పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య తన జీవిత సారాన్ని రంగరించి రాసిన ఆత్మకథ ‘నా జీవన నౌక’ నుంచి గత కొన్ని నెలలుగా ఒక్కో అధ్యాయాన్ని ప్రచురిస్తూ వస్తున్నాం. ఆయన నుంచి నేటి యువత గ్రహించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మయ్య గురించి తెలుసుకోవడం ఈ తరానికి అవసరం కూడా. ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శప్రాయం. బ్రహ్మయ్య తన ‘నా జీవన నౌక’లో రాసిన ‘విద్యార్థి దశ’ను యథాతథంగా మీకోసం అందిస్తున్నాం.
నాకు ఏడవ సంవత్సరం వచ్చిన తర్వాత మా మేనమామ సుబ్బయ్య గారు శాస్త్రీయంగా ఘంటసాల వెంకటకృష్ణయ్య పంతులుగారి చేత విద్యాభ్యాసం చేయించారు. ఈయన తాలూకా బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థులకు భోజనాలు, ఉపాధ్యాయునికి నూతనవస్త్ర బహూకరణ జరిగింది. మా తల్లి నన్ను పెందలకాడనే లేపి, నిత్యకృత్యాలైన తర్వాత చల్ది అన్నం వెన్న, పెరుగుతో పెట్టి ప్రతి నిత్యం వేళకు పాఠశాలకు పంపేది. పిల్లలను సరైన వేళకు వచ్చేటట్లు చేయడానికి అప్పుడు స్కూలులో మొదట వచ్చిన వారికి ‘శ్రీ’ అని తర్వాత వచ్చిన వారికి ‘చుక్క’ అని తర్వాత క్రమానుగతంగా చిన్నదెబ్బలు అరచేతిమీద తగిలించేవారు. పిల్లలు పెందలకడనే లేచి వేళకు వచ్చుటకు పోటీని ఈ పద్ధతి పెంచేది. నేను శ్రీ, చుక్క సంపాదించుటకే ప్రయత్నించేవాడిని. శ్రద్ధగా చదివేవాడిని. ప్రతి క్లాసులో నేనే పెద్దను. మార్కులను బట్టి ఈ పెద్దరికం వచ్చేది.
శని, ఆదివారాలలో స్కూలు వుండేది కాదు. మా మేనమామ గారి దొడ్లో జామచెట్టు వుండేది. ఆ జామకాయల కోసం ఎడ్లు, గొడ్లతో కాలక్షేపం చేయడానికి నేను నాతోటి విద్యార్థులతో ఆ దొడ్డి వరకు వెళ్లడం చూసి, సుబ్బయ్యగారు దొడ్డివద్దకు రావడం అలవాటైతే వ్యవసాయం మీద, పశువుల మీద, మోజుపడి చదువులకు స్వస్తి చెప్పడం జరుగుతుందని తలంచి దొడ్డి వరకు రావద్దని, జామకాయలు వున్నప్పుడు తానే తెచ్చి పెట్టెదనని చెప్పారు. ఆయన మాట పాటించవలసిన శాసనం నాకు. అంత కచ్చితంగా చెప్పి పాటించేటట్లు చేసేవారు. ఎపుడూ కొట్టడం మాత్రం జరిగేది కాదు.
పది సంవత్సరాలకు నేను మూడవ క్లాసు చదువుతున్నాను. మా వూరిలో అనేక చెరువులున్నవి. పెద చెరువు ఆళ్ల వెంకమ్మ చెరువు. కొందరు పిల్లలతో స్నానానికి వెళ్లాను. ఒకరిని మించి ఒకరు కేరింతలు కొట్టుకుంటూ స్నానాలు చేస్తున్నాము. నేనొక లోతు గోతిలో పడి మునిగిపోయాను. రెండు గుక్కలు నీళ్లు కూడా త్రాగాను. ఇంక కొన్ని నిముషాలలో ప్రాణము పోయేది. ఆ చెరువుకు నీళ్లకు వచ్చిన ఒక పద్మశాలి ఆడపడుచు శ్రీమతి దేవిమాణిక్యం నా స్థితిని చూసి నా జట్టుపట్టి బయటకు లాగి నన్ను మా యింటికి తీసుకెళ్లి మా అమ్మకు అప్పగించింది. సంవత్సరమున్నర వయసులో విషగండం నుంచి, ఇప్పుడు జలగండం నుంచి బ్రతికి బయటపడ్డాను. ఆ పద్మశాలి యువతి ఆత్మకు నా ప్రణామాలు.
ప్రాథమిక పాఠశాల
వెంకట కృష్ణయ్య పంతులుగారు తాలూకా బోర్డు ఎలిమెంటరీ స్కూలులో ఏకోపాధ్యాయుడు. వారు తండ్రి రామబ్రహ్మంగారి వద్ద కట్టుదిట్టంగా చదువుకున్నవారు. ఒక గంట చెప్పినా గట్టిగా పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పకలరు. ఉపాధ్యాయ బాధ్యతలకు తోడుగా ఆయన బ్రాంచి పోస్టుమాస్టరు.
ఈ రెండు సంస్థల స్థాపనలోను అగ్రతాంబూలం వారిదే కూడా. పోస్టాఫీసు స్థాపనలో వానముల లక్ష్మీనారాయణగారు హెచ్చు కృషి చేశారు. మెరక వ్యవసాయం. ఎడ్లు, ఆవులు, పాడి పశువులు వీరి అజమాయిషీ చూసుకోక తప్పదుగదా!
పైగా గ్రామములో వీరిమీద లక్ష్యముతో ప్రామిసరీ నోట్లు దస్తావేసులూ వ్రాయించి కొంత డబ్బు ముట్టజెప్పాలనే ఆయన మిత్రుడు మా మేనమామ బోటివారు వూళ్లోవున్నారు. వీటన్నింటినీ సంబాళించుకుంటూ అష్ఠావధానం చేసేవారు. వీరు గైర్హాజరు సందర్భంలో చిన పేర్రాజుగారి కుమారుడు రామయ్య, సరసయ్యగార్లను క్లాసులు చూస్తూ ఉండవలసిందిగా ఆదేశించి వెళ్లేవారు. వారు పిల్లలు అల్లరి చేయకుండా చూస్తూ వారికి వచ్చినది బోధించారు.
అప్పుడు పిల్లలను క్రమశిక్షణగా వుంచడానికి బెత్తపు దెబ్బలు, తొడపాశాలు వీరు విరివిగా వుపయోగించేవారు. వీరు లేనపుడు వీరి తల్లి సీతమ్మగారే మమ్ములను అల్లరిచేయకుండా అదుపులో వుంచేది. ప్రతిక్లాసు పెద్ద మిగతా పిల్లలు చూచివ్రాత కాపీలు వగైరా వ్రాయించుతూ వుండేవారు. నువ్వ కాయకోత వగైరా వ్యవసాయపు ఒత్తిడి పనులలో పిల్ల వాళ్లు పాల్గొని పంతులుగారి ప్రశంసలనందుకునేవారు. మా మేనమామ గారి పట్ల గల భయంతో నాకట్టిపనులు వారు చెప్పకపోయినా నా అంతట నేనే స్వచ్ఛందంగా పాల్గొని మిగతా పిల్లలతో పోటీపడి పనిచేసేవాడిని. కొన్ని సందర్భాలలో అందరికంటే నాకే ప్రశంసలు వచ్చేవి కూడా.
పంతులుగారిపట్ల నాకు అమితభక్తి. మా కుటుంబ స్నేహాలు ఇప్పటికీ వర్ధిల్లుతునే ఉన్నవి. అప్పటి పల్లెటూళ్ల పాఠశాలలు భోగట్టా నిమిత్తం పై విషయం వ్రాశాను. ఇప్పటి బోర్డు ప్రాథమిక పాఠశాలలో కుర్చీలు, మేజాలు, బల్లలు, హెచ్చు మంది ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం పుస్తకాల మార్పిడి కొత్త కోర్సుల స్థాపన, నూతనమైన బోధనా పద్ధతులు వున్నప్పటికి కూడా, 70 సంవత్సరాల క్రిందట వీధిబళ్ల స్థాయిని అందుకోలేనందుకు విచారించక తప్పదు. అయితే, నేను గుంట ఓనమాలు దిద్దుడు రోజులకు, కోదండాలు వేయించి చింతబరికెలతో శిక్షణ ఇచ్చే రోజులకు వెళ్లమని చెప్పడం లేదు. పెద్ద బాలశిక్ష, ఎక్కాలు కంఠస్థం చేయించుటకు, అర్థం కాకపోయినా కృష్ణ, దాశరథి, సుమతి, ఆంధ్రనాయక శతకములు వల్లెవేయించుట వగైరా పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుననుట నిర్వివాదం.
1919లో ఎలకుర్రు ఆగ్రహారంలో దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు వారి తల్లిపేర స్థాపించిన శ్రీ శ్యామలా పాఠశాల వార్షికోత్సవ సందర్భంలో కీర్తిశేషులు ముట్నూరి కృష్ణారావుగారు చెప్పినట్లు ‘‘అమ్మ మొగుడు నాయన, అక్క మొగుడు బావ చదువులు నేటివి’’. బందరు నేషనల్ కాలేజీ స్థాపకులకు కీర్తిశేషులు కోపల్లె హనుమంతరావు పంతులుగారు ఎం.ఏ, బి.ఎల్. ఆ రోజుననే చెప్పినట్లు చిన్ననాడు చదువు భవిష్యత్తులో ఉపయోగపడేదిగా వుండాలి. వారు ఇలా చెప్పారు.
‘‘వయసు వచ్చిన తర్వాత బట్టీపట్టిన షేక్‌స్పియర్ నాటకాలలోని వేల పంక్తులు జ్ఞాపకం లేవు. చిన్ననాడు కంఠస్థం చేసిన కృష్ణ శతకము, దాశరథి శతకము, సుమతీ శతకము, వేమన శతకము పద్యాలు ధారాళంగా ఇప్పటికీ తప్పులేకుండా అప్పజెప్పగలను. చిన్ననాడు ఆ పద్యాల అర్థము సరిగా తెలియకపోయినా, పెద్దవారైన తర్వాత వాటి అర్థము నెమరు వేసుకొని జీవితమును ధన్యత గావించుకొనవచ్చు’’. ఈ భావాలు ఇప్పటి పరిపాలకులకు ఎప్పటికి తలకెక్కునో చూపుదూరాన కనబడడం లేదు. బ్రిటీషువారి హయాంలోని వరవడే ఇప్పటికీ కొనసాగుతున్నందుకు విచారించకతప్పదు. నియమనిబంధనలు వురిత్రాళ్లుగా కాక చేతుళ్లగా వుపయోగించే విచక్షణా జ్ఞానాన్ని వుపయోగించగల దక్షత, విజ్ఞానం మన పాలకులకు, ఉద్యోగులకు పెరగాలని కోరుకుందాం.
ఈ కృష్ణయ్య పంతులుగారినే ఆహ్వానించి సత్కరించి మా అబ్బాయి చిరంజీవి వీరరాఘవేంద్రరావుకు 1940లో వీరి చేతనే అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. వీరిది మా కుటుంబ విద్యాగురువుల కుటుంబంగా భావించుచున్నాను.
శ్రీ కృష్ణయ్య పంతులుగారిని ప్రధానోపాధ్యాయులను చేసి రెండవ ఉపాధ్యాయునిగా చిరువోలు రామశేషయ్య గారిని వేసిరి. ఆయన యువకుడు, పొరుగూరివాడు. ఇతర వ్యాపకాలు లేనివాడు. మాకు శ్రద్ధగానే చదువు చెప్పాడు. నేను ఇంగ్లీషు అక్షరాలు ఆయన వద్దనే మూడవ తరగతిలో ప్రారంభించాను. ఇంగ్లీషు పాఠం రాత్రిళ్లు మా ఇంటికి వచ్చి నాకు చెప్పేవారు. అందుకు మారుగా మా మేనమామగారు జీతం ముట్టజెప్పేవారు. తరువాత వారి స్థానే వచ్చిన దశరథరామయ్య పంతులుగారి సెలవు కాలంలో వెంకటరమణయ్య గారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. వెంకటరమణయ్యగారు మాకు చదువు సరిగా చెప్పుట లేదని, గ్రామ వ్యవహారాలు చూసుకుంటున్నారని పిల్లలంతా సంతకాలు చేసి ఒక కార్డు, కవరు వ్రాశాము. పై ఉద్యోగులు విచారణకు రానందుకు విచారించాం.
నేడు మూడవ తరగతి చదువుతూ ఉండగా వందేమాతరం ఉద్యమంలో శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆరు నెలలు ఖైదులో వుంచి విడుదల చేసినప్పుడు మా గ్రామంలోని సుజనరంజని నాటక కంపెనీవారు బిపిన్ చంద్రపాలుగారి ఫొటోను వూరేగించారు. ఆ వూరేగింపులో పాల్గొని వందేమాతరం నినాదాలు యిచ్చిన కుర్రవాళ్లలో నేను కూడా వున్నాను. ఆ వెంటనే కొన్ని రోజులకు స్కూళ్ల సూపర్ వైజర్ మా స్కూలు తనిఖీకి వచ్చారు. వారు రావడంతోటే ‘వందేమాతరం, మందేరాజ్యం’ అని నినాదం విద్యార్థులందరం ఇచ్చాం. సీమసున్నంతో ఆయన వచ్చేటప్పటికే బోర్డుమీద, గోడలమీద వ్రాసి వుంచాం. అందుకు ఆయన మా మేష్టరుగారి మీద మండిపడ్డారు. ఆయన వెళ్లిన తర్వాత మా మేష్టారు కృష్ణయ్య పంతులు రూళ్లకర్ర దెబ్బలు మేము వహించిన పాత్రకు అనుగుణంగా ముట్టజెప్పారు. నాకు బహుమానం ఘనంగానే ముట్టింది.
1910 ప్రాంతంలో గొర్తి నారాయణమూర్తిగారు ప్రధానోపాధ్యాయుడుగా వచ్చిన తరువాతనే ఘంటసాల స్కూలు చెప్పుకోదగిన ఉచ్ఛస్థితికి వచ్చింది. ఆయన ఊరంతా తిరిగి హెచ్చుమంది పిల్లలను చేర్చడం, ఉపాధ్యాయులను హెచ్చు చేయించడం, పిల్లలకు చక్కగా బోధించి, తోటి ఉపాధ్యాయులు బోధించేట్టు, ఎక్కువమంది ఆయా తరగతులలో వుత్తీర్ణులయ్యేటట్లు చూడడం జరిగింది. నేను ప్రైమరీ తరగతి ఈయన వద్దనే ఉత్తీర్ణుడయ్యాను. శ్రద్ధగానే చదివేవాడిని. క్లాసులో మొదటివాడిగా ఉండేవాడిని.
ప్రైవేటు పాఠశాల
కీర్తిశేషులు వారణాసి చిన అచ్చన్న పంతులు గారిది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా అత్తిలి దగ్గర మొయ్యేరు. ఈయన మంచి లౌకికుడు. వ్యవహర్త కూడా. అన్ని విషయాలు చెప్పుటలో మంచి బోధనాశక్తి గలవారు. రాత్రింబవళ్లు విద్యార్థులు ఆయనతో వుండవలసిందే. చదువులకు తోడు భజనలు, ఆటలు, పాటలు సాగించేవారు. అందులో ఆయన కూడా పాల్గొనేవారు. మాచేత ఘంటసాల ప్రైవేటు స్టూడెంట్సు లైబ్రరీ అని పెట్టించి దానికి నన్నే కార్యదర్శిగా చేశారు. ఘంటసాల, ఘంటసాలపాలెం, దేవరకోట గ్రామాలలో ముష్టి ఎత్తించి కొన్ని పుస్తకాలు కొన్నారు. ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, దేశాభిమాని ఆంధ్రకేసరి, శశిరేఖ, గృహసుందరి వార్తాపత్రికలు తెప్పించి చదివించేవారు. వాగ్వర్థనీ సంఘాలలో మమ్ము మాట్లాడునట్టు చేశారు. గ్రామంలో బహిరంగ సభలు జరిపి విద్య, సంఘసంస్కరణ మొదలగు విషయాలను గురించి తాను ప్రసంగించి, మమ్ములను మాట్లాడుటకు ప్రోత్సహించే వారు. గ్రామంలోకి ఏ రెవిన్యూ ఇన్‌స్పెక్టరో వచ్చినపుడు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనన అధ్యక్షులుగా వుంచేవారు. ఈ మీటింగులకు ప్రజలు ఎక్కువగా రాకపోతే, తిరుపతి కవుల ‘అశ్వమేథయాగ’ నాటకమును మామూలు దుస్తులతోనే మాచేత ప్రదర్శింపజేసి, హెచ్చుమంది వచ్చుటకు ఆకర్షణను కలుగజేసేవారు. దానిలో నాది భీముని పాత్ర. నా జీవితరంగంలో కూడా నాది భీమునిపాత్ర అయింది.
ఈ పత్రికలతోపాటు, ఇతర పుస్తకాలు (General Books) చదవాలనే కోరికను, ప్రజాసేవ చేయాలనే వాంఛను, సంస్కరణాభిలాషను మాకు కలుగజేశారు.