రచర్చ, పురాణగోష్ఠి జరిపేవారు. ఆ బ్రాహ్మణులందరూ బాలకృష్ణమ్మ గారిని గురించి డబ్బు ఎంత ఇస్తే మాత్రం ఈ మర్యాద మన్ననలు మరొకరు చేయగలరా? ఆ దేవతా విగ్రహం, ఆ పాండిత్య ప్రకర్ష అని పొగుడుకుంటూ తమ గ్రామాలకు వెళ్లేవారు. కొద్ది ఖర్చులతో బ్రాహ్మణులను తృప్తి పరిచారు. తన కీర్తిని పెంచుకున్నారు. జమీందారి వ్యవహారములలో ఖర్చుకు డబ్బు సేకరించుకున్నారు.
1889లో ఉప్పెన గాలికి ఓడ ఒకటి కొట్టుకువచ్చి ఘంటసాల నేలమీద పగిలిపోయింది. దాని కలప వగైరా జమీందారుగారి హుకుం ప్రకారం వారి తాబేదారులు కూలీలతో పోగు చేయించి గుట్టలు పెట్టించుకున్నారు. బాలకృష్ణమ్మగారు వాటిమీద విలాసాలు చూసి, తాడేపల్లి వారిదిగా గుర్తించి వారికి కబురు చేశారు. మీ ఓడ కలప తోలిపెట్టించి వాళ్లకు బాడుగ మాత్రం ఇవ్వమని ఉత్తరం రాశారు. వారు పరమానంద భరితులై ఒక రోజున బాలకృష్ణమ్మగారిని సన్మానించనెంచి ఘంటసాల నుంచి తీసుకెళ్లి విందు భోజనాలైన తర్వాత ఒక పళ్లెంలో తాంబూలంతో సహా 80వ నంబరు ధోవతులు, ఒక బంగారు మొలతాడు సమర్పించారు. ధోవతులు మాత్రం తీసుకుని ధరించారు. మొలతాడు తీసుకోలేదు. వారు తీసుకొనవలసిందిగా ప్రాధేయపడగా, ‘‘ఈ ధోవతులతో నన్ను మీరు సత్కరించారు. మరొకప్పుడు నేను మిమ్ములను మరొక ధోవతుల చాపుతో సత్కరించగలను. ఈ మొలతాడు వంటి విలువగల వస్తువలతో తిరిగి మిమ్ములను సత్కరించగల ధనవంతుడను గాను. అట్టి స్థితిలో దీనిని అక్రమ లాభంగా పరిగణించవలసి వస్తుంది’’ అని ధర్మపీఠమున గల న్యాయమూర్తిగా సమాధానమిచ్చారు. ఈ సంఘటన తాడేపల్లి వారిని బాలకృష్ణమ్మ గారికి శాశ్వత స్నేహితులుగా చేసింది.
రైతులపై జమీందారు అక్రమ వ్యవహారాలను తలపెట్టినప్పుడు, అందుకు ధనం కావాల్సినప్పుడు కొంతమంది చేత వారి పేర ప్రామిసరీ నోట్లు రాయించి డబ్బు అప్పుగా తెప్పించేవారు. మరల వడ్డీతో తీర్చేవారు. ఉద్యోగులకెవరికైనా సిఫార్సు కావలసి వస్తే జమీందారుకు దీటైన ఉజ్జీగా తాడేపల్లి వారిని ఉపయోగించుకునేవారు. ఈయన వ్యవహార నిర్వహణ నైపుణ్యానికి ఇట్టివెన్నో చెప్పవచ్చు.
కరణం-మునసబుల మధ్య సయోధ్య
ఈయన మా గ్రామ కరణం. ఘంటసాల తారకబ్రహ్మం గారితో కలిసి ఎక్కడికైనా ప్రయాణమై వెళ్లేటప్పుడు ‘‘తారక బ్రహ్మంగారూ! గుండేరు దాటుతున్నాం జాగ్రత్త!’’ అని హెచ్చరించేవారట. దాని తాత్పర్యం మనం ఒకరిని ఒకరు చులకనగా ఇతరుల వద్ద మాట్లాడితే ఇద్దరినీ వారు తేలికగా చూస్తారు సుమా అని హెచ్చరిక. తారక బ్రహ్మంగారు బాలకృష్ణమ్మగారిని గూర్తి ప్రశ్నిస్తే ‘‘బాలకృష్ణమ్మగారా, ఆయన దేవతా విగ్రహానికి తగిన ధర్మమూర్తి, సత్యనిష్ట కలిగిన పండిత ప్రభువు. ఆయనతో మరొకరు సాటి వస్తారా’’ అనేవారు. తారకబ్రహ్మం గారిని గురించి బాలకృష్ణమ్మ గారిని గురించి అడిగితే ‘‘మా కరణంగారా! మంచి లెక్కవాడు. చక్కని ముసద్దీ, కలుపుకోలుతనం గల పెద్దమనిషి. రైతులకు తలలో నాలుకలాగా వుంటాడు’’ అని అనేవారు. వీరి మర్యాద మన్ననలు ఇట్టివి.
బాలకృష్ణమ్మ వేదాంతి, అహింసా తత్పరుడు. గ్రామ దేవతలకు జంతుబలిని మాన్పి కొబ్బరికాయలతోనే ఆరాధన చేసుకునేటట్లు చేశారు.
శ్రీ జలధీశ్వర ఆలయం ముందు చక్కని, గ్రామాలకు అందచందాలు తెచ్చే మేడను ప్రజల వద్ద ధనం వసూలు చేసి కట్టించారు. స్వామి వారికి పవళింపు సేవకు అది అపుడు ఉపయోగపడేది. ఇప్పుడు పాఠశాలగా ఉపయోగపడుతున్నది. గ్రామ ఉమ్మడి ధనంతో ఇట్టి శాశ్వత ప్రతిష్ఠాపన చేసి నేటి వరకు కీర్తి నిలబెట్టుకున్న దూరదృష్టి గల మహామహుడు. ఈ గడ్డమీద పుట్టిన వారిలో ఈయనయే మొదటివాడు. తన తర్వాతి తరాల వారికి మార్గదర్శి.
ఆ రోజులలో గ్రామమంతా తనదేనని, గ్రామస్థులందరినీ సంస్కరించడం తన విధి అని భావించేవారు. ఆనాడు ఎరుకల వాళ్లకు గోచి పెట్టుకొనడం మాని బట్టకట్టుకొనడాన్ని ప్రోత్సహించారు. చనిపోయే ముందు (1907) కుమారునికి అంత్యసందేశం: ‘‘ఇచ్చేది మడులు, మాణ్యాలు కాదు. ప్రజావశీకరణ మంత్రం’’ అని అన్న దేవతామూర్తి, కీర్తిశేషుడు బాలకృష్ణమ్మగారు.
ఆయన లౌకిక ప్రజ్ఞావిశేషానికి మరొక ఉదాహరణ.
కోర్టు ఆఫ్ వార్డ్స్ పాలన నుంచి శ్రీ మల్లికార్జున ప్రసాద్ నాయుడు జమీన్‌ను అప్పగింత చేసుకున్న తర్వాత అంత వరకు ప్రభుత్వం తరపున మేనేజరుగా ఉన్న చేవెండ్ర వెంకటచలం పంతులుగారు (సీనియర్ డిప్యూటీ కలెక్టర్) బాలకృష్ణమ్మగారిని చల్లపల్లి పిలిపించుకుని జమీందారుగారికి పరిచయం చేస్తాను రమ్మనమనగా ‘‘పెద్దలు మీ దయ ఉంటే చాలు. మీ దర్శనమునకై మాత్రమే వచ్చాను. ఎక్కడ ఉన్నా ఆశీర్వదిస్తూ ఉండండి’’ అని సెలవు పుచ్చుకున్నారు. ఆయన ముఖ్యానుచరుడు, శిష్యతుల్యుడైన ఆయన పెదతండ్రి మనుమడు గొర్రెపాటి వెంకయ్యగారు వారు కోరినట్టు జమీందారుగారి పరిచయం పొందితే బాగుండేది కదా అని అనగా, ‘‘మనవద్ద సరుకుంటే జమీందారుగారే మనను పిలిపించుకుంటారు. మనవద్ద శక్తిలేకపోతే ఈయన పరిచయం చేసినా జమీందారుగారు మనను లెఖ్ఖగా చూడడు. జమీందారు పరిచయం కంటే ఆయన పరిచయమే అమూల్యంగా భావించి ఆయన ఆశీర్వచనములు కోరాం. ఆయన ఇందుకు సంతోషించాడే కానీ అన్యధా భావించలేదుగా?’’ అని చెప్పారు.
ఇటువంటి ప్రజ్ఞాశాలి కుమారుడే వెంకట నరసింహం గారు. 1920లో ఓట్లు ఇవ్వవద్దనే రోజులలో గ్రామ మునసబు, మా ప్రచార ఫలితంగా ఓటర్లు ఎవరు ఓటు వేయలేదు. పోలింగ్ ఆఫీసర్లుగా వచ్చిన ఉద్యోగులు కూడా మా కృషికి ఆనందించి మమ్ములను అభినందించారు. ఇంకా మా ఉత్సాహానికి మితి లేదు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలు అయింది. ఇంకా రెండున్నర గంటల కాలం ఉంది. పోలింగుకు గ్రామోద్యోగీయులు ఓటు చేశారా మా గ్రామానికి ప్రథమ తాంబూలార్హత ఉండదు. కొందరు వోటు చేద్దామని, మరికొందరు వద్దని తర్జన భర్జనలు పడ్డారు. మేమందరినీ వోటు చేయవద్దని ప్రాధేయపడుచున్నాం.
అపుడు నేను, నా మిత్రుడు పండిత వెంకట సుబ్బయ్య వెంకట నరసింహం గారి వద్దకు వెళ్లి ‘‘పెదనాయనా! మన గ్రామానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు వచ్చే ముహూర్తాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. మీరు సాహసించి ఓటు చేయనని ప్రకటిస్తే ఎవ్వరూ ఓటు చేయరు’’ అని కోరగా, ఆయన వారందరినీ ఒక చోట చేర్చి, ప్రజలందరకు వ్యతిరేకంగా మనం ఓటు చేయడం ఏమీ న్యాయంగా నాకు కనపడడం లేదు. ఏ డిప్యూటీ కలెక్టరో మనలను పిలిపించి అడిగితే ఇలా చెబుదాము: ‘‘మా గ్రామస్థులందరు మమ్ములను ఓటు చేయవద్దన్నారు. ప్రభుత్వమూ ఓటువేయమని మాకు సర్క్యులర్ పంపలేదు. ప్రజలను ధిక్కరిస్తే ప్రభుత్వపు అండ అయినా మాకు ఉంటుందనే హామీని ఏ ఉద్యోగస్తుడు మాకు ఇవ్వలేదు. అందువల్ల ప్రజాభిప్రాయానికి కట్టుబడ్డాం అని చెబుదాం’’ అన్నారు.
ఈ వాదనకు అది వరకే సుముఖులుగా ఉన్న కొడాలి మునసబు తుమ్మల సీతారామయ్యగారు బలపరిచారు. అందరూ సరేనని వోటు చేయకుండా ఖాళీ పెట్టెలకు జాగ్రత్తగా సీళ్లు వేయించి పంపుటలో ఆఫీసర్లకు తోడుబడ్డారు. ఈ సీతారామయ్యగారి కుమారులు నరసయ్య, వెంకటరామయ్యగార్లు నేటికీ కాంగ్రెస్‌కు అండదండలుగా వుంటూ ఉన్నారు.
మేమందరం యజ్ఞయాగాది క్రతువులు చేసినంత ఆనందంతో ఇండ్లకు వెళ్లి సుఖస్వప్నాలతో ఆ రాత్రి గడిపి మరురోజు ఉదయం బందరు వెళ్లి మా గురువులకు జయప్రదమైన మా కృషిని నివేదించుకుని వారి అభినందనలు అందుకున్నాము. ఈ ప్రజల ఘన విజయానికి తోడ్పడిన గ్రామోద్యోగీయులెల్లరు అభినందనీయులు.