బొమ్మ పడితే దిమ్మ తిరగాల్సిందే !

55

చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమారంగం పరిస్థితి కూడా చిత్రవిచిత్రంగానే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన కల్లోలం నుండి ఒక్కో రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే సినిమా రంగం మాత్రం ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా చిత్ర నిర్మాణం చేస్తోన్న దేశం మనది. మన దేశంలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు నిలచిపోయాయి. మే నెలలో కొంత తెరిపి కనిపించగానే మళ్ళీ షూటింగులు మొదలు పెట్టుకోవచ్చునని పలువురు సినీజనం భావించారు. ఆ తరువాతి నెలలో అంటే జూన్ లో మన తెలుగు చిత్రసీమ ప్రముఖులు సైతం షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలనూ అభ్యర్థించారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు అందుకు సరేనంటూ తలలు ఊపారు. అయినప్పటికీ షూటంగులు మొదలు పెట్టాలంటే భయం పట్టుకుంది. ఇక కొందరు సింగిల్ థియేటర్ల యజమానులు మే నెలలోనే తమకు అనుమతి ఇస్తే, కరోనా సమయంలో థియేటర్లను ఎలా రన్ చేసుకోవచ్చునో ప్రాక్టికల్స్ చేసుకోవడానికి వీలుంటుందనీ వక్కాణించారు. ఇప్పుడు అన్ లాక్ 3.0 సందర్భంగా ఆగస్టు నుండి థియేటర్లు తెరచుకోవచ్చునని కేంద్రం సెలవిచ్చింది. ఇక్కడే సింగిల్ థియేటర్ల యజమానులకు అసలు విషయం బోధపడింది. దాంతో ఈ వెసులుబాటు మల్టీప్లెక్సులకు సబబే కానీ, తమకు అనుకూలమైనది కాదంటూ రాగాలు తీయడం మొదలెట్టారు. ఉరకలు వేస్తూ షూటింగులు జరపాలని కోరుకున్నదీ సినీజనమే, థియేటర్లు తెరిస్తే కరోనాపై ప్రయోగాలు చేస్తూ సాగవచ్చునన్నదీ వారే. ఇప్పుడు రెండు అంశాల్లోనూ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించినా ఏమీ చేయలేని అయోమయ పరిస్థితిలో చిత్రసీమ చిక్కుకొని బిక్కు బిక్కు మంటోంది.

కరెంట్ కష్టాలు

అసలు విషయానికి వస్తే, థియేటర్లు నడచినా, నడవక పోయినా, మినిమమ్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టవలసి ఉంటుందని గతంలోనే సినిమా యాక్ట్ ప్రకారం ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని నిర్ణయించాయి. అయితే మార్చి ప్రథమార్ధం కాగానే థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికి దాదాపు నాలుగున్నర నెలలుగా మూతపడ్డ థియేటర్లకు కరెంట్ బిల్లు కట్టడానికి అసలు తమ వద్ద నగదు లేదని థియేటర్ల వారి ఆవేదన. దాంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలనూ మూతపడ్డ సమయానికి కరెంట్ బిల్లు తీసి వేయాలనీ సినీపెద్దలు అభ్యర్థించారు. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ సరేనన్నారు. అయితే అది ఆచరణలోకి రాలేదు. దాంతో ఇప్పుడు థియేటర్లను తెరచినా, విద్యుత్ శాఖవారు అన్ని రోజుల బిల్లు చెల్లించకుంటే కరెంట్ కట్ చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగిల్ థియేటర్ల వారి అనుమానం. మల్టీప్లెక్సులలో ఎన్ని థియేటర్లు ఉన్నా, దానిని ఒక సంస్థగానే భావించి విద్యుత్ ఛార్జీలు ఉంటాయి. అందువల్ల మల్టీప్లెక్సులు తెరచుకున్నా, వాటికి మిగతా షాపుల వల్ల ఆదాయం ఉంటుందని, సహజంగానే సరైన కలెకన్లు లేకపోతే, మల్టీప్లెక్సులలో కొన్ని థియేటర్లను బంద్ చేయడమూ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారికి కరెంట్ బిల్లు ఆదా అవుతూ వస్తుంది. అదే సింగిల్ థియేటర్ల వారు అయితే సినిమా ఆడినా, ఆడకున్నా మినిమమ్ కరెంట్ బిల్లు చెల్లించవలసిందే.

555

ఎన్నెన్నో ప్రశ్నలు

మొన్నటి దాకా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, థియేటర్లకు ఉండే క్రేజ్ తగ్గదని బీరాలు పలికిన వారు సైతం ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ థియేటర్లు తెరచినా, వాటిని నడపడానికి కావలసినన్ని సినిమాలు లేవు కదా అన్నది మొదటి అనుమానం. అన్ని థియేటర్లకు తగ్గ సినిమాలు లేకపోయినప్రుడు సినిమా హాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమే. ఒకవేళ థియేటర్లలో పాత సినిమాలు వేసుకుందామన్నా, అవన్నీ శాటిలైట్ ఛానెల్స్ లోనూ, ఇంటర్నెట్ లోనూ, ఇప్పుడు ఓటీటీల్లోనూ ఉన్నవే. కాబట్టి అదేపనిగా థఙయేటర్లకు వచ్చి చూసేవారు ఉండరు. ఒకవేళ కొత్త సినిమాలనే థియేటర్లలో వేసుకుందామని అనుకుంటే, కరోనా భయం వల్ల థియేటర్లకు వచ్చే వారు ఎందరు అన్నది మరో ప్రశ్న. ఇక కేంద్రం థియేటర్లను 25 శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుకోమనీ సలహా ఇచ్చింది. అది కూడా సీట్లకు సీట్లకు మధ్య దూరం పాటించమనీ సెలవిచ్చారు. నిజానికి బిగ్ స్క్రీన్ పై సినిమాలు చూడాలనుకునేవారు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో వెళ్తే, అక్కడ దూరదూరంగా కూర్చోవడం వల్ల మునుపటి థ్రిల్ ఉండదు. దాంతోనూ సినిమాలకు జనం వచ్చేందుకు అంతగా ఇష్టపడరు. పైగా లాక్ డౌన్ సమయంలో ఇంటిల్లి పాది కూర్చుని ఎంచక్కా పలు సినిమాలు వీక్షించిన వారికి, థియేటర్లలో దూరంగా కూర్చుని చూడటం అసలు నచ్చదు. అదీగాక ఓటీటీలకు, ఏటీటీలకు అలవాటు పడ్డ జనం,కరోనా భయంతో థియేటర్లకు వెళ్ళి మరీ సినిమా చూస్తారని లేదు. ఇన్ని అనుమానాలు ఓ వైపు తొలచివేస్తుంటే, కేవలం 25 శాతం టిక్కెట్లు మాత్రమే ఇస్తే, కరెంట్ ఖర్చులు కూడా వసూలు కావని ఆందోళన చెందుతున్నారు. పైగా ఇప్పుడు కరెంట్ ఖర్చుతో పాటు థియేటర్లను సీట్లను శానిటైజ్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఆట ఆటకూ శానిటైజ్ చేయిస్తే, 25 శాతం ఆక్యుపెన్సీతో వచ్చే ఆదాయం ఏ మాత్రం లాభదాయకం కాదని థియేటర్ల వారి ఆందోళన. దీని బదులు థియేటర్లను మూసి వేయడమే ఉత్తమమని పలువురి అభిప్రాయం.

రక్షించాల్సిన బాధత్య!

కరోనాకు పుట్టిల్లు అయిన చైనా కొన్నాళ్ళ క్రితం థియేటర్లను తెరచింది. అయితే కరోనా సోకడం వల్ల, థియేటర్లకు జనం అసలు రాకపోవడం వల్ల మూసివేయవలసి వచ్చింది. జనాభాలో చైనా తరువాత మనదేశానిదే అగ్రస్థానం. జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇప్పుడు సామాజిక వ్యాప్తి కూడా పెరుగుతోంది. కాబట్టి, చైనాలాగే మన దేశంలోనూ థియేటర్లు తెరచినా, లాభం లేదు. జపాన్, దుబాయ్, న్యూజిలాండ్ ల్లో మాత్రం థియేటర్లు తెరచుకున్నాయి. అక్కడ కరోనా కట్టడి కూడా బాగాన ఉంది. దాంతో థియేటర్లకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, అక్కడ జనాభాతో పోలిస్తే మన దేశం ఎన్నో రెట్లు అధికం. ఆ దేశాల్లోనూ ఇతర దేశాల్లో తయారయిన పాత చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అవి అయిపోతే, అక్కడ కూడా థియేటర్లకు తగిన ఫీడ్ ఉండదు. అప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనక తప్పదు. ఇక థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయి? ఈ ప్రశ్నకు కరోనాకు తగిన వ్యాక్సిన్ లభించిన తరువాతేననే సమాధానం సర్వత్రా వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే కరోనాకు తగిన వ్యాక్సిన్ వస్తుందని వినిపించడం ఆశాజనకమే. మరి అది వచ్చిన తరువాత కూడా ఎంతమంది జనం అలవాటు పడ్డ ఓటీటీ, ఏటీటీలను వదలి థియేటర్లకు వస్తారు? అదీగాక ఇప్పుడు సెల్ ఫోన్ లోనే ప్రొజెక్టర్ ఉన్న కెమెరాలు వస్తున్నాయి. వాటి వల్ల ఇంట్లోనే 16 ఎమ్ఎమ్ స్థాయి చిత్రాలను చూడవచ్చు. అలాంటప్పుడు పైరసీని ఆశ్రయించి, ఆ కాపీలనే సెల్ ఫోన్ ప్రొజెక్టర్ తో ఇంటిల్లి పాది చూసుకోవచ్చు. ఇక సినిమా థియేటర్ల వారికి ఆశలు రేకెత్తిస్తోన్నది అగ్రకథానాయకుల చిత్రాలే. వాటిని అభిమానులు థియేటర్లలోనే వీక్షించి ఆనందిస్తారని కొందరి ఆశ.. సినిమా బాగుంటే సరేసరి. లేదంటే ఎంత అభిమాన హీరో చిత్రమే అయినా, పదే పదే చూడటానికి అభిమానులు సైతం ఆసక్తి చూపుతారా అన్నది మరో అనుమానం. మిగతా అన్ని రంగాలతో పోలిస్తే సినిమా రంగం పరిస్థితి, అందునా థియేటర్ల విషయమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. థియేటర్ల వారిని ఆదుకోవాంటే, కరోనా కట్టడికి వ్యాక్సిన్ వచ్చిన తరువాతనైనా ప్రభుత్వాలు కనికరం చూపాలి. లేదంటే థియేటర్ల మనుగడ కష్టం. ముఖ్యంగా సింగిల్ థియేటర్ల మనుగడ మరింత కష్టం. థియేటర్లు చరిత్రలో కలసి పోకుండా పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే!

Share: