మా ఊరి పెత్తనదారులు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

BH01

మా గ్రామ పెత్తనదార్లను గురించి ఇక్కడ రాస్తాను. వేమూరి రామన్నగారిని గురించి రాయడానికి ముందు వారి తండ్రి సుబ్బయ్య గారిని గురించి అప్పటి దేవరకోట జమీందారి పరిస్థితుల గురించి పరిచయం చేస్తాను. ఈయన ఏడుకత్తుల భూమిగల పెద్ద రైతు. బోళ్లపాడు గ్రామ పెత్తందారు. ఆ రోజులలో జమీందారీ పరిపాలనా పద్ధతిని అనుసరించి ప్రతి గ్రామానికి ఒక పెత్తనదారు చొప్పున పరగణాకు ఆరుగురు పెత్తనదార్లు ఉండేవారు. వంశపారంపర్యంగా వారికి పెత్తందారీతనం ఉండేది.

పరగణాకంతకు ఒక పెత్తందారు. ఈయనను పరగణా పెత్తందారు అనేవారు. ఈయన ఘంటసాలపాలెం వేమూరివారి కుటుంబంలో జ్యేష్టుడు. వేమూరి వెంకట్రాముడుగారు. ఆయన కుమారుడు వెంకటయ్యగారు తరువాత ఆయన కుమారుడు వెంకట్రామన్నగారు పరగణా పెత్తనం నిర్వహించారు.
ఒకనాడు జరిగిన సంఘటనను ఇక్కడ పొందుపరుస్తాను. జమీందారు అంకినీడు గారు (పెద్ద) శివగంగ అమ్మవారిని ప్రతిష్ఠించిన మహా భక్తుడు) పేష్కసు చెల్లించని కారణాన జమీవేలం కానుండగా పరగణా పెత్తనదారును కొలుసుకొనడానికి ఘంటసాలపాలెం వచ్చి, వెంకట్రాముడు గారు చెరువుగట్టుమీద నిలువు చెంబు కిందవేసుకుని కూర్చుండడం చూసి, మేనా ఆయన ముందు ఆపక, కొన్ని గజాల అవతలికి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లి దిగారు. వెంకట్రాముడు గారు చెంబుమీద నుంచి లేవనేలేదు. అంతట జమీందారు వెంకట్రాముడు అంటూ కొన్ని గజాలు వెనకకు నడిచిరాగా, ఆయన కూడా కొన్ని గజాలు వెళ్లి ఆయనను సన్మానపూర్వకంగా, గౌరవ పురస్కరంగా సంబోధించి విషయం తెలుసుకుని వెళ్లి ‘మేముండగా జమీ వేలము పడడమే?’’ అని వాయిదా నాటికి పరగణాలోని గ్రామాల పెత్తనదార్ల నుంచి డబ్బు వసూలు చేసుకుని జమీవేలం పడకుండా కాపాడారు. ఆనాటి పెత్తనదార్ల ఆత్మగౌరవమట్టిది.

ఈ సుబ్బయ్యగారు ఘంటసాల గ్రామ పెత్తనదారైన చెంచయ్యగారి అల్లుడు. గ్రామంలోను, చుట్టుపక్కల పలుకబడిగల వ్యక్తి. ఒక రోజున మధ్యాహ్నం 12 గంటలకు భోజనానికి ముందు స్నానం చేయడానికి అంగవస్త్ర కట్టుకుని సిద్ధంగా ఉండగా చిట్టూరు కరణం పెద పేర్రాజుగారు వచ్చి గావురుమని ఏడ్చారు. ఏమిటని అడుగగా, తన భూమికి శిస్తు చెల్లించని కారణాన జమీందారు కోటకు పిలిపించి నెత్తిమీద దుంగలు ఎత్తించి నిలబెట్టి అవమానించారని చెప్పేటప్పటికి ఉగ్రుడై పైబట్ట కూడా లేకుండా ఆ అంగవస్త్రంతోనే నాలుగు మైళ్లు ఎండలో నడిచి చల్లపల్లి కోటలోనికి వెళ్లి, వారి మామ అయిన ముక్త్యాల జమీందారు గారితో కలిసి హాలులో కూర్చుని ఏవో ఆలోచనలు చేస్తూవున్న శ్రీ అంకినీడుగారిని చూసి, ఈ జమీ పుట్టిన తర్వాత ఎంతమంది జమీందారులయ్యారు? మీరెన్నోవారు? ఇలా రైతులను ఎన్నడైనా హింసించారా? ఇలా అయితే రైతుల నుంచి శిస్తులు వసూలు చేస్తారా? జమీందారీ నిలిచినప్పుడు చూస్తాను అని హాలు దద్దరిల్లేలా పెద్దగా గర్జించారు.

అసలే ఎర్రని కళ్లు, ఎండలో నడిచిరావడంతో, కోపంతో ఒళ్లు తెలియని ఆవేశంతో ఉండడం, ఇదంతా చూసి కంగారుపడి ఏమీ సమాధానం చెప్పకుండానే అంకినీడుగారు తెలివిగా దిగ్గున లేచి వెనక వసారాలోకి వెళ్లి, ఈ సుబ్బయ్యను ఈ వైపునకు ఇక్కడికి తీసుకురమ్మని ఆయన అక్కడకు రాగానే ‘‘ఏమి బావా! కళ్లంత ఎర్రగా ఉన్నవేమి? ఏమైనా పుచ్చుకోలేదు కదా?’’ అని పరిహాసమాడి ‘‘నీవేమైనా అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనాలి గాని, పరాయి జమీందారు ముక్త్యాలవారి ఎదుట అంటే మనకు అమర్యాద, వారికి మనం లోకువ అవడం కాదూ? ఇంతకు వచ్చిన పనేమిటో చెప్పు’’ అని ఆయనను శాంతపరిచి ప్రశ్నించడం జరిగిన విషయం చెప్పి, ‘‘ఈ బ్రాహ్మణుడు నా బిడ్డంటివాడు. ఈయనను ఇలా అవమానించడం నన్ను నేను మరిచిపోయేంత కోపం తెప్పించింది. ఇకనైనా ఆయన శిస్తు చెల్లించలేడు. భూములు పంటలు పండవాయె. పెద్ద కుటుంబం, కరణీకానికి మీరిచ్చేది తిండికి చాలదాయె. ఎక్కడి నుంచి తెచ్చి శిస్తులు చెల్లిస్తాడు, చెప్పండి? అని తిరిగి గర్జించేసరికి, ‘‘ఇంతకీ ఏమి చేయమంటావు’’ అని జమీందారుగారు అడగడం పెద పేర్రాజు గారితో సంప్రదించి కాజ ముఠాకు సముద్దారుగా ఆయనను నియమించి ఆయనకు ఇచ్చే జీతం శిస్తుకింద జమకట్టుకుని, మిగతాది ఆయనకు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని తిరిగి ఘంటసాల చేరుకున్నారు-కాపు, కరణం ఇద్దరు.

ఇలాంటి చండప్రచండుని కుమారుడు రామన్నగారు పొట్టికురచ. మనిషి బలాఢ్యుడు? ఆయనకు డబ్బు చేతపట్టడం తెలియదు. అసలు రూపాయలు అణాపైసలు ఎప్పుడైనా లెక్కపెట్టాడా అనేది అనుమానం. ఈయన ఆశ్రిత వత్సలుడు. ముందొచ్చి చెప్పుకున్నవారి తరపున ఈయన ఉండడం స్వభావం. న్యాయమో, అన్యాయమో, సత్యమో, అసత్యమో, ఆ సంగతి దేవునికెరుక. తాను ఒకరికి డబ్బులు తినేది లేదు. తాను పదిమందికి పెట్టడం నిత్యం జరిగేది. భూములు పుట్ర నివేశన స్థలాలు అడగనివాళ్లది పాపం. గ్రామంలో అన్ని వర్గాల చేత ధర్మాత్ముడనిపించుకున్నాడు. మా మేనమామగారు ఆయనను ‘‘బాబూ!’’ అని పిలిచేవారు. అలాగే, ఊళ్లో అందరికీ బాబుగారు అయ్యారు ఆయన. ఆయన భార్యపేరు సీతమ్మ. నా వివాహానికి శుభలేఖలు ఈయన పేరుననే రాయించాము. ఈ సీతారాములను పూజించి, వారి ఆశీర్వచనాలను అందుకుని నేను పాలకీ ఎక్కాను పెండ్లికొడుకుగా. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. రామన్నగారికి మొదటి సంబంధం భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈ సీతారాముల పెద కుమారుడు వెంకయ్యగారు. తండ్రి రామన్నగారి, తాత బాలకృష్ణగారి పేరు, ప్రతిష్ఠలు నిలిపారు. అజాత శత్రువు. ఆయనకు కోపం రాదు. వస్తే ఆయన ముందు ఎంతటివారికైనా నిలవడం చాలా కష్టతరం. 16 ఏండ్లు పంచాయతీ బోర్డు అధ్యక్షులుగా, జనరంజకంగా వ్యవహరించారు. ‘‘ఛైర్మన్ వెంకయ్యగారు’’ అనే పేరు వీరికి ఏర్పడింది. గ్రామంలో పార్టీల కక్షలు ఉన్నా, ఎదిరి పక్షం మెప్పులు కూడా పొందిన అదృష్టవంతుడు. జలదీశ్వరాలయ ముఖమండప నిర్మాణంలో వీరి కృషి ప్రధానంగా పరిగణించదగింది.

ఈ పంచాయతీ బోర్డు అధ్యక్షులుగా వున్నప్పుడు నేను, నా స్నేహితులు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, వేమూరి సీతారామయ్య  సభ్యులుగా ఉండేవారము. గ్రామాభివృద్ధి సౌభాగ్యం దృష్టిలో పెట్టుకుని కలిసిమెలసి పనులు చేయించేవారము. ఒకప్పుడు పంచాయతీబోర్డు అధ్యక్షుడుగా నన్ను వుండమని ఆయన కోరారు. ఆయనవంటి పెద్దలే అధ్యక్షులుగా ఉండడం. మాబోటి పిన్నలు వారికి సహాయకులుగా వుండడం మంచిదని వారిని ఒప్పించారు. అపుడు పంచాయతీబోర్డు ఆఫీసు మా మేడమీదనే ఉండేది.

ఆయన కొంతకాలం బందరు తాలూకా బోర్డు సభ్యులుగా వున్నారు. తిరిగి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన చిన్నతమ్ముడు లక్ష్మయ్యగారి సూచనపై ఆయన నన్ను తాలూకా బోర్డు సభ్యులుగా వుండడానికి ప్రోత్సహించి బలపరిచారు. పోటీ లేకుండానే సభ్యుడైన తరువాత తాలూకా బోర్డు అధ్యక్షుడినయ్యాను. తాలూకాబోర్డు సభ్యత్వానికి, అధ్యక్షతకు నాకు ఆయన ప్రయాణ ఖర్చులు వగైరా అరవై రూపాయలు మాత్రమే. శ్రీ వెంకటయ్యగారు చనిపోయే వరకు ఆయన ఆశీర్వచనాలు నాకు గలవు. నేనెక్కడ ఉన్నా నా యోగక్షేమాలు ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన కాంగ్రెసు సానుభూతిపరుడు. కాంగ్రెసువాదిగా నేను చేసిన కార్యక్రమాలలో ఆయన అండదండలు నిరంతరం నాకు వుండేవి.

1945 నుంచి 1951 వరకు కాంగ్రెసు, కమ్యూనిస్టు పోరాటాలలో ఆయన సొంత మేనల్లుడు చిరంజీవి గొర్రెపాటి వెంకట్రామయ్య ఆ పార్టీకి నాయకత్వం వహించినా, ఆయన మాకే అన్ని విధాల సహాయ సంపత్తినిస్తూ మాలోనే వున్నారు.

వేమూరి లక్ష్మయ్యగారు వేమూరి రామన్నగారి చిన్నకుమారుడు. చాలా అందమైనవాడు. ఉదారుడు. ఉత్సాహ, ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. మంచి కార్యసాధకుడు. ఈయనలో చినతాత రామస్వామిగారి తెలివితేటలు, చాకచక్యం కలవనేవారు. ఎస్టేటులోని ముఖ్యగ్రామాలలో ఈయనకు మంచి పలుకుబడి ఉండేది. ఆ గ్రామాలలో పెత్తందార్లు వీరి మాట వినేవారు. అలాగాని యెడల కొందరు యువకులైనా  ఆయన పక్షాన ప్రాణాలిచ్చుటకైనా సిద్ధపడేవారు ఉండడమో జరిగేది.

పోలీసులకు ఈయన ముఖ్య స్నేహితుడు. ఆఫీసర్లను బుట్టలో వేసే ప్రజ్ఞ ఈయనకు అపారం. ఆయన ఉన్నంత వరకు ఏ ఉద్యోగి గ్రామంలోనికి వచ్చినా షడ్రసోపేతంగా ఆయన వారికి అతిథ్యమివ్వడం జరుగుతుండేది. ఈయన యాక్టింగ్ మనుసబుగా వుంటూనే కాంగ్రెస్ ఉద్యమసాఫల్యతకు చాలా తోడ్పడ్డారు.

రామన్న, చిట్టెన్నగార్ల సంబంధాన్ని గురించి పైన రాశాను. ఆయన రామన్నగారి కుమారుడు. నేను చిట్టెన్నగారి మనవడిని. మా కుటుంబాలు ఒకటిగానే లెక్క. నేను భవిష్యత్తులో పైకి రాగలనని, నా వల్ల గ్రామ ప్రతిష్ఠ పెరుగగలదని పదుగురితో ఆయన చెప్పేవాడు. నాలో ప్రజా, గ్రామ సేవా బీజాలను ప్రభవింపజేసినదీయనే. నేను కోరినదే తడవుగా నాకూ ప్రోత్సాహమిచ్చి సహాయం చేయడాన్ని ఆయన కర్తవ్యంగా భావించేవారు.
గ్రామంలో ఇళ్లు తగలబడిపోగా, వారలకు వాసాలు, తాటాకు సహాయం చేయడానికి ప్రయత్నించడంలోను, గ్రామంలో తూర్పున, ఈశాన్యమూల చప్టాలను వేయించడంతోను నా గ్రామసేవ ప్రారంభమైంది. 1920లో మహాత్ముని శాంఖారావం విని దేశాన్ని ఓట్ల నిరాకరణకు తయారుచేయడంలో ఆంధ్రదేశమంతటా తాలూకా సభలు జరుగుతుండగా, దివి తాలూకా సభను ఘంటసాలలో జరపడానికి సంకల్పించాం. పెద్ద ఎత్తున అంచనాలు వేశాం. పండిత వెంకటసుబ్బయ్య, నేను నా సహచరులైన మిగతా యువకులలోనే తగినంత ప్రోత్సాహం కనబడని కారణాన మేము చాలా నిరుత్సాహపడ్డాం. ఈ సంగతి తెలుసుకున్న లక్ష్మయ్యగారు నా వద్దకు వచ్చి ఏమోయి వేసిందే ఒక గంతు, తగిలిందే ఒక దెబ్బ మీరు ఒక ఘనకార్యం  తలపెట్టింది ఇదే ప్రథమం. ఇంతలోనే దిగజారితే మీరు చేయగలిగినదేమిటి? మీ పలుకుబడి మీకు తెలియదు. మీరు కోరితే ఇవ్వనివారెవ్వరు? నేను పదిమందితోను చెబుతాను. మీ వెంట నేను వస్తాను. బయలుదేరండని ప్రోత్సాహమిచ్చారు. అయిదు వందల రూపాయలు వసూలైనది. అది తాలూకా సభ కాదు. జిల్లా సభ అనిపించుకున్నది. దీనితోనే నేను, నా మిత్రబృందం జిల్లాలో కొంత పేరు ప్రతిష్ఠలు గలవారమయ్యాము. రాజకీయ రంగంలో ఇది నా మొదటి అడుగు. రెండవ అడుగు వేయడానికి గల శక్తి, ఉత్సాహాలు మాలో ఏర్పడినవి. కలిగిన నిరుత్సాహాన్ని, తన ప్రోత్సాహమనే మంత్రదండంతో పోగొట్టి మమ్ములను దేశసేవకు పురికొల్పారు లక్ష్మయ్యగారు.

తమ అన్న, కుటుంబ పెద్ద, పూజ్యుడు, తాలూకా బోర్డు సభ్యుడుగా అది వరకు వున్నవారిని ‘‘నీవు సభ్యుడుగా మాత్రమే ఉండగలవు. బ్రహ్మయ్యను మనం సభ్యునిగా పంపితే, ప్రెసిడెంటు కాగలడు’’ అని చెప్పి ఆయన స్థానే నన్ను తాలూకా బోర్డుకు వెళ్లేటట్టు చేశారు. తాలూకా బోర్డు అధ్యక్షతకు అభ్యర్థిగా ఉండాలనే కోర్కె అప్పటికి నాలో కలగనే లేదు. ఆయన భవిష్యత్ సూచనల ద్వారా ఆ కోరికకు నాలో బీజారోపణ చేశారు.
ఆయనకంటే నేను ఎనిమిది సంవత్సరాలు చిన్న. ఆయనకు నాపై పలుకుబడి కూడా కలదు. నేనేదైనా వ్యవహారాలలో మధ్యవర్తిగా ఉన్న సందర్భాలలో నాకు సిఫారసు చేయమని ఎవరైనా ఆయనను కోరినప్పుడు ‘‘అభివృద్ధి రాదగిన బ్రహ్మయ్యకు సిఫారసు చేసి, అతనిని తప్పుదారి పట్టించి, అతని గౌరవం తగ్గించడం నా వల్ల కాదు’’ అని చెప్పేవారు. నేను తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా ఉన్నా ఏ ఇతర పదవులలో ఉన్నా, తానే ఆ పదవిలో ఉన్నట్టు ఆనందించేవారు.

నల్లజెండాల కేసులో నేను సబ్‌జైలులో ఉండగా చూడవచ్చి కండ్ల నీరు పెట్టాడు. నేనే ఆయనకు ధైర్యం చెప్పవలసి వచ్చింది. వేలూరు జైలులో ఉండగా చూడవచ్చి మహా ధైర్యంగా ప్రోత్సాహ వాక్యాలు పలికారు. గ్రామంలోను, తాలూకాలోను అప్పుడు ఉప్పు సత్యాగ్రహం, కల్లుదుకాణాల పికెటింగు, ఈత, తాటిచెట్ల గెలలు నరకడం జరిగే రోజులు. వాటిని చేసే కాంగ్రెసు సేవకులను ప్రోత్సహించి తగిన బలం ఇచ్చి ఉద్యమం జయప్రదం కావడానికి సాయపడవలసిందిగా నేను కోరిన వెంటనే సరేనన్నారు.

ఆయన అప్పుడు ఘంటసాల యాక్టింగ్ మునసబు. ఆ రోజులలో ఆయన పగలు ఉద్యోగులతో, రాత్రిళ్లు కాంగ్రెసువాదులతో ఉండి, అన్ని విధాల కాంగ్రెస్ ఉద్యమానికి పట్టుకొమ్మ అయ్యారు. ఈ విషయం కర్ణాకర్ణిగా విని ‘‘డిప్యూటీ కలెక్టర్ ఆయనను మందలింపుగా మాట్లాడగా – రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సమాధానం చెప్పేసరికి ఆయనకు గల పలుకుబడిని గుర్తించిన వాడగుట వల్ల ఆయన వినీ విననట్లు మిన్నకున్నారు. సర్వ విధాల ప్రోత్సాహమిచ్చిన ఈ లక్ష్మయ్యగారిని నిత్యం స్మరించుట నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

Share: