పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చుక్కాని కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం.
—————-
1921లో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సంఘ ఆదేశానుసారం కోటి రూపాయల నిధి వసూలు సందర్భమున ఇరవై లక్షల రాట్నాలు, కోటిమంది సభ్యులను చేర్పించుటలో రాష్ట్ర కాంగ్రెసు వారు తూర్పు కృష్ణా కోటాకు నిర్ణయించిన దానికంటే హెచ్చుగా పట్టాభిగారి నాయకత్వం కింద మేమంతా కలిసి పనిచేశాము.
తిలక్ స్వరాజ్య నిధికిగాని, గాంధీ పూజానిధికి కాని, ఖద్దరునిధికి గాని విరాళాలకు వెళ్లేటప్పుడు సాధారణంగా పట్టాభి, ముట్నూరి, చెరుకువాడలతో నేనుండేవాడిని. డబ్బు రాబట్టుటలో పట్టాభిగారు మహా ప్రజ్ఞాధురీణులు, మేము నామకః పక్కనుండడమే. సంభాషణ అంతా వారే సాగించేవారు. ఒక రోజున ఒక చోటుకు వెళ్లినప్పుడు ఆ గృహస్తుని చాలా పొగిడారు. ఆయన తండ్రి కట్టించిన మేడల కంటే ఈయన కట్టించిన డాబా ఉన్నతంగా ఉన్నందుకు మిక్కిలిగా ప్రశంసించారు. ఈ డాబా తనాబీపైన పద్మాన్ని వర్ణించి నీది కళా హృదయం, నీవు కళాపోషకుడవని ఆయనను ప్రశంసించారు. తరువాత రూ. 116లు చందా కోరారు. ఆయన తీసుకురావడానికి లోనికి వెళ్లినప్పుడు ‘‘కృష్ణారావు! ఇదిగో నేనీ పద్మాన్ని వర్ణించినప్పుడు నీవు లోలోన నవ్వుకుంటూ ఉంటావు. ఈ పట్టాభికి కళను గురించి ఏమి తెలుసు అని. నా వర్ణన అంతా ఆ పద్మంలోని కళను తెలుసుకుని కాదు, ఆయన ఇవ్వవలసిన రూ. 116ల కట్నం కోసం’’. దానికి సమాధానం మౌనముద్రాలంకారులగు కృష్ణారావుగారి ఒక చిరునవ్వు.
తూర్పు కృష్ణా జిల్లా రాజకీయాలు పట్టాభిగారి నాయకత్వాన జరిగినవి. పట్టాభిగారికి కృష్ణారావు సలహా సంప్రతింపులు పూర్తిగా వుంటూ వుండేవి. నేను ఏదైనా పట్టాభిగారి అభిప్రాయం కోరినప్పుడు ఆయన అభిప్రాయం చెప్పి ‘‘కృష్ణారావు గారితో కూడా సంప్రతించండి’’ అనేవారు. ‘‘కృష్ణారావుగారు మీరు చెప్పిందానికి భిన్నంగా చెబితే తిరిగి మీ వద్దకు రమ్మంటారా?’’ అని ప్రశ్నిస్తే ‘‘అబ్బే ఎందుకు? కృష్ణారావు మాటే ఫైనల్’’ అనేవారు. ఆ రోజుల్లో కాంగ్రెసు రాజకీయాల్లో యువకులను పైకి తీసుకురావడానికి వారుభయులు ప్రోత్సహించి, ప్రతి చిన్న విషయంలో సలహా సంప్రతింపులిచ్చి తీర్చిదిద్దేవారు.
1919లో పంజాబు వధలు జరిగినపుడు కృష్ణారావుగారు గ్రామాల వెంట కూడా పయనించి బ్రిటిష్‌వారి పైశాచికత్వమును గురించి పిడుగులు పడేటట్లు ఉపన్యసించేవారు. ప్రజలను ఉద్రేక ఉత్సాహాలతో రణరంగానికి దూకేటంత ధీరులుగా చేసేవారు. వారి ఉపన్యాసం అచ్చంగా కృష్ణాపత్రిక సంపాదకీయంలాగానే ఉండేది. ఆయనతో పల్లెటూళ్లలో పర్యటించే అవకాశం చెరుకువాడ, బోడి నారాయణరావుగార్లతోపాటు నాకున్నూ కలిగినది.
అందరిలోకి నేను చిన్నవాడను. నాకు 22 సంవత్సరాలు. ఆ సమావేశాలకు నన్ను అధ్యక్షునిగా వుంచి నా చేత మాట్లాడించి తరువాత ఉపన్యాసాలు వారు సాగించేవారు.
1930 తరువాత శ్రీ ముట్నూరివారు మౌనముద్రాలంకారులయ్యారు. కారణం జన సమాన్యమునకు అర్థమయ్యే సులభమైన వాడక భాషలో మాట్లాడలేను అని వారు అనుకోవడమే.
1920-21లో ముట్నూరి కృష్ణారావుగారు జిల్లా కాంగ్రెసు సంఘమునకు ప్రెసిడెంటు, పట్టాభిగారు ప్రధాన కార్యదర్శి; నేను, మరికొందరు కార్యసంఘ సభ్యులం. మరు సంవత్సరం నేను ప్రెసిడెంటుగాను, పట్టాభిగారు ప్రధాన కార్యదర్శిగాను వుండడం జరిగింది.
శ్రీ ముట్నూరి కృష్ణారావు పెట్టిన వరవడినే తూర్పు కృష్ణాలో ప్రతి సంవత్సరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారడం, పని ఉత్సహకరంగా ఉంటుందని భావించి, అట్లుగా ఆచరణలో పెట్టడం జరిగింది. నా తర్వాత కానూరు చిన వెంకట దాసయ్యగారు, ఆయన తర్వాత కొల్లిపర సూరయ్యగారు, తర్వాత ఆత్మకూరి నాగేశ్వరరావుగారు అధ్యక్షులుగా వున్నారు. సాధారణంగా ఈ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా కొడాలి ఆంజనేయులుగారు నా వంటి యువకుల అభిప్రాయం తీసుకుని ముట్నూరి కృష్ణారావుగారితో సంప్రతించి పట్టాభిగారే నిర్ణయించారు.
పన్నుల నిరాకరణోద్యమం
1924లో గుంటూరు జిల్లా పెదనందిపాడు ఫిర్కాలో పన్నుల నిరాకరణోద్యమం ఆంధ్రదేశ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం తరపున కొండ వెంకటప్పయ్య పంతులు గారు ప్రెసిడెంటుగాను, గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ప్రధాన కార్యదర్శిగాను గుజరాత్‌లోని బార్డోలికి ముందుగానే జయప్రదంగా నిర్వహించ ప్రతినపట్టి సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా నాయకత్వం వహించినది పర్వతనేని వీరయ్య చౌదరిగారు. పల్నాడు అటవీ సత్యాగ్రహం వగైరా ఉన్నవ లక్ష్మీనారాయణగారి ఆధ్వర్యం క్రింద జయప్రదంగా నిర్వహణ సాగుతున్న రోజలవి. ఆంధ్ర జిల్లాలన్నింటిలో గుంటూరు ప్రధాన స్థానం వహించి ఇతర రాష్ట్రాల ప్రశంసలనందుకున్నది. పట్టాభిగారి నాయకత్వం కింద తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెసు తిరిగి ఆదేశం ఇచ్చే వరకు పన్నులు ఇవ్వవద్దని మాత్రమే తీర్మానం చేసి అందుకు ప్రభోదించడం జరిగింది. అట్లుగా మా నాలుగు తాలూకాలలో పన్నుల చెల్లింపు తాత్కాలికంగా ఆపడం అయినది. గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్ నాయకత్వాన బోర్డోలీ పన్నుల నిరాకరణ జయప్రదం అయ్యే వరకు హిందూ దేశంలో మరొకచోట పన్నుల నిరాకరణోద్యమం ఆంధ్ర జిల్లాలోని పెద్దల అభిరుచి, ఉత్సాహానికి వ్యతిరేకంగా ఆపడం జరిగింది.
