దిక్కులేని దేవుడు

Editor

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు దేవుళ్లకు దిక్కులేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో దేవుళ్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హిందూ ఆలయాలపైనా, విగ్రహాలపైనా జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయినప్పటికీ నోరెత్తి ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. ముఖ్యంగా హిందూ మతోద్ధారణకే పుట్టినట్టు చెప్పుకునే బీజేపీకి అసలే లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పార్టీ పరోక్షంగా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న విషయం బహిరంగ రహస్యం.

రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగి ఉంటే ఈపాటికే బీజేపీ గగ్గోలు పెట్టేసి ఉండేది. హిందూ మతానికి పెను ఉత్పాతం జరుగుతున్నట్టు గగ్గోలు పెట్టేసి ఉండేది. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఉండడం వెనక మతలబు ఏమిటో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో ప్రజలు లేరు.

అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని దుండగులు దగ్ధం చేయడం, విజయవాడ కనదుర్గ అమ్మవారి వెండి సింహాలు మాయం కావడం, ఎక్కడికక్కడ చిన్నచితకా విగ్రహాలు ధ్వంసం కావడం వంటి పరిణామాలను సగటు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు పుండుమీద కారం చల్లినట్టు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు తీసుకెళ్లడం.

క్రిస్టియానిటీని ఆచరిస్తున్న జగన్ ఏడుకొండలవాడిపై తనకు నమ్మకం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాలన్న తెలుగుదేశం, బీజేపీ డిమాండ్‌ను జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లిపోయారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్లే అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్న నిబంధన రాష్ట్రప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలోనే ఉంది. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్‌ కలాం వంటివారు ఈ నిబంధనకు అనుగుణంగా డిక్లరేషన్‌ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు.

ప్రభుత్వం జారీ చేసిన జీవోను స్వయంగా ముఖ్యమంత్రి కాలరాయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరలేదు. ఇప్పుడు మాత్రమే ఈ వివాదం తెర మీదకు రావడంతో రాష్ట్రంలో మత రాజకీయాలకు బీజం పడినట్టుగా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు, హిందూ ఆలయాలపై వరుస దాడులు, రథాలు, విగ్రహాలను వరుసగా ధ్వంసం చేస్తూ పోతుండడాన్ని చూస్తుంటే ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా అనుమానించక తప్పడం లేదు. తెర వెనక ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది.

ఇదంతా చూస్తుంటే ఇప్పటి వరకు కుల రాజకీయాలకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్‌ ఇకపై మత రాజకీయాలు తప్పవన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఆలయాలపై దాడులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి సహకారం అందకపోవడం ఇక్కడి నేతలకు మింగుడుపడడం లేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి. కాబట్టి ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీ పథకం. కుల, మత ప్రాదిపదికన ప్రజలను విడగొట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వెనక క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారని, కాబట్టి హిందువులను తమవైపు తిప్పుకోగలిగితే టీడీపీ పని ఖతమేనన్నది బీజేపీ నాయకుల ఆలోచన.

ఆందోళనల కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు బయటకు వస్తే దారుణంగా అణచివేస్తున్న ప్రభుత్వం, బీజేపీ విషయంలో మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడం చూస్తుంటే ఆ పార్టీ వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నది జగన్ ఆలోచన కావచ్చు. ఈ కారణంగానే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి మరీ బీజేపీ నేతలు, కార్యకర్తలు బయటకు వస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏ భార్యను తీసుకుని అయోధ్యకు వెళ్లారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మౌనంగా ఉండడం వెనక ఏ మతలబు ఉందో అర్థం చేసుకోలేని అమాయకులు కారు రాష్ట్ర ప్రజలు.

అంతేకాదు, హిందూ ఆలయాలపై దాడుల విషయంలో కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు వ్యవహరిస్తున్న తీరును కూడా శంకించాల్సి వస్తోంది. చంద్రబాబు హయాంలో ఏ చిన్న సంఘటన జరిగినా తీవ్ర విమర్శలు చేసిన స్వాములు, ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ మౌనాన్ని ఆశ్రయించడంలోని ఆంతర్యం ఏమిటో తెలియంది కాదు. మేధావుల బాటలో స్వాములు కూడా ముఖ్యమంత్రికి భయపడుతుండడమో, లేక ప్రలోభాలకు లొంగిపోతుండడమే జరుగుతోందన్నది జగమెరిగిన సత్యం.

గతంలో ఏ చిన్న ఘటన జరిగినా అపచారమని ఘోషించిన విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానందకు ఇప్పుడు ఏమీ కనిపించకపోవడం ఆయన తీరుకు నిదర్శనం. హిందువులందరికీ ఆయనే ఏకైక ప్రతినిధి అన్నట్టుగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఏ గుర్తింపునకు నోచుకోని ఆయనకు ఇప్పుడు ఒక్కసారిగా గుర్తింపు రావడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాబట్టి ఈ ఘటనలేవీ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం ఏమీ కాదు. ఏది ఏమైనా ఇప్పుడు మతం రంగును కూడా పులుముకుంటున్న ఆంధ్రప్రదేశ్‌లో దేవుడికి దిక్కులేకపోవడమే అన్నింటి కంటే విషాదం.

Share: