మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు చలనచిత్ర సీమలో ఎన్నెన్నో సంప్రదాయాలకు బీజం వేశారు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ఆయన ఆచరించి, అనుసరించిన అనేక సంప్రదాయాలు తరువాతి తరాలకు ఆదర్శంగా నిలిచాయి. ఈ తరం కథానాయకుల్లో కాసింత స్టార్ డమ్ చూసిన వారు సైతం తమ సినిమాల టైటిల్స్ హీరో ఓరియెంటెండ్ గా ఉండాలని ఆశిస్తున్నారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసి నటించిన యన్టీఆర్ ఏ రోజునా సినిమా టైటిల్ హీరో పేరు మీదేఉండాలని భావించలేదు. కథకు అనుగుణంగానే టైటిల్ ఉండాలని ఆశించేవారు. అంతేకాదు దానిని తు.చ. తప్పక పాటించేవారు. అలా తానే కథను సమకూర్చి, సొంతగా నిర్మించి నటించిన చిత్రాలలోనూ ఆయన అదేతీరున సాగారు. ఏ నాడూ ఈ సత్ సంప్రదాయానికి నీళ్ళు వదలలేదు. అందుకే ఆయన ప్రతిష్ఠాత్మక చిత్రాలయిన నూరవ చిత్రం ‘గుండమ్మకథ’గానూ, 200వ సినిమా ‘కోడలు దిద్దిన కాపురం’గానూ వెలిశాయి. ఒకవేళ ‘గుండమ్మకథ’లో మరో హీరో ఉండడం వల్ల ఏ తంటా లేకుండా ఆ చిత్రానికి ఆ పేరు పెట్టారు అనుకుందాం. తన కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ (1970) విషయంలోనూ కథకే ప్రాధాన్యమిచ్చారు. పైగా ఈ చిత్రం ఆయన రాసిన కథతోనే రూపొందింది. అదీగాక ఆయన సొంత సినిమా. అయినప్పటికీ కథానుగుణంగానే టైటిల్ ను నిర్ణయించారే తప్ప తన స్టార్ డమ్ కు అనువుగా ఆ సినిమాకు పేరు పెట్టలేదు. ఈ విషయాన్ని నవతరం కథానాయకులు గుర్తు చేసుకుంటే ఎంతోమంచిది.
అదే విశేషం!
ఇక యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ విషయానికి వస్తే, ఈ యేడాదితో ఈ సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1970 అక్టోబర్ 21న ఈ చిత్రం విడుదలై ఆ యేడాది అన్నిటికన్నా మిన్నగా నిలచి ఘనవిజయం సాధించింది. రెండు వందల రోజులు ప్రదర్శితమైంది. ఇప్పటి దాకా ఇలా 200వ చిత్రం విజయవంతంఆ 200 రోజులు ప్రదర్శితమైన రికార్డు తెలుగునాటనే కాదు, ఇతర భాషల్లోనూ ఏ హీరోకూ కానరాదు.
ఇలాంటి రికార్డుల విసయాలను అలా పక్కన పెడితే ‘కోడలు దిద్దిన కాపురం’ ధనిక కుటుంబాల జీవనశైలికి అద్దం పడుతుంది. ఎంత డబ్బు ఉన్నా సంస్కారం అన్నిటికన్నా మిన్న అనే నీతిని చాటుతూ ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో యన్టీఆర్ ప్రస్తావించిన అంశాలు యాభై ఏళ్ళనాటివే కాదు, ఈ నాటికీ మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపిస్తూనే ఉండడం విశేషం.
ఆలోచింపచేసే కథాంశం
‘కోడలు దిద్దిన కాపురం’ కథ విషయానికి వస్తే – కోట్లు సంపాదించినా, ఏ మాత్రం మనశ్శాంతి లేని ధనవంతుడు పేకాటతో కాలక్షేపం చేయడం, ఇక ఆయన భార్య పూజలు, పుణ్యాలు అంటూ మూఢవిశ్వాసాలతో డబ్బులు తగలేసుకుంటూ దొంగస్వామిజీలను నమ్ముకోవడం చూస్తాం. వీరి పిల్లల్లో పెద్దవాడు పెళ్ళయినా, భార్యను అలక్ష్యం చేసి, విలాసవంతమైన జీవితానికి బానిస అవుతాడు. చిన్నవాడు ఏ లక్ష్యం లేకుండా రాత్రయితే చాలు మందు కొట్టేస్తూ, తమ ధనికుల కుటుంబాలలో సాగే ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందిస్తుంటాడు. వాటిలోని తప్పులనూ విమర్శిస్తూంటాడు. జమీందార్ ఏకైక కూతురు పెళ్ళయినా, భర్తను కూడా ఇంటనే కట్టేసుకొని అతనికి ఏ మాత్రం విలువ నీయకుండా టిప్పుటాపుగా తిరుగుతూ ఉంటుంది. ఇలా డబ్బు జబ్బుతో సాగుతున్న కాపురాన్ని ఆ ఇంటి పెద్ద కోడలు ఎలా చక్కబెట్టింది అన్నదే ఈ సినిమా కథ. చూడటానికి ఇది సాదా సీదా కథలాగే కనిపించినా, ఇందులో ప్రస్తావించిన అంశాలు నిత్యసత్యాలు. మన దేశంలోనే కాదు నేలపైని అందరు ధనవంతులు కోటానుకోట్లు సంపాదించినా, తగిన మనశ్శాంతి లేక వ్యసనాలకు బానిసలు కావడం చూస్తూనే ఉన్నాం. కోటికి పడగలెత్తినా లభించని మానసిక సంతృప్తి కోసం ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని చూస్తున్నారు. ఇది అభినందించ దగ్గ విషయమే. అయితే ఇక్కడే వారికి కొందరు దొంగస్వాములు తారసపడుతూ చేతివాటం చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ నాడు ఎందరో దొంగబాబాలు ఆధ్యాత్మిక మార్గం మాటున చేస్తున్న ఘోరాలు తరచూ వింటూనే ఉన్నాం. ఈ అంశాన్ని 50 ఏళ్ళ క్రితమే ‘కోడలు దిద్దిన కాపురం’లో ప్రస్తావించారు రచయితగా రామారావు.
చిత్ర విశేషాలు
నటనతోనే కాదు కలం బలంతోనూ కథలు రాసి, దర్శకత్వం వహించి మెప్పించిన యన్టీఆర్, తన 200వ చిత్రానికి మాత్రం తన మిత్రుడు డి.యోగానంద్ దర్శకత్వంలోనే రూపొందించడం విశేషం. అప్పటికే ఇతర సంగీత దర్శకులు తెలుగు చిత్రసీమలో రాజ్యమేలుతున్నా, తమ సొంత చిత్రాలకు ఎన్నిటికో సంగీతం సమకూర్చిన టి.వి.రాజుతోనే ఈ సినిమాకూ స్వరకల్పన చేయించారు. రామారావు తన సొంత చిత్రాలలో ఏదో ఒక సందర్భంలో సందేశాత్మక గీతాలను, చైతన్యవంతమైన పాటలను చొప్పించేవారు. ఈ చిత్రంలో అలా “నీధర్మం నీసంఘం…” అంటూ సాగే పాటను మరువలేం. అలాగే ధనికుల జీవిత కోణాలను, ప్రభుత్వ పనితీరును “చూడర నాన్నా ఈ లోకం…” పాటలో సున్నితంగా విమర్శించారు. ఇక ఈ చిత్రంలో యన్టీఆర్ సరసన వాణిశ్రీ నాయిక. అంతేకానీ, కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టూనే సాగుతుంది. ఇందులో జమీందార్ గా నాగభూషణం, ఆయన భార్యగా సూర్యకాంతం నటించారు. వారి పెద్దకొడుకుగా జగ్గయ్య, చిన్నకొడుకుగా యన్టీఆర్, కూతురుగా సంధ్యారాణి, ఆమె భర్తగా పద్మనాభం ఆ ఇంటి పెద్ద కోడలు పాత్రలో సావిత్రి అభినయించారు. ఈ సినిమా కంటే ముందు యన్టీఆర్ కథతోనే రూపొందిన ఆయన మరో సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లోనూ రామారావుకు వదినగా సావిత్రి నటించారు. ఆ సినిమాలోనూ ఆమె కాపురాన్ని చక్కదిద్దడానికి మరిదిగా యన్టీఆర్ కృషి చేస్తాడు. ఇందులోనే అదే తరహా పాత్రలో యన్టీఆర్ తనదైన అభినయంతో రక్తి కట్టించారు. ఆయన సరసన అనేక చిత్రాలలో నాయికగా నటించి మెప్పించిన సావిత్రి ఆ తరువాత పలు చిత్రాలలో వదినగా, అక్కగానూ నటించడం విశేషం. సావిత్రి నాయికగా ఆదరణ కోల్పోయిన సమయంలోనూ ఆమెకు తగ్గ పాత్రలు ఇచ్చిన ఘనత కూడా యన్టీఆర్ దే. అదే తీరున తన 100వ చిత్రం ‘గుండమ్మకథ’లోని నాయిక సావిత్రికి తాను నటించిన 200వ సినిమాలోనూ తగిన పాత్ర ఇచ్చి గౌరవించారు రామారావు. అంతేకాదు, ‘గుండమ్మకథ’లో గుండక్కగా నటించిన సూర్యకాంతంకు ‘కోడలు దిద్దిన కాపురం’లోనూ కీలక పాత్రను అందించారు. అంతేకానీ, సినిమా మొత్తం తానే ఉండాలని, సినిమా టైటిల్ తన పేరనే పెట్టాలని యన్టీఆర్ భావించేవారు కాదు. అందుకు ఆయన నటించిన సినిమాల టైటిల్స్ ను చూస్తేనే అర్థమవుతుంది. ‘కో్డలు దిద్దినకాపురం’ ప్రేక్షకుల రివార్డుతో పాటు ప్రభుత్వ అవార్డులనూ సొంతం చేసుకుంది.
ఏది ఏమైనా యన్టీఆర్ 200వ చిత్రంగానే కాదు, ఓ మంచి కథాబలమున్న సినిమాగా ‘కోడలు దిద్దిన కాపురం’ జనం మదిలో నిలచిపోయింది. ఈ తరహా చిత్రాలను రూపొందించడానికి, ఇలాంటి చిత్రాలను నిర్మించడానికి, వీటిలోనటించడానికి ఈ తరం నటీనటులు ఎందరు ఆసక్తి చూపిస్తారో తెలియదు కానీ, కుటుంబకథ మాటునే సమాజంలోని అనేక అంశాలను స్పృశిస్తూ కథను నడపడం అన్నది భావి చిత్రప్రేమికులు ఈ చిత్రాన్ని చూసి నేర్చుకోవచ్చు.