తూర్పు కృష్ణా జిల్లాలో కల్లు దుకాణాల పికెటింగులు, ఖద్దరు ఉద్యమం, అస్పృశ్యతా నిర్మూలనోద్యమం పట్టాభి, ముట్నూరి కృష్ణారావుగార్ల నాయకత్వం కింద జయప్రదంగా నిర్వహించడం జరిగింది. 1926లో తిరిగి నేను జిల్లా కాంగ్రెసు కమిటీ ప్రెసిడెంటుగా ఎన్నికైనాను. కొడాలి ఆంజనేయులుగారు ప్రధాన కార్యదర్శిగాను, బొబ్బా వెంకటశేషయ్యగారు (కౌతారం దేశాభిమాని అస్వర్థ నామధేయుడు) సహాయ కార్యదర్శిగా ఉన్నారు. మేము ముగ్గురము ఆత్మయంగా కలిసి, మెలసి సమర్థవంతంగా పెద్దల ఆశీర్వచనాలు అందుకునే తీరున జిల్లాలో కాంగ్రెసు కార్యక్రమ నిర్వహణ సాగించాము. ఆంజనేయులుగారు సునిశిత మేధావి. పరమ పూజ్యులు. జగత్ర్పసిద్ధులగు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారి శిష్యుడు. విద్యార్థిగా వుండగానే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారితో కలిసి కవిత్వం చెప్పడం; వారిరువురు సత్యాంజనేయ కవులుగా ప్రసిద్ధిగాంచడం జరిగింది. అవనిగడ్డ సబ్ మేజిస్ట్రేట్ కోర్టులో రెండవ గుమాస్తాగా ఉండిన ఆంజనేయులుగారు 1920లోనే రాజీనామా ఇచ్చి రాజకీయ రంగంలో ప్రవేశించారు. వారి స్వగ్రామం మాకు మూడు మైళ్లలోని కొడాలి. ఆ గ్రామ కరణం సంపన్న గృహస్థులు చలమయ్యగారి కుమారుడే వీరు. ఆంజనేయులుగారు చాలా స్వతంత్రుడు, త్యాగధనుడు. ఆనాడు కాంగ్రెసు ప్రచారంలో మేమంతా కలిసి ప్రచారం చేస్తుండేవారం. ఆంజనేయులు గారి సహకార సలహా సంప్రదింపులు, రాజకీయాల్లో చొరవగా నేను ముందడుగు వేయడానికి నాకెక్కువ తోడ్పడినవి. ఆయన ఘంటాసాల నా కొరకు వచ్చినప్పుడు ‘‘ఆంజనేయులుగారు! మా అబ్బాయి కొరకు వచ్చారు. సరేకాని, కాస్త భోంచేసి వెళ్లండి’’ అనేది మా అమ్మగారు. మేము ఇద్దరం ఖద్దరు వస్త్రధారణ ఒకే రోజున మా ఇంట్లోనే చేశాం. ఆ నాటి నుంచి నేటి వరకు ఆప్యాయతతో మా మిత్రత్వం సాగుతూ ఉంది. మధ్య కొన్ని సంవత్సరాలు మేము ఒకరికొకరం దూరమై ఒకే దృష్టితో సమస్యలను చూచుకోలేకపోయినప్పటికీ, కలిసినపుడు కొన్ని సమస్యలను గురించి వాద ప్రతివాదనలను చేసుకుని చిర్రుబస్సు లాడుకున్నప్పటికీ ఇతరుల వద్ద మా వొండొరులను గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు మేము గౌరవ పురస్పరంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మా ఆప్యాయతకు భంగం లేకుండా వ్యవహరించుకొనగలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను.
కౌతరంలో శ్రీ చెరుకువాడ వెంకట నరసింహం పంతులుగారు ఉపాధ్యాయులుగా వున్న రోజుల్లో దేశాభిమాని అనే పేరు వెంకట శేయ్యగారికి పెట్టారు. ఆయనెంత భారీ మనిషో అంత ఔదార్యం, దయ, ప్రేమగల వ్యక్తి. జీవితాంతం వరకు ఆయన దేశభక్తి దినదిన ప్రవర్థమానమై, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండి ఆయన కీర్తి పొందాడు. ఆయన అండ దండలు నాకు అమూల్యమైనవిగా ఉండేవి.
అంతరాత్మ ప్రస్తావన
1920లో శాసనసభలను బహిష్కరించవలెనని, 1923లో కాంగ్రెసువారు ఇష్టం వున్న వారు ఓటు చేయవచ్చునన్నారు. 1926లో దేశబంధు దాసు, మోతీలాల్ నెహ్రూగార్ల నాయకత్వాన ప్రతిష్ఠంభనను కలిగించడానికి, శాసనసభలలో ప్రవేశించడానికి ఏర్పడిన స్వరాజ్య పార్టీ తరపున నిలిచిన అభ్యర్థులకు ఓట్లనివ్వవలసిందిగా కాంగ్రెసు ఆదేశించింది. ఇలా ఓట్లనివ్వడానికి అంతరాత్మకు విరుద్ధంగా భావించే ‘‘మార్పు కాదనేవారు’’ (No Changes) వర్గం వారు ఇవ్వకుండా వుండవచ్చుననే నిర్ణయం జరిగింది. అపుడు మా గురువర్యులు శ్రీ యుతులు ముట్నూరి, భోగరాజు, చెరుకువాడ త్రయం ‘‘No Changes’’గానే ఉన్నారు. యవకులగు మేము కాంగ్రెసు ఆదేశానుసారం అప్పటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘ అధ్యక్షులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ప్రధాన కార్యదర్శి మహర్షి బులుసు సాంబమూర్తి గార్ల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రంలోని ఎన్నికల సంరంభంలో పాల్గొనడానికి నిశ్చయించుకున్నాం.
వారిరువురు త్యాగమూర్తులు, మహాత్ముని దేశపితగా భావిస్తే; ఆంధ్రదేశం ఆంధ్రపితగా ప్రకాశం పంతులుగారిని గౌరవించి, పూజించి, ధన్యత చెందినది. వారికి తగిన ప్రధాన కార్యదర్శి సాంబమూర్తిగారు. వీరిద్దరిది రాజస ప్రవృత్తి. భారత కాలంలో ద్రోణాచార్యలు, కృపాచార్యుల శ్రేణికి చెందినవారు. ప్రకాశం పంతులుగారు స్వరాజ్య పార్టీ సభ్యులు. సాంబమూర్తిగారు స్వరాజ్య పార్టీలో సభ్యులు కాదు. కాని, మార్పు కావాలనేవారు (Pro Changer) సాంబమూర్తిగారి అడుగుజాడల్లో మేము Pro Changersగా ఉండడం ఉచితమని భావించాము. కృష్ణా జిల్లాకు రెండు స్థానాలు, పెద్దలు కాళేశ్వరరావుగారిని, నా సన్నిహిత మిత్రుడు, యువకుడు, త్యాగధనుడు, సౌమ్యుడు అయిన కొల్లిపర సూరయ్య గారిని అభ్యర్థులుగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం నిర్ణయించింది.
అప్పుడు జిల్లా బోర్డు అధ్యక్షులుగా వున్న మీర్జాపురం రాజాగారు జస్టిస్ పార్టీ అభ్యర్థి. కృష్ణా జిల్లాలో జిస్టిస్ పార్టీ ప్రముఖులు, హెచ్చు పలుకుబడిగల వ్యక్తి అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారితో సంప్రతించి సూరయ్యగారి పేరు ప్రకాశం పంతులుగారు నిర్ధారణ చేయడం జరిగింది. కానీ నామినేషన్ తేదీనాటికి గోపాలకృష్ణయ్యగారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ‘‘సూరయ్యగారిని వెయ్యమని మీరు మళ్లీ స్వయంగా దాఖలు చేయడం న్యాయమా’’ అని నేను వారిని ప్రశ్నించగా ‘‘మీర్జాపూర్ రాజావంటి బలవంతుని ఓడించడం సూరయ్య గారికి అలవిమాలిన పని, నేనయితే ఓడించగలను’’ అన్నారు.