గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ క్రొత్తపల్లి రాజసూర్య సాంబశివరావు వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న మిజోరం యూనివర్సిటీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ తాజాగా విడుదల చేసిన ‘ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2021’లో మిజోరం యూనివర్సిటీకి ప్రపంచస్థాయిలో 601-800 ర్యాంకు లభించింది. దేశంలోని మొత్తం 49 యూనివర్సిటీలకు ఈ ర్యాంకింగ్స్‌లో స్థానం లభించగా, మిజోరం వర్సిటీకి 21వ స్థానం లభించడం విశేషం. అంతేకాదు, ఈశాన్య భారతదేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,115 యూనివర్సిటీలను ఎంపిక చేయగా, అందులో మిజో యూనివర్సిటీకి స్థానం లభించడం గమనార్హం. అదొక్కటే కాదు, ఈశాన్య భారతదేశం నుంచి ఎంపికైన ఒకే ఒక్క యూనివర్సిటీగాను రికార్డులకెక్కింది.
ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన (SDGs)లో 17కు గాను మిజోరం యూనివర్సిటీ 6వ ర్యాంకు సాధించింది. పరిశ్రమ, ఇన్నోవేషన్, మౌలిక సదుపాయాలపై ఎస్డీజీ -9 లో 101-200 ర్యాంకింగ్స్‌లో మిజోరం విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ర్యాంక్సింగ్స్ సంస్థ అయిన ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని సంస్థల ర్యాంకింగ్స్‌ను అంచనా వేస్తుంది. మరింత మెరుగైన, సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు ఆయా సంస్థలకు ఈ ర్యాంకింగ్స్ బ్లూ ప్రింట్లా ఉపయోగపడతాయి.
‘టైమ్స్’ ర్యాంకింగ్స్‌లో తమ వర్సిటీకి ఉత్తమ ర్యాంకు దక్కడంపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం కొవిడ్-19 సంక్షోభంలో చిక్కుకున్న వేళ ఈ విజయం తమకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని, తమలో బోల్డంత ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ఈ ర్యాంకు సాధించడం వెనక ఎంతోమంది కృషి ఉందని, సహోద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది కృషితోపాటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. విద్యావిషయాలలో యూనివర్సిటీ ఎన్నో మైలురాళ్లు అధిగమించిందని, మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ప్రొఫెసర్ సాంబశివరావు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికే యూనివర్సిటీ గర్వకారణంగా నిలిచిందన్నారు. కాగా, గతేడాది జూన్‌లో భారత ప్రభుత్వ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF)లో మిజోరం విశ్వవిద్యాలయానికి 67వ స్థానం లభించింది.
ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు గురించి..
గుంటూరు జిల్లాలోని అమృతలూరుకు చెందిన ప్రొఫెసర్ సాంబశివరావు 2012లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 1988లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేసిన ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు.. ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, ప్రొ-వైస్ చాన్స్‌లర్‌గా, ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2017లో మిజోరం యూనివర్సిటీ (సెంట్రల్ యూనివర్సిటీ)లో అవకాశం రావడంతో వైస్-చాన్స్‌లర్‌గా వెళ్లారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్‌లకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గానూ ఉన్నారు. వీసీగా చేరిన అనతికాలంలోనే మిజోరం అక్కడి విద్యారంగంపై తనదైన ముద్ర వేశారు.
మిజోరం యూనివర్సిటీని మరోస్థాయికి తీసుకెళ్తున్న ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021