మా అమ్మాయిలాంటి ఎఫిషియంట్ మనిషి చాలా అరుదని, ఆమెకు రెండో పెళ్లి చెయ్యాలని ఓ కంపెనీ సీఈవో చెప్పారు. ఆమె తన సబ్జెక్టులో మాస్టరని, ఆరు నెలల్లోనే ఆమె జీతం 60 శాతం పెరిగిందన్నారు. ఇది ఆ అబ్బాయి ఈర్ష్యకు కారణమైంది. అదే జీతం, అదే ఉద్యోగం. మనసులు కలవడం లేదు. ఆలోచిస్తే అనిపించింది గతంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒకే చాలెంజ్ ఉండేది. మెట్టినింటికి వెళ్లాక ఇరు కుటుంబాలకు మంచి పేరు తెచ్చిపెట్టడం. ఇందుకోసం అమ్మాయికి అన్ని విషయాలు నేర్పేవారు.
వినయ విధేయతలు, వంటావార్పు, పెళ్లై వెళ్లాక ఏవైనా ఇబ్బందులొస్తే మెట్టినింటి వారికి నొప్పించకుండా మసలుకోవడం, ఇంటా బయట ఎలా వ్యవహరించాలి? ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి? ఉన్నంతలో కాపురాన్ని గుట్టుగా ఎలా ఈదుకు రావాలి వంటి విషయాలను నేర్పి మరీ పెళ్లి చేసి పంపేవారు. అది కూడా ఇరవయ్యేళ్లలోపే. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా చదువు, ఉద్యోగాల్లో రాణించనిదే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడడం లేదు. ఇంట్లో అన్నింటికీ పనివాళ్లు. పిల్లలు తమ కెరియర్లో ఎంత ఎత్తుకు ఎదగగలరో అంత వరకు తల్లిదండ్రులు తమ శాయశక్తులా సాయపడేవారు.
పెళ్లి చేసి కాపురానికి, మంచి సంసారానికి కావాల్సిన మంచి విషయాలను నేర్పే సమయం కానీ, ఓర్పు కానీ ఇప్పటి పెద్దల్లో లేవు. అంత తీరికా లేదు. తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న వారి కాంక్ష ముమ్మాటికీ సబబే. కానీ, చివరికి మిగిలేది కుటుంబమే. ఉద్యోగం, వ్యాపారం కోసం జీవితం మొత్తాన్ని ధారపోసి కుటుంబం అనే వృక్షాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎండిపోతుంది. జీవితం అంతే. ఆనందాన్ని వృత్తిలో మాత్రమే వెతుక్కునే పరిస్థితి. విపరీతమైన ఒత్తిడి. ఆ ఒత్తిడి వృత్తి నుంచి నిజ సంసార జీవితంలోకి వద్దన్నా చొచ్చుకుపోయి కుటుంబంలో కొద్దిపాటి ఆనందాన్ని హరించేస్తుంది.
అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ వృత్తిలో రాణించాలి. అలానే కుటుంబం కూడా చాలా ముఖ్యం. ఆనందాన్ని అందిస్తేనే కడదాకా ఆ సంసారం గట్టిగా, మన్నికగా సంతోషంగా సాగదు. కాబట్టి పెద్దలు తమ పిల్లలకు తమ కాళ్లపై తాము నిలబడడానికి ఎంతగా ప్రోత్సహించి మెట్టుపై మెట్టు ఎక్కడానికి వెనక ఉండి ఎలా నడిపిస్తున్నారో, అలానే సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. వివాహ ఆవశ్యకతతో పాటు దాని అవసరం కూడా చెప్పి వృత్తిని, సంసారాన్ని రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్లాలన్న దానిపై అతి జాగ్రత్తగా అవగాహన కల్పించాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ఎంతోమంది చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు.
ఒకవైపు తమ వృత్తి, వ్యాపకాలు, వంటవార్పు చూసుకోవడంతోపాటు తమ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే, మగ పిల్లలు కూడా తమకు చేతనైనంత వరకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ ముచ్చటగా, సరదాగా తమ సంసారాన్ని ముందుకి నడిపిస్తున్నారు. కుటుంబం అనేది ఇద్దరి బాధ్యత. నేనే ఎక్కువ సంపాదిస్తున్నానన్న ఆలోచన ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా అది ముప్పే. కాబట్టి, ఎక్కువ తక్కువలను పక్కనపెట్టి ఇద్దరి సంపాదనతో వచ్చే దానితో చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అతిగా ఆశపడకుండా ఉన్న దానితో, వచ్చిన దానితో సంతృప్తి పడడం అలవాటు చేసుకుంటే ఆ ఇంటిని మించిన ఆనందం ఇంకేముంటుంది!