తమిళనాడులో సుమారు 60 లక్షల మంది కమ్మవారు ఉన్నారు. వారంతా వివిధ రంగాలలో ఉన్నారు. పారిశ్రామిక ప్రగతిలో, వ్యవసాయాభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఉత్తర, పశ్చిమ, దక్షిణ తమిళనాడులో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రా సరిహద్దులో నివసిస్తున్న వారికి మాత్రం తెలుగు చదవడం, రాయడం తెలుసు. మిగతా వారు ఇంట్లో మాత్రమే తెలుగు మాట్లాడతారు. కానీ, వారికి చదవడం, రాయడం తెలియదు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారు. స్థానిక ప్రజలతో కలిసి మెలసి జీవిస్తూ, వారి సంప్రదాయాలను కూడా పాటిస్తారు. ఒక ప్రాంతం వారికి, మరొక ప్రాంతం కమ్మవారికి ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో తేడాలున్నాయి.
1323వ సంవత్సరంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాను చేతిలో పరాజయం పాలై బందీ అయ్యాడు. అనంతరం అతడిని ఢిల్లీ తీసుకెళ్తుండగా నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంతమంది కమ్మసేనానులు విజయనగర రాజుల కొలువులో చేరారు. విజయనగర రాజుల కాలంలో తెలుగువారు ఎక్కువగా తమిళ ప్రాంతాలకు తరలివెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తాళికోట యుద్ధంలో (1565) దక్కను సుల్తానుల చేతిలో విజయనగర సామ్రాజ్యం పరాజయం పాలవగా తెలుగు సేనా నాయకులు, ప్రజలు చెల్లాచెదురై దక్షిణ దిశగా పోయి తమిళ దేశం చేరి మదురై, తంజావూరు, జింజీ రాజ్యాలను పాలిస్తున్న కమ్మనాయకుల ఆశ్రయం పొంది, అక్కడ పాలెగాళ్లుగా, భూస్వాములుగా, జమీందార్లుగా స్థిరపడ్డారు. కొందరు రైతులుగా స్థిరపడ్డారు.
గండికోట దుర్గాన్ని పెమ్మసానివారు విజయనగర రాజుల సామంతులుగా 300 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చరిత్రను బట్టి తెలుస్తోంది. పెమ్మసాని వంశపు చివరి రాజు చిన తిమ్మానాయుడును గోల్కొండ నవాబు సేనాపతి మీర్ జుమ్లా 1652లో మాయోపాయంతో చంపించి గండికోటను ఆక్రమించాడు. తిమ్మానాయునికి అండగా ఉన్న 65 మంది కమ్మయోధులు తమిళ దేశానికి తరలిపోయి మదురై, తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో చేరారు. కొందరు రైతులుగా అనేక జిల్లాల్లో స్థిరపడ్డారు.
76 సంవత్సరాల వృద్ధుడు, అనేక విద్యాసంస్థల అధిపతి, 10 పుస్తకాలకు పైగా ప్రచురించిన గ్రంథకర్త , సంఘసేవకుడు, నూజివీడుకు చెందిన శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావుగారు ఈ పుస్తకం రాయడానికి పదేళ్లపాటు తమిళనాట అనేక ప్రాంతాలు తిరిగారు. కమ్మవారి వివరాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించి అనేక విషయాలను సేకరించి ఈ గ్రంథాన్ని రాశారు. తెలుగులో చదవలేని వారి కోసం తమిళంలో కూడా ప్రచురించారు. 240 పేజీలు ఉన్న ఈ గ్రంథాన్ని తన సహధర్మచారిణి, 50 ఏళ్లపాటు తన జీవితంలో భాగస్వామిగా ఉన్న కీర్తిశేషులు శ్రీమతి అంజనాదేవి గారికి అంకితమిచ్చారు.
ఈ పుస్తకానికి తెలంగాణ నేత, రోడ్లు, భవనాలశాఖ మాజీ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నార్త్ చెన్నై పార్లమెంటు సభ్యులు తుమ్మల గంగాధర వెంకటేశ్ బాబు, బెంగళూరు చార్టెర్డ్ అకౌంటెంట్ శ్రీ తుమ్మల గాంధీ గార్లు ముందుమాట రాశారు. పుస్తకం వెల రూ. 300. దీని ప్రతుల కొరకు కింది అడ్రసును సంప్రదించగలరు.
తుమ్మల వెంకటేశ్వరరావు, నెం. 18/192, తుమ్మలవారి వీధి, నూజివీడు, కృష్ణా జిల్లా. 521 201, మొబైల్: 98488 76188.