ప్రైవేటీకరణ.. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. నష్టాల బూచి చూపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒక్కొక్కటిగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ వస్తోంది. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల అభీష్టాన్ని పక్కనపెట్టేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను వేదనకు గురిచేస్తున్నాయి. దేశాభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను హతాశులను చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వస్తోంది.
నిన్న కాక మొన్న ఎయిర్ ఇండియాను అమ్మకానికి పెట్టిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడింది. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమానికి 32 మంది బలిదానం తర్వాత ఫుల్‌స్టాప్ పడింది. 1971 జనవరి 20న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1990లో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించగా, రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంటుకు సొంతంగా గనులు లేకపోవడం శాపంగా మారింది. 26 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ పరిశ్రమలో 16 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 17,500మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమను ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు పంచేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే కాదు, యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోరాటాలే ఊపిరిగా పురుడుపోసుకున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ అన్యాయంపై నోరు మెదకపోవడం చూస్తుంటే ప్రతిపక్షాలు మోదీకి ఎంతగా భయపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక, అత్యధిక మంది ప్రజల మద్దతుతో ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్‌మోహన్ రెడ్డి కూడా తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రం ఎదుట సాష్టాంగపడడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
అన్నింటికంటే ముఖ్యవిషయం ఏపీ ప్రజల్లో ఐక్యత లేమి. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. పోరాడి సాధించుకున్న ఉక్కును అదే పోరాట స్ఫూర్తితో రక్షించుకోవాలన్న ధ్యాస రాష్ట్ర ప్రజల్లో లేశ మాత్రమైనా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయారు. అమరావతి కోసం ఉద్యమం జరుగుతుంటే అది మనకి సంబంధించిన విషయం కాదని పట్టించుకోవడం మానేశారు. పక్కనున్న కృష్ణా జిల్లా వాసులకు కూడా పట్టింపు లేకుండా పోయింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కాస్తో కూస్తో జరుగుతున్న నిరసనలతో తమకు పనేంటని మిగతా జిల్లా ప్రజలు ఆ ఊసుకూడా ఎత్తడం లేదు. ఫలితంగా ఉద్యమం గురించి ఎవరికీ పట్టింపులేకుండా పోయింది. రాజకీయ పార్టీలు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా అప్పుడప్పుడూ వచ్చి కాసేపు పలకరించి పోతున్నాయి. ప్రజల్లో నిర్లిప్తత ఇలానే కొనసాగితే రాష్ట్రం చిన్నచిన్న కమతాలుగా విడిపోయే పరిస్థితి దాపురిస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ‘‘పోరాడనిదే ఆంధ్రులకు ఏ హక్కులూ రావు’’ అన్న నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మాటల గురించి ఇప్పుడిక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగువాడి పౌరుషం, ధైర్యసాహసాలు ఏనాడో చచ్చుబడిపోయాయని చెప్పడానికి నేటి పరిస్థితులు ఉదాహరణగా మిగిలిపోతాయేమో.
దేశం ఇప్పుడు క్రమంగా ప్రైవేటుగా మారిపోతోంది. ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్‌ఎల్, రైల్వే, రక్షణ రంగ సంస్థలు ఇలా ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం అయిపోతున్నాయి. ఇలా అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రైవేటు పరం చేసే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. సంస్కరణలు ఆహ్వానించదగినవే అయినా అవి ప్రజల క్షేమం కోరేలా ఉండేలా కానీ, వారి జీవితాలను దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రైవేటీకరణ ప్రభుత్వానికి కనకవర్షం కురిపిస్తుందేమో కానీ, ప్రజల జేబులు గుళ్ల అవుతాయన్న సత్యం నెమ్మదిగా బోధపడుతుంది. ఈ నిజం ప్రభుత్వానికి వంత పాడుతున్న వారికీ తెలిసినా అధికార బలం ముందు నోళ్లు పెగల్చలేకపోతున్నారు.
ప్రభుత్వ లెక్కలు ఇవీ..
పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా ఏకంగా 1.70 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం కంటికి కనిపించిన వాటిని కార్పొరేట్ సంస్థలకు వీలైనంత త్వరగా కట్టబెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. దేశవ్యాప్తంగా 1.75లక్షల మంది ఉద్యోగులతో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ వివిధ కారణాలతో అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. దీని ప్రైవేటీకరణకు దారులు వెతికిన ప్రభుత్వం, మహారాజుగా కీర్తిగడించి, విమానయాన రంగంలో విశేష సేవలందించిన ఎయిర్ ఇండియాను విక్రయించడం ద్వారా రూ.15వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది.