యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం తెలుగువారిని ఈ నాటికీ పులకింప చేస్తూనే ఉంది. తెరపై అనేక పౌరాణిక పాత్రలలో తనదైన అభినయం ప్రదర్శించి అలరించారు రామారావు. ఆయన నటనావైభవం ద్వారానే మన పురాణాల్లోని దేవతామూర్తుల పాత్రలను చూసి ఆనందించగలిగాం. శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శ్రీసత్యనారాయణ స్వామి, మహాశివుడు వంటి దేవతామూర్తుల పాత్రల్లో యన్టీఆర్ ఆకట్టుకున్న తీరును ఎవరూ మరచిపోలేరు. తెలుగువారికే కాదు, యావద్భారతంలోనూ శ్రీరాముడు అంటే రామారావునే ఊహించుకొనేవారు ఎందరో ఉన్నారు. యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన పౌరాణిక చిత్రాలను తమిళ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకి అనువదించడం వల్ల అక్కడి వారు సైతం నీలమేఘశ్యాముడు అంటే రామారావే అనే భావనలో ఉన్నారు.
తిరుగులేని తారకనామం…
యన్టీఆర్ పేరులోనే తారకరాముడు కొలువై ఉన్నాడు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా అనితరసాధ్యమైన వైభవాన్ని చూశారు. అయోధ్యలో తానున్నా, కారడవులలో పోతున్నా, రాముడెప్పుడూ రాముడే అన్నట్టుగా చిత్రసీమలో రామారావు నటనావైభవం సాగింది; ఇక రాజకీయాల్లోనూ ఈ తారకరాముని జైత్రయాత్ర అనితరసాధ్యంగానే నిలిచింది. అందుకు ఆయన పేరులోనే తారకరామ అన్న శక్తిమంతమైన పదాలు ఉండడం కారణం అంటారు శాస్త్రం తెలిసిన వారు.
అచ్చివచ్చిన ‘రాముడు’
నందమూరి తారకరామునికి చిత్రసీమలో ‘రాముడు’ అన్న పదం భలేగా అచ్చివచ్చింది. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’లో ఆయన పేరు తోటరాముడు. ఆ పాత్రలో రామారావు అలరించిన తీరు ఆబాలగోపాలాన్నీ మురిపించింది. అలా ‘రాముడు’ అన్న పేరుతోనే యన్టీఆర్ చిత్రసీమలోనే తొలి బిగ్ హిట్ ను సాధించడం విశేషం.
శ్రీరామ పాత్రలో…
యన్టీఆర్ అనగానే శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలే ముందుగా గుర్తుకు వస్తాయి. తొలుత సాంఘిక చిత్రాలలోనే ఈ పాత్రల్లో కనిపించి మురిపించారు యన్టీఆర్.’చరణదాసి’లో తొలిసారి తెరపై శ్రీరామునిగా కనిపించారు రామారావు.. ఈ సినిమాలో ఆయన సరసన సీతగా అంజలీదేవి నటించారు. తరువాతి రోజుల్లో ‘చరణదాసి’ నిర్మాత శంకర్ రెడ్డి – యన్టీఆర్, అంజలీదేవితోనే ‘లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయం చవిచూశారు. యన్టీఆర్ పూర్తిస్థాయిలో శ్రీరామునిగా నటించిన తొలి చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. ఇది తొలుత తమిళంలో రూపొంది, అక్కడ ఘనవిజయం సాధించిన తరువాత తెలుగులోకి అనువాదమై ఇక్కడా అలరించింది. ‘సంపూర్ణ రామాయణం’ తరువాత “లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” వంటి పౌరాణిక చిత్రాలలో శ్రీరామునిగా నటించారు రామారావు. సదరు చిత్రాలలో శ్రీరామునిగా నటించిన యన్టీఆర్, అదే రూపంలో ఎందరో అభిమానుల మదిలో కొలువైనారు. ‘చరణదాసి’తో పాటు “సి.ఐ.డి.,చిట్టిచెల్లెలు, అడవిరాముడు” వంటి సాంఘికాల్లోనూ శ్రీరామునిగా కనిపించి కనువిందు చేశారు రామారావు.
16 చిత్రాల రాముడు…
తెలుగు చిత్రసీమలో రాముడు అన్న పేరుతో అనేక చిత్రాలలో నటించిన ఘనత కూడా యన్టీఆర్ సొంతం. ఇక సినిమా టైటిల్స్ లోనూ ‘రాముడు’ అన్న పేరును అనితరసాధ్యంగా పలు మార్లు జోడించుకున్నదీ రామారావే. అలా రాముడు పేరుతో యన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘అగ్గిరాముడు’. 1954 బ్లాక్ బస్టర్ గా ‘అగ్గిరాముడు’ నిలవడం విశేషం. ఆ తరువాత ‘శభాష్ రాముడు’గానూ జనాన్ని మెప్పించారు. ‘శభాష్ రాముడు’ కూడా ఘనవిజయం సాధించడంతో వరుసగా “బండరాముడు, టాక్సీ రాముడు, టైగర్ రాముడు” వచ్చాయి. ఈ చిత్రాలు అంతలా ఆకట్టుకోకపోయినా, తరువాతి రోజుల్లో జనాన్ని భలేగా మెప్పించాయి. ఇక యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’లోనూ ‘రాముడు’ తోడయ్యాడు. ఇంకేముంది, విజయం ఆయన జోడయింది.
“పిడుగు రాముడు, రాముని మించిన రాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు” వంటి చిత్రాలలోనూ రామారావు నటించి మురిపించారు. ‘రాముడు’ టైటిల్ తో ఆయన నటించిన చివరి చిత్రం ‘కలియుగ రాముడు’. ఇక 1980లో అయితే ఆయన ఏడు చిత్రాలలో నటించగా, వాటిలో నాలుగు సినిమాలు ‘రాముడు’ టైటిల్ తో రూపొందినవే కావడం విశేషం. ఆ యేడాది “ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, రౌడీరాముడు, సరదా రాముడు”గా జనం ముందు నిలిచారు యన్టీఆర్. రాముడు టైటిల్స్ లో యన్టీఆర్ అత్యధిక శాతం విజయాలనే చవిచూశారు. ఒకటి రెండు మినహాయిస్తే, యన్టీఆర్ ‘రాముడు’ టైటిల్స్ తో వచ్చిన చిత్రాలన్నీ జనాన్ని ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. అలా మొత్తం 16 చిత్రాలలో యన్టీఆర్ ‘రాముడు’ టైటిల్స్ తో సాగడం విశేషం!
‘అడవిరాముడి’దే అగ్రస్థానం!
యన్టీఆర్ ‘రాముడు’ టైటిల్ తో నటించిన చిత్రాలలో ‘అడవిరాముడు’దే అగ్రస్థానం. ఈ సినిమాలో రామారావు ఓ పాటలో శ్రీరాముని గెటప్ లో కనిపించగానే జనం పులకించిపోయారు. నాలుగు కేంద్రాలలో స్వర్ణోత్సవాలు చూసిన ‘అడవిరాముడు’ నేటికీ ఓ చరిత్రగా నిలచే ఉంది.
అనేక చిత్రాలలో రాము పేరుతో నటించిన యన్టీఆర్ సదరు సినిమాలతోనూ అపూర్వ విజయాలను చూశారు. అందుకే ఈ నాటికీ ఎందరో అభిమానుల మదిలో శ్రీరామునిలాగే కొలువై ఉన్నారు యన్టీఆర్.
తండ్రికి తనయుడి గాననివాళి!
యన్టీఆర్ నటవారసునిగా జనం ముందుకు వచ్చిన బాలకృష్ణకు ఆరంభంలో అపజయాలు పలకరించాయి. ‘మంగమ్మగారి మనవడు’తో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో తొలిసారి రాముని గెటప్ లో కనిపించారు బాలయ్య. తండ్రి బాటలోనే నడుస్తూ ‘లవకుశ’ను పోలిన ఉత్తర రామాయణం కథతో తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’లో శ్రీరామునిగా నటించారు బాలయ్య. యన్టీఆర్ 99వ జయంతిని పురస్కరించుకొని, బాలకృష్ణ ‘శ్రీరామదండకం’ గానం చేయడం విశేషం. మే 28న ఉదయం 9.45 గంటలకు విడుదలైన బాలకృష్ణ గానం చేసిన ‘శ్రీరామదండకం’ అభిమానగణాలను అలరిస్తోంది.