మా ఘంటసాల చారిత్రక ప్రసిద్ధి: గొట్టిపాటి బ్రహ్మయ్య

Gottipati-1

ఆత్మకథలు చాలా వరకు గ్రంథకర్తల చుట్టూనే తిరుగుతుంటాయి. వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, స్ఫూర్తి కలిగించే ఘటనలు ఉంటాయి. ఎవరి జీవిత చరిత్ర చూసినా ఇంచుమించూ ఇవే విషయాలు ఉండి స్ఫూర్తిని రగిలించేవిగా ఉంటాయి. గొట్టిపాటి బ్రహ్మయ్య ఆత్మకథలోనూ అవే ఉంటాయనుకోవడం పొరపాటే అవుతుంది. అజాత శత్రువైన ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’లో అంతకుమించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చారిత్ర అంశాలు మిళితమై ఉన్నాయి. ఘంటసాల గురించి ఎవరికీ తెలియని గొప్ప విషయాలు చాలానే ఉన్నాయి. చారిత్ర పాఠం చదువుతున్నంత చక్కగా సాగే ‘నా జీవన నౌక’ నిజంగానే నౌకాయానంలో అలా అలా సాగిపోతుంది. గొట్టిపాటి బ్రహ్మయ్య ‘నా జీవన నౌక’లోని ‘మా ఘంటసాల చారిత్రక ప్రసిద్ధి’ యథాతథంగా..

Gottipati-2

————–
మా వూరు ఘంటసాల. జనాభా సుమారు ఎనిమిది వేలు. కృష్ణా జిల్లాలో పెద్ద గ్రామాల్లో ఒకటి. పరమ భక్తాగ్రేసరుడైన త్యాగరాజుకు ఈడూ-జోడూ అయిన మధుర భక్తుడు క్షేత్రయ్య భర్తగా ఆరాధించిన వేణుగోపాలుడు వెలసిన మొవ్వ గ్రామం మాకు ఐదు మైళ్ల దూరంలో కలదు. భరత నాట్యాచార్యుడైన శ్రీ సిద్ధేశ్వర మహాయోగి నడయాడిన కళాక్షేత్రం భాగవతుల కూచిపూడి మాకు ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది.

ప్రాచీన కాలంలో బౌద్ధ మతం చాలా వ్యాప్తి పొందిన రోజుల్లో బుద్ధ భగవానుని గుర్రం పేరున ‘కంటక శైల’ అని ఈ గ్రామం నిర్మించబడినట్టు చారిత్రక ఆధారాలు కలవు. ఆ నాడు బౌద్ధమత వ్యాప్తికి ఏర్పడిన ప్రధాన ప్రచార కేంద్రములలో ఇది ఒకటి. ఆనాడు బౌద్ధమత వ్యాప్తికి ఏర్పడిన ప్రధాన ప్రచార కేంద్రములలో ఇదొకటి. శిథిలమైనను ఇప్పటికీ కానవచ్చే అనేక స్థూపములు, బౌద్ధ శిల్పములు అమరావతి, జగ్గయ్యపేట బౌద్ధ శిల్పములతోగల సామీప్యత ఈ విషయమును బలపరుస్తున్నవి. నేడు ధర్మగోటకమని పిలువబడే విశాలమైన పచ్చికబయలు నాడు బౌద్ధుల ఉద్యానవమని పురాతత్వశాఖ వారి రికార్డులు చెబుతున్నాయి. క్రీస్తుకు పూర్వం నుంచి మనకు యూరప్ ఖండముతో వర్తక వ్యాపారాలు కలవు. ఆనాడు వ్యాపారమంతా ఓడల ద్వారానే. ఈజిప్టు ఖగోళ శాస్త్రజ్ఞుడు, సుప్రసిద్ధుడు తొలమీ ఈ కంటకశైలం కృష్ణానది ముఖద్వారమున గల ఓడరేవని, వాణిజ్య వ్యాపారమని రాశాడు. ఈయన క్రీస్తుశకం రెండో శతాబ్దంనాటి వాడు. ఈ కంటకశైలం ఓడరేవు నుంచే ఇటలీ మొదలైన పాశ్చాత్య దేశములకు వజ్రములు, సన్నని నూలు వస్త్రములు విరివిగా ఎగుమతి అవుతుండేవి. ఆనాడు రోమను నాణెములు మన దేశమున బాహాటముగా చెలామణి అవుతుండేవి. నేటికీ గ్రామంలోని పాటిదిబ్బలు తవ్వినప్పుడు దొరికే బంగారు నాణెములు (ఒకవైపు రోము చక్రవర్తి, రెండవ వైపున సముద్రుడు గలవి) ఈ విషయమును ధ్రువపరుస్తున్నవి. ఈ కంటకశైలం బందరు కంటే పురాతన రేవు పట్టణమని, ఆనాడు గూడూరు, కంటకశైలం రేవుల నుంచే విదేశాలకు ఓడ వ్యాపారం జరుగుతుండేదని నమ్మడానికి తగిన ఆధారాలు కలవు.

ప్రాచీన కాలమున బౌద్ధ భిక్షవులు, బ్రాహ్మణ మత ప్రచారకులు తమ మత వ్యాప్తికై ఈ ఓడలలో పయనించి జావా, సుమత్రా, బోర్నియో మొదలైన ప్రాగ్దేశములకు వెళ్లారు. ఈ ప్రాంతమున గల ఆంధ్రదేశపు పట్టణ నామములు కూడా ఇందుకు నిదర్శనం. సయాం, కంబోడియా దేశములలో ఇప్పటికీ శాలివాహన శకమే చెల్లుబడి కావడం మరొక నిదర్శనం. ఈ నాగరికత కంటకశైలం గూడూరు రేవుల నుంచే వ్యాప్తి చెందెనని సుప్రసిద్ధ ఫ్రెంచి చరిత్రకారుడు డూబ్రయల్ దక్కన్ పూర్వ చరిత్రలో స్పష్టపరిచాడు.
నాగార్జున కొండ, అమరావతి, పెదవేగిలలో దొరికిన శాసనములు కంటకశైల ప్రసిద్ధి ప్రశంసలతో నిండి ఉన్నాయి. బౌద్ధమత వ్యాప్తికి ఇది ప్రసిద్ధ కేంద్రం కావడం వల్ల చాళుక్యుల పాలనలో కూడా దీని ప్రసిద్ధి కలదు. వీరి కాలమున ఇది ఘంటసాలయై చోడ పాండ్యపురమనే నామాంతరం కలిగి ఉన్నది.

Gottiati -4

పదమూడవ శతాబ్దం వరకు ఓడరేవుగా ఉన్న ఘంటసాల నదీముఖద్వారం మారుటచే రేవు పోయినందున పట్టణ ప్రాముఖ్యం క్రమంగా క్షీణించినది. ఎన్నో కట్టడములు, దేవాలయములు, శిథిలములై భూపతనమైనవి. రైతులు పాటి మట్టిని తవ్వినప్పుడు అనేక శివలింగములు, నందులు, ఇతర విగ్రహములు, స్థూప సంబంధపు శిలాఖండములు, శిల్పములు దొరకడం ఇందుకు సాదృశ్యం.

నేటికీ గ్రామం మధ్యన పురాతనమైన పెన్నేరమ్మ ఆలయం కలదు. దేవుళ్లకు పూర్వం దేవతలనే ప్రజలు ఆరాధించేవారు. ప్రసిద్ధి చెందిన నదులను, స్థానికంగా ప్రజలకు ఆధారభూతములైన జలాధారాలను దేవతలుగా పూజించినట్టు కనబడుతున్నది. నేడు ఘంటసాల గ్రామం మూడువైపులా ఉన్న గంజికాల్వ గుండేరునే పెన్నేరుగా ఆరాధించి వుండవచ్చు. ఈ పెన్నేరుపై పడవలలో చేపలను పట్టి జీవించుట రెండవ వృత్తిగా గల కర్షకులగు ముదిరాజుల వంశీకులే ఈ గ్రామ ఆదిమ నివాసులు. నేటికీ వీరు ఉన్నారు. తరువాత మానవుల ఆరాధనకు దేవుళ్లు, దేవాలయములు వెలసినవి. గ్రామం మధ్యనగల శ్రీ జలధీశ్వరాలయం ఘంటసాల ప్రాచీనతను తెలుపుతున్నది.

gottipati -5                                      Gottipati-6

ఈ గ్రామం ఓడరేవు కావడం వల్ల ఇచట నావికులు, వర్తకులు, తమ భాగ్యభోగాలు, జయాపజయాలు జలధిపై ఆధారపడి వుండడం వల్ల జలధీశ్వరుని ఆరాధించు చున్నారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో తెలియదు కానీ, అక్కడి శాసనాలను బట్టి తొమ్మిదవ శతాబ్దానికి పూర్వమే నిర్మించినట్టు తెలుస్తోంది. విష్ణువర్ధన మహారాజు రెండువేల బ్రాహ్మణలకు గృహదానము చేసినట్టు ఒక శాసనం తెలియజేస్తున్నది.

Gottipti-7

చాళుక్యుల కాలమున కూడా ఇది ప్రాముఖ్యమైన ఓడరేవుగా వుండి వైశ్యుల అష్టాదశ ముఖ్యపట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామంలోని వైశ్యులు అనేక దేవాలయాలకు, ఇంకా ఇతర ధర్మ ప్రతిష్టాపనలకు దానములు చేసినట్టు శాసనములు కలవు.

ఈ ఆలయ ఆవరణలోనే శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి ఆలయమును కీర్తిశేషులు గొర్రెపాటి కృష్ణమ్మగారు నూరు సంవత్సరములకు పూర్వము నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఈ ఆలయమునకు దక్షిణముగా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయము కూడా చాలా పురాతనమైనదే. ఈ ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నూరు సంవత్సరముల క్రితం వైశ్యులచే నిర్మించబడినది. ఈ ఆలయములు నాలుగు, పెన్నేరమ్మ ఆలయం గ్రామం మధ్యనే కలవు.

ఈ గ్రామం ప్రాచీన కాలమున ప్లాను ప్రకారం కట్టబడినట్టు కనిపిస్తోంది. నలు చదరమైన గ్రామం. మధ్య రెండు వీధులు చాలా వెడల్పయి, సుమారు ఒక మైలు పొడవైనవి. గ్రామమునకు తూర్పున పద్మశాలీయుల ధర్మ చెరువు, వనంతోట, దాని వెంట హరిజనపల్లె, దక్షిణాన ఆళ్ల వెంకమ్మ ధర్మచెరువు, వేమూరివారి విశ్వేశ్వరాలయం, వనంతోట దాని వెంట హరిజనపల్లె, పడమర వైశ్యుల ధర్మ చెరువు వనంతోట, ఉత్తరమున గొర్రెపాటి వారి ధర్మచెరువు, చుండూరి నాగభూషణంగారి ధర్మసత్రం, విశాలమైన గోభూమి ధర్మగోటకం గలవు. ఈ ధర్మగోటకంలో రెండు హరిజన పల్లెలు కలవు. ఇటీవల ఈ వీధులను కొంత వరకు ఆక్రమించుకున్నట్టు కనబడుతున్నది. ప్రస్తుతం ఆక్రమణలోగల ఇండ్ల ఆవరణలో బజారువైపున ఒక వరుసను చిన్నవరల నూతులు పురాతన కాలం నాటివి దొరకడం నిదర్శనం. ఈ నూతులు మంచి నీళ్ల సప్లయికి ఏర్పడిన పబ్లిక్ నూతులుగా తలంచబడుచున్నవి.

gottipati3

సైనిక కేంద్రం

శాతవాహన యుగమున ఆంధ్రరాజధానిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం, ఇక్కడికి ఏడుమైళ్లు. ఆనాడు ఘంటసాల ఆంధ్ర సామ్రాజ్యములో రెండవ పట్టణముగా ప్రసిద్ధి చెందినది. కొంత సేన కూడా అక్కడ ఉండేదని, నేడు దండుబాట, గుర్రాల గొందె, గుర్రాలశాల అనే పేర్లుగల ప్రదేశాలు దాని చిహ్నాలేనని ప్రతీతి.

ఈనాటి గ్రామం చక్కగా తీర్చిదిద్దిన వీధులతో గ్రామం మధ్యను గల ఐదు దేవాలయముల ఉత్సవాదులకు, బహిరంగ సభలకు, నాటకములు వగైరా ప్రదర్శనలకు అనువైన, విశాలమైన ఖాళీ ప్రదేశం, నలువైపులా విశాలమైన వీధులు, చక్కని భవంతులు పరిశుభ్రముగా ఉండి కనుల పండువగా ఉంటాయి. ఈ గ్రామ విశిష్టత ప్రతి ఇంటికీ చక్కని ప్రహరీ, దానిని ఆనుకుని వచ్చే వారిని ఆహ్వానిస్తున్నట్టు అరుగులు కలిగి ఉండడం, సంక్రాంతి పండుగకు ప్రతి ఇల్లు పెండ్లి ఇంటి వలె వెల్లవేయబడి, అలుకు ముగ్గులతో అందచందాలతో అలరారుతూ ఉంటుంది. ఈ గ్రామ శోభ అప్పుడు అతిశయిస్తుంది.

 

 

మా వూరు ప్రాచీన చరిత్రకు తోడు నవీన చరిత్రను కూడా అలవరచుకున్నది. జమీందారు-రైతు సమస్యలలో ప్రముఖ పాత్ర వహించిన ధీరులైన కీర్తిశేషులు గొర్రెపాటి బాలకృష్ణమ్మ, గొట్టిపాటి వీరరాఘవయ్య గార్లు ఈ గ్రామమున జన్మించి, గ్రామ పెద్దరికమును నిలబెట్టారు. ఒక శతాబ్ది క్రితం బ్రిటష్ వారి పాలనలో సైనికుడిగా చేరి, స్వయం ప్రతిభ వల్ల సుబేదారుగా ప్రతిష్ట ఆర్జించుకుని విక్టోరియా రాణి దర్శనార్థం ఇంగ్లండ్‌ను దర్శించి విక్టోరియా రాణి పతకమును పొందిన సుబేదార్ బ్రహ్మయ్యగారి స్వగ్రామమిదే.

గ్రామంలోని పశువులు మేయడానికి ఉపయోగపడుతున్న పెద్ద భూఖండం ధర్మగోటకమును తన సొంత సేద్యముగా ఉపయోగించుకొనడానికి ఆనాటి జమీందారు చేసిన అనేక బ్రహ్మ ప్రయత్నములను అనేక కష్టనష్టములకు గురి అయి ప్రాణములను సైతం పణంగా పెట్టి, విఫలపరచి నేటికి గ్రామ సాముదాయక భూమి ఉండునట్టు చేసిన ఘనత ఆనాటి యువజన నాయకులు గొట్టిపాటి వీర రాఘవయ్య, దోనేపూడి వెంకట్రాములు, వేమూరి వెంకన్న, పిశుపాటి పెద సుబ్బయ్య ప్రభృతులకు అరవై ఐదు సంవత్సరాల క్రితమే దక్కింది. చల్లపల్లి ఎస్టేటులోని అన్ని గ్రామములలోని గోభూమి జమీందారుని సొంత కమతము కాగా, ఈ ఒక్క గ్రామంలోని భూమి ప్రజల అధీనంలోనే ఈ నాటికీ నిలపుకొనడం ఈ గ్రామ వ్యక్తిత్వానికి నిదర్శనం.

రాళ్లను కరిగించే విమల గాంధర్వ విద్యల విఖ్యాతి గాంచిన చల్లపల్లి సీతారామయ్య, సుబ్బయ్య సోదర ద్వయం, వంచనదీశ్వర శర్మ, పురుషోత్తం సోదర ద్వయం ఈ ఊరివారే. శ్రీ సుబ్బయ్య గద్వాల సంస్థాన విద్వాంసులుగా గౌరవింపబడినారు.

భతరనాట్యమును బోధించే గరడీలు కూడా ఉండేవి. వీరు వీధినాటకముల ప్రదర్శనలిచ్చేవారు. ఆనాడు భరతనాట్యమున ప్రసిద్ధి పొందిన కళావంతులకును ప్రసిద్ధి గాంచినది మా ఊరు. 1900 సంవత్సరములకు పూర్వమే గొట్టిపాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఘంటసాల సీతారామయ్యగార్లు ఆంగ్ల విద్యలో పట్టభద్రులుగా ఆ గ్రామమునకు ప్రతిష్ట నార్జించారు. చిన్నయవసులోనే వారిరువురు పరమపదించడం మా గ్రామ దురదృష్టం. వేదాంత తర్కశాస్త్రములలో ఉద్ధండుడైన పండితుడనిపించుకున్న చింతలపాటి లక్ష్మీపతి శాస్త్రిగారిదీ ఈ ఊరే.

బందరు బ్రహ్మమందిరమున వసతి ఏర్పరచుకొని చదువుకొను విద్యార్థులం 1914లో ఒక గ్రంథాలయమును ఏర్పాటు చేసుకొని దానికి శ్రీ రామమోహన గ్రంథాలయమని పేరు పెట్టుకున్నాం. దీనికి అనుబంధముగ వేసంగి సెలవులలో వయోజన పాఠశాలను కూడా నడిపాం. ఈ కార్యకలాపములకు మేము దిగుటకు ‘కృష్ణా పత్రిక’ సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులుగారి ప్రభావం మాపై ప్రసరించుటయే కారణం. మా విద్యార్థి బృందమునకు నాయకుడుగా, మమ్ములను జాతీయ భావప్రేరితులుగా చేసిన సోదరుడు గొర్రెపాటి వెంకటేశ్వర్లుగారు 1917లోనే ఆకస్మికంగా మమ్మల్ని వీడి స్వర్గస్తులగుట మా గ్రామమునకు వచ్చిన మరొక దురదృష్టం.

ఒక దృష్టిలో 1917లో మా గ్రామ చరిత్రలో చెడ్డ సంవత్సరమనుకున్న రోజులు గలవు. అప్పుడు బందరులో ఆంగ్లభాష చదువుతున్న పదిహేడు మంది యువతులు అనారోగ్య కారణంగానో, కుటుంబ కష్టపరంపరల వల్లనో చదువులకు స్వస్తి చెప్పి గ్రామములో కుదురుకొనుట తటస్థించినది. నేటి పరిణామమును బట్టి ఆ చదువు సంధ్యలు మానినవారు అంతోఇంతో దేశసేవ చేసి, గ్రామానికి పేరు ప్రతిష్టలను ఆర్జించుటే గాక గ్రామాన్ని ఆధునిక సౌకర్యాలతో, వసతులతో సౌభాగ్యవంతముగ ధనధాన్యముల రాశిగా చేసిన ఘనతను ఆర్జించుకున్నారు. కాబట్టి 1917 మాకు యోగదాయకమైన సంవత్సరమనే చెప్పక తప్పదు.

Share: