నవీన కాలమ్

nv

ఎప్పుడూ పెళ్ళిళ్ళు పేరంటాలు వాటికి ముందు వెనుక విషయాలు తప్ప వేరొకటి వ్రాయటానికి నా అనుభవాలు కేవలం వాటి చుట్టూనే ఉంటుంటాయి. కానీ ఇప్పుడు తమ
వాళ్ళు తమ కళ్ళముందే ఇలా ఆసుపత్రికని వెళ్ళి తిరిగిరాని లోకానికి వెళ్ళే వారి గురించే వినవలసి వస్తోంది. ఎటు విన్నా అవే మాటలు. ఫోన్‌ చేస్తే అవే సంగతలు. అందరూ ఇంట్లో బాగున్నారా అని ఒకప్పుడు మంచితనంతో మాటవరసకి పలకరించేవాళ్ళు. కానీ, ఇప్పుడు ఏమి వినవలసి వస్తుందోనన్న భయంతో పలకరించవలసి వస్తోంది. ఎటుచూసినా భయం. ప్రాణభయం సంపాదించిన డబ్బంతా ఖర్చుపెట్టినా దక్కని ప్రాణాలు. చనిపోయిన వారికి కనీసం చివరి లాంఛనాలు కూడా జరిపించలేని పరిస్థితి. భర్త చనిపోయిన విషయం భార్యకి, భార్య చనిపోయిన విషయం భర్తకీ తెలియ చెప్పలేని విషమ పరిస్థితి. చిన్న చిన్న పిల్లలున్న ఇంటిలోనూ ఇంటి పెద్దను కోల్పోయిన విషాద గాథలు. ఇదంతా మీకు తెలియదని చెప్పటం లేదు. చెప్పాలనుకునే దేమిటంటే ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా సాయపడాల్సి వస్తే దయచేసి చేయి అందించండి. మీకు తెలిసిన డాక్టర్లకు రెకమెండ్‌ చెయ్యటం. ఎక్కడైనా వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌ సదుపాయం కల ఆసుపత్రులలో మీ మాట మీద సాయం అందించేవారు ఉంటే సాయపడండి. అది కేవలం మీకు తెలిసినవారే కావలసిన అవసరం లేదు. ఇంటిలోని పెద్దవారు క్వారంటైన్‌ లేదా ఆసుపత్రిలో ఉండవలసి వస్తే వారికి కాని వారి పిల్లలకు ఆనీ భోజనం సాయం చెయ్యండి. భయపడి దూరంగా వెళ్ళకండి. నాకు సొంతవారు కాదు నాకెందుకని వెనుదిరగకండి. ఇప్పుడు కావలసింది మానసిక భద్రత. మహమ్మారి బారిన పడినవారికి ఏమీ కాదన్న దైర్యాన్ని ఇస్తూ ఉండండి. కోలుకుని చక్కగా తిరుగుతున్న వారి ఉదాహరణలు చెప్పండి. మంచి విషయాలు పంచుకోండి. ఇంకెంత ఇంకో పదిరోజుల్లో మామూలైపోతారన్న మనో నిబ్బరాన్ని పంచండి. వేరొక ఇంటిలో మనవల్ల ఒక మనిషి బ్రతికినా ఇలాంటి కష్టకాలంలో మనవల్ల వారు ఏ విదమైన ఉపశమనాన్ని పొందినా అది మన జీవితంతం ఒక గొప్ప మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే మనకెందుకులే అని మనం మన స్వార్థం మాత్రమే చూసుకుంటే రేపు మనకా పరిస్థితి రాకూడనే రాకూడదు. కానీ వస్తే అప్పుడు మనలా ఆలోచించే వ్యక్తులు తారసపడితే తప్ప తెలియదు.
చిన్న ఉదాహరణ నా స్నేహితురాలి భర్త వ్యాపారంలో భాగస్వామి దగ్గర చుట్టాలకి ఆక్సిజన్‌ పడిపోతే నాలాంటి పదిమంది తలో పక్క ఫోన్‌లు చేసి అటూఇటూ తిరిగితే ఎవరో ముక్కూమొహం తెలియన వ్యక్తి దుబాయి నుంచి రెకమెండ్‌ చేస్తే వెంటిలేటర్‌ ఉన్న ఆసుపత్రిలో బెడ్‌ దొరికింది. ఆక్జిన్‌ ఉన్న అంబులెన్స్‌ దొరకలేదు. బండి తీసుకుని పక్కనున్న ఆసుపత్రుల బయట ఏదన్నా అంబులెన్స్‌ దొరుకుతుందేమోనని వెళ్లితే ఒక్కచోటా దొరకలేదు. ఆసుపత్రి పక్కనున్న రోడ్డుమీద పండ్లు అమ్ముకునే అతను కొందరికి ఫోన్స్‌ చేసి అంబులెన్స్‌ ఏర్పాటు చేశాడు. మేమింత పోరాడిన ఆ మనిషిని కాపాడలేకపోయాం. ఆసుపత్రి వెళ్ళేలోపే ప్రాణం పోయింది. రోడ్డుమీద పండ్లు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ చావుబుతుకుల మధ్య కొట్టాడిన వ్యక్తికి కులం తెలియదు, ఆర్థిక స్థోమతతో సంబంధమే లేదు. ఇద్దరికీ పరిచయం లేదు మనుషుల మధ్య మానవత్వం అనే ఒక్క బంధం తప్ప ఏ రక్త సంబంధమూ లేదు. అందుకే చొరవ తీసుకుని చెబుతున్నాను. నిస్వార్థంగా ఈ మహమ్మారిమీద మనందరం కలిసి పోరాడి జయిద్దాం. మానవత్వం అన్న కులం ఒక్కటేనన్న సిద్ధాంతాన్ని నమ్మి నడుచుకుందాం.

Share: