– మీకు భయపడాలా?.. మీకు లొంగి బానిసల్లా బతకాలా?
– రెడ్లలోనూ మంచోళ్లు ఉన్నారు.. వారిని ఆదర్శంగా తీసుకుని పాలించండి
– వైవీబీ రాజేంద్రప్రసాద్
——–
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని, ఓ కులాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పాలన రాష్ట్రానికి క్షేమకరం కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. కమ్మకులంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోందని, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కులాన్ని లక్ష్యంగా చేసుకుంటూ జరుగుతున్న కుట్రల వల్ల మొత్తం రాష్ట్రమే నష్టపోతోందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ కుట్రలకు స్వస్తి చెప్పి, రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిసారిస్తే మంచిదని హితవు పలికారు. ఇంకా ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..
——————-
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగింది ముమ్మాటికీ దురదృష్టకర ఘటనే. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి నేను వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. ఈ ఘటనపై విచారణ జరిపి అక్కడేదైనా తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని కూడా చెప్పాం. కానీ జరుగుతున్నది మరోటి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే గుండెలు బరువెక్కి పోతున్నాయి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఒక కులాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైద్యుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. కమ్మకులాన్ని టార్గెట్ చేసుకుని, వారిని అపఖ్యాతి పాలు చేసేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే స్వర్ణ ప్యాలెస్ ఘటన వెనక పెద్ద కుట్ర ఉన్నట్టు అనుమానంగా ఉంది.
అప్పుడే జాగ్రత్తలు తీసుకుని ఉంటే..
స్వర్ణ ప్యాలెస్ ఘటనపై వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో కొవిడ్ సెంటర్లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొంది. బాగానే ఉంది. మరి, డాక్టర్ రమేశ్ గారు స్వర్ణప్యాలెస్‌ను కొవిడ్ సెంటర్‌గా మార్చకముందు అది ప్రభుత్వ అధీనంలోనే ఉంది కదా. దీనితోపాటు విజయవాలోని మరో 15 హోటళ్లను మీరు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి విదేశాల నుంచి వచ్చిన వారిని వాటిలోనే 15 రోజులపాటు ఉంచారు కదా? మరి అప్పుడే వాటిలో రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్నది ఎందుకు పరిశీలించలేదు. ఆ రోజున మీరు ఆ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగి ఉండేదా? అంతమంది చనిపోయి ఉండేవారా? ఇక్కడ ఉన్నది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ రమేశ్ గారిని వేధించాలన్న మీ దురుద్దేశం క్లియర్‌గా కనిపిస్తోంది.
ఒక్క ట్వీట్ పెడితే రామ్ గారికి నోటీసులు ఇస్తారా? మీరు సినిమాల్లోనే కాదు, బయట కూడా హీరోగా ఉండాలంటే బయటకు రండి. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ఏమవుతుంది? ఏం చేస్తారో చూద్దాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు. ఎంతమందిని ఇబ్బంది పెడతారు. ఎంతమందిని జైలులో పెడతారు?
మేం కావాలని కమ్మకులంలో పుట్టామా?
మేం కమ్మోళ్లమే. మాది కమ్మకులమే. అది తప్పెలా అవుతుంది? మేం కోరి కావాలని ఆ కులంలో పుట్టలేదే. కమ్మోళ్లు ఏమైనా రాక్షసులా? మేమేమైనా దోపిడీలు, దొంగతనాలు చేశామా? ఆస్తులు కబ్జా చేశామా? కేసులు పెట్టించుకున్నామా? జైలులో ఉన్నామా? మా మీద సీబీఐ కేసులు ఉన్నాయా? కమ్మకులంలో పుట్టడం మా తప్పెలా అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కో కులంలో పుడతారు. అన్ని కులాల్లోనూ మంచోళ్లు, చెడ్డోళ్లు ఉన్నారు. కులాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యక్తులను, మేధావులను, సేవాభావం కలిగిన వారిని అల్లరి చేయడం ఏమిటి? ముఖ్యమంత్రి మెప్పుకోసం పై అధికారులు కావాలనే ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఓ కులాన్ని వేధిస్తున్నారు.
రమేశ్ ధనం మనిషి కాదు.. జనం మనిషి
డాక్టర్ రమేశ్ మీరు చెబుతున్నట్టు ధనం మనిషి కాదు.. జనం మనిషి. ఆయన సేవకు అంకితమైన వారు. ఆయనను డబ్బు మనిషిగా ప్రచారం చేయడంలో అర్థం లేదు. అయనకు నిజంగానే డబ్బుమీద మోజు ఉంటే కరోనా లేకున్నా భయపెట్టి ఆసుపత్రిలో చేర్చుకుని లక్షలాది రూపాయలు సంపాదించి ఉండేవారు కదా. రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న డాక్టర్ రమేశ్‌ను ఏదో మర్డర్లు, అత్యాచారాలు చేసినట్టు చూస్తున్నారు. డాక్టర్ రమేశ్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. సేవా దృక్పథం కలిగిన వారు. ఆయన ఎలాంటి వ్యక్తో నేను స్వయంగా చూశాను కాబట్టే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నా. నా కులం వాడని కాదు. ప్రజలకు నిజం తెలియాలనే ఈ వాస్తవాలు చెబుతున్నా. రమేశ్ గారిని ఇబ్బంది పెడితే ఎవరికి నష్టం. ఆయన ఇక్కడ కాకపోతే హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో, మద్రాసులోనే మరో దగ్గరో ఆసుపత్రి పెట్టుకుంటారు. ఆయనకు వచ్చిన నష్టమేమిటి? ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోతే నష్టం ఎవరికి? వేలాదిమంది పేదలకు, ఆయన వద్ద వైద్యం చేయించుకునే రాజకీయ నాయకులకు, ప్రజలకే నష్టం. డాక్టర్ రమేశ్‌బాబు, స్వర్ణ ప్యాలెస్ అధినేత ముత్తవరపు శ్రీనివాసరావు వెళ్లి స్వర్ణప్యాలెస్‌ను పెట్రోలు పోసి తగలబెట్టేసినట్టు దుష్ప్రచారం చేయడం నీచాతినీచం.
వారే దర్జాగా తిరుగుతున్నారు.. మీకెందుకు భయం
డాక్టర్ రమేశ్ గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తారు? మహా అయితే అరెస్ట్ చేసి జైలులో పెడతారు. అంతకుమించి ఇంకేం చేస్తారు. 18 నెలలు జైలులో ఉండొచ్చిన మన సీఎం గారే ప్రజల్లో తిరిగారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి కేసులో రూ. 52 వేల కోట్ల అవినీతిని సీబీఐ నిర్ధారించింది. 11 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అటువంటి జగన్, విజయసాయిరెడ్డి తదితర ఏ1 నుంచి ఏ12 నిందితుల వరకు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయి దర్జాగా తిరుగుతున్నారు. ఢిల్లీ చుట్టూ, ప్రధాని, రాష్ట్రపతుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లు అంత నిర్భయంగా తిరుగుతుంటే మీకెందుకు భయం. తప్పుచేయని మీరెందుకు భయపడాలి? అది ఒక ప్రమాదం. అది మన చేతుల్లో లేదు. దేవుడు అలా రాసిపెట్టాడు. గాంధీ, నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. మనం దాక్కుంటే తప్పుచేసినట్టు అవుతుంది.
ఎవరు మాట్లాడితే వారికి నోటీసులు ఇచ్చేస్తారా?
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? లేక, నియంతృత్వమా? లేదంటే, రాక్షస రాజ్యమా? ఎవరూ నోరెత్తకూడదా. పెదవి విప్పితే నోటీసులు ఇచ్చేస్తారా? సినిమా హీరో రామ్ ఏదో ట్వీట్ చేస్తే పోలీసులు హెచ్చరించేశారు. నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేస్తాం అని బెదిరించారు. ఏం రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛలేదా? నేను రామ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ట్వీట్లు చేస్తూనే ఉండండి. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించండి. ఏం చేస్తారు? విజయసాయిరెడ్డి ఆయన స్థాయి నుంచి దిగజారిపోయి ఎదుటివారి మీద అడ్డగోలుగా ట్వీట్లు పెట్టడం లేదా? నాతో మొదలుకుని అందరి మీద అందరి మీదా నీచంగా ట్వీట్లు పెట్టడం లేదా? ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారు?
కులం చూసి మాట్లాడడం హేయం
రాష్ట్రంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన వారు ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టును జీఎంఆర్ కడితే మన తెలుగువాడు అని గర్వపడ్డాం. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన గ్రంధి మల్లికార్జునరావు కట్టిన ఎయిర్‌పోర్టు అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన కమ్మవాడా, కాపువాడా, రెడ్డా, బీసీనా, ఎస్సీనా అని ఆలోచించం. ఆయనను ఒక తెలుగువాడిగానే చూస్తాం. అలాగే, జీవీకే రెడ్డిగారు. ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టు కట్టారంటే ఇది మా తెలుగువాడు కట్టినదని గర్వంగా తిరుగుతున్నాం. ఆయన రెడ్డా? మరొకరా? అని చూడడం లేదు. అపోలో ఆసుపత్రి ప్రతాప్‌రెడ్డి గారిని చూసి గర్వపడతాం. రామోజీరావు గారిని చూసి ఆనందిస్తాం. ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నాగేశ్వరరెడ్డిని చూసి గర్విస్తాం. ఏదైనా సమస్య ఉందంటే ఆయన దగ్గరకు వెళ్లమని చెబుతుంటా. ఎప్పుడో పదేళ్ల క్రితం వెళ్తే ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా నాకు వైద్యం చేశారు. అంతమంచి వ్యక్తి. ఏ కులంలో ఉన్నా, మతంలో ఉన్నా మంచి వాళ్లను మంచి వాళ్లనే చెబుతాం. రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డిగారు, డాక్టర్ గురవారెడ్డిగారు. ఇక్కడ కులం చూడకూడదు. అలా చూడడం హేయం.
కులం మనల్ని ఎన్నాళ్లు కాపాడుతుంది?
కులాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ అధికారం సాధించాలని, దానిని నిలబెట్టుకోవాలని అనుకోవడం తప్పు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువ రోజులు నిలబడవు. మేఘా కంపెనీ కృష్ణారెడ్డిగారు, నవయుగ విశ్వేశ్వర్ గారు చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. మేఘా కృష్ణారెడ్డి గారు వంద రోజుల్లో పట్టిసీమ కట్టి రికార్డు సృష్టించారు. డెల్టా ప్రాంతంలో కృష్ణా నది ఎండిపోయినా మేం వ్యవసాయం చేస్తున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబునాయుడి గారి దూరదృష్టితోనే సాధ్యమైంది. చంద్రబాబు గారు వంద రోజుల్లో పట్టిసీమను కట్టాలంటే కృష్ణా రెడ్డిగారు కట్టేశారు. ఆయనను తెలుగువాడిగా చూసి గౌరవిస్తాం, గర్విస్తాం. కులం చూసి తిడతారా? ఆ రోజు ఆయనను తిట్టింది మీరే. అందులో అవినీతి జరిగింది, తినేశారు, దోచేశారు అని ఆరోపించారు. ఇది చాలా తప్పు. కులాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నాళ్లు రాజకీయం చేస్తాం. కులం ఎన్నాళ్లు మనల్ని కాపాడుతుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. న్యాయం, ధర్మం, సత్యం గెలుస్తాయి. బైబిల్లో యేసు క్రీస్తు చెబుతాడు. ఉపకారం చేసిన వారికి అపకారం చేయకుడి అని. గుర్తుంచుకోండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ధర్మో రక్షతి రక్షితః అని. ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి దయచేసి కుల రాజకీయలు చేయకండి.
కమ్మవాళ్లంటే ఎందుకు భయం
వాస్తవాలు చెబుతున్న నన్ను అరెస్ట్ చేసి జైలులో పెడతారా? రండి చాలెంజ్ చేస్తున్నా. నేను అన్నింటికీ సిద్ధమే. మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, మా కమ్మకులస్థులం దాక్కోవాలా? వ్యాపారాలు చేయకూడదా? బయట తిరక్కూడదా? ఏమీ మాట్లాడకూడదంటే ఎలా? కమ్మవాళ్లను చూసి ఎందుకు భయపడుతున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రెస్‌మీట్‌లోనే మీరు కులం పేరుతో ప్రస్తావించినప్పుడే మీ పతనం ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్రెడ్డిగారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఎల్జీ పాలిమర్స్‌కు ఒక న్యాయం.. డాక్టర్ రమేశ్‌కు మరో న్యాయమా?
రాష్ట్రంలో రెండు రకాల న్యాయాలు ఉన్నాయా? మనకొకటి, మనకు కాని వారికి ఒకటా? విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత ఏమైందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రమాదం జరిగిన వెంటనే ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో జగన్ వైజాగ్ వెళ్లారు. విమానాశ్రయంలోనే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో నవ్వుతూ చర్చలు జరిపారు. జనాలకేం చెప్పాలి? ఏం చేయాలి? అనేదానిని ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. ఆ వెంటనే బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? కంపెనీ ఇవ్వాలా? ప్రభుత్వమా?
డాక్టర్ రమేశ్ కుమార్ వ్యవహారంలో మీరెలా స్పందించారు. రమేశ్ ఆసుపత్రిపై తీసుకున్న చర్యలను ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎందుకు తీసుకోలేదు. రమేశ్ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టుగానే ఎల్జీ పాలిమర్స్ యజమాని భార్య, కొడుకు, కోడళ్లకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. ఆ కంపెనీ ఎండీ, చైర్మన్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. తూతూమంత్రంగా ఇక్కడి ఇన్చార్జులను అరెస్ట్ చేసి బెయిలుపై విడుదల చేసేశారు. విదేశీ సంస్థకు ఓ న్యాయం. మన తెలుగు వాడికి మరో న్యాయమా? వేలాదిమందికి ప్రాణం పోసే డాక్టర్ రమేశ్ గారి వ్యవహారంలో భిన్నంగా ఎలా వ్యవహరిస్తారు? ఎల్జీ పాలిమర్స్ సంస్థ భారతీ సిమెంట్స్‌కు బ్యాగులు సరఫరా చేస్తుంది కాబట్టి వదిలేశారా? ఏం లోపాయికారీ ఒప్పందం జరిగింది? మీ బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేస్తే మీరేం చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఆ హత్య ఎవరు చేశారో మీకు తెలుసు. కానీ ఎటువంటి చర్యలు లేవు. ఎందుకు?
—————–
ఆసుపత్రిలో చేరుతానంటే.. వద్దు డబ్బులు దండగన్నారు
మాది ఉయ్యూరు. నాకు కరోనా సోకగానే మా అమ్మయి భయపడి పోయింది. వెంటనే రాజేంద్రప్రసాద్ గారికి ఫోన్ చేసి ఏదైనా ఆసుపత్రిలో చేర్పించమని కోరింది. దీంతో రాజేంద్రప్రసాద్ గారు డాక్టర్ రమేశ్ బాబుతో మాట్లాడారు. ఆ వెంటనే రమేశ్‌బాబు గారు మా అమ్మాయి డాక్టర్ అలేఖ్యతో మాట్లాడారు. ఆసుపత్రిలో కానీ, తమ కొవిడ్ సెంటర్లో కానీ చేర్చాల్సిన అవసరం లేదని, డబ్బులు దండగని, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. యూఎస్‌లో ఉండే మా పెద్దమ్మాయి కూడా రమేశ్ గారితో మాట్లాడి ఫీజు విషయంలో వెనకాడవద్దని, ఎంతైనా ఫర్వాలేదని, నన్ను చేర్చుకోవాలని చెప్పింది. అయినా డాక్టరు గారు వద్దంటే వద్దన్నారు. తాను చేసేది డబ్బు కోసం కాదని, సేవ మాత్రమేనని చెప్పారు. తమ వైద్య బృందం చెప్పినట్టు చేస్తే కరోనా నయమవుతుందని చెప్పారు. డాక్టర్ రమేశ్ బాబు నిజంగా డబ్బు మనిషే అయితే, అప్పుడే నన్ను చేర్చుకునే వారు కదా. ఆ తర్వాత మా అమ్మాయి స్నేహితురాలి ద్వారా నేను విజయవాడలోని ‘హెల్ప్’ ఆసుపత్రిలో చేరాను. అక్కడ చికిత్స తీసుకుని కోలుకున్నాను. అది వేరే విషయం. డాక్టర్ రమేశ్ బాబు గారిపై వస్తున్న ఆరోపణలు చూసిన తర్వాత ఆయన ఎంత మంచివారో చెప్పాలనే ముందుకొచ్చా.
– నూకల వెంకటేశ్వరరావు
అనూష స్కూల్ అధిపతి, ఉయ్యూరు