ఇప్పటి దాకా తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో కాంబినేషన్స్ తో చిత్రాలు రూపొంది జనాన్ని ఎంతగానో అలరించాయి. ఇక మల్టీస్టారర్స్ విషయానికి వస్తే తెలుగువారిని విశేషంగా అలరించిన కాంబినేషన్ యన్టీఆర్-ఏయన్నార్ దే అని అంగీకరించి తీరాలి. వీరిద్దరూ కలసి దాదాపు 15 చిత్రాలలో నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ (1950)తో మొదలైన వీరి కాంబినేషన్ ‘సత్యం – శివం’ (1981) దాకా సాగింది. 1963లో వీరిద్దరూ కలసి నటించిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా తరువాత దాదాపు 14 సంవత్సరాలు ఈ మహానటులు మళ్ళీ కలసి నటించలేదు. 1977లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘చాణక్య -చంద్రగుప్త’ లో యన్టీఆర్ తో ఏయన్నార్ మళ్ళీ కలసి నటించారు. ఆ తరువాత ‘రామకృష్ణులు’ (1978), ‘సత్యం-శివం’ (1981) చిత్రాలలో తెరను పంచుకున్నారు. టాప్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు మహానటులు కలసి 15 చిత్రాలలో నటించడం అన్నది ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే అరుదైన విషయం. ఆ తరువాత కృష్ణ – శోభన్ బాబు కాంబినేషన్ లో మల్టీస్టారర్స్ రూపొందినా వారిద్దరూ ఈ మహానటుల స్థాయి సాధించిన వారు కాదు. అలా తెలుగునాట మల్టీస్టారర్స్ కు ఓ క్రేజ్ ను తీసుకు వచ్చిన ఘనత యన్టీఆర్ – ఏయన్నార్ కే దక్కింది.
ఎందుకని .. కుదరలేదు!?
తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ -ఏయన్నార్ తరువాత అంతగా అలరించిన మల్టీస్టారర్ కాంబినేషన్ కృష్ణ -శోభన్ బాబుది అనే చెప్పాలి. వీరి తరువాత ఎందుకనో టాప్ స్టార్స్ కలసి నటించలేకపోయారు. జనం బాలకృష్ణ – చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రూపొందితే చూడాలని ఎక్కువగా కోరుకున్నారు. నాగార్జున – వెంకటేశ్ కలసి నటిస్తే చూడాలనీ ఆశించారు. అయితే ఈ కాంబినేషన్స్ ఎందుకనో కుదరలేదు. అయితే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ , కృష్ణ, శోభన్ బాబుతో కలసి ‘త్రిమూర్తులు’ అనే చిత్రంలో ఓ పాటలో కాసేపు కనిపిస్తారు. అంతకు మించి టాలీవుడ్ టాప్ స్టార్స్ గా దాదాపు మూడు దశాబ్దాలపాటు రాజ్యం చేస్తోన్న బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఏ నాడూ కలసి తెరను పంచుకున్నది లేదు. కానీ, నవతరం కథానాయకులు ఎంత టాప్ స్టార్స్ అయినా కలసి నటించడానికి ఈ మధ్య ఉత్సాహం చూపుతున్నారు. అలా జూ.యన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తోన్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్
రాజమౌళి వంటి దిగ్దర్శకుడు రూపొందిస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ మల్టీస్టారర్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న మాట వాస్తవమే అయినా, తెలుగునాట ఈ కాంబినేషన్ కన్నా మిన్నగా జనం మరో కలయికను చూడాలనుకుంటున్నారట. ఈ మధ్య ఏ టాప్ స్టార్స్ కలసి నటిస్తే చూడాలని ఉంది అన్న ప్రశ్నపై సర్వే సాగించగా అందులో అత్యధికులు నందమూరి నటవంశానికి చెందిన బాలకృష్ణ, జూ.యన్టీఆర్ పేర్లు ప్రస్తావించడం విశేషం. ఈ కాంబినేషన్ నే జనం కోరుకోవడానికి కారణమేంటి? బాలకృష్ణ తరం హీరోలలో ఆయన ఒక్కరే పౌరాణిక,జానపద,చారిత్రక, సాంఘిక, సోషియో ఫాంటసీ మూవీస్ లో నటించి మెప్పించారు. ఇక నవతరం కథానాయకుల్లో జూ.యన్టీఆర్ లాగా ఆల్ రౌండర్ అనిపించుకున్నవారు కానరారు. ఆ విధంగా నందమూరి నటవంశానికి చెందిన ఈ ఇద్దరూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటి దాకా వీరిద్దరూ కలసి ఒక్క చిత్రంలోనైనా నటించలేదు సరికదా, కనీసం ఒక్క సీన్ లోనైనా తెరపై కనిపించింది లేదు.
ఆ కాంబినేషన్ పైనే ఆసక్తి!
ఇక, ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ తో కలసి ‘ఖైదీ నంబర్ 150’లోనూ, ‘మగధీర’లోనూ పాటల్లో కనిపించారు. ఇక వెంకటేశ్ తన అన్న కొడుకు రానాతో కలసి ‘కృష్ణం వందే జగద్గురుం’లో ఓ పాటలో నర్తించారు. నాగార్జున అయితే ‘మనం’లో తన తనయుడు నాగచైతన్యకే కొడుకుగా నటించి మురిపించారు. ఇలా ఈ టాప్ స్టార్స్ అందరూ తమ నటవంశంలో తమ తరువాత స్టార్స్ గా జేజేలు అందుకుంటున్న వారితో కలసి తెరపై కనిపించి, అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నందమూరి నటవంశంలో బాలయ్య తరువాత మాస్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న జూ.యన్టీఆర్ తో కలసి బాలకృష్ణ ఇప్పటి దాకా నటించక పోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. అందువల్లే బాలకృష్ణ -జూ.యన్టీఆర్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే చూడాలని అసంఖ్యాకులైన వారి అభిమానులు ఆశిస్తున్నారు. వారితో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా బాలయ్య, జూనియర్ కాంబినేషన్ ను చూడాలనే ఆసక్తి ప్రదర్శించడం ఇక్కడ విశేషం!
మధ్యలో కొన్ని మల్టీస్టారర్స్ వచ్చాయి. వెంకటేశ్ – మహేశ్ కలసి నటించారు. వెంకటేశ్ తోనే పవన్ కళ్యాణ్, రామ్, నాగచైతన్య వంటి నవతరం కథానాయకులు కలసి స్క్రీన్ పై అలరించారు. అయితే ఈ కాంబినేషన్స్ లో వెంకటేశ్ సీనియర్ ఆయన సమకాలికులతో ఆయన నటించలేదు. అందువల్ల ఈ తరం అసలు సిసలు మల్టీస్టారర్ ను చూడలేదనే వినిపిస్తోంది. ఆ అభిలాషను అంతో ఇంతో తీరుస్తోన్న చిత్రం ‘ట్రిపుల్ ఆర్’. అయినా జనం ఈ కాంబినేషన్ కంటే బాలయ్య, జూనియర్ కాంబోపైనే మనసు పడడం విశేషం.
పిల్లలు చూపిన దారిలో
అసలే నందమూరి నటవంశానికి చిత్రసీమలోనే కాదు, రాజకీయంగానూ ఎంతో పేరుంది. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలసి జూనియర్ నటిస్తే చూడాలని జనం ఆశించడం తప్పేమీ కాదు. ప్రేక్షకుల్లో ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ కాంబినేషన్ లో ఎవరు సినిమాను తెరకెక్కిస్తారో కానీ, వారు అదృష్టవంతులే, సినిమాల పట్ల జనాల్లో మునుపటిలా ఆసక్తి లేదు. పైగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం వల్ల జనం థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే మూడ్ లోనూ లేరు. ఈ నేపథ్యంలో మళ్ళీ థియేటర్లకు జనం పరుగులు తీయాలంటే కొన్ని అరుదైన కాంబినేషన్స్ లో చలన చిత్రాలు రూపొంది తీరాలి. ప్రస్తుతం అలాంటి క్రేజ్ ఉన్న సినిమా ఏదంటే రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ అనే వినిపిస్తోంది. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం 2021 వేసవిలో జనం ముందుకు రానుంది. అప్పటికి కోవిడ్ కు తగిన వ్యాక్సిన్ వస్తుందనీ భావిస్తున్నారు. ఆ సినిమా విడుదల సమయానికంటే ముందు కరోనా వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ రాగలిగితే, థియేటర్లకు జనం మునుపటిలా పరుగులు తీయగలరు. ఆ ఒక్క సినిమాతోనే థియేటర్లు ప్రతిరోజూ నిండే పరిస్థితి లేదు. అందువల్ల జనానికి విశేష ఆసక్తి కలిగిస్తోన్న కాంబినేషన్స్ లో సినిమాలు రావాలి. మన సినిమా రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే ఆ రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ తమ పాత్రల గురించి ఆలోచించకుండా కలసి నటించారు. ఈ తరం తారలు కూడా ఆ మహానటులు చూపిన బాటలో నడచి, మళ్ళీ మన సినిమాలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం కావడానికి, మన సినిమా రంగం పదికాలాల పాటు మనడానికి భేషజాలు వీడి మల్టీస్టారర్స్ లో నటించాలని కోరుకుందాం. చిన్నవాళ్ళయినా జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్నారు. వీరిని చూసయినా పెద్దవారు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ కలసి జనరంజకమైన చిత్రాలలో నటిస్తే ఆ మల్టీస్టారర్స్ కారణంగా మళ్ళీ మన తెలుగు సినిమా పది కాలాల పాటు మనగలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి జనం కోరుకొనే కాంబినేషన్లలో మల్టీస్టారర్స్ ఎప్పుడు రూపొందుతాయో కాలమే సమాధానం చెప్పాలి.