నందమూరి నటసింహం బాలకృష్ణతో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను తాజాగా మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. అందరూ ‘బి.బి.-3’ అంటున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమానకు మొదట్లో ‘మోనార్క్’ అని, తరువాత ‘సూపర్ మేన్’ అని టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ అన్న పేరూ వినిపిస్తోంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం వచ్చింది. అది అంతగా ఆదరణ చూరగొనలేదు. అలాంటి టైటిల్ మనకెందుకు అని బాలయ్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏయన్నార్ సినిమాల టైటిల్స్ బాలకృష్ణకు అచ్చి రావని “ఆత్మబలం, దొంగరాముడు” సినిమాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఉంటుందో లేదో చెప్పలేం. ఈ తర్జన భర్జన ఇలా ఉండగానే ఇంకా టైలిల్ నిర్ణయించని ఈ సినిమాకు అప్పుడు బిజినెస్ జరిగిపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
పరాజయాలున్నా, భలే రేటన్నా!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఇంతకు ముందు రూపొందిన ‘సింహా’ చిత్రం 90 పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చివరి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక వారి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ ఏకంగా 1005 రోజులు ప్రదర్శితమై దక్షిణ భారతంలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా చరిత్ర కెక్కింది. ఇలా రెండు సినిమాలతోనూ బాలయ్యతో కలసి రికార్డులు సృష్టించిన బోయపాటి శ్రీను ఈ సారి ఏ తీరున అరిస్తారోనని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఇలా ఉన్నా, బాలయ్య గత చిత్రాలు మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. యన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ రెండూ పరాజయం పాలు కాగా, ఆ తరువాత వచ్చిన ‘రూలర్’ కూడా నిరాశ పరచింది. ఈ మూడు చిత్రాలు కలిపి రూ.50 కోట్ల షేర్ చూడలేకపోయాయి. ఇక బోయపాటి శ్రీను చిత్రాలు ‘జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అనగానే సినీజనాల్లో ఓ ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో బాలయ్య చిత్రాలలో కనీవినీ ఎరుగని బిజినెస్ ఈ సినిమాకు జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్ర, సీడెడ్, నైజామ్ ఏరియాలు కలిపి రూ.55 కోట్లు బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇతర రాష్ట్రాలలోనూ రూ.6 కోట్ల దాకా పలికింది. ఇక ఈ సినిమా విదేశాలలో రూ. 6 కోట్లు రాబట్టింది. ఇక శాటిలైట్ ద్వారా రూ.23 కోట్లు, హిందీ డబ్బింగ్ ద్వారా మరో ఇరవై కోట్లు వెరసి రూ.104 కోట్లు బిజినెస్ చేసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి ఇంకా టైటిల్ కూడా నిర్ణయించలేదే? అదెలా సాధ్యమైందని ట్రేడ్ పండిట్స్ బుర్రలు గోక్కుంటున్నారు. అయితే అందరి మాటా బాలయ్య, బోయపాటి కాంబోపై ఉన్న నమ్మకమే ఈ బిజినెస్ కు కారణం అని వినిపిస్తోంది.
సర్వత్రా ఆసక్తి!
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే కోవిడ్ కారణంగా అంతరాయం కలిగింది. ఆ సమయంలో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న విడుదల చేసిన ఓ టీజర్ అభిమానుల్లోనూ, ఇతరుల్లోనూ ప్రత్యేక ఆసక్తి కలిగించింది. ఆ టీజర్ లో బాలయ్య డైలాగ్స్, ప్రత్యర్థులను కంగు తినిపించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ టీజర్ చూసిన దగ్గర నుంచీ అందరిలోనూ ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ అధికారిగా, అఘోరాగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకు ముందు బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన రెండు చిత్రాలలోనూ హీరో ద్విపాత్రాభినయం చేయడం గమనార్హం! అదే తీరున ఈ సారి కూడా బాలయ్యతో డ్యుయల్ రోల్ చేయించారు బోయపాటి. పైగా బాలయ్యతో హ్యాట్రిక్ దిశగా బోయపాటి సాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి అనూహ ్యమైన క్రేజ్ లభించింది. ఈ కారణంగానే సినిమాకు కూడా మంచి ఊపు లభించిందని, తద్వారా రూ.104 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ టాక్!
మరి ఇంతలా క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం ఏ టైటిల్ తో జనం ముందు నిలుస్తుందో, ఏ తీరున థియేటర్లలో అలరిస్తుందో చూడాలన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి రెండు చిత్రాలతో బాలయ్యకు తరిగిపోని, చెరిగిపోని రికార్డులు సమకూర్చిన బోయపాటి శ్రీను ఈ సారి ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో చూడాలి.