నన్ను చంపడానికి రూ. 2600 అవసరమని లేఖ రాశాడు

BH01

కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు. ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఆయన రాసిన ‘నా జీవన నౌక’ పుస్తకం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పుస్తకంలో ఆయన ఏ ఒక్కరి మీద ఒక్క ఆరోపణ కూడా చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. 86 ఏళ్ల తన జీవితకాలంలో ఎక్కువ భాగం దేశం కోసం, సమాజహితం కోసం వెచ్చించారు. పుట్టినవారందరూ గొప్పవారు కాలేరు. అలాగని గొప్ప వారంతా మంచివారూ కాలేరు. అయితే, ఈ రెండూ ఉన్న గొప్ప వ్యక్తే బ్రహ్మయ్యగారు. ఆయన స్వీయ రచనలోని ఎన్నో విషయాలు మనసును హత్తుకుంటాయి. ఆయన గురించి తెలుసుకోవడం నేటి తరానికి అవసరం. ఆ ఉద్దేశంతోనే బ్రహ్మయ్యగారి ‘నా జీవన నౌక’ నుంచి ‘నా హత్యకు దౌర్జన్యవాదులు చేసిన ప్రయత్నం’ అనే అధ్యాయాన్ని యథాతథంగా అందిస్తున్నాం.

1994వ సంవత్సరంలో నేను, ఆంజనేయులుగారు ఒకేసారి విడుదలయ్యాం. శ్రీరంగం వగైరా పుణ్యక్షేత్రాలను సందర్శించి నేను బందరు వచ్చేసరికి ఘంటశాల నుంచి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (కిసాన్) దోనేపూడి సీతారామయ్య, గొర్రెపాటి చిన నరసింహం, వేమూరి పేరయ్య- వీరందరూ కాంగ్రెస్‌లో ఉన్న నా సహచరులు వచ్చి ఈ రెండు సంవత్సరాల నాలుగు మాసాలలో మా తాలూకాలోను, జిల్లాలోనూ ఏర్పడిన పరిస్థితులు, కమ్యూనిస్టులకు పెరిగిన ప్రాబల్యం, పోలీసు వారి అండదండలు కమ్యూనిస్టులకు ఉండడం ఈ వివరాలన్నీ చెప్పారు. మా గ్రామంలో ముఖ్యంగా, సన్నిహితంగా ఉండే బంధువర్గం, కాంగ్రెస్‌లోని సహచరులు గొర్రెపాటి వెంకట్రామయ్య వగైరా కొంతమంది కమ్యూనిస్టులు కావడం కూడా చెప్పారు.

నేను బస్సులో కొడాలిలో దిగి ఘంటశాలకు బండిమీద వెళ్లాల్సి ఉంది. కాంగ్రెస్ పౌరులు కమ్యూనిస్టులు, పెద్దలు, పిన్నలూ మూడువందలమంది నాకు స్వాగతం చెప్పడానికి వచ్చారు. కాంగ్రెస్ వారు కాంగ్రెస్ జెండాలతోను, కమ్యూనిస్టులు కమ్యూనిస్టు జెండాలతోను వచ్చారు. కాంగ్రెస్ వారు నాతో విరోధపడాలనే ధోరణిలో లేరు. అయితే, నా సహచరులైన మిగతా కాంగ్రెస్ వారితో సఖ్యతతో ఉండే స్థితి మాత్రం ఆనాటికే దాటిపోయింది. నాకు స్వాగతం ఇవ్వడానికి ఏర్పడిన బహిరంగ సభకు ‘కిసాన్’ గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ వాదులు ఇచ్చిన స్వాగత పత్రాన్ని స్వీకరించడం నా మనస్తత్వానికి వ్యతిరేకం అని చెప్పాను. నేను వచ్చే నాటికి మా గ్రామంలో కమ్యూనిస్టుల ఉపన్యాసాలు, బుర్రకథలు యథేచ్ఛగా సాగుతూ ఉండేవి. కాంగ్రెస్ వాదులకు ప్లాట్‌ఫారమే లేదు. పోలీసు వారి కుమ్మక్కులు కూడా కమ్యూనిస్టులకు ఉండేవి. ఈ స్థితిలో నేను కాంగ్రెసుకు వెనకటి ప్రాబల్యం గ్రామంలోను, చుట్టుపక్కలా పెంచుకోవాల్సి వచ్చింది. ఈ రాకను పురస్కరించుకుని నా సహచరులేగాక, గ్రామంలో కొత్తగా ప్రముఖ పాత్ర హించడానికి వచ్చిన యువకులు విజృంభించడం, వారు చేసిన దానిని నేను సమర్థించడం తప్పనిసరి అయింది.

స్వభావరీత్యా పల్లెటూరు పార్టీలు నడపగల మనస్తత్వం గానీ, ఆ పార్టీని బలవత్తరం చేయడానికి తగిన ఎత్తుగడలుగానీ నా వద్దలేవు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టు అనే ధోరణిలో నేను గ్రామ పార్టీకి ప్రథమంగా నాయకత్వం వహించక తప్పలేదు. అందుచేత, కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువు నేనే అయ్యాను. కొంతకాలం అయిన తర్వాత రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెసు వాదులను చంపడం, కమ్యూనిస్టులను పోలీసు వారు కాల్చివేయడం వరకు వచ్చింది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. మా ఊరిలోగానీ, చుట్టుపక్కల గ్రామాలలోగానీ పోలీసు లాఠీచార్జీలు వగైరా జరగకుండా నేను శ్రద్ధ వహించాను. అపుడు మా ఊరిలోని ఒక యువకుడు నన్ను చంపితే తప్ప కమ్యూనిస్టులకు ప్రాబల్యం పెరగదని ‘బ్రహ్మయ్య గారిని చంపడానికి రూ. 2600 అవసరం. రెండువేలు ఇక్కడ వసూలు చేస్తున్నాం, ఆరు వందలు మంజూరు చేస్తే బ్రహ్మయ్య గారిపై యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వవలసినదిగా తాలూకా కమ్యూనిస్టు డిక్టేటర్‌కు ఉత్తరం రాశాడు. ఆయన అండర్ గ్రౌండ్‌లో ఉండగా, ఆయన ఇంటిమీద దాడి చేసిన డీవైఎస్‌పీ శ్రీథామస్‌కు ఈ ఉత్తరం దొరికింది.

ఆయన డీఎస్పీ అప్పల నరసయ్యనాయుడు గారికి, ఆయన కలెక్టరుకు అందజేశారు. కలెక్టర్ శ్రీ మలయప్పన్‌గారు ఈ ఉత్తరం నాకు చూపించారు. ‘‘మీరు జాగ్రత్తగా ఉండవలసింది’’ అంటూ నాకు ‘సర్వెయ్‌లెన్సుగా ఒక పెద్ద కానిస్టేబుల్‌ను ఇస్తాను’’ అన్నారు. నేను అంగీకరించలేదు. ‘దేవుడే నా రక్షకుడు. నాకు ఏ సర్వేయ్‌లెన్స్ అక్కర్లేదు’’ అన్నాను.

కలెక్టర్ మలయప్పన్‌గారు నాకు చాలా సన్నిహితుడిగా ఉండేవారు. నేను అక్కర్లేదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ట్రెజరీలో ఉన్న ఒక రివాల్వరు కూడా నాకు కొద్ది ఖరీదుకు ఇచ్చారు. దానిని వారు ఇస్తున్నప్పుడు పుచ్చుకుంటూ నేను చెప్పినదేమంటే..

‘‘చిన్ననాటి నుంచి నేను అహింసా తత్పరతతోనే ఉన్నాను. దీనిని నేను ఎవరిపైనా కాల్చడానికి ఉపయోగించే మనస్తత్వం నాకు ఉండదు. పైగా, ఎవరైనా నాపై పడినప్పుడు ఇది నా రక్షణకు ఉపయోగపడే బదులువారి చేతులలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ మీరు ప్రేమతో ఇస్తున్నారు. కాబట్టి నేను తీసుకుంటున్నాను’’ అని చెప్పి నేను దానిని తీసుకున్నాను.

ఇప్పటికీ నా మనస్తత్వంలో మార్పులేదు. చిన్ననాడు చదువుకొన్న సుమతీ శతకంలోని పద్యం.. ‘అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడె నేర్పరి సుమతీ’ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని సాధ్యమైనంత వరకు అలా వర్తించుట కర్తవ్యంగా భావిస్తున్నాను. ఇలా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తూర్పు కృష్ణా జిల్లాలో నా నాయకత్వం కింద, పశ్చిమ కృష్ణాలో కాకాని వెంకటరత్నంగారి నాయకత్వం కింద పటుతరంగా వ్యవహరించడం జరిగింది.

1994 నుంచి 1952 వరకు జరిగిన ఈ పార్టీ సంఘటనలను, పరిస్థితులను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే గ్రామ కాంగ్రెసు పార్టీలలో కాంగ్రెసు తత్వం గాని, కమ్యూనిస్టు పార్టీలలో కమ్యూనిస్టు భావాలుగానీ కనబడవు. ఇవి కాలం గడిచిన కొలదీ పల్లెటూరి పార్టీల కింద దిగినవి. నా నాయకత్వం, నా అనుచరులు చేసినది మంచి చెడులతో నిమిత్తం లేకుండా బలపర్చడం తప్ప, నా అనుమతి తీసుకుని వారు కార్యనిర్వహణ చేయడం జరగలేదు.

1953లో ఈ కాంగ్రెస్ పార్టీ అనబడే దానిలో ఉన్నవారిని అందరినీ పిలిచి ఇంత వరకు కమ్యూనిస్టులకు వ్యతిరేక పక్షంగా ఏర్పడి మనం సాధించినది ఏమీ లేదు. పైగా ఆ పార్టీ బలపడడం జరిగింది. గ్రామంలో పార్టీలు, కక్షలు పెరిగినవి. పర్యవసానంగా నా స్థితి రాష్ట్ర పెద్దిరికాన్నుండి గ్రామ పెద్దరికానికి దిగింది. గ్రామంలో అందరిచేత ప్రేమించబడే నేను ఒక వర్గానికి నాయకుడను కావడం జరిగింది. కాబట్టి ‘‘ఇంతటి నుండి గ్రామ రాజకీయాలలో జోక్యం కలిగించుకోవడం మానేస్తాను. గ్రామ సమష్టి కార్యక్రమాలలో ఇది వరకు మాదిరిగానే సహాయం చేస్తాను. మీరు వ్యక్తులుగా ఏదైనా సహాయ సంపత్తి కావాలంటే నా వద్దకు రండి. పార్టీగా మాత్రం నా వద్దకు రావద్దు’’ అని నేను చెప్పాను.

కమ్యూనిస్టులతో ఓవైపు పోరాడుతూ ఉంటూనే గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాలు చాలా నిర్వహించాను. ఈ నా నిర్ణయం సరైనదని తర్వాత జరిగిన సంఘటనలు రుజువు చేశాయి. ఆ నాడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు నేడు నా ఎడల సద్భావంతో వ్యవహరిస్తూ నా పెద్దరికాన్ని పెంచుతున్నారు.

నా మిత్రుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిచే రాయబడిన సరోజినీదేవి చరిత్రకు మద్రాసు ప్రభుత్వ అవార్డు సిద్ధించిన సమయమున ఆయనకు ఆంధ్రదేశంలో హాస్య రచనలో సిద్ధహస్తుడుగా ప్రసిద్ధినొంది అనేక గ్రంథాలకు కర్తయై ఆంధ్ర పాఠక లోకమును ఆనంద పరిచిన కాంతం కథకులకున్నూ, మద్రాసు ప్రభుత్వం అవార్డు పొందిన మునిమాణిక్యం నరసింహారావు B.A(Litt) గారిని 1951 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీని మా గ్రామంలో సన్మానించి గౌరవించుకున్నాము. ఆ సన్మానసభకు మహాకవి కాటూరి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు అభినవ తిక్కన, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, కవి పాదుషా పువ్వాడ శేషగిరిరావు, మధురకవి కాకాని నరసింహారావు, అభినవ పోతన గురజాడ రాఘవ శర్మ, ఉన్నవ గోపాలకృష్ణ గోఖలే, దామరాజు పట్టాభిరామరావు ప్రభృతులు హాజరై సభను జయప్రదంగా జరిపారు. ఈ సన్మానసభ ఏర్పాటు చేసి నిర్వహించుటకు అశకాశము నాకు చిక్కినందులకు ఆనందించాం. కమ్యూనిస్టులతో ఒకవైపు పోరాడుతూ ఉంటూనే గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాలు చాలా నిర్వహించాను.

Share: