మనుషుల ఆహారపు అలవాట్లను బట్టి మూడు రకాలుగా విభజించొచ్చు. జంతువులు, పశుపక్ష్యాదుల్లోనూ ఇవే రకాలు ఉంటాయి. ఇందులో ఒకటి మాంసాహారం మాత్రమే తినేవి కాగా, రెండోవి శాకాహారాన్ని మాత్రమే భుజించేవి. రెండూ భుజించేవి మూడో కోవకు చెందినవి. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, అసలు మనిషి మాంసాహారం తినొచ్చా? అందుకు ప్రకృతి అనుమతి ఇస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే తొలుత మనిషికి, జంతువులకు మధ్య ఉన్న ఆహారపు అలవాట్లను పోల్చి చూడాల్సి ఉంటుంది.
మాంసాహార జంతువులైన పులి, పిల్లి, కుక్క లాంటి జంతువులన్నీ నీటిని నాలుకతో తాగుతాయి. శాకాహార జంతువులైన ఆవు, గేదె వంటివాటితోపాటు మనిషి కూడా పెదవులతోనే నీటిని తాగుతాడు. మాంసాహార జంతువులకు పుట్టిన పిల్లలు రెండుమూడు రోజులకు కానీ కళ్లు తెరవలేవు. కానీ మానవ శిశువు పుట్టిన వెంటనే కళ్లు తెరుస్తుంది. మాంసాహార జంతువుల గోళ్లు వంపు తిరిగి వేటకు అనుకూలంగా ఉంటాయి. శాకాహార జంతువుల గోళ్లు అలా ఉండవు. అలాగే, మాంసాహార జంతువులు వేటాడిన తర్వాత మాంసం చీల్చడానికి కోరపళ్లు ఉంటాయి. మనిషికి అలాంటి వెసులుబాటు లేదు. ఈ తేడాలన్నీ గమనించిన తర్వాత మనిషి ప్రకృతి సిద్ధంగానే శాకాహారి అన్న విషయం అర్థమవుతుంది. మాంసాన్ని భుజించడం మనిషి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడమేనని గుర్తుంచుకోవాలి.
శారీరక నిర్మాణం పరంగా చూసినా ఇదే విషయం అవగతమవుతుంది. మనిషి జీర్ణాశయంలో ఆహారం మూడు నాలుగు గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. మాంసాహారం జీర్ణం కావడానికి నిజానికి ఆ సమయం ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోదు. అసంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారం నుంచి ‘టాక్సిన్ అమినో ఆమ్లాలు’ (విష పదార్థాలు) విడుదలవుతాయి. ఇవి కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వాటి పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయి. జీవ రసాయనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య పెరుగుతుంది. ‘అసంపూర్ణ జీర్ణం సకల రోగాలకు మూలం’.. కాబట్టి మాంసాహారం మానవ శరీరానికి నిషిద్ధం.
ఇప్పుడు మానసిక పరమైన కారణాల సంగతేంటో చూద్దాం. ఓ కోడిని కోసినప్పుడు అది బాధతో విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకుంటుంది. భయంతో రెక్కలు టపటపలాడిస్తుంది. భయం కారణంగా దాని శరీరంలో కొన్ని విషపదార్థాలు ఉత్పత్తన్నమవుతాయి. ఇది ఆ కోడి శరీరం మొత్తానికి వ్యాపిస్తుంది. మనం కోడిని తినేటప్పుడు దాని భయాన్ని కూడా మనం మన పొట్టలోకి పంపేస్తున్న విషయాన్ని గ్రహించాలి. జంతువుల విషయంలోనూ ఇదే జరుగుతుంది. వాటి యొక్క భయాలు మనలో మానసిక ఆందోళనళకు కారణమవుతాయి.
ఆధ్యాత్మిక కారణాలు: చనిపోయిన శరీరాన్ని ‘మృత కళేబరం’ అంటారు. అలాంటి మృత కళేబరాలను మన పొట్టలోకి తోసేసి ‘దేవాలయం’ లాంటి శరీరాన్ని శ్మశానంలా మార్చుకోకూడదు. మనకు కనబడే స్థూల శరీరం చుట్టూ ఎనర్జీ బాడీ ఉంటుంది. మాంసాహారం తినడం వలన ఈ ఎనర్జీ బాడీ క్షీణిస్తుంది. ఆ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా రోగాలు సంభవిస్తాయి. మనలో ప్రవేశించే విశ్వప్రాణశక్తికి మాంసాహారం వల్ల ఉత్పన్నమయ్యే ‘నెగటివ్ ఎనర్జీ’ ఆటంకపరుస్తుంది. అందుకే మనిషికి మాంసాహారం నిషిద్ధం.
– గణేశ్వర్‌బాబు వెల్లంకి
99482 25709