రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామాలు, పట్టణాల్లో బావులు, చెరువులు, నదుల నీటిని తాగేవారు. కాలక్రమేణా పరిశ్రమలు పెరగడంతో నదులు కలుషితమయ్యాయి. చెరువులు, భూగర్భ జలాలు కూడా తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో క్రమంగా ప్రజలు శుద్ధి చేసిన తాగునీటిని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సాంకేతికత పెరిగి ఆర్వో నుంచి ఆల్కలైన్ వాటర్‌ను అందించే ప్యూరిఫైర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నా, వాటి సామర్థ్యంపై మాత్రం నమ్మకం అంతంతమాత్రమే. దీంతో ప్రజలకు అతి తక్కువ ధరలో, అత్యంత నాణ్యమైన ఆర్వో ప్యూరిఫైర్లను అందించేందుకు ముందుకొచ్చారు యలమంచిలి ప్రభు.
————
బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ప్రభు స్వస్థలం కృష్ణా జిల్లాలోని కనుమూరు. తండ్రి సత్యవరప్రసాద్, తల్లి అన్నపూర్ణ. చెల్లెలు శ్రీరత్నం ఉన్నారు. 2008లో బీఎస్సీ చదువుతుండగానే సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రభు తాపత్రయపడేవారు. ఒకరి వద్ద ఉద్యోగం చేయడం కంటే తానే కొందరికి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచన ఉండేది. అది కాస్తా తీవ్ర రూపం దాల్చడం, అదే సమయంలో వాటర్ ప్యూరిఫైర్లపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడం గుర్తించి గ్రామంలోనే ఆ దిశగా అడుగులు వేశారు. కోడూరుకు చెందిన స్నేహితుడు మన్నే హరీశ్‌తో కలిసి శ్రీ బాలాజీ ఆర్వో సేల్స్ అండ్ సర్వీసెస్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. అయితే, తొలుత అనుకున్నంతగా వ్యాపారం ముందుకు సాగలేదు. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా ముందుకుసాగారు. ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు పట్టుదలగా వ్యాపారాన్ని నిలబెట్టుకున్నారు.
2010లో హైదరాబాద్‌కు…
2009లో చదువు పూర్తయ్యాక వ్యాపారాన్ని హైదరాబాద్‌కు విస్తరించారు. మాదాపూర్‌లో కార్యాలయాన్ని తెరిచి ఆర్వో, ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ల సేల్స్ అండ్ సర్వీస్ మొదలుపెట్టారు. తొలుత సొంతంగానే మార్కెట్ చేసుకున్నారు. విద్యాసంస్థలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలలో ఆర్వో ప్యూరిఫైర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేవారు. అలా క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కంపెనీలు, విద్యా సంస్థలలో చాలా వరకు వీరు ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్లే ఉంటాయి. మినషరీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి సేల్స్ అండ్ సర్వీసు వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడని తత్వం, వినియోగదారులకు నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు. తొలుత ఆర్వోతో ప్రారంభమైన వీరి వ్యాపారం ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతతో ఆల్కలైన్ ప్యూరిఫైర్ల వరకు పెరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు
వ్యాపారమైతే ఉత్సాహంగా ప్రారంభించినప్పటికీ తొలుత వీరిని ఆర్థిక కష్టాల వేధించాయి. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందక కొన్ని ఆర్డర్లు చేజారిపోయాయని ప్రభు గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నామని, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదని ప్రభు చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు భోజనానికి కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. తమ వినియోగదారుల్లో ఎక్కువమంది విద్యాసంస్థలకు చెందిన వారే ఉన్నారని చెప్పారు.
దెబ్బతీసిన కరోనా
ప్రపంచం మొత్తాన్ని కకావికలు చేసి, ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన కరోనా మహమ్మారి ప్రభావం శ్రీ బాలాజీ ఆర్వో సేల్స్ అండ్ సర్వీసెస్‌పైనా పడింది. గత ఆరు నెలల్లో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయినప్పటికీ ఏమాత్రం కుంగిపోలేదని, పరిస్థితులు కొలిక్కి వచ్చిన తర్వాత అంతా సర్దుకుంటుందని భావించామని, అనుకున్నట్టే ఇప్పుడిప్పుడే వ్యాపారం మళ్లీ పుంజుకుంటోందని ప్రభు వివరించారు.
దిగ్గజ కంపెనీలతో పోటీ
వాటర్ ప్యూరిఫైర్ల రంగంలో ఇప్పటికే దిగ్గజ కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలుగుతున్నామంటే.. దానికి కారణం మేమిచ్చే సర్వీసుతోపాటు నాణ్యత ప్రధాన కారణమని, అలాగే మార్కెట్ ధర కంటే తక్కువకే ప్యూరిఫైర్లు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కారణంగానే తమవైపు ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారని చెప్పారు. వినియోగారులతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటామని, ఆ రిలేషన్ ఒక్కసారికే ముగిసిపోదన్నారు.
అసలేంటీ ఆర్వో, ఆల్కలైన్..
ఆర్వో.. రివర్స్ ఓస్మోసిస్.. అనేది నీటి శుద్ధీకరణలో ఓ ప్రక్రియ. ఈ విధానం ద్వారా నీటిలోని అయాన్లు, అవాంఛిత అణువులు, పెద్ద కణాలను తొలగించి నీటిని పూర్తిగా శుద్ధి చేసి ఫ్రీరాడికల్స్ రహితంగా మారుస్తుంది. సహజసిద్ధంగా నీరు ఎలా అయితే శుద్ధి అవుతుందో, ఇందులోనూ అలాగే అవుతుంది కాబట్టి ఆర్వో ప్యూరిఫైర్ వాటర్ తాగడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయని, పలు సమస్యలు తలెత్తుతాయంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని ప్రభు కొట్టిపడేశారు.
ఇక, ఇప్పుడిప్పుడే ప్రజలు ఆల్కలైన్ వాటర్ వైపు చూస్తున్నారు. దీంతో ఆల్కలైన్ వాటర్ అయోనైజర్ల ఏర్పాటుకు కర్మాగారాలు, సంస్థలు, అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. ఆల్కలైన్ ద్వారా హైడ్రోజన్ ఆధారిత తాగునీటిని అందించవచ్చు. ఇందులో వాడే ఫిల్టర్లు చాలా ఖరీదైనవి ఉంటాయి. వీటిలో ప్లాటినం కోటింగ్‌తో కూడిన టైటానియం ప్లేట్లు ఉపయోగిస్తారు. సాధారణంగా నాలుగు లీటర్ల సాధారణ నీటిని కనుక మనం తీసుకుంటే శరీరం శోషించుకునేది మాత్రం రెండు లీటర్లు మాత్రమేనని, అదే ఆల్కలైన్ వాటర్ అయితే మూడు లీటర్ల వరకు శరీరం శోషించుకుంటుందని ప్రభు వివరించారు. ఆల్కలైన్ నీళ్లు తాగడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని, ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
జీరో వేస్టీజీ లక్ష్యంగా..
నిజానికి నీటిని శుద్ధి చేసే క్రమంలో పెద్ద మొత్తంలో నీళ్లు వృథా అవుతాయి. ఈ వృథాను తగ్గించడమే తమ లక్ష్యమని ప్రభు, హరీశ్‌లు చెప్పుకొచ్చారు. జీరో వేస్టీజీతో నీటిని శుద్ధిచేసే మెకానిజం వైపు దృష్టి సారించినట్టు చెప్పారు. మున్ముందు వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలపైనే తమ దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పారు. ప్రస్తుతం తాము సాధించినది సగం విజయమేనని, మిగతా 50 శాతాన్ని త్వరలోనే చేరుకుంటామన్న నమ్మకం తమకుందని పేర్కొన్నారు. వారి ఆశయం నెరవేరాలని కోరుకుందాం.
మిగతా వారికి, మాకు అదే తేడా
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటర్ ప్యూరిఫైర్ కంపెనీలకు మాకు చాలా తేడా ఉంది. వారు ఆర్డర్ రాగానే అక్కడి నీటిని ఏమాత్రం పరిశీలించకుండానే ప్లాంట్‌ను ఏర్పాటు చేసి వెళ్లిపోతారు. కానీ మేం అలా కాదు. నీటిలో టీడీఎస్ (టోటల్ డిజాల్వడ్ సాలిడ్స్)ను పరిశీలించి అందుకు అనుగుణంగా మిషనరీని ఏర్పాటు చేస్తాం. టీడీఎస్‌లో అకర్బన లవణాలైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, బైకార్బొనేట్లు, క్లోరైడ్లు, సల్ఫేట్లతోపాటు కొద్దిమొత్తంలో సేంద్రియ పదార్థాలు కలిసిపోయి ఉంటాయి. లీటరు నీటిలో 300-600 మధ్య టీడీఎస్ ఉంటే చాలా మంచిది. ఇది 900-1200 మధ్య ఉంటే తాగడానికి ఆ నీరు పనికి రాదని అర్థం. కాబట్టి మేం టీడీఎస్‌ను పరిశీలించిన తర్వాతే ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. దానికి తగ్గట్టుగా మెంబ్రేన్, ఫిల్టర్లను ఏర్పాటు చేస్తాం. నా మిత్రుడు హరీశ్‌తో కలిసి ఈ రంగంలోకి దిగిన తర్వాత చిన్నచిన్న కష్టాలు మినహా పెద్దగా సమస్యలు ఎదుర్కొన్నది లేదు. మా ఇద్దరి స్నేహం గత 18 సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతోంది. మా మధ్య ఎన్నడూ, ఏ విషయంలోనూ భేదాభిప్రాయాలు రాలేదు. ఇకముందు రావు కూడా.
– యలమంచిలి ప్రభు
93973 14